ఓ వైపు జనం ఎక్కువై సమస్యలు ఎదుర్కుంటూ ఉంటే మరోవైపు జననాల రేటు పడిపోవడంతో తమ దేశం ఉనికే లేకుండా పోతుందని వాపోతున్నారు ఆ దేశపు జనం. అక్కడి వ్రుద్దులు అన్ని దేశాల జనం ఎక్కువ కాలం జీవిస్తుండగా పుట్టుక రేటు మాత్రం అడ్డంగా పడిపోయింది. ఇది ఇలాగే కొనసాగితే తమ దేశం సోదిలో లేకుండా పోతుందని అక్కడి ప్రభుత్వం ఆందోళన చెందుతోంది.. ఇంతకీ ఎక్కడుందా దేశం..ఏంటి దాని సంగతి.. ఇప్పుడు చూద్దాం..
అది మరెక్కడో కాదు..మన దేశానికి మిత్రదేశమైన జపాన్లో జరుగుతోంది. అక్కడ జననాల రేటు ఎన్నడూ లేనంతగా పతనం అవుతుండటంతో.. ‘ఇలాగే ఉంటే ఎవరు మిగలరని ఆధ్యయనం చేసే సంస్థలు హెచ్చరిస్తున్నాయి. జపాన్లో జననాల రేటు ఆందోళనకర రీతిలో పడిపోతుండటం అక్కడి ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. ఇలాగే కొనసాగితే.. జపాన్, తన ఉనికిని కోల్పోతుందని, బతకడానికి తమ దేశంలో ఎవరూ ఉండరని.. ప్రధాని ఫుమియో కిషిదా సలహాదారు తాజాగా చేసిన వ్యాఖ్యలతో ఆందోళన మరింత పెరిగింది. అవును ఇది నిజం..జపాన్ లో పిల్లలను కనేందుకు జపాన్ ప్రజలు ముందుకు రావడం లేదు. ఫలితంగా ఇటు జననాల రేటు తగ్గిపోతుంటే, అటు వృద్ధుల మరణాల రేటు కూడా పెరిగిపోతోంది. గత ఏడాది.. జపాన్లో పుట్టిన వారి కన్నా మరణించిన వారి సంఖ్య రెండింతలు ఎక్కువగా నమోదైంది.
పోయిన సంవత్సరం 8 లక్షల కన్నా తక్కువ పిల్లలు జన్మించగా.. అదే సమయంలో 1.58 మిలియన్ మంది జనం మరణించారు. ఈ లెక్కలను ఫిబ్రవరి 28న విడుదల చేసింది అక్కడి ప్రభుత్వం. అంటే జననాల కన్నా రెండింతలు మరణాలు నమోదవుతున్నాయి. ఇది అక్కడి వారిని కలవరపరుస్తోంది. 2008లో జపాన్ జనాభా 128 మిలియన్లుగా ఉండేది. ఇదే అత్యధికం. అప్పటి నుంచి జనాభా తగ్గుతూ వస్తోంది. ఇటీవలి కాలంలో ఈ ట్రెండ్ ఇంకా దారుణంగా పడిపోతోంది. యువత జనాభా కూడా తగ్గుముఖం పడుతోంది. 2022లో మొత్తం మీద 65, అంతకన్నా ఎక్కువ వయస్సు ఉన్న వారు.. జపాన్లో 29శాతం కన్నా అధికంగా ఉన్నారు. సౌత్ కొరియాలో సంతానోత్పత్తి రేటు దారుణంగా పడిపోతుండగా.. జపాన్లో ఏకంగా జనాభానే తగ్గిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది.
నిజానికి జననాల రేటు తగ్గడం లేదు. దారుణంగా పడిపోతోంది.
ఇలా జరుగుతోందంటే.. సమాజంలో పిల్లలు తక్కువగా ఉన్నట్టు లెక్క.. ఇదంతా సమాజంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. పరిస్థితులను చక్కదిద్దకపోతే సమాజంలోని భద్రతా వ్యవస్థ కుప్పకూలుతుంది. పారిశ్రామిక, ఆర్థిక వ్యవస్థలు పడిపోతాయి. రక్షణ రంగంలో రిక్రూట్మెంట్లు తగ్గిపోతాయి. ఇది దేశ భద్రతకు కూడా ముప్పు కలిగిస్తుంది,” అని ప్రధాని కిషిదా సలహాదారు, మాజీ మంత్రి మోరి మీడియాకు వెల్లడించారు. ఇప్పటికే జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలి. లేదంటే సమస్య కొండంతగా మారిపోతుంది. ఆపై పరిష్కారం చేతిలో ఉండకపోవచ్చునని చావు కబురు చల్లగా చెప్పారు సదరు ప్రధాని సలహాదారు.
ఎవరో చెప్పారంటే ఇగ్నోర్ చేయవచ్చు..కానీ ఏకంగా ప్రధాని సలహాదారు చెప్పడంతో సమస్యకు ప్రాధాన్యత సంతరించుకుంది. మరి సమస్యకు పరిష్కారమేంటి? అన్న విషయానికొస్తే.. మరేం ఫరవాలేదు..దేశంలో నెలకొన్న సమస్యను తాను పరిష్కరిస్తానని ప్రధాని కిషిదా చెబుతున్నారు. పిల్లలు, కుటుంబ సంక్షేమం కోసం తమ ప్రభుత్వం అధికంగా ఖర్చు చేస్తుందని హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన పథకాన్ని కిషిదా ప్రకటించాల్సి ఉంది. అయితే.. ఇప్పటివరకు ఉన్న విధానాల కన్నా.. తాము తీసుకురానున్న పాలసీ చాలా కొత్తగా, భిన్నంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. మరి ఆ పాలసీ ఏంటో అందులో అంత రహస్యమేం దాగి ఉందో కానీ కిషిదా వ్యాఖ్యలపై పలువురు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇలాంటి సమస్యల్లో డబ్బులు ఖర్చు పెడితే సరిపోదని, మరిన్న చర్యలు చేపట్టాలని అంటున్నారు.
పిల్లల తల్లులపై భారాన్ని తగ్గించే విధంగా చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. పిల్లల పెంపకంలోనూ మహిళలు- పురుషుల పాత్ర సమానంగా ఉండాలని చెబుతున్నారు. అప్పుడే.. మహిళలు బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా పనికి వెళ్లొచ్చని అంటున్నారు. ఇప్పటికే అక్కడ మహిళలకు ప్రసూతి సెలవులు పెంచారు. పెళ్లి చేసుకుంటే ఇంక్రీమెంట్లు, ప్రమోషన్లు, పిల్లలు పుడితే ఇన్సెంటివ్స్ సెలవులు కూడా ప్రకటించారు. ఇప్పుడు ప్రధాని మరేం కొత్త ప్లాన్ వేసారో కానీ తాను తప్పకుండా విజయం సాధిస్తానని నమ్మకంగా చెబుతున్నారు. అయితే జపాన్ యువత మాత్రం స్థిరమైన అభిప్రాయంతో ఉన్నారు. పెళ్లి, పిల్లలు జీవితంలో స్వేచ్ఛ కోల్పోడానికి కారణమవుతారని వారు భావిస్తున్నారు. పెళ్లి తరువాత జీవన వ్యయం చాలా ఎక్కువవుతుందని ఫీల్ అవుతున్నారు..ఆ జంజాటం లేకుండానే జీవితం గడపాలని కోరుకుంటున్నారు.