Homeజాతీయంమండుతున్న ఎండలు...!!

మండుతున్న ఎండలు…!!

చూస్తుండగానే చలికాలం ముగిసిపోయి ఎండాకాలంలోకి ప్రవేశించడం జరిగిపోయింది. శివరాత్రి నుంచి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. భానుడు అప్పుడే తన ప్రతాపం చూపించడం మొదలైంది. ఈ సారి సమ్మర్ లో ఉష్ణోగ్రతలు గతం కన్నా ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వివిధ వాతావరణ సంస్థలు, శాస్త్రవేత్తలు రాబోయే వేసవి తీవ్రతకు సంబంధించిన హెచ్చరికలు ముందే చేశారు. ఫిబ్రవరి నెల పూర్తికాకముందే దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఎండలు మండుతున్నాయి.

గుజరాత్‌, రాజస్థాన్‌, మహారాష్ట్ర, కర్ణాటకలో 35 నుండి 39 సెల్సియస్‌ డిగ్రీల దాకా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీలకు ఉష్ణోగ్రత చేరుకోగా, అనేక చోట్ల సాధారణం కన్నా ఐదు నుండి ఆరు డిగ్రీలు ఎక్కువగా నమోదయింది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఎండల తీవ్రత పెరిగింది. మార్చి నెల ప్రారంభం కాకుండానే ఈ స్థాయిలో ఎండలు మండటం ఇటీవల సంవత్సరాల్లో ఇదే ప్రథమం. ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న వాతావరణ మార్పుల నేపథ్యంలో ఈ వేసవి ప్రభావం తీవ్రంగానే ఉంటుందన్న నివేదికలు కొంత కాలంగా వస్తూనే ఉన్నాయి. అయితే ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందిస్తున్నట్టు కనిపించడం లేదు.

తీరా మండే ఎండలు ముంచుకొచ్చి, చుక్కనీరు దొరకని స్థితిలో వడగాల్పులకు జనం పిట్టల్లా రాలిపోయే పరిస్థితి వస్తే కానీ కదలరా? ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోరా? అన్న ప్రశ్నలు సహజంగానే జనంలో ఉదయిస్తున్నాయి. వాతావరణ శాస్త్రవేత్తలు, పర్యావరణ నిపుణుల నుండి అందుతున్న వివిధ రకాల అంచనాలతో పాటు, ఈ వేసవికి సంబంధించి ఇప్పటికే మూడు హెచ్చరికలు మన దేశంలోని పరిశోధన సంస్థల నుండి కేంద్ర ప్రభుత్వానికి అందాయి. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ రీసెర్చి ‘ఐసిఎఆర్‌’ దాదాపు వారం రోజుల క్రితం రైతుల కోసం విడుదల చేసిన సూచనలలో ఈసారి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉందని తెలిపింది.

ఉష్ణోగ్రతలతో పాటే పసుపుపచ్చ పురుగు కూడా విస్తరించే అవకాశం ఉందని హెచ్చరించింది. వేసవి తీవ్రతకు సంబంధించి ఇది మొదటి హెచ్చరిక కాగా, ఆ తరువాత మూడు రోజులకే ఇండియన్‌ మెట్రలాజికల్‌ డిపార్ట్‌మెంట్‌ ‘ఐఎండి’ అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఉత్తర భారత దేశంలో గోధుమ పంటతో పాటు, ఇతర పంటల ఉత్పత్తి గణనీయంగా తగ్గే అవకాశం ఉందని హెచ్చరించింది. 21న విడుదల చేసిన మరో ప్రకటనలో ఉత్తరభారత దేశంలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కన్నా మూడు నుండి ఐదు డిగ్రీలు అదనపు ఉష్ణోగ్రతలు కొద్దిరోజుల పాటు నమోదయ్యే అవకాశం ఉందని, ఆ తరువాత కూడా సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.

గత ఏడాది ఇటువంటి పరిస్థితుల కారణంగా ఉత్తరభారత దేశంలో గోధుమల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. ఫలితంగా మార్కెట్లో గోధుమలకు కొరత ఏర్పడింది. ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్నయోజన కింద 11 రాష్ట్రాలకు చేయవలసిన గోధుమల సరఫరాను చేయలేక కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. దాదాపుగా అవే పరిస్థితులు పునరావృతమవుతున్నా కేంద్ర ప్రభుత్వంలో ఇంతవరకు చలనం లేకపోవడం బాధ్యతారాహిత్యం అని అంటున్నారు నిపుణులు. దీనికి తోడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న ఎల్‌నినో పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందన్న హెచ్చరికలు సైతం వెలువడుతున్నాయి.

బ్రిటన్‌ మెట్రలాజికల్‌ డిపార్ట్‌మెంట్‌తో పాటు, వివిధ అంతర్జాతీయ సంస్థల అంచనాల ప్రకారం ఎల్‌నినో కారణంగా మార్చి-ఏప్రిల్‌ నెలల మధ్య కాలం నుంచే ఉష్ణోగ్రతలు, వడగాల్పులు తీవ్రతరం కానున్నాయి. భూతాపం కారణంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయిన సంవత్సరంగా 2016 ప్రపంచ చరిత్రలో నిలిచిపోయింది. ఎల్‌నినో కారణంగా మళ్ళీ అటువంటి పరిస్థితులే ఏర్పడే అవకాశం ఉందన్న ఆందోళనలు నిపుణుల్లో వ్యక్తమవుతున్నాయి. అంటే రానున్నది కేవలం ఎండాకాలం… మండేకాలం మాత్రమే కాదు.. అంతకన్నా గడ్డు కాలం అని నిపుణులు అని చెప్పకనే చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో అన్ని రంగాల్లోనూ అవసరమైన ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. తాగునీటి నుంచి పశుగ్రాసం సరఫరా వరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరగాలి. ఉపాధి హామీ పథకంలో భాగంగా పనిచేసే కూలీలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలి. రోడ్డు పక్కన బతుకులీడ్చే అభాగ్యులను ఆదుకోవడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఇప్పటివరకు ఉన్న వాతావరణం వేరు, రానున్న కాలంలో పరిస్థితులు వేరుగా ఉండబోతున్నాయని సదరు శాఖ అధికారులు చెబుతున్నారు. దినసరి కూలీలు ఉదయంపూటనే పనులు పూర్తిచేసుకొని మధ్యాహ్నంలోగా ఇంటికి చేరేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. ఇక నుంచి మధ్యాహ్నం పూట బయటికి వెళ్లాలంటే తప్పకుండా గొడుగులు వెంట తీసుకెళ్లాలంటున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు చాలా జాగ్రత్తగా ఉండాలని, ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్‌ ధరించాలంటున్నారు.

రాత్రిపూట చలి, మధ్యాహ్నం వేడిగా ఉంటున్నది. ప్రతిరోజూ భిన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వైరల్‌ జ్వరాలు పెరిగాయి. జ్వరం, దగ్గు, ఒళ్లు నొప్పులు, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలతో ఇప్పటికే చాలామంది బాధపడుతున్నారు. ప్రభుత్వ దవాఖానల్లో వడదెబ్బ బాధితుల కోసం ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నారు. ఇప్పటికే అధికార యంత్రాంగం ఎండదెబ్బల నుంచి కాపాడుకునేందుకు ఉపశమన చర్యలపై ఆదేశాలు జారీ చేసింది. చేతులు కాలాక ఆకులు పట్టుకునేదానికన్నా ప్రభుత్వాలు తక్షణమే స్పందించి తగు కార్యాచరణతో ముందుకు రావాలి. దేశంలో ఫిబ్రవరి మొదట్లోనే ఇంతగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతే త్వరగా వేసవి వచ్చిపడిందా అన్న అనుమానాలున్నాయి కాబట్టే ఈ జాగ్రత్తలు అవసరం. మధ్యాహ్నం పూట భానుడు తన ప్రతాపం చూపుతుండడంతో బయట అడుగు పెట్టేందుకు జనం భయపడుతున్నారు. ఉదయం, రాత్రి వేళల్లో చలి ప్రభావం ఉన్నప్పటికీ మధ్యాహ్నం అయ్యేసరికి ఎండ తీవ్రత పెరుగుతున్నది.

ఎల్ నినో, లా నినోలు వాతావరణ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయన్నది సూచిస్తాయి. ఎల్‌నినో అంటే అసాధారణమైన ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అదే ‘లా నినో’ అంటే చలి గాలులు ఎక్కువగా వీస్తాయి. సాధారణంగా భారత్‌లో ఎల్‌నినో సంవత్సరంలో వర్షపాతం తగ్గుతూ ఉంటుంది. 2018లో దేశంలో చివరగా ఎల్‌నినో పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ ఏడాది ఎల్‌నినో ముప్పు పొంచి ఉండటంతోనే ఫిబ్రవరిలోనే వేడికి జనం అల్లాడిపోతున్నారని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. ఇప్పటికే భూతాపం పెరగడం , భూమధ్య రేఖ వెంబడి పసిఫిక్ మహాసముద్రంలో వేడెక్కుతున్న సముద్ర ఉపరితలాన్ని ఎల్ నినో సంకేతాలుగా భావిస్తున్నారు. ఈ ఏడాది మార్చి ఆరంభం భరించలేని వేడితో పాటు నుంచే వడగాలులు కూడా మనల్ని చుట్టేయబోతున్నాయి.

ఇక మనం ఎప్పుడూ చెప్పుకునే గ్లోబల్ వార్మింగ్ విషయాని వస్తే.. వాతావరణ మార్పుల కారణంగా సాధారణంగా ఇలాంటి హీట్ వేవ్ నాలుగేళ్ల కొకసారి కనిపించవచ్చని లండన్‌లోని ఇంపీరియల్ కాలేజ్‌కు చెందిన మరియం జకారియా, ఫ్రెడరిక్ ఒట్టో చేసిన పరిశోధనలో తెలిసింది. హీట్ వేవ్స్ పెరిగేకొద్దీ వ్యవసాయం, టూరిజం, మత్స్యకార పరిశ్రమ, ఇలా అనేక రంగాలపై దీని ప్రభావం పడుతుంది.పంటల దిగుబడులు తగ్గిపోతాయి. భూతాపాన్ని ఒకటిన్నర డిగ్రీలు తగ్గించే దిశగా అంతర్జాతీయ సదస్సుల్లో అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారు. మండే ఎండల ప్రభావం ఇతర రంగాల మీదా ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతలు పెరిగితే విద్యుత్ వినియోగం పెరుగుతుంది. ఆ మేరకు విద్యుత్ ఉత్పత్తి పెరగాల్సి ఉంటుంది. వృద్ధులు, వడదెబ్బ వల్ల మరణాలు వంటివి కూడా పెరగవచ్చు. అనారోగ్య సమస్యలు, గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు, పశువుల మేత, పంటల దిగుబడి తగ్గడం లాంటి అనేక సమస్యలు దీనితో ముడిపడి ఉన్నాయి. మొత్తానికి ఈసారి వస్తున్న వేసవి.. ప్రజలతో పాటు పాలకులకు కూడా అగ్ని పరీక్ష లాంటిదే అని అంటున్నారు నిపుణులు.

Must Read

spot_img