Homeఅంతర్జాతీయంచైనాలో విచిత్రం..కరోనా కారణమా..?

చైనాలో విచిత్రం..కరోనా కారణమా..?

శవాలు గుట్టలుగా పేరుకుపోతున్నా నగరం మొత్తం మీద కరోనా కారణంగా ఒకటీ రెండూ లేదా ముగ్గురు మాత్రమే చనిపోయినట్టుగా ప్రకటిస్తోంది చైనా. నిజానికి చైనాలో కరోనా ఆంక్షలు ఎత్తివేసినప్పటి నుంచి కేసులు విపరీతంగా పెరిగాయి. గంటల వ్యవధిలో వేలాదిగా వైరస్ బారినపడుతున్నారు. వందలాది మంది చనిపోతున్నారు. రోగులతో ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి. అటు శ్మశాన వాటికల్లో 20 రోజుల వెయిటింగ్ లిస్టు కొనసాగుతోంది.

డ్రాగన్ కంట్రీలో కరోనాతో చికిత్స అందక వందలు వేలుగా చనిపోతున్నా కరోనాతో ఒక్కరూ చనిపోలేదని జిత్తులమారి లెక్కలు చెబుతోంది. వాస్తవ పరిస్థితి చాలా బీభత్సంగా ఉంటే చైనా లెక్కలు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. కరోనా వల్ల పెద్దగా చనిపోలేదని ఆ దేశ ఆరోగ్య శాఖ అధికారిక ప్రకటనలో తెలిపింది. సోమవారం ఐదుగురే మరణించారని పేర్కొంది. ఇప్పటివరకు మొత్తం 5,241 మంది మాత్రమే వైరస్ కారణంగా చనిపోయినట్లు చెబుతోంది.

మంగళవారం కొత్తగా 3,101 మందికి వైరస్ సోకిందని చైనా వెల్లడించింది. వీరిలో 52 మంది విదేశాల నుంచి వచ్చిన వారేనని కల్లబొల్లి కబుర్లు ప్రచారం చేస్తోంది. కొత్తగా నమోదైన కేసులతో కలిపి చైనాలో ఇప్పటివరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 3,86,276కి చేరిందని తెలిపింది.

ముఖ్యంగా అధిక జనాభా కలిగిన ప్రముఖ నగరాల్లో కరోనా రోగుల సంఖ్య భారీగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే తమ దేశంలో ఇటువంటి పరిస్థితి ఉన్నప్పటికి ఆ దేశ ప్రభుత్వం మాత్రం చాలా సైలెంట్ గా ఎటువంటి వార్తలు బయటకు రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటుంది. కాగా ప్రస్తుతం చైనాలో పరిస్థితి మనం అనుకున్న దానికంటే చాలా దారుణంగా ఉంది.

దీనికి సంబంధించి ఆసుపత్రుల నుంచి రోగులు భయంకరమైన వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ట్విట్టర్‌లో పంచుకున్న వీడియో క్లిప్‌లో, కరోనా సోకిన వారికి వైద్యం అందించి అలసిపోయిన వైద్యులు, అలాగే రోగులకు చికిత్స అందించడానికి సరైన బెడ్లు లేక కొంతమంది ఫ్లోర్ పైన పడుకోబెట్టి CPR చికిత్స అందిస్తుండటం కనిపిస్తుంది. చాలా మంది వైద్యులు అలసట, అధిక పని కారణంగా నిద్రపోతున్నట్లు వీడియోలలో కనబడింది.

చైనాలో ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా అన్ని వేరియంట్లలోనూ ఇదే అన్నింటికన్నా వేగంగా వ్యాప్తిచెందేది. ఓ వ్యక్తికి వైరస్ సోకిందని తెలుసుకునే లోపే..వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు ఒమిక్రాన్ బారిన పడుతున్నారు. దీంతో చైనాలోని చాలా నగరాల్లో కుటుంబాలకు కుటుంబాలు కరోనా బారిన పడుతున్నాయి. వైరస్ తీవ్రతతో కరోనా మరణాలూ మొదలయ్యాయి.

ఇద్దరు చైనా జర్నలిస్టులు వైరస్‌తో చనిపోయారు. అయితే ఆ సీనియర్ జర్నలిస్టులిద్దరూ 70 ఏళ్ల పైబడ్డవారే. సాధారణ ప్రజలతో పాటు రోగులకు చికిత్స అందిస్తున్న డాక్టర్లు, నర్సులు ఒమిక్రాన్‌ బారిన పడుతున్నారు. స్మశానవాటిక సిబ్బందికి సైతం కరోనా సోకడంతో..అక్కడ విధి నిర్వహణ కష్టంగా మారింది.

అయితే చైనా లెక్కలకు వాస్తవ పరిస్థితుల వ్యత్యాసానికి కారణం ఉంది. ప్రపంచంలోని అన్ని దేశాలు కరోనా సోకిన వారు దుష్ప్రభావాలు లేదా మరే ఇతర కారణంతో చనిపోయినా దాన్ని కోవిడ్ మరణాల కిందే లెక్క కడుతూ వచ్చాయి. చైనాలో మాత్రం నిబంధనలు మరోలా ఉన్నాయి. వైరస్‌ సోకి శ్వాసకోస వ్యవస్థ దెబ్బతిని చనిపోయిన వారిని మాత్రమే కరోనా మృతులుగా గుర్తిస్తోంది.

వైరస్‌ సోకి మిగతా ఏ కారణంతో చనిపోయినా.. వారిని కోవిడ్ మృతులుగా గుర్తించడం లేదు. అలాగే లక్షణాలు ఉంటేనే కరోనా కేసుగా లెక్కగడుతోంది. కానీ ఇప్పుడు చైనాలో సోకుతున్న కరోనా వైరస్ ఏ లక్షణాలను చూపించడం లేదు. వారిని కరోనా మ్రుతులని అందుకే గుర్తించడం లేదు. ఈ కారణంగానే చైనాలో రోజుకు ఎంతమంది చనిపోయినా.. అధికారిక కరోనా మరణాల సంఖ్య మాత్రం చాలా తక్కువగా ఉంటుంది.

వైరస్ నిపుణుల అంచనాల ప్రకారం చైనాలో ప్రస్తుతం రోజుకు 40వేలకు పైగా కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. వందల మంది వైరస్‌కు బలవుతున్నారు. అక్కడ ఆస్పత్రులు కూడా పడకల ఖాళీ లేనంత రద్దీగా మారాయి. శవాలను ఖననం చేసేందుకు శ్మశానవాటికల్లో ఖాళీ కూడా లేని దుస్థితి ఉంది. కొన్ని చోట్ల దహన సంస్కారాలకు 20 రోజులు వెయిటింగ్ లిస్టు కొనసాగుతోందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

వైరస్‌ వ్యాప్తిని నియంత్రించడానికి మళ్లీ ఆంక్షల బాట పట్టడం మినహా చైనాకు మరో మార్గం కనిపించడం లేదు. వాణిజ్య నగరం షాంఘైలో ఇప్పటికే ప్రభుత్వం ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించాలని ఆదేశించింది. చాలా స్కూళ్లలో టీచర్లు, స్కూల్ సిబ్బంది కరోనాతో బాధపడుతున్నారు. నర్సరీలు, డే కేర్ సెంటర్లు మూసివేస్తున్నారు. పెరుగుతున్న కేసులుకు తగ్గట్టుగా చికిత్స సదుపాయాలు పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

Must Read

spot_img