Homeసినిమాసుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం.. హత్యా లేక ఆత్మహత్యా..!

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం.. హత్యా లేక ఆత్మహత్యా..!

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ .. మరణం .. మిస్టరీనే మిగుల్చుతోంది. తాజాగా ఆయనది హత్యా లేక ఆత్మహత్యా అన్న చర్చ తెరపైకి వచ్చింది. పోస్టుమార్టం చేసిన సిబ్బంది వ్యాఖ్యలతో మళ్లీ ప్రకంపనలు షురూ కానున్నాయి.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ .. మృతి .. బాలీవుడ్ నే షేక్ చేస్తోంది. ఇప్పటికే బాయ్ కాట్ పేరిట .. రచ్చ సృష్టిస్తోంది. తాజాగా ఈ డెత్ మిస్టరీలో పోస్టుమార్టం లో పాల్గొన్న ఓ ఉద్యోగి వ్యాఖ్యలు .. ఇప్పుడు పెను తుఫాన్ కు కారణమని అంచనాలు వినిపిస్తున్నాయి.

బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌ పుత్ డెత్ కేసు అనూహ్య మలుపు తిరిగింది. ఈ కేసుపై కేంద్రీయ దర్యాప్తు సంస్థ.. సీబీఐ రెండు సంవత్సరాలుగా దర్యాప్తు సాగిస్తోన్న నేపథ్యంలో తాజాగా కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతదేహంపై కొన్ని చోట్ల గాయాలు ఉన్నాయనే విషయం బయటపడింది. అవన్నీ కూడా ఆయనది బలవన్మరణం కాదని, హత్యకు గురై ఉండొచ్చనే అనుమానాలను రేకెత్తించాయి.

2020 జూన్ 14న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ముంబై బాంద్రాలోని తన ఫ్లాట్‌లో ఆయన ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. సుశాంత్ సింగ్ డెత్ కేసు అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. ఆయనతో సన్నిహితంగా మెలిగిన అంకిత లోఖండె, రియా చక్రవర్తి పేర్లు బయటికొచ్చాయి. దేశం మొత్తాన్నీ కుదుపులకు గురి చేసిన బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం కూడా ఈ డెత్ కేసు తరువాతే వెలుగు చూసింది.

బిహార్‌కు చెందిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అప్పటివరకు 12 సినిమాల్లో నటించారు. ఎంఎస్ ధోనీ తరువాత ఆయన నటించిన అన్ని సినిమాలూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షాన్ని కురిపించాయి. స్టార్‌ డమ్‌ను తెచ్చిపెట్టాయి. పలు సినిమాలు చర్చల దశల్లో ఉన్నాయి. కొన్నింటికి సంతకాలు కూడా చేశారాయన. కేరీర్ ఉన్నత స్థితిలో ఉన్న సమయంలో అనూహ్యంగా ఆయన ఆత్మహత్య చేసుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

సుశాంత్ సింగ్ రాజ్‌ పుత్ వద్ద మేనేజర్‌గా పని చేసిన దిశ అనే యువతి ఆత్మహత్య తరువాత ఆయన డిప్రెషన్‌లోకి వెళ్లి ఉండొచ్చంటూ మొదట్లో వార్తలొచ్చాయి. బాలీవుడ్ యువ నటి అంకిత లోఖండేతో సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన రిలేషన్‌ షిప్ బ్రేకప్ కావడం కూడా దీనికి ఓ కారణంగా భావించారు.

సుశాంత్ సింగ్ ది ఆత్మహత్య కాదని, ఆయనది హత్యేనని నిర్ధారించడానికి బలమైన సాక్ష్యాధారం బయటికొచ్చింది..

ఈ కేసులో దర్యాప్తు సాగుతున్న కొద్దీ కొత్త విషయాలు బయటపడ్డాయి. బాలీవుడ్ లో ఉన్న లోపాలన్నీ- తీగ లాగితే డొంక కదిలిందన్నట్లుగా బయటికొచ్చాయి. ఇప్పుడు తాజాగా షాకింగ్ విషయం వెలుగు చూసింది.

ఆయన మృతదేహానికి అటాప్సీ నిర్వహించిన ఉద్యోగి ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు. సుశాంత్ సింగ్ మృతదేహంపై గాయాలు ఉన్నాయని, అది ఎవరో కొట్టిన దెబ్బలేనని ఈ ఉద్యోగి వ్యాఖ్యానించారు. సుశాంత్ సింగ్ రాజ్‌ పుత్ మృతదేహానికి కూపర్ ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించిన విషయం తెలిసిందే. అక్కడ పోస్ట్ మార్టం నిర్వహించిన రూప్ కుమార్ షా అనే ఉద్యోగి సంచలన విషయాలను వెల్లడించారు.

సుశాంత్ సింగ్ మరణించినప్పుడు తమ ఆసుపత్రికి అయిదు మృతదేహాలు పోస్ట్‌మార్టం కోసం వచ్చాయని, ఆ అయిదింట్లో ఒకటి విఐపీకి చెందినదని చెప్పారు. తాము పోస్ట్ మార్టం చేయడానికి వెళ్లినప్పుడే అది సుశాంత్ సింగ్ మృతదేహం అని తెలిసిందని, శరీరంపై చాలా గుర్తులు ఉన్నాయని పేర్కొన్నారు. మెడపై రెండు నుంచి మూడు గాయాల గుర్తులను తాము నిర్ధారించామని చెప్పారు.

తాను సుశాంత్ సింగ్ మృతదేహాన్ని మొదటిసారి చూసినప్పుడే ఇది ఆత్మహత్య కాదని భావించానని ఆ ఉద్యోగి స్పష్టం చేశారు. ఆయనది హత్యేననే విషయాన్ని తనపై అధికారులకు తెలిపానని వివరించారు. నిబంధనల ప్రకారం తన పని తాను చేశానని, తాను గుర్తించిన విషయాలను వారికి వివరించానని అన్నారు. వీలైనంత త్వరగా పోస్ట్ మార్టం పూర్తి చేసి మృతదేహాన్ని పోలీసులకు అప్పగించాలంటూ ఒత్తిడి చేశారని, అందుకే రాత్రి పూట మాత్రమే పోస్ట్‌మార్టం నిర్వహించామని రూప్ కుమార్ షా స్పష్టం చేశారు.

సుశాంత్ శరీరంపై గాయాలు ఉన్నాయి. ఇది మర్డర్ కావచ్చు, మనం ప్రొసీజర్ ఫాలో అవుదామని చెప్పానని రూప్ కుమార్ తెలిపారు. పోస్టుమార్టం
వీడియో రికార్డు చేయాల్సి ఉంది. కానీ అధికారులు వద్దు అన్నారని, కేవలం ఫోటోలు తీసుకొని పోలీసులకు బాడీని అప్పగించామని చెప్పారు. ఈ
విషయాన్ని ఇంతకాలం ఎందుకు దాచిపెట్టారనే ప్రశ్నకు కూడా సమాధానమిచ్చారు.

పనిలో ఎవరికీ ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే ఇంత సేపు మాట్లాడలేదని అన్నారు. కూపర్ హాస్పిటల్ మార్చురీలో రూపకుమార్ పనిచేసి, నెలన్నర క్రితం పదవీ విరమణ చేశారు. ఇదిలా ఉంటే సుశాంత్ సింగ్ మరణం పై సుదీర్ఘ విచారణ జరిగింది. ఈడీ, ఎన్సీబీ, సీబీఐ అధికారులు విచారణ చేపట్టారు. కొన్ని అరెస్టులు కూడా జరిగాయి. ఫైనల్ గా సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నారని తేల్చారు.

మరోవైపు సుశాంత్ తండ్రి కేకే సింగ్ నా కొడుకుది ఆత్మహత్య కాదు మర్డర్ అని వాదిస్తున్నారు. సుశాంత్ హత్యలో మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రమేయం ఉందని ఆరోపించారు. తాజాగా రూపేష్ కుమార్ షా చేసిన కామెంట్స్ పెను దుమారం రేపాయి. సుశాంత్ సింగ్ మరణం బాలీవుడ్ లో ప్రకంపనలు రేపింది. అభిమానులు పెద్ద ఎత్తున ప్రముఖులపై సోషల్ మీడియా యుద్ధం ప్రకటించారు.

అలియా భట్, కరీనా కపూర్, కరణ్ జోహార్, సల్మాన్ ఖాన్, మహేష్ భట్ ఇలా పలువురిని టార్గెట్ చేశారు. నెపోటిజం కారణంగానే సుశాంత్ మరణించారంటూ బాయ్ కాట్ బాలీవుడ్ నినాదం తెరపైకి తెచ్చారు. నెటిజన్స్ దెబ్బకు కొన్ని నెలల పాటు అలియా భట్, కరణ్ జోహార్, కరీనా సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు. అప్పటి నెపోటిజం మంటలు ఇప్పటికీ బాలీవుడ్‌లో కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున అభిమానులు సుశాంత్‌కి మద్దతుగా నిలిచి.. అతని చావు వెనుక ఉన్న మిస్టరీని ఛేదించాలని డిమాండ్ చేశారు.

కేసుని సీబీఐకి అప్పగించాలని కూడా అప్పట్లో అభిమానులు పెద్ద ఎత్తున కోరారు. కానీ కొంత మంది బాలీవుడ్ పెద్దలు ఈ కేసుని నీరుగార్చినట్లు
ఆరోపణలు వినిపించాయి. మరోవైపు ఈ కేసులో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ స్నేహితురాలు రియా చక్రవర్తికి ‘ఏయూ’ అనే వ్యక్తి నుండి రియాకు 44
కాల్స్ వచ్చినట్టుగా తెలిసింది. ఏయూ అంటే ఆదిత్య ఠాక్రే అని బీహార్ పోలీసులు తెలిపారు.

దీనిపై లోక్‌సభలో ఏక్‌నాథ్ షిండే వర్గానికి చెందిన ఎంపీ రాహుల్ షెవాలే సైతం వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్.. సంచలనం సృష్టించాయి. సుశాంత్ కేసు విషయంలో సీబీఐ విచారణ స్థితిని వెల్లడించాలని ఎంపీ డిమాండ్ కూడా చేశారు. ఆ సమయంలో రియాకు కాల్ చేసినది మరొరకు కాదని, అప్పటి మంత్రి ఆదిత్య ఠాక్రే అని బీహార్ పోలీసులు కనుగొన్నారని ఆరోపించారు.

తాజాగా సుశాత్ సింగ్ రాజ్‌పుత్ మృతి వెనుక ఉన్న మిస్టరీపై మరోసారి చర్చ తెరపైకి రావడంతో మళ్లీ వివాదం రాజుకుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో #SushantSinghRajput హ్యాష్‌ ట్యాగ్‌ ట్రెండీగా మారింది. అయితే సుశాంత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్ కుటుంబాలపై విమర్శలు చెలరేగాయి. గొప్ప భవితవ్యం కలిగి ఉండి, విదేశీయుతో కలిసి పని చేసిన రాజ్‌పుత్ సూసైడ్ స్టోరీ అసంపూర్తిగా మిగిలిపోయింది.

అయితే ఇప్పుడు కొన్ని ప్రశ్నలకు అతడి ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్‌ల రూపంలో జవాబులు దొరుకుతున్నాయి. ఇన్‌స్టాలో అతడు రాసుకున్న పొయెట్రీ అతనేంటో చెబుతోంది. ఆకాశంలో నక్షత్రాలను, బాలీవుడ్‌లో తారలను దగ్గరగా చూసిన ఓ హీరో అంతులేని కథ ఇంకా ముగింపుకు రాలేదు. తాజాగా రూప్ కుమార్ ఆరోపణల నేపథ్యంలో మళ్లీ సుశాంత్ విషాదాంతం .. తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారుతోంది.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ .. హత్య గావించబడ్డారన్న వార్తలు .. లక్షలాది మంది అభిమానుల్ని తీరని వేదనకు గురి చేస్తున్నాయి. మరి దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఏ నిర్ణయం తీసుకుంటుందన్నదే కీలకంగా మారింది.

Must Read

spot_img