ఆర్థికంగా చితికిపోయి ఐఎమ్ఎఫ్ పై ఆశలు పెట్టుకుని బతుకుతున్న కొనసాగుతున్న శ్రీలంకకు మరో అగ్నిపరీక్ష ఎదురైంది. తాజాగా ఐఎంఎఫ్ సూచనల మేరకు విద్యుత్ చార్జీలను పెంచాల్సి వచ్చింది. దీంతో ఇప్పటికే దివాలా తీసిన దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త షరతులు తోడయ్యాయి. అత్యధిక ధరలను మోయలేని సామాన్యులపై కరెంటు చార్జీల భారం మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టుగా అయింది.
శ్రీలంక విద్యుత్ బోర్డు విద్యుత్ చార్జీలను ఏకంగా 66 శాతం వరకు పెంచింది. దేశ ఆర్దిక వ్యవస్ద దివాలా తీయడంతో అంతర్జాతీయ ద్రవ్యనిధి ‘ఐఎంఎఫ్’ షరతులకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని ఇంధన శాఖ మంత్రి కాంచన విజేశేఖర్ అన్నారు తాజాగా పెంచిన విద్యుత్ చార్జీల తర్వాత ఐఎంఎఫ్ నుంచి రుణాలు పొందడానికి అడ్డంకులు తొలగిపోతాయని విక్రమసింఘే ప్రభుత్వం భావిస్తోంది.
గత ఏడాది ప్రభుత్వం విద్యుత్ చార్జీలను 75 శాతం వరకు పెంచింది. ఇప్పటికే శ్రీలంక పౌరుడు అధిక ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్నాడు. ఏడాది ప్రాతిపదిక చూస్తే రిటైల్ ద్రవ్యోల్బణం 54 శాతానికి ఎగబాకింది. అలాగే ఆదాయపు పన్నును అత్యధికంగా 36 శాతం వరకు విధించారు. ప్రజలపై విద్యుత్ చార్జీల భారం అధికంగానే ఉందని విద్యుత్ ఇంధనశాఖ మంత్రి కంచనా విజేశేఖర్ అంగీకరించారు.
పెరిగిన విద్యుత్ చార్జీలతో ముఖ్యంగా పేదలు తీవ్రంగా ఇబ్బందులు పడుతారని అన్నారు. అయితే దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా ఉందని.. తమకు వేరే గత్యంతరం లేదని.. విజేశేఖర్ కొలంబోలో చెప్పుకొచ్చారు.
విద్యుత్ టారిఫ్ పెంచినందు వల్ల ఐఎంఎఫ్ నుంచి రుణలు దక్కే అవకాశం మెరుగుపడిందని ఆశిస్తున్నానని ఆయన చెప్పారు. సిలోన్ ఎలక్ర్టిసిటి బోర్డు కూడా విద్యుత్ చార్జీలను పెంచిన విషయాన్ని ఖరారు చేసింది.
ఇదిలా ఉండగా ఐఎంఎఫ్ గత ఏడాది సెప్టెంబర్‌లో శ్రీలంకకు 2.9 బిలియన్ డాలర్ల రుణాలు ఇస్తామని హామీ ఇచ్చింది. అయితే దీనికి కొన్ని షరతులను విధించింది.
ముఖ్యంగా పన్నులను పెంచడంతో పాటు ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలను రద్దు చేయాలని, అలాగే ప్రభుత్వరంగానికి చెందిన కంపెనీల అప్పులు తగ్గించుకోవాలన్న కండిషన్లు పెట్టింది. ఇక కొత్తగా రణిల్ విక్రమసింఘే గత ఏడాది జులైలో అద్యక్ష బాధ్యతలు చేపట్టారు. గొటబాయ రాజపక్స గద్దె దిగిన తర్వాత బాధ్యతలు చేపట్టిన రనీల్ దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టాలంటే పెద్ద ఎత్తున నిధులు కావాలంటూ వెంటనే ఆయన ఐఎంఎఫ్‌ను రుణం కోసం ఆశ్రయించారు. అయితే విద్యుత్‌శాఖ మంత్రి వాదన ఏమిటంటే విద్యుత్ చార్జీలను పెంచడం వల్ల సబ్సిడీలు ఆగిపోతాయని దీర్ఘకాలంలో విద్యుత్ రంగం గాడినపడుతుందన్నారు.
అయితే పెంచిన విద్యుత్ చార్జీలను జులై తర్వాత నుంచి కాస్తా తగ్గించే అవకాశం ఉందని విద్యుత్ శాఖమంత్రి చెబుతున్నారు. అయితే విశ్లేషకులు మాత్రం పెరిగిన విద్యుత్ చార్జీలతో రిటైల్ ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే నెల నుంచి రిటైల్ ద్రవ్యోల్బణం 55 శాతానికి చేరుతుందని అంచనా వేస్తున్నారు.
కాగా గత ఏడాది రిటైల్ ద్రవ్యోల్బణం రికార్డు స్థాయికి 73.7 శాతానికి ఎగబాకింది. ఇదిలా ఉండగా ఆల్ ఐలాండ్ క్యాంటీన్ ఓనర్స్ అసోసియేషన్ చీఫ్ అసేలా సంపత్ దేశంలోని రెస్టారెంట్‌లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ చార్జీలను తాము భరించలేమని చెబుతున్నారు. శ్రీలంక ప్రభుత్వం తరచూ విద్యుత్ చార్జీలను పెంచుతూ దేశంలోని మధ్యతరగతి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేవలం 2.2 కోట్ల జనాభా ఉండే శ్రీలంక, కొన్ని దశాబ్దాలలో ఎన్నడూ లేనంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కొన్ని నెలలుగా అక్కడ ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోవడంతో ఆహారం, గ్యాస్, పెట్రోలియం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీనికి తోడు రష్యా, యుక్రెయిన్ యుద్ధం కారణంగా లంక పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది.
విద్యుత్ కోతలు, ఖాళీ ఏటీఎంలు, పెట్రోల్ బంకుల ముందు భారీ క్యూలు సర్వసాధారణం అయ్యాయి. శ్రీలంక దాదాపు ప్రతీది దిగుమతి చేసుకుంటుంది. పెట్రోలియం నుంచి ముడి చక్కెర వరకు అన్నీ దిగుమతులే. ఇప్పుడు దిగుమతులకు అంతరాయం కలగడంతో భారీ ద్రవ్యోల్బణం, అత్యవసర వస్తువులకు సుదీర్ఘ క్యూలు ఏర్పడుతున్నాయి. శ్రీలంక అధికంగా దిగుమతులపైనే ఆధారపడుతుంది. ఓఈసీడీ ప్రకారం, 2020లో శ్రీలంక 1.2 మిలియన్ డాలర్ల విలువ చేసే రిఫైన్డ్ పెట్రోలియంను దిగుమతి చేసుకుంది. ఫ్యాబ్రిక్స్, ఔషధాల కోసం వినియోగించే ముడి పదార్థాలు, గోదుమ నుంచి చక్కెర వరకు ఇలా అన్నింటినీ శ్రీలంక దిగుమతి చేసుకుంటంది. ఏదీ సొంతంగా తయారు చేసుకునే పరిస్థితి లేదు. అందుకే ఆర్థిక సంక్షోభం నుంచి తప్పించుకోలేకపోయింది..