- మంగళగిరిలో రోజుకు రోజుకు రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి.
- వచ్చే ఎన్నికల గెలుపుకోసం ముందు నుంచే అన్ని పార్టీల నాయకులు వ్యూహాలు రచిస్తున్నారు.
- వైసీపీ నుంచి టిడిపికి కొందరు జంప్ అవుతుంటే, టిడిపి నుంచి వైసీపీలోకి కొందరు జంపింగ్ లు చేస్తున్నారు.
- దీంతో ఎత్తుకు పై ఎత్తుగా సాగుతున్న ఈ రాజకీయం వేడినిపెంచుతోంది.
అమరావతి రాజధాని మంగళగిరిలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ నేతలు తమ అస్త్రాలను సిద్దం చేసుకుంటున్నారు. అందులో భాగంగా ప్రత్యేర్థి వర్గంలో ఉన్న కీలక నేతలకు వల విసిరి తమవైపుకు తిప్పుకుంటున్నారు. అంతకు ముందు టిడిపి నుంచి గంజి చిరంజీవిని వైసీపీ పార్టీలోకి తీసుకుంటే తాజాగా వైసీపీ మంగళగిరి మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ టిడిపిలో చేరారు.

మంగళగిరి పట్టణంలోని నేత సామాజికవర్గానికి చెందిన బలమైన నాయకుడు శ్రీనివాసరావు వైసీపీని వీడారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎన్నికలో ఈయన కీలక పాత్ర పోషించారు. దీంతో ఈ రాజకీయ జంపింగ్ లు మంగళగిరిలో ఎన్నికల వేడిని తీసుకొస్తున్నాయి. ఇక ఎన్నికలకు ఏడాది ముందే రెండు పార్టీలు మరిన్ని జంపింగ్ లకు తెర తీసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు.
దీంతో ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో మంగళగిరిలో ఈ జంప్ లతో మంగళగిరిలో రాజకీయ యుద్దం తప్పదనిపిస్తోంది. గత ఎన్నికల్లో చంద్రబాబు తనయుడిగా ప్రత్యక్ష ఎన్నికల్లోకి ఎంట్రీ ఇచ్చిన లోకేష్ తొలిసారి ఫెయిల్ అయినా ఈసారి మాత్రం కచ్చితంగా గెలవాలనే తపనతో ఉన్నారు. అందుకోసం గ్రౌండ్ లెవల్లో గెలుపు కోసం తీవ్ర కృషి చేస్తున్నారు. నేరుగా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాటిని పరిష్కరించేందుకు సిద్దమవుతున్నారు.
మరోపక్క మంగళగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి స్థాన చలనం తప్పదనే ప్రచారం జరుగుతోంది. మంగళగిరి నుంచి 2014,2019లలో వరుసగా రెండుసార్లు ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలుపొందారు. రెండోసారి చంద్రబాబునాయుడు కుమారుడు, మంత్రి లోకేశ్‌పై గెలుపొంది అందరి దృష్టిని ఆకర్షించారు. లోకేశ్‌పై గెలిపిస్తే ఆళ్లకు మంత్రి పదవి దక్కుతుందని నాడు ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.
అయితే మంత్రి పదవి మాత్రం దక్కలేదు. జగన్ మాట నిలబెట్టుకోలేదనే అసంతృప్తి ఆళ్ల రామకృష్ణారెడ్డిలో బలంగా వుంది. ఇదిలా వుండగా 2024 ఎన్నికల వేళ సెగ్మెంట్ లో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారిపోతున్నాయి. దీంతో ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీలు .. తమ అభ్యర్థుల విషయంలో మల్లగుల్లాలు పడుతున్నాయి. మూడోసారి గెలిచి, హ్యాట్రిక్ సాధించాలని ఉవ్విళ్లూరుతోన్న వైసీపీ అధినేత జగన్ .. ఈ దఫా మంగళగిరిలో ఆళ్లను మార్చి, మరొక బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలని యోచిస్తున్నట్లు సమాచారం.
- లోకేశ్‌ను ఓడించాలని జగన్ వ్యూహం..!
సెగ్మెంట్లోని సామాజిక వర్గాల ఆధారంగా బలంగా ఉన్న చేనేత వర్గానికి చెందిన ఓ నాయకుడిని నిలబెట్టడం ద్వారా లోకేశ్‌ను మరోసారి ఓడించాలని జగన్ వ్యూహం పన్నుతున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే మంగళగిరి పేరు చెప్పగానే టక్కున గుర్తుకువచ్చే నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఈ దఫా ఆళ్లను పల్నాడు జిల్లాలో ఓ మంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గానికి పంపనున్నారని విశ్వసనీయ సమాచారం.

సదరు మంత్రిపై అక్కడ వ్యతిరేకత ఉండడం, అభ్యర్థి మార్పు ద్వారా గెలుపు అవకాశాలను మెరుగుపరచుకోవచ్చనే ఎత్తుగడతో ఆళ్ల రామకృష్ణారెడ్డిని అక్కడి నుంచి బరిలోకి దించాలని జగన్ యోచిస్తున్నారు. ఆ నియోజకవర్గం ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట. ఆ తర్వాత 2014లో టీడీపీ, 2019లో వైసీపీ గెలుపొందాయి. ప్రస్తుతం అక్కడి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి గుంటూరుకు వెళ్లాలనే ఆలోచనతో ఉన్నారట.
ఒకవేళ మళ్లీ ఆయనకు అదే సీటు ఇచ్చినా గెలవలేరని సర్వే నివేదికలు చెబుతున్నాయని వైసీపీ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో ఆళ్లను అటు పంపిస్తే, రెండు నియోజకవర్గాల అభ్యర్థులను మార్చినట్లేనని, దీనివల్ల రాజకీయంగా లాభం పొందవచ్చని సీఎం జగన్ వ్యూహాత్మకంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. అదే జరిగితే మంగళగిరిలో ఈసారి రాజకీయ సమీకరణాలు మారే అవకాశం కనిపిస్తుంది.
మరోవైపు ఈ స్థానం నుంచి బరిలోకి దిగుతున్న లోకేష్ .. పూర్తిస్థాయి పట్టుకు తీవ్రంగా కృషి చేస్తున్నారని తెలుస్తోంది. ఇక ఈ సెగ్మెంట్ ను టీడీపీ 2009 వరకు జరిగిన 5 ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా మిత్రపక్షాలకు కేటాయించాల్సి వచ్చింది. మంగళగిరి సీటు వేరే పార్టీలకు ఇవ్వడంతో టీడీపీ అక్కడ బలోపేతం కాలేదనే భావన చంద్రబాబుకు ఉంది. 2014లో పోటీచేసినా విజయం దక్కలేదు. 2019 ఎన్నికల్లో కూడా అదే పరిస్థితి.
దీంతో మొదటి నుంచి టీడీపీకి మంగళగిరి పెద్ద తలనొప్పిగానే ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గత చరిత్రను ఓసారి పరిశీలిస్తే, 1983, 1985లో టీడీపీ అభ్యర్థి కోటేశ్వరరావు విజయం సాధించారు. 1989లో కాంగ్రెస్ నుంచి గోలి వీరాంజనేయులు విజయం సాధించగా, 1994లో సీపీఐ నుంచి నిమ్మగడ్డ రామ్ మోహన్ రావు గెలిచారు. ఇక 2004 లో కాంగ్రెస్ తరఫున మురుగుడు హనుమంతరావు ఎమ్మెల్యేగా ఉన్నారు. 2009లో మాత్రం కాంగ్రెస్ నుంచి కాండ్రు కమల విజయాన్ని అందుకున్నారు. 2014, 2019లో వైసీపీ తరఫున ఆళ్ల రామకృష్ణారెడ్డి విజయం సాధించారు.
అయితే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిర బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితి కాస్త మారింది. 2019 ఎన్నికల్లో ఎదురైన ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగుతున్నారు. ఈ ఎన్నికల్లో ఓటమి తర్వాత మంగళగిరి నియోజకవర్గంపై లోకేష్ మరింత ఫోకస్ పెట్టారు. నియోజకవర్గంలో పార్టీ యాక్టివిటీ పెంచడం, కార్యకర్తల సంక్షేమంతో పాటూ ఇతర కార్యక్రమాల కారణంగా మంచి మార్పు కనిపిస్తుందని అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. ఈసారి కచ్చితంగా మంగళగిరిలో ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.
లోకేష్ కూడా తరచూ నియోజకవర్గంలో పర్యటిస్తూ.. పార్టీ తరఫున సాయంతో పాటు.. తాను సొంతంగా 12కి పైగా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. ఈసారి కచ్చితంగా తిరుగులేని విజయం సాధిస్తానని లోకేష్ కూడా ధీమాతో ఉన్నారు. అయితే 2024లో ఎలాగైనా విజయం సాధించాలని టార్గెట్ పెట్టుకున్న లోకేష్‌కు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ బలోపేతం అవుతుందని భావించిన ప్రతిసారీ ఇబ్బందులు తప్పడం లేదు.
2019 ఎన్నికల నుంచి ఇప్పటి వరకు కీలక నేతలు టీడీపీని వీడారు. గతంలో కాంగ్రెస్‌లో ఉన్న మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల 2019 జనవరిలో టీడీపీలో చేరారు. కానీ రెండు నెలలు కూడా గడవకముందే వైసీపీలో చేరారు. మంగళగిరి సీటు వస్తుందని భావించినా రాదని నిర్ణయించుకుని కండువా మార్చేశారు. ఆమె స్థానికంగా బలమైన సామాజిక వర్గం నేత కావడంతో.. ఆమె పార్టీ మారిన ప్రభావం కొంతమేర లోకేష్‌కు డ్యామేజ్ చేసింది.
ఇక మంగళగిరి నియోజకవర్గంలో మరో కీలక నేత, మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు టీడీపీకి రాజీనామా చేశారు. తనకు పార్టీలో తనకు తగిన ప్రాధాన్యం లేదని వైసీపీలోకి వెళ్లిపోయారు. ఆయనకు ఎమ్మెల్సీ పదవి కూడా దక్కింది. 1999, 2004లో హనుమంతరావు మంగళగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మంత్రిగా కూడా పని చేశారు. ఈ రెండు ఎదురు దెబ్బల తర్వాత మరో కీలక నేత టీడీపీకి గుడ్ బై చెప్పారు.
మాజీ మున్సిపల్ ఛైర్మన్ గంజి చిరంజీవి వైసీపీలో చేరిపోయారు. చిరంజీవి మంగళగిరిలో కీలక నేతగా ఉన్నారు.. 2014లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత మున్సిపల్ ఛైర్‌పర్సన్ పదవి దక్కగా.. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేయడంతో గంజి చిరంజీవికి సీటు రాలేదు. ఎన్నికల తర్వాత కూడా పార్టీలో కొనసాగారు. ఇలా వరుసగా ముగ్గురు నేతలు టీడీపీని వీడారు.
మరి జంపింగ్ ల వేళ మంగళగిరి ఎవరికి దక్కనుందన్నదే హాట్ టాపిక్ గా మారింది.