ప్రస్తుతం పాకిస్తాన్ ఎదుర్కుంటున్న ఆర్థిక సంక్షోభాన్ని కొన్ని నెలల క్రితం శ్రీలంక ఎదుర్కుంది. జనానికి తిందామంటే తిండి లేదు..ఇంకా సంక్షోభం నీడలలోంచి ఆ దేశం తొలగిపోలేదు. ఈ నేపథ్యంలో శ్రీలంకలో జరగాల్సిన ఎన్నికలను ప్రభుత్వం పోస్ట్ పోన్ చేసింది. ఎందుకంటే ఎన్నికల ఖర్చును భరించే స్థోమత శ్రీలంక వద్ద లేకపోవడమే అందుకు కారణం..
పాపం శ్రీలంకలో ప్రజలకు తిందామంటే తిండి లేదు.. ఇక ఎన్నికలు నిర్వహించాలి అంటే ఎలా?.. అసలే అప్పుల ఊబిలో చిక్కుకుని తీవ్ర ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంకలో పరిస్థితి రోజురోజుకు దయనీయంగా మారుతోంది. ప్రభుత్వ ఖజానా ఎప్పుడో ఖాళీ అవడంతో కనీసం ఎన్నికలు నిర్వహించేందుకు కూడా నిధులు లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో మార్చి 9న నిర్వహించాల్సిన స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
మార్చి 3న కొత్త తేదీలను వెల్లడించే అవకాశం ఉంది. శ్రీలంక విదేశీ మారక నిల్వలు 500 మిలియన్ డాలర్లకు పడిపోయాయి. ఆర్థికి పరిస్థితి అద్వాన్నంగా మారడంతో ఈ దేశానికి అప్పులు ఇవ్వకుండా ఐఎంఎఫ్, పారిస్ క్లబ్ ఆంక్షలు విధించాయి. దీంతో మిత్ర దేశం చైనా కూడా సాయం చేసేందుకు ముందుకు వచ్చే సూచనలు కన్పించడం లేదు. దీంతో తమపై ఐఎంఎఫ్ ఆంక్షలు ఎత్తివేసేలా చూసి అమెరికా, జపాన్ తమను ఆదుకుంటాయేమోనని లంక గంపెడు ఆశలు పెట్టుకుంది.
ఐఎంఎఫ్ ప్రతిపాదించిన విధంగా 10 సంవత్సరాల రుణ మారటోరియంతో ఆర్థిక సహాయం కోసం చైనా వైపు శ్రీలంక చూస్తున్నప్పటికీ అలా జరిగే సూచనలు కన్పించడం లేదు. అసలు సమస్య ఏంటంటే ఒకవేళ శ్రీలంకకు చైనా సాయం చేయాల్సి వస్తే ఇతర దేశాలకు కూడా ఆర్థిక సాయాన్ని అందించవలసి ఉంటుంది. ఆఫ్రికాలో బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ ‘బీఆర్‌ఐ’తో పాటు, తమ చిరకాల మిత్ర దేశం పాకిస్తాన్‌కు కూడా చైనా ఆర్థిక సాయం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ కారణంగానే పాకిస్తాన్‌కు 700 మిలియన్ డాలర్ల రుణాన్ని రీఫైనాన్స్ చేసింది తప్ప కొత్తగా రుణాలు ఇవ్వలేదు. అది కూడా ఇంకా పాకిస్తాన్ దేశానికి చేరనే లేదు.. దాని కోసం అక్కడి నేతలు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.
- ఇప్పుడు పాకిస్తాన్, శ్రీలంకలో పరిస్థితులు దాదాపు ఒకే విధంగా ఉన్నాయి..
ఓ వైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు రాజకీయ అనిశ్చితితో రెండు దేశాలు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ప్రజలు తినడానికి తిండి కూడా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ద్వీపదేశం శ్రీలంకలో ఎన్నికలను నిర్వహించేందుకు బ్యాలెట్ పేపర్లు ప్రింట్ చేయడానికి కూడా డబ్బుల్లేవని ఎలక్షన్స్ వాయిదా వేసింది శ్రీలంక. ఎన్నికలను వాయిదా వేయాలనే నిర్ణయాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పార్లమెంటునూ స్తంభింపజేశాయి.
ఆర్థిక సంక్షోభం సాకుతో ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్నే అణచివేస్తున్నదని ఆరోపించారు. ఎన్నికలను తుంగలో తొక్కాలని చూస్తున్నారని, అధికారాన్ని పట్టుకుని వేలాడే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు చేశాయి. ఎన్నికలు నిర్వహించాలని అక్కడి టాప్ కోర్టు తీర్పు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ, కోర్టు తీర్పు ఎన్నికలు జరపాలని ఇచ్చినా.. నిజంగానే వాటి నిర్వహణకు డబ్బులున్నాయా? లేదా? అనే విషయాలు మాత్రం తెలియదు. రాణిల్ విక్రమ్ సింగే ప్రజలలో తనకున్న మద్దతును చూపెట్టుకోవడానికి ఈ ఎన్నిక కీలక పరీక్షగా మారింది.
షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించి తీరుతామని ఇటీవలే తాము కోర్టుకు తెలిపామని ఈసీ చీఫ్ నిర్మల్ పంచిహెవా వివరించారు. కానీ, ఇప్పుడు ఇది సాధ్యం కావడం లేదని కోర్టుకు చెబుతున్నానని తెలిపారు. ఎందుకంటే ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఫండ్స్‌ను ప్రభుత్వం విడుదల చేయడం లేదని పేర్కొన్నారు. శ్రీలంక అధ్యక్షుడు ఇటీవలే ఇందుకు సంబంధించి వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు నిర్వహించడం ఇప్పుడు అసాధ్యంగా ఉన్నదని తెలిపారు. జీతాలు, పింఛన్లు, అత్యవసర సేవలు నిర్వహించడం దుస్సాధ్యంగా ఉన్నదని ఆయన అన్నారు.
శ్రీలంక చాలా చిన్నదైన ద్వీప దేశం. ఇప్పుడు పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో ఉంది. కేవలం 2.2 కోట్ల జనాభా ఉండే శ్రీలంక, కొన్ని దశాబ్దాలలో ఎన్నడూ లేనంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కొన్ని నెలలుగా అక్కడ ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోవడంతో ఆహారం, గ్యాస్, పెట్రోలియం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
దీనికి తోడు రష్యా, యుక్రెయిన్ యుద్ధం కారణంగా లంక పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది. విద్యుత్ కోతలు, ఖాళీ ఏటీఎంలు, పెట్రోల్ బంకుల ముందు భారీ క్యూలు సర్వసాధారణం అయ్యాయి. శ్రీలంక దాదాపు ప్రతీది దిగుమతి చేసుకుంటుంది. పెట్రోలియం నుంచి ముడి చక్కెర వరకు అన్నీ దిగుమతులే. ఇప్పుడు దిగుమతులకు అంతరాయం కలగడంతో భారీ ద్రవ్యోల్బణం, అత్యవసర వస్తువులకు సుదీర్ఘ క్యూలు ఏర్పడుతున్నాయి.