Homeఅంతర్జాతీయంవ్యసనంగా మారిన సోషల్ మీడియా..

వ్యసనంగా మారిన సోషల్ మీడియా..

ప్రస్తుతం ఈ ప్రపంచాన్ని సోషల్ మీడియా నడిపిస్తోంది. దిక్కు దిశ లేకుండా అన్ని వైపులా కాంతి వేగంతో ప్రయానిస్తోంది. ప్రపంచదేశాన్నింటినీ తన గుప్పిట్లోకి తీసుకుని ఆడిస్తోంది. రేడియో, పత్రికలు, టీవీలను కూడా పక్కకు జరిపి తనదైన పద్దతిలో ప్రయాణిస్తోంది సోషల్ మీడియా ఎవరికి కావలసిన విధంగా వారిని అలరిస్తూ ప్రపంచాన్ని సోషల్‌ మత్తులో ముంచేస్తోంది..నిజానికి సోషల్ మీడియా అంటే అదో జగత్తు..డిఫరెంట్ వరల్డ్.. అక్కడ రూల్స్ వర్తించవు. ఎవరిష్టం వారిదే..అపరిమితమైన స్వాతంత్య్రం.. చైనా, నార్త్ కొరియా, కొన్ని ఇస్లామిక్ దేశాల్లో కట్టడి చేయబడినా ఎక్కువ శాతం విచ్చలవిడిగానే కొనసాగుతోంది. కొందరికి ఇది వ్యసనంగా మారుతోంది.

ఇదో సామాజిక మాధ్యమంగా మారిపోయి చాలా కాలం అవుతోంది. మీకు తెలుసా.. పాశ్చాత్య దేశాల్లో 98 శాతం యువత నిత్యం ఆన్‌లైన్‌లోనే జీవిస్తున్నారు. వారు ఎంతగా దీని ప్రభావానికి లోనయ్యారంటే ప్రతి 30 నిమిషాలకు ఒకసారి నెట్‌లోకి వెళుతున్నట్టు గుర్తించారు. ఈ విషయంపై ఇప్పటికే పలు సంస్థలు పరిశోధనలు చేసి నివేదికలు సమర్పించాయి. ముఖ్యంగా మన దేశం విషయానికొస్తే సోషల్‌ మీడియాలో గడిపే భారతీయుల సగటు సమయం 2.36 గంటలుగా ఆధ్యయన కర్తలు చెబుతున్నారు. అయిదు గంటలకు పైగా 4.7 శాతం మంది ఆన్‌లైన్‌ లోనే ఉంటున్నారు.

స్మార్ట్‌ఫోన్‌ ఉన్న ప్రతి ఒక్కరికీ ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్, యూట్యూబ్, ఇన్‌స్ట్రాగామ్‌ గురించి బాగా తెలుసు. ఇవి జనం మెచ్చిన సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌. స్నేహితులు, కుటుంబ సభ్యులను కలిపేందుకు మొట్ట మొదట అందుబాటులోకి వచ్చాయి. ఆ తరువాత తమకు బయట విలుకాని సరదాలు తీర్చకునేందుకు ఉపయోగపడటం మొదలైంది. అనేక రకాలైన అవకాశాలతో ఇప్పుడు గంటల తరబడి వాటిలోనే గడిపేటంత వ్యసనంగా మారిపోయాయి. ముఖ్యంగా 16 నుంచి 24 ఏళ్ల యువత గంటల తరబడి సోషల్‌ మీడియాలోనే గడుపుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఇంగ్లండ్‌కు చెందిన కమ్యూనికేషన్స్‌ రెగ్యులేటర్‌ ‘ఆఫ్‌కమ్‌’ లెక్కల ప్రకారం పాశ్చాత్య దేశాల్లో 98 శాతం యువత అంటే 16 నుంచి 24 సంవత్సరాల వయసుల వారు రోజులో ఎక్కువ సమయం ఆన్‌లైన్‌లో గడుపుతుంటే భారతదేశంలో 33.7 శాతం మంది అదే పనిలో ఉంటున్నట్టు తెలిపింది. దేశంలో వినియోగంలో ఉన్న స్మార్ట్‌ ఫోన్లలో కనీసం మూడు యాప్‌ల్లో ఏదో ఒకటి రోజూ 30 నిమిషాలకు ఒకసారి తెరుస్తున్నట్టు గుర్తించారు. రోజులో గంట కంటే ఎక్కువ సేపు ఆన్‌లైన్‌లో గడిపితే అనర్థాలకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ప్రస్తుతం భారతదేశంలోని ఇంటర్నెట్‌ వినియోగదారులు సగటున రోజుకు 2.36 గంటలు సోషల్‌ మీడియాలో గడుపుతున్నట్టు యూఎస్‌కు చెందిన టెక్‌ జ్యూరీ సంస్థ తెలిపింది. వాస్తవానికి సోషల్‌ మీడియా వ్యసనాన్ని లెక్కించేందుకు నిర్దిష్టమైన కొలమానాలు ఏవీ లేవు. గంటల తరబడి ఫోన్‌తోనే గడపడాన్ని వ్యసనంగానే భావిస్తున్నారు.

ప్రతి 20 నిమిషాలకు ఒకసారి ఫోన్‌ చూసుకోవడం.. ఎలాంటి సందేశాలు రాకున్నా వచ్చినట్టు భావించడం.. కాస్త సమయం దొరికితే యూట్యూబ్, ఫేస్‌బుక్‌లోకి దూరిపోయి సమయాన్ని మరిచిపోవడం.. నిద్ర వస్తున్నా బలవంతంగా ఫోన్‌ చూస్తూ గడిపేయడం వంటి లక్షణాలు కనిపిస్తే అది సోషల్‌ మీడియా అడిక్షన్‌గా పేర్కొంటున్నారు. అయితే ఈ అలవాటును వారు తమకు తోచినవిధంగా సమర్థించుకుంటున్నారు నెటిజన్స్.

నిశ్శబ్దంగా తమ మెదళ్లలోకి వచ్చి చేరే నాలెడ్జీని ఎలా వద్దనుకుంటాం అని ప్రశ్నిస్తున్నారు. ఆధ్యయన కర్తలు ఏమంటున్నారంటే..5 గంటలకు పైగా ఆన్‌లైన్‌లోనే ఉండేవారిని వ్యసనపరులుగా చెబుతున్నారు. యూకేలో 10 శాతం మందికి ఈ వ్యసనం ఉండగా, మన దేశంలో 4.7 శాతం మందికి సోషల్‌ మీడియా వ్యసనంగా మారినట్టు లెక్కించారు. ప్రస్తుతం ఇంటర్నెట్‌ ఎక్కువ మందికి అందుబాటులోకి వస్తుండడంతో వచ్చే రెండేళ్లలో మనదేశంలో ఇది 12 శాతానికి పెరగవచ్చని అంచనా వేస్తున్నారు.

  • ఇష్టమైన యాప్స్‌ లో లాగిన్‌ అయినప్పుడల్లా మెదడులో డోపమైన్‌ అనే ఎంజైమ్ విడుదలవుతుంది..

డోపమైన అంటే మన శరీరానికి ఆనందాన్ని కలిగించే ఓ ఎంజైమ్‌. ఇది పలు రకాల ఆనందలకు కారణమవుతుంది. సోషల్ మీడియాలోని తమకు ఇష్టమైన సైట్లలోకి ప్రవేశించడం వల్ల కూడా ఈ విధమైన ఎంజైమ్ విడుదలవుతోందని నెటిజన్లు చెబుతున్నారు. ఈ ఎంజైమ్ విడుదల కారణంగా మెదడులోని న్యూరో ట్రాన్స్‌మీటర్లు ఆనందంతో కదులుతాయని వైద్యులు చెబుతున్నారు. సోషల్‌ మీడియా వ్యసనానికి, ఆనందించే అలవాటుకు మధ్య కొన్ని ముఖ్యమైన తేడాలు ఉన్నట్టు చికాగో యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడించింది. సోషల్‌ మీడియాను మితిమీరి ఉపయోగించడం వల్ల ఉద్యోగం, చదువు, పనులపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అంటే ఏదైనా నిర్దిష్ట సమయంలో చేయాల్సిన పనికి బదులు ఫోన్‌లో యాప్‌లను తెరిస్తే అది వ్యసనానికి సంకేతంగా చెబుతున్నారు.

అంటే చేసే పనిని పాతరేసి లేని పనులను స్రుష్టించుకోవడం. దాని వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువగా జరుగుతుంది. చేయాల్సిన పనులను వాయిదా వేసే అలవాటు పెరుగుతుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఉన్నప్పుడు, భోజనం చేసేటప్పుడు స్మార్ట్‌ఫోన్‌ను తీసుకోవడం, మెస్సేజ్‌లను చూడడం వల్ల సామాజిక సంబంధాలు దెబ్బతింటాయి. ఒంటరిగా ఉండటం అలవాటుగా మారిపోతుంది. బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా జీవించడం అలవాటుగా మారిపోతుంది. ప్రతి చిన్న సమస్యకు పరిష్కారంగా ఆన్‌లైన్, సోషల్‌ మీడియాపై అధికంగా ఆధారపడటం జరుతుంది.

ఇలా చేయడం వల్ల తప్పుదారి పట్టడం ఖాయం అని అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్నెట్ మొత్తం ఆర్టిఫీషియల్ ఇంటలీజెన్ ఆధారంగా నడుస్తోంది. ఈ ఏఐ టెక్నాలజీలు వీక్షకులు ఏం చేస్తున్నారు ఏం చదువుతున్నారో గమనిస్తుంటుంది. దాంతో సరిగ్గా అదే కంటెంట్ ను నెటిజన్ ముందుకు తెచ్చిపెడుతుంది.

ఈ కంటెంట్ మామూలుగా ఉండదు కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతుంది. వాటిని చదవడం చూడటంతోనే సమయం అంతా గడచిపోతుంటుంది. ఈ నాలెడ్జీ వల్ల జనానికి ఏ ఉపయోగమూ ఉండదు. ఫలానా హీరోకు ఉన్న అక్రమ సంబంధాలు, ఫలానా హీరోయిన్ కు విపరీత అలవాట్లు లాంటివి తెలుసుకుని యువత సాధించేదేమీ ఉండదు. పైగా మరో సమస్య కూడా వీరిని వెంటాడుతుంటుంది. ఫోన్‌లో బ్యాలెన్స్‌ ఉండి, ఇంటర్నెట్‌ రాకుంటే చిరాకు, కోపం రావడం, ఏదో కోల్పోయినట్టు ఆందోళన చెందడం జరుగుతుంది. కొన్ని వివరాలు మీకు షాక్ కలిగించేవిగా ఉన్నాయంటున్నారు నిపుణులు.

మీకు తెలుసా..ఫోన్‌ ని అస్సలు స్విచ్చాఫ్‌ చేయనివారు 50 శాతం కాగా రోజుకు 150 సార్లు ఫోన్‌ అన్‌లాక్‌ చేయడం జరుగుతోంది. సగటున 63 సార్లు ఫోన్‌చెక్‌ చేసుకుంటున్నారు. 71శాతం మంది ఫోన్‌ పక్కలోనే పెట్టుకుని నిద్రపోతున్నారు. బాత్‌రూముల్లోనూ ఫోన్లు వినియోగించేవారు 40 శాతంగా తేలింది. డ్రైవింగ్‌లో ఒక్కసారైనా మెస్సేజ్‌ చేసేవారు 75 శాతం కాగా పడుకునే ముందు లేదా నిద్ర లేచిన వెంటనే ఫోన్‌ చూసేవారు 87 శాతంగా చెబుతున్నారు ఆధ్యయన కర్తలు .. అమ్మాయిలైనా అబ్బాయిలైనా చేతిలో స్మార్ట్ ఫోన్ లేందే గడప దాటడం లేదు.

దారి కనుక్కోవాలన్నా, టీ తాగితే 5 రూ.లు చెల్లించాలన్నా మొబైల్ నే వాడేస్తున్నారు. ఎక్కడ ఏం జరిగిందో క్షణాలలో తెలిసిపోతున్నాయి. దీంతో మనిషి సంఘటనలకు స్పందించే తీరు మారిపోతోంది. అన్నింటినీ నిర్వేదంగా పరిశీలించడం పరిపాటిగా మారిపోయింది. ఒక విధంగా యువత మెదడు సుశుప్తావస్థలోకి చేర్చడం అన్న ఇంటర్నెట్ లక్ష్యం సోషల్ మీడియా ద్వారా పూర్తియందని అంటున్నారు నిపుణులు. యువత మాత్రమే కాదు సామాన్య జనం కూడా సోషల్‌ మీడియా అడిక్షన్‌లోకి వెళ్లినట్లేనని మానసిక వైద్యులు చెబుతున్నారు.

Must Read

spot_img