నిన్న మొన్నటిదాకా పేపర్లు టీవీలు మానవజీవితాల్ని ప్రభావితం చేసాయి. జనం ఏం చేయాలో నిర్ణయించాయి. అయితే ప్రస్తుతం వాటి దశ మారింది. ఇప్పుడు సోషల్ మీడియా రాజ్యమేలుతోంది. ఎవరు ఎలా జీవించాలో మొదలుకొని ఏం ధరించాలో ఏం తినాలో ఏం మాట్లాడాలో కూడా నిర్దేశిస్తోంది. ఎందుకంటే ప్రపంచం ఇప్పుడు ఇంటర్నెట్ పుణ్యమా అని ఊపిరి పీల్చుకుంటోంది. చేతిలో మొబైల్ లేదా స్మార్ట్ ఫోన్ లోని సోషల్ మీడియా పుణ్యమా అని ప్రాణాలతో ఉంది.
అంతకన్నా ఎక్కువగానే మానవ జీవితాలను ప్రభావితం చేస్తోంది. సోషల్ మీడియాలో మనకు దొరకని విషయం అంటూ లేదు. తినే తిండి దగ్గర్నుంచీ పూజించే దేవుళ్ల దాకా అన్నీ సోషల్ మీడియానే డైరెక్టు చేస్తోంది. ఎలాంటి వస్తువునైనా ఆకాశానికెత్తేయడం పాతాళానికి తొక్కేయడం సోషల్ మీడియాకు సాధ్యం.
ప్రపంచానికి రెండు వైపుల ఉన్న వ్యక్తుల ఆలోచనలు క్షణాలలో కలసిపోతున్నాయి. ఒకరి నుంచి మరొకరు అపారమైన నాలెడ్జీలను పంచుకుంటున్నారు. తెలియని అనేక విషయాలను తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాను వినియోగిస్తున్న వారి సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది.
దే స్థాయిలో తప్పుడు సమాచారం కూడా విశ్రుంకలంగా ప్రచారం అవుతోంది. అందులో నిజాల సంగతి దేవుడెరుగు..అబద్దాలు వేగంగా జనం మనసుల్లోకి దూసుకుపోతున్నాయి. జనం జేబులకు చిల్లులు పడేలా చేస్తున్నాయి. అందుకే సోషల్ మీడియాలో తప్పుడు ప్రకటనలు, తప్పుదారి పట్టించే ప్రమోషన్‌లను నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వంచర్యలు తీసుకోనుంది.
వీటికి సంబంధించి త్వరలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లకు కొత్త మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేయనుంది. ఇన్‌ఫ్లుయెన్సర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో ఏవైనా ప్రొడక్టులు, బ్రాండ్‌లు, సేవలను ప్రమోట్ చేయాలంటే, వారికి సదరు సంస్థతో ఉన్న సంబంధాన్ని వెల్లడించాలని, డిస్‌క్లైమర్‌లను ఉంచాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనుంది.
- సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లకు అందుతున్న ఆర్థిక ప్రయోజనాలు..
అందుకు ప్రతిఫలంగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లకు అందుతున్న ఆర్థిక ప్రయోజనాలను బహిర్గతం చేయాలని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అయితే తప్పుడు సోషల్ మీడియా ప్రమోషన్లు చేస్తే భారీ జరిమానాలా తప్పవని హెచ్చరిస్తున్నాయి. ఇన్నాళ్లకు ఇన్‌ఫ్లూయెన్సర్లకు కొత్త గైడ్ లైన్స్ జారీ చేసే పనిలో పడింది భారత ప్రభుత్వం. ఇకపై సోషల్ మీడియాలో ఇన్‌ఫ్లుయెన్సర్లు తప్పుదారి పట్టించే సమాచారం లేదా నకిలీ రివ్యూలను షేర్ చేస్తున్నట్లు తేలితే జరిమానా చెల్లించాల్సి ఉంటుందని సోషల్ మీడియా గైడ్‌లైన్స్ రాబోతున్నాయి.
అయితే కొత్త మార్గదర్శకాలపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ల రెస్పాన్స్ ఏంటో తెలుసుకుందాం. ఇకపై తప్పుదారి పట్టించే సమాచారం లేదా నకిలీ రివ్యూలను షేర్ చేస్తున్నట్లు తేలితే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. మొదటి నేరానికి గరిష్టంగా10 లక్షల రూ.లు, నేరాలు రిపీట్ అయితే అంతకు అయిదు రెట్లుగా 50 లక్షల రూ.ల వరకు జరిమానా పొడిగించే అవకాశం ఉంటుంది.
అయితే ఈ మార్గదర్శకాలను కొందరు ఇన్‌ఫ్లూయెన్సర్లు సపోర్ట్ చేస్తుండగా, మరి కొందరు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది వ్యక్తుల భావ ప్రకటనా స్వేఛ్చకు భంగం అంటూ విమర్షిస్తున్నారు. అయితే ఒకటి ..సోషల్ మీడియాలో తక్కువ సంపాదించే క్రియేటర్స్‌పై మాత్రం ఈ మార్గదర్శకత్వాల వల్ల ప్రభావం పడుతుంది.
కేంద్రం తీసుకొస్తున్న మార్గదర్శకాలు మైక్రో ఇన్‌ఫ్లుయెన్సర్‌లపై లేదా 1,000 నుంచి లక్ష మంది ఫాలోవర్స్ ఉన్నవారిపై ప్రభావం చూపుతాయని కొందరు ఆందోళన చెందుతున్నారు. తక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నవారు చాలా తక్కువ సంపాదిస్తారు కాబట్టి, వారిపై అదే భారీ జరిమానా విధించడం సరికాదని డిజిటల్ కంటెంట్ క్రియేటర్లు చెబుతున్నారు.
అయితే తాజా మార్గదర్శకాలు తీసుకురావడానికి గల ఉద్దేశాలను కొందరు సమర్థిస్తున్నారు. ఇలాంటి కఠిన నిబంధనలు, బ్రాండ్స్‌కు ప్రమోషన్ చేసే ముందు సంబంధిత కంపెనీ గురించి పూర్తి వివరాలు తెలుసుకునేలా చేస్తాయని అంటున్నారు.
అయితే క్యాంపెయిన్ సైజ్, సంపాదిస్తున్న మనీ ఆధారంగా జరిమానాలు ఉండాలని వారు అభిప్రాయపడ్డారు. క్రియేటర్‌లు, బ్రాండ్‌లు రెండూ కలిసి ప్రమోషన్లు చేస్తాయని, కేవలం ఇన్‌ఫ్లూయెన్సర్లను మాత్రమే అందుకు బాధ్యులను చేయకూడదని చాలా మంది భావిస్తున్నారు.
విక్రయాలను పెంచుకోవడానికి, ఫెయిర్ పార్ట్‌నర్‌షిప్‌లను కోరుకుంటారని, అలాంటప్పుడు పెయిడ్ అడ్వెర్టైజ్‌మెంట్ అని ఫాలోవర్లకు చెప్పడానికి క్రియేటర్స్ ఇష్టపడరని డిజిటల్ క్రియేటర్‌లు వాదిస్తున్నారు. క్రియేటర్స్‌తో ఒప్పందం చేసుకునే కంపెనీలను బాధ్యులను చేయాలని అంటున్నారు.
ఇద్దరికీ జరిమానా విధించడం ద్వారా బ్రాండ్‌లు కూడా బాధ్యతాయుతంగా ఉంటాయని చెబుతున్నారు. ట్రస్టెడ్ కమ్యూనిటీని డెవలప్ చేయడానికి ఈ మార్గదర్శకాలు ఉపయోగపడతాయి. వ్యాపారాలు, బ్రాండ్‌లను ప్రోత్సహించడానికి చేస్తున్న ప్రమోషన్స్, కంటెంట్ అడ్వెర్టైజ్‌మెంట్ అని ప్రేక్షకులకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా తెలియజేడయం నైతిక బాధ్యతగా ఉంటుంది.
ఈ పనులను బ్రాండ్‌కి పేమెంట్ పార్ట్‌నర్‌షిప్ రిక్వెస్ట్ పంపడం, క్యాప్షన్‌లో #ఏడీ వంటి హ్యాష్‌ట్యాగ్‌లను చేర్చడం ద్వారా చేయవచ్చని చెబుతున్నారు. నిజానికి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏ మొబైల్ కొనాలి,.? ఏ ఎలక్ట్రిక్ బైక్ కొనాలి..? ఎక్కడ తినాలి? ఏం తినాలి అన్నీ చెప్పేస్తున్నారు. ఎందులో డబ్బులు పెట్టాలి? లాంటి ఎన్నో ఆర్థిక విషయాలతో నెటిజన్లను ఆటాడిస్తోంది సోషల్ మీడియా.
చూస్తుండగానే ఆకాశమంత ఎదిగిన సోషల్ మీడియా పుణ్యమా అని కంపెనీలు బాగుపడుతున్నాయి. కంపెనీల నుంచి కాసుల కోసమో, కానుకల కోసమో ఇవన్నీ చెబుతున్న అపర డిజిటల్ ఆర్థిక మేధావులకు ఇకపై కళ్ళెం పడనుంది. ఈ నేపథ్యంలో నే సామాన్యుల నిర్ణయాన్ని ప్రభావితం చేస్తున్న సోషల్ మీడియా ప్రజాభిప్రాయ పరికల్పకులకు సర్కార్ మార్గదర్శకాలు రూపొందించింది.
- అమాయకులను తప్పుదోవ పట్టిస్తున్న వాణిజ్య ప్రకటనలు..
అమాయకులను తప్పుదోవ పట్టిస్తున్న వాణిజ్య ప్రకటనలకు అడ్డుకట్ట వేయడానికీ, సోషల్ మీడియా ప్రభావిత మార్కెట్ విస్తరిస్తున్న వేళ వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికీ ఇది మరో ముందడుగు అని అంటున్నారు విశ్లేషకులు. రోజువారీ వినియోగ వస్తువుల నుంచి క్రిప్టోకరెన్సీలు, నాన్-ఫంగిబుల్ టోకెన్లు, క్రిప్టో డిపాజిట్ల దాకా అన్నిటికీ ఈ జాడ్యం సోకింది.
కంపెనీలకు పోయేదేమీ లేదు కానీ, వారు ఏర్పాటు చేసుకునన ఇన్ ఫ్లూయెన్సర్ల మాట నమ్మి డబ్బులు పెట్టిన అమాయకులకే నష్టం. అందుకే, ఎలాంటి కానుకలు, హోటల్ బసలు, ఈక్విటీలు, రాయితీలు, అవార్డులందుకొని ఈ ఉత్పత్తులు, సేవలు, పథకాలను సిఫార్సు చేస్తున్నమిడి మిడి జ్నానపు ఇన్‌ఫ్లుయెన్సర్ మేధావులను అరికట్టాలని అనుకుంటోంది ప్రభుత్వం. సర్కార్ పగ్గాలు వేయనున్నట్టు గత సెప్టెంబర్ నుంచి వార్తలొస్తూనే ఉన్నాయి.
ఈ జనవరి 20న అవి నిజమయ్యాయి. సోషల్ మీడియాలో వివిధ ఉత్పత్తుల్ని సమర్థిస్తూ ప్రకటనలిస్తున్నప్పుడు ప్రముఖులు, , వర్చ్యువల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు ఎలాంటి విధివిధానాల్ని పాటించాలనేది సర్కార్ తేల్చేసింది. పోయిన ఏడాది 1275 కోట్ల రూ.ల విలువైన సోషల్ మీడియా మార్కెట్ ఏటా 20 శాతం వంతున పెరగనుందని అంచనాలున్నాయి. 2025 నాటికి అది 2800 కోట్ల రూ.లకు ఎగబాకుతుందని తాజా అంచనా.
అందుకే, సోషల్ మీడియాను ఆసరాగా చేసుకొన్న నవతరం ప్రసిద్ధులు బాధ్యతాయుతంగా ప్రవర్తించడానికి మార్గదర్శకాలు పెట్టడం మంచి పనే అంటున్నారు విశ్లేషకులు.. ఈ మార్గదర్శకాలతో అసలైన వస్తువుల విషయాలనే ప్రచారం చేయడానికి వీలుంటుంది. కొత్త పారదర్శకతతో, తుది కొనుగోలు నిర్ణయం వినియోగదారుల విచక్షణకు వదిలేసినట్టవుతుంది. జనం తేలిగ్గా మోసపోకుండా ఉండాలంటే, ఇన్‌ఫ్లుయెన్సర్లకు మార్గదర్శకాలిస్తే చాలదు.
మదుపరుల్ని ఆర్థిక విద్యావంతుల్ని చేసి, పరిజ్ఞానంతో పాటు చైతన్యం పెంచే ప్రణాళికలను చేపట్టాలి. ప్రముఖులెవరో చెప్పారు కదా అని అడ్డమైన వాటినన్నింటినీ నమ్మితే అసలుకే మోసమని అందరూ గ్రహించాలి. ఎందుకంటే, ఒక ప్రకటనలో ఓ పెద్దమనిషి నిత్యం చెబుతున్నట్టు డబ్బులు ఎవరికీ ఊరికే రావు కదా..