Homeఅంతర్జాతీయంఅరుణాచల్ లోని తవాంగ్ కేంద్రంగా .. మరో కుట్రకు చైనా తెర తీసిందా..?

అరుణాచల్ లోని తవాంగ్ కేంద్రంగా .. మరో కుట్రకు చైనా తెర తీసిందా..?

గాల్వాన్ ఘటనను మళ్లీ రిపీట్ చేసే వ్యూహంలో చైనా ఉందా..? అయితే ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ దిశగా చైనా పీఎల్ఏ ఆర్మీ ఎందుకు వెళుతోంది..?

భారత్ భూభాగమైన అరుణాచల్ ప్రదేశ్ పై చైనా కన్నేసిందా..? అందుకే తాజాగా ఇప్పుడు తవాంగ్ దగ్గర ఆక్రమణకు ప్రయత్నించిందా..? అసలు
అరుణాచల్ ప్రదేశ్ విషయంలో చైనా వ్యూహం ఏమిటి..?

చైనా మరోసారి భారత్‌ను దొంగదెబ్బ కొట్టే ప్రయత్నం చేసింది. అకారణంగా రెచ్చగొట్టేలా వ్యవహరించింది. ఇదివరకు లఢక్ తూర్పు ప్రాంతంలో వాస్తవాధీన రేఖ వద్ద ఘర్షణకు పాల్పడిన చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ బలగాలు ఇప్పుడు కూడా అలాంటి దుందుడుకు చర్యలకు తెగబడ్డాయి. భారత జవాన్లపై దాడికి దిగాయి. వాస్తవాధీన రేఖను దాటుకుని భారత భూభాగంపైకి చొచ్చుకుని రావడానికి శతవిధాలా ప్రయత్నించాయి. ఈ ప్రయత్నాలను భారత సైన్యం తిప్పి కొట్టింది. పీఎల్ఏ బలగాలను నిలువరించగలిగింది. 2020 జూన్ 15వ తేదీన అనూహ్యంగా..

ఎలాంటి ముందుస్తు హెచ్చరికలు లేకుండా చైనా పీఎల్ఏ బలగాలు భారత జవాన్లపై దాడికి దిగిన విషయం తెలిసిందే. రెండు దేశాల జవాన్లు పెద్ద ఎత్తున దాడులు, ప్రతిదాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో రెండు వైపులా ప్రాణనష్టం సంభవించింది. తెలంగాణకు చెందిన కల్నల్సం తోష్ బాబు వీరమరణం పొందారు. ఆయనతో పాటు మరో 20 మంది జవాన్లు అమరవీరులయ్యారు. ఇప్పుడు తాజాగా అరుణాచల్ ప్రదేశ్స రిహద్దుల వద్ద ఇలాంటి ఘర్షణే భారత్-చైనా జవాన్ల మధ్య చోటు చేసుకుంది. ఈ నెల 9వ తేదీన తవాంగ్ సెక్టర్ సమీపంలో గల వాస్తవాధీన రేఖ వద్ద రెండు దేశాల జవాన్లు పరస్పరం ఘర్షణకు దిగారు.

ఈ ఘటనలో రెండు దేశాల జవాన్లు గాయపడ్డారు. ఈ విషయాన్ని ఆర్మీ అధికారులు ధృవీకరించారు. భారత భూభాగంపైకి చొచ్చుకుని రావడానికి ప్రయత్నించిన చైనా పీఎల్ఏ బలగాలను భారత్ సరిహద్దు జవాన్లు నిలువరించే ప్రయత్నంలో ఈ ఘర్షణన చోటు చేసుకుందని వివరించారు. ఈ ఘర్షణల్లో 30 మందికి పైగా భారత జవాన్లు గాయపడినట్లు తెలుస్తోంది. వారిలో ఆరుమందికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ఆ ఆరుమందిని అత్యవసర చికిత్స కోసం ఎయిర్ అంబులెన్స్ ద్వారా గువాహటికి తరలించారు.

తవాంగ్‌ సెక్టార్ సమీపంలోని వాస్తవాధీన రేఖ పొడవునా సుమారు 300 మంది చైనా సైనికులు భారత భూభాగంపైకి చొచ్చుకురావడానికి
ప్రయత్నించినట్లు చెబుతున్నారు. అదే సమయంలో భారత జవాన్లు అప్రమత్తంగా వ్యవహరించారని, వారి దాడిని సమర్థవంతంగా తిప్పి కొట్టారని
తెలుస్తోంది. ఈ ఎదురుదాడిని ఊహించని చైనా సైనికులు వెనక్కి మళ్లారని పేర్కొన్నారు. దీని తరువాత రెండు దేశాల కమాండర్ స్థాయి అధికారులు
చర్చల ద్వారా సామరస్యపూరకంగా మాట్లాడుకున్నారని సమాచారం. అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి కొన్ని
ప్రాంతాల సరిహద్దుల్లో తరచూ ఉద్రిక్తతలు చెలరేగుతుంటాయని అంటున్నారు. భారత్, చైనా సైనికుల మధ్య ఎదురుకాల్పులు జరగడం ఇదే
మొదటిసారి కాదు. 2006 నుంచీ తరచూ ఈ తరహా ఎదురు కాల్పులు కొనసాగుతూ వస్తున్నాయని చెబుతున్నారు.

గతేడాది అక్టోబర్ మాసంలో ఇదే ప్రాంతంలో చైనా ఆర్మీని ఇండియన్ ఆర్మీ అడ్డుకున్న విషయం తెలిసిందే. దాదాపు 200 మంది పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనికులను అరుణాచల్ ప్రదేశ్ లోని వాస్తవ నియంత్రణ రేఖ దగ్గర అడ్డుకున్నారు. ఈ ప్రాంతంలో ప్రశాంత నెలకొల్పే ప్రయత్నాలు ప్రారంభించినట్టుగా ఇండియన్ఆర్మీ ప్రకటించింది. భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలను నివారించేందుకు గాను ఇరువైపులా కొన్ని ప్రయత్నాలు చేశారు. ఈ విషయమై చర్చలు
జరిపారు. సరిహద్దు వెంబడి సాయుధ దళాలు మౌళిక సదుపాయాలను పటిష్టం చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి.

తాజా ఘటనలో ప్రాణహాని జరుగకపోయినా ఈ ఆందోళనకర వాతావరణం ఆహ్వానించదగినది కాదు. తూర్పు లడాక్ ఘర్షణ తర్వాత ఈ తరహా ఘటన జరగడం ఇదే ప్రధమంగా చెబుతున్నారు.

సరిహద్దుల్లో శాంతి, సమరస్యాలను నెలకొల్పే దిశగా ఇరు దేశాల మధ్య ప్రయత్నాలు జరుగుతున్న వేళ ఈ హఠాత్ పరిణామం కొత్త ఆలోచనలను
రేకెత్తిస్తోంది.

ఈ ఘర్షణల నేపథ్యంలో రెండు దేశాలకు సంబంధించిన బలగాలను వెనక్కి రప్పించినట్లుగా సమాచారం. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సరిహద్దులకు వెళ్లి మన సైన్యానికి అచంచలమైన ధైర్యాన్ని ఇవ్వడమే కాక, చైనాకు గట్టి హెచ్చరిక కూడా చేశారు. సమాంతరంగా శాంతి స్థాపనకు పెద్దఎత్తున ప్రయత్నాలు జరిగాయి. ఇరు దేశాల ప్రతినిధులు పలుమార్లు చర్చలు జరిపారు. సుదీర్ఘకాలం పాటు వరుస చర్చల తర్వాత రెండు దేశాలు తమ బలగాలను చాలా వరకూ వెనక్కు తీసుకున్నాయి.

దీనివల్ల ఆ ప్రాంతాల్లో ఉద్రిక్తతలు తగ్గి కొంత శాంతి వాతావరణం అలుముకుంది. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ లో జరిగిన సంఘటనతో సరిహద్దుల్లో మళ్ళీ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ తరుణంలో మనం అప్రమత్తమైనప్పటికీ, అతి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతో వుంది. జవహర్ లాల్ నెహ్రూ కాలం నుంచి ఇప్పటి వరకూ జరిగిన పరిణామాల్లో చాలా వరకూ మన భూభాగాలను చైనా ఆక్రమించేసిందనే ఎక్కువమంది పరిశీలకుల వాదన. ఏ కాలంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఈ ఆక్రమణ విషయాన్ని ఏ ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు.

అధికారంలో ఉన్నప్పుడు ఒకరకంగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకో రకంగా తమకు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నాయి. ముఖ్యంగా జిన్ పింగ్ కాలంలో, భారత్ -చైనా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయనే చెప్పాలి. అమెరికాను అధిగమించి అగ్రరాజ్యంగా అవతరించాలనే ఆకాంక్ష, సామ్రాజ్య విస్తరణ కాంక్ష బలంగా ఉన్న నాయకుడిగా జిన్ పింగ్ కు ప్రపంచ దేశాల్లో పేరుంది.

ఇక అరుణాచల్ ప్రదేశ్ విషయానికి వస్తే అదంతా తమ భూభాగమనే భావనల్లోనే చైనా ఉంది. అరుణాచల్ ప్రదేశ్ అనే దానికి చైనా ప్రభుత్వం ఎప్పుడూ గుర్తింపు ఇవ్వలేదు. అరుణాచల్ ప్రదేశ్ ‘దక్షిణ టిబెట్‌’ అని చైనా చెబుతోంది. భారత్- చైనా మధ్య సరిహద్దు వివాదాలపై ఎన్ని సమావేశాలు జరిగినా.. ఇప్పటివరకూ ఈ సమస్య మాత్రం అపరిష్కృతంగానే ఉంది. రెండు దేశాల మధ్య 3500 కిలోమీటర్ల సరిహద్దు ఉంది.

సరిహద్దు వివాదం వల్ల రెండు దేశాలు 1962లో యుద్ధం కూడా చేశాయి. కానీ ఇప్పుడు కూడా సరిహద్దులో ఉన్న కొన్ని ప్రాంతాలు రెండు దేశాల మధ్య అప్పుడప్పుడు ఉద్రిక్తతలకు కారణం అవుతున్నాయి. అయితే అరుణాచల్ ప్రదేశ్‌తో పాటు ఉన్న భారత దేశ సౌర్వభౌమాధికారానికి అంతర్జాతీయ గుర్తింపు ఉంది.

అంతర్జాతీయ చిత్రపటాల్లో కూడా అరుణాచల్ ప్రదేశ్‌ను భారత్‌లో భాగంగా చూపిస్తున్నారు. చైనా మాత్రం టిబెట్‌తోపాటు అరుణాచల్ ప్రదేశ్‌ కూడా తమదే అంటోంది. ఈ ప్రాంతం దక్షిణ టిబెట్‌ అంటోంది. మొదట్లో అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్‌ ఉత్తర భాగం మాదేనని చైనా చెప్పేది. 1912 వరకూ టిబెట్, భారత్ మధ్య ఎలాంటి స్పష్టమైన సరిహద్దు రేఖ లేదు. 1914లో టిబెట్ స్వతంత్రంగా ఉన్నా బలహీనమైన దేశం.

భారత్‌లోని బ్రిటిష్ పాలకులు తవాంగ్‌, దక్షిణ భాగాన్ని భారత్‌లో భాగంగానే భావించారు. దానిని టిబెటన్లు కూడా అంగీకరించారు. కానీ అది చైనాకు కోపం తెప్పించింది. చైనా ప్రతినిధులు దానికి ఒప్పుకోలేదు. సమావేశం నుంచి వెళ్లిపోయారు. 1935 తర్వాత నుంచి ఆ ప్రాంతం మొత్తం భారత చిత్రపటంలోకి వచ్చింది. చివరికి 1950లో చైనా టిబెట్‌ను పూర్తిగా తన అధీనంలోకి తెచ్చుకుంది. టిబెట్బౌ ద్ధులకు చాలా ముఖ్యమైన తవాంగ్ కూడా దేశంలో భాగంగా ఉండాలని చైనా కోరుకుంటోంది.

చైనా .. అరుణాచల్ ప్రదేశ్ ను హస్తగతం చేసుకోవాలనుకుంటున్నా, సాధ్యం కావడం లేదు. అందుకే అక్కడ అలజడి సృష్టించాలని కుయుక్తులు
పన్నుతోందని అంతర్జాతీయ పరిశీలకులు అంటున్నారు.

Must Read

spot_img