పాముకి పాలు పోసి పెంచితే కాటేయడం మానేస్తుందా…? పాకిస్తాన్‌కు అదే అనుభవం ఎదురైంది ఇప్పుడు. పాకిస్తాన్ పెంచి పోషించిన తాలిబన్లే… ఇప్పుడు ఆ దేశాన్ని కాటేస్తున్నారు. ఏకంగా సమాంతర ప్రభుత్వాన్నే నడుపుతూ సవాలు విసిరారు తాలిబన్లు.. పాకిస్తాన్‌కు పక్కలో బల్లెంలా మారుతున్నారు. పాక్‌లో సామాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ చుక్కలు చూపిస్తున్నారు తాలిబన్లు.
హక్కానీ యూనివర్సిటీలో తాలిబాన్ల కు శిక్షణ ఇచ్చేందుకు ప్రోత్సహించిన పాకిస్థాన్‌పైనే ఇప్పుడు తాలిబాన్లు జిహాద్ జరపనున్నారా…? పాకిస్థాన్ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నిస్తూ.. తాలిబాన్లు సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నారా…? ప్రస్తుత పరిణామాలు అవుననే సమాధానాలు చెబుతున్నాయా..? మరి.. పాక్ ప్రభుత్వం ఏం చేస్తోంది..?

ఆఫ్గానిస్థాన్ లో తిష్టవేసిన సోవియట్లను తరిమేందుకు తాలిబన్లను తయారు చేశాం.. మేం చేసిన వారే అమెరికాను, నాటోను కూడా ఓడించారంటూ పాక్ నాయకులు గొప్పగా చెప్పుకున్నారు.. ఇక తాలిబన్ మూకలు భారత్ పై దృష్టి పెడతాయని బెదిరింపులకు తెగబడ్డారు. కానీ, వారి అంచనాలు తిరగబడ్డాయి. అదే తాలిబన్ల మద్దతుతోనే ‘తెహ్రీక్ ఇ తాలిబన్లు’ చెలరేగిపోతున్నారు. పాముకి పాలు పోస్తే తిరిగి కాటేసిందన్నట్టుగా పాకిస్తాన్‌నే కాటేస్తున్నారు ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్స్.
ఆఫ్ఘన్‌లో అధికారం చెలాయిస్తోన్న తాలిబన్లు, ఇప్పుడు పాక్‌పై ఫోకస్ పెట్టారు. పాకిస్తాన్‌ను తమ కంట్రోల్‌లోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆఫ్ఘన్ తాలిబన్లకు సన్నిహితమైన టీటీపీ ద్వారా పాకిస్తాన్‌లో చెలరేగిపోతోంది. ప్రధాని షెహబాజ్ ప్రభుత్వానికి పోటీగా ఉత్తర పాకిస్తాన్‌లో సమాంతర సర్కార్‌ను నెలకొల్పి పాలిస్తోంది.కేవలం ప్రభుత్వాన్నే కాదు.. మంత్రివర్గాన్ని కూడా ఏర్పాటు చేసింది తెహ్రీక్ ఇ తాలిబన్ గ్రూప్.
ఈ పరిణామాలు పాకిస్తాన్ సార్వభౌమత్వాన్నే సవాలు చేయడంతో పాలక వర్గం, సైన్యం డిఫెన్స్‌లో పడ్డాయి. ఎలాఎదుర్కోవాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్నారు పాలకులు.
ఒకవైపు ఉత్తర పాకిస్తాన్‌లో ప్రభుత్వాన్ని నడుపుతూనే, మరోవైపు పాక్ బోర్డర్‌లో దాడులు చేస్తున్నారు ఆఫ్ఘన్ తాలిబన్లు. తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్తాన్ గ్రూప్‌ను టీటీపీగా పిలుస్తారు. ఈ గ్రూప్‌ను పాకిస్తాన్ తాలిబన్ అని కూడా అంటారు. ఇది ఆఫ్ఘన్ తాలిబన్‌కి అనుబంధ సంస్థ. ఈ గ్రూపే ఇప్పుడు ఉత్తర పాకిస్తాన్‌లో సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతోంది. దాంతో, షెహబాజ్ సర్కారు ఉలిక్కిపడింది.
ఆర్మీ ఆఫీషియల్స్‌తో అత్యవసర సమావేశం నిర్వహించారు ప్రధాని షెహబాజ్ .. ఈ మీటింగ్ తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌పై హాట్ కామెంట్స్ చేశారు పాక్ హోంమంత్రి రాణా సనావుల్లా. పాకిస్తాన్ వ్యతిరేక శక్తులను ప్రోత్సహిస్తే, ఆఫ్ఘన్‌లోకి చొచ్చుకొచ్చి మరీ దాడి చేస్తామని హెచ్చరించారు. ఈ ప్రకటనతో మరింత చెలరేగిపోతున్నారు తాలిబన్లు.
ఇప్పుడు ఏకంగా పాక్ ప్రధాని షెహబాజ్ ప్రభుత్వానికి పోటీగా… ఉత్తర పాకిస్థాన్ లో టీటీపీ సమాంతర ప్రభుత్వాన్ని నెలకొల్పింది. దీనిలో వివిధ మంత్రి వర్గ శాఖలను ఏర్పాటు చేసింది. ఈ పరిణామాలు పాకిస్థాన్ సార్వభౌమత్వాన్నే సవాలు చేయడంతో పాలకులకు, సైన్యానికి కునుకు పట్టడం లేదు. 1971లో భారత్ చేతిలో ఎదురైన అవమానమే ఈసారి తమ నుంచి ఎదురవుతుందని హెచ్చరిస్తున్నారు. దాంతో, పాకిస్తాన్ పరువు పోయినంత పనైంది.
అఫ్గాన్ తాలిబన్లు పాక్ పై సరిహద్దుల్లో దాడులు ..
భూభాగాన్ని కూడా విభజించి.. పాక్ తాలిబన్లు తమదిగా చెప్పుకొంటున్న ప్రాంతాన్ని రెండు భాగాలుగా విభజించారు. వీటిల్లో గిల్గిట్, బల్టిస్థాన్, అఫ్గాన్ సరిహద్దులను కలిపి ఉత్తర ప్రావిన్స్‌గా.. పాక్ లోని పంజాబ్ ప్రావిన్స్ సరిహద్దు వరకు ఉన్న ప్రదేశాన్ని దక్షిణ ప్రావిన్స్‌గా విభజించింది. అంతేకాదు పాక్ అత్యంత కీలకమైన పంజాబ్ ప్రావిన్స్‌లోని డేరా ఘాజీ ఖాన్ ప్రాంతాన్ని కూడా తమదిగానే చెబుతోంది.
”తెహ్రీక్ ఇ తాలిబన్ ఈ కొత్త నియామకాలతో మా సంస్థను వివిధ మంత్రిత్వ శాఖలుగా విభజిస్తోంది. రక్షణ, న్యాయ, సమాచార, రాజకీయ వ్యవహారాల, ఆర్థిక వ్యవహారాల, విద్యా, ఫత్వా అథారిటీ, ఇంటెలిజెన్స్, నిర్మాణ శాఖలు ఉంటాయి” అని టీటీపీ ప్రతినిధి విడుదల చేసిన ప్రకటనను ‘ది ఖొరాసన్ డైరీ’ ప్రచురించింది. పాకిస్థాన్ ను ఆక్రమించి షరియా చట్టం అమలు చేయాలన్నది టీటీపీ లక్ష్యం.

‘తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్థాన్’ ను టీటీపీగా వ్యవహరిస్తారు. దీనిని పాక్ తాలిబన్ అని కూడా అంటారు. ఇది అఫ్గాన్ తాలిబన్ తానులోని ముక్కే. 1990లో
తాలిబన్లతో కలిసి సోవియట్ పై వీరు పోరాడారు. 2001 సెప్టెంబర్ 11న ట్విన్ టవర్స్‌పై దాడి తర్వాత అమెరికా ఉగ్రవేటకు పాక్ మద్దతు తెలిపింది. దీనిని పాక్‌లోని తాలిబన్ సానుభూతి పరులు వ్యతిరేకించారు. 2007లో దీనిని స్థాపించారు. ఇది అఫ్గాన్ తాలిబన్లతో కలిసి పనిచేస్తోంది. 2021లో అఫ్గాన్ నుంచి అమెరికా, నాటో బలగాలు వెళ్లిపోయాక బలపడింది. టీటీపీ అధినేత నూర్ వలీ మెహసూద్ అఫ్గాన్‌లోనే తిష్ఠవేసి తన కార్యకర్తలను నడిపిస్తున్నాడు.
అఫ్గాన్ తాలిబన్లు అడ్డం తిరిగిన వేళ.. అఫ్గానిస్థాన్‌లో అధికారం దక్కించుకొనే వరకు అక్కడి తాలిబన్లు పాకిస్థాన్ కనుసన్నల్లోనే ఉండేవారు. అమెరికా
నుంచి అధికారం దక్కించుకొన్నాక.. నాటి పాక్ ఐఎస్‌ఐ చీఫ్ ఫయాజ్ హమీద్ కాబూల్ వెళ్లి అక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు తాలిబన్లకు మార్గదర్శకత్వం చేసి మరీ వచ్చాడు.
దాదాపు 18 నెలలు గడిచాక పరిస్థితులు వ్యతిరేకంగా మారాయి. దాదాపు 2,600 కిలోమీటర్ల పొడవు కలిగిన డ్యూరాండ్ లైన్ వద్ద పాక్‌తో ఉన్న సరిహద్దు వివాదంపై అఫ్గాన్ తాలిబన్లు దృష్టిపెట్టారు. తొలుత ఈ సరిహద్దులో కంచె వేద్దామని పాక్ యత్నించినా తాలిబన్లు ఆ ప్రయత్నాలను అడ్డుకొన్నారు. ఖైబర్ పఖ్తూన్‌క్వాలోని పష్తూన్ ప్రాంతాలు పాక్ ఏలుబడిలోకి వెళ్ళిపోయాయని, అవి తమకే చెందుతాయని అఫ్గాన్ తాలిబన్లు వాదిస్తున్నారు.
చమన్-స్పిన్‌బౌల్డక్ వద్ద డిసెంబర్‌లో అఫ్గాన్ తాలిబన్లు చేసిన దాడిలో ఒకరు మరణించగా.. 11 మంది గాయపడ్డారు. అదే నెలలో కాబూల్‌లోని పాక్ ఎంబసీపై కూడా దాడి జరిగింది. అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు అధికారం చేపట్టాక.. పాక్ తాలిబన్లకు బలం వచ్చేసింది. ‘పాక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పీస్ స్టడీస్’ లెక్కల ప్రకారం 2020 ఆగస్టు నుంచి 2021 ఆగస్టు వరకు 165 ఉగ్రదాడులు జరిగ్గా.. 294 మంది మరణించారు.
అదే 2021 ఆగస్టు నుంచి 2022 ఆగస్టు వరకు 250 ఉగ్రదాడుల్లో 433 మంది మరణించారు. అంటే అఫ్గాన్ నుంచి అమెరికా వెళ్లిపోయాక.. పాక్‌లో ఉగ్రదాడులు 50శాతం పెరిగాయి. వీటిల్లో చాలా వరకు టీటీపీ చేసిన దాడులే.. ఇక గత మూడు నెలల్లో 132 ఉగ్రదాడులు జరిగితే.. వీటిల్లో 50 ఒక్క నవంబర్లోనే చోటు చేసుకొన్నాయి. ఉత్తర పాకిస్థాన్‌లో సమాంతర ప్రభుత్వం ఏర్పాటుతో షెహబాజ్ సర్కారు ఉలిక్కిపడింది.
పౌర, సైనిక నాయకత్వాలు అత్యవసరంగా సమావేశమయ్యాయి. ఈ మీటింగ్ అనంతరం పాక్ హోం మంత్రి రాణా సనావుల్లా అఫ్గానిస్థాన్‌పై వివాదాస్పద ప్రకటన చేశారు. పాక్ వ్యతిరేక శక్తులకు ఆశ్రయమిస్తే.. అఫ్గానిస్థాన్‌లోకి చొచ్చుకొచ్చి మరీ దాడి చేస్తామన్నారు. ఈ ప్రకటనతో అఫ్గాన్ తాలిబన్ పాలకులు మండిపడ్డారు. 1971లో భారత్ చేతిలో ఎదురైన అవమానం ఈ సారి తమ చేతిలో ఎదురవుతుందని హెచ్చరించారు. దీంతో పాక్ పరువు పోయినంత పనైంది.
కొత్త సంవత్సరం సందర్భంగా టీటీపీ పాకిస్థాన్‌లో సమాంతర ప్రభుత్వం..!
సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతామని ప్రకటించింది. గృహ నిర్మాణం మొదలు.. దేశ రక్షణ దాకా.. అన్ని విభాగాలకు మంత్రులను నియమిస్తూ.. ఆ జాబితాను మీడియాకు విడుదల చేసింది. పాకిస్థానీ తాలిబాన్ల రక్షణ మంత్రిగా కరడుగట్టిన ఉగ్రవాది ముఫ్తీ ముజాహిమ్ పేరును ప్రకటించింది. అతనితో పాటు.. విద్యా, రాజకీయ వ్యవహారాలు, ఫత్వాల జారీ, నిఘా శాఖలకు మంత్రులను నియమించింది. తమకు పట్టులేని ప్రాంతాలను కూడా పాలిస్తున్నట్లు స్పష్టం చేసింది.
ఇందుకోసం పాకిస్థాన్‌ను రెండుగా విభజించింది. పెషావర్, మలాకండ్, మర్దాన్, గిల్గిట్-బలూచిస్థాన్ లను ఉత్తరంగా…, దేరా ఇస్మాయిల్, బన్నూ, కోహట్ లను దక్షిణంగా విభజించింది.. ఆందోళనకరమైన విషయం ఏమిటంటే జిహాద్ కోసం మానవ బాంబు దాడులు చేసేలా.. ‘స్పెషల్ ఇస్తిషాహిద్ ఫోర్స్’ పేరుతో ఓ శాఖను పరిచయం చేసింది. పాక్ సర్కారుపై జిహాద్‌ను ప్రకటించింది.

తాలిబాన్ల తాజా నిర్ణయంతో టీటీపీకి పట్టున్న గిరిజన ప్రాంతాలైన ఖైబర్ పఖ్తున్‌ఖ్వా, బలూచిస్థాన్ రీజియన్లలో పౌరుల్లో ఆందోళనలు నెలకొన్నాయి. కొన్ని వర్గాలు తాలిబాన్ల పాలనను స్వాగతిస్తుండగా.. మరికొన్ని 2014 మునుపటి పరిస్థితులను ఊహించుకుంటూ తీవ్ర భయాందోళనలకు గురవుతున్నాయి. సెప్టెంబరు 18న ఖైబర్ పఖ్తున్‌ఖ్వాలోని స్వాత్ జిల్లాలో పౌరులు పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
ఈ ఆందోళనలు పలు ప్రాంతాలకు విస్తరించాయి. పాక్ సర్కారు అభివృద్ధిని విస్మరించిందని, వాయవ్య ప్రాంతాలను పూర్తిగా విస్మరించిందంటూ ఆందోళనకారులు విమర్శించారు. అదే సమయంలో.. తాలిబాన్ల చేతుల్లోకి ఈ రీజియన్లు మళ్లీ వెళ్లిపోతున్నాయంటూ సింహభాగం పౌరులు ఆందోళన చెందుతున్నారు. 2014కు ముందు ఈ ప్రాంతాల్లో తాలిబాన్ల అరాచకాన్ని గుర్తుచేసుకుంటున్నారు. ‘‘అప్పట్లో ఇక్కడ ఉండలేక.. వేల సంఖ్యలో పౌరులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు.
చాలా మంది సొంత దేశంలోనే శరణార్థులుగా ఉన్నారు. 2014లో పాక్ సర్కారు తాలిబాన్లను అణిచివేసినా.. 2017 వరకు చాలా మంది తిరిగి రావడానికి సాహసించలేదు..’’ వేల మంది అప్పట్లో వలస వెళ్లారని, రాక్షస పాలన తిరిగి వస్తే మళ్లీ అదే పరిస్థితి నెలకొంటుందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. పాకిస్థాన్ తాజా మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ స్వస్థలం ఖైబర్ ఫంఖ్తుఖ్వాలో ఈ పరిస్థితులు నెలకొనడం గమనార్హం..
పాకిస్థాన్ ప్రభుత్వం టీటీపీ విషయాన్ని తేలిగ్గా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది..
పాకిస్థానీ తాలిబాన్లు గత ఏడాది ఆ దేశ సైన్యం, పోలీసులు, ఇంటెలిజెన్స్ వర్గాలపై 148 సార్లు దాడులు జరిపారు. అంతకు ముందు ఏడాది కూడా ఖైబర్ పఖ్తున్‌ఖ్వా, క్వెట్టా, బలూచిస్థాన్‌లలో వందల సంఖ్యలో ఉగ్రదాడులు జరిగాయి. నిజానికి పాకిస్థాన్ సర్కారుతో టీటీపీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. గత ఏడాది నవంబరులో ఆ ఒప్పందాన్ని రద్దుచేసుకుంటున్నట్లు టీటీపీ ప్రకటించింది. ఆ తర్వాత తాలిబాన్ల దాడులు ఉధృతమయ్యాయి.
పీపీటీ ఒక్క నవంబరులోనే 59 దాడులు చేయగా.. డిసెంబరులో ఆ సంఖ్య 30కి పైగా ఉంది. పాకిస్థాన్ ప్రభుత్వం టీటీపీ విషయాన్ని తేలిగ్గా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. పాకిస్థానీ తాలిబాన్లు కేవలం 10 వేల మంది వరకు ఉంటారు. వాళ్ల కుటుంబ సభ్యులతో కలిపితే ఆ సంఖ్య 25 వేలకు మించదు’’ అని పాకిస్థాన్ అంతర్గత భద్రత వ్యవహారాల మంత్రి రాణా సనాఉల్లా వ్యాఖ్యానించారు. తాలిబాన్లకు ఆఫ్ఘానిస్థాన్ దన్నుగా ఉంటోందని విమర్శించారు.
టీటీపీని అణిచివేస్తామన్నారు. వాయవ్య పాకిస్థాన్‌కు చెందిన యువతను టీటీపీ నేతలు పెద్ద సంఖ్యలో రిక్రూట్ చేసుకుంటున్నారు. కాగా.. టీటీపీ నేతలు 15 నుంచి, ఆపైన వయసున్న యువతను భారీ ఎత్తున రిక్రూట్ చేసుకుంటున్నట్లు పాకిస్థాన్ పత్రిక ‘ద డాన్’ ఓ కథనాన్ని ప్రచురించింది..
టీటీపీ పాకిస్థాన్‌లో సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతామని ప్రకటించింది. ఇదే ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వంలో కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.. మరి.. పాక్ ప్రభుత్వం ఏం చేయనుందో చూడాలి..