Homeఅంతర్జాతీయంధూమపానం .. ఆరోగ్యానికి హానికరం..

ధూమపానం .. ఆరోగ్యానికి హానికరం..

ఎందరు చెప్పినా, ఏం చేసినా .. స్మోకింగ్ మాత్రం ఆగడం లేదు. ధర పెంచితే, సింగిల్ సిగరెట్టు కొనుగోళ్లు పెరుగుతున్నాయి. దీన్ని గమనించిన కేంద్రం .. ఓ సరికొత్త నిర్ణయానికి సన్నద్ధం అవుతోంది.. సరదా సరదా సిగరెట్టు .. అన్నట్లే .. ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉన్నా, వాడకం మాత్రం తగ్గట్లేదు.. అందుకే సిగరెట్ బ్యాన్ కు కేంద్రం సరికొత్త పథకాన్ని సిద్ధం చేయనుంది. మరి అదేంటో.. చూద్దామా..

పొగతాగడం ఆరోగ్యానికి హానికరం .. సిగరెట్ ప్యాకెట్లు, గోడలు, బిల్ బోర్డులు, హోర్డింగులు, సినిమా థియేటర్లలో, ఇంకా అనేక మార్గాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తోంది ప్రభుత్వం. అధికారంలో ఏ పార్టీ ఉన్నా, ఆర్థిక మంత్రి ఎవరైనా సరే.. బడ్జెట్‌లో రెవిన్యూ పెంచుకునేందుకు సిగరెట్లు ఒక అవకాశం.

ప్రజారోగ్యంతో ముడిపడిన పొగాకు వినియోగాన్ని నియంత్రించడం ద్వారా తగ్గించాలనే విధానాన్ని అమలు చేస్తున్నారు పాలకులు. ఎంతగా ప్రచారం చేసినా… సిగరెట్లు, బీడీలు, గుట్కా, ఖైనీల రూపంలో పొగాకు వాడకం ఏటేటా పెరుగుతోందని చెబుతున్నాయి అధికారిక గణాంకాలు. అందుకే పొగ తాగడాన్ని తగ్గించేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంటోంది కేంద్ర ప్రభుత్వం. సిగరెట్లను లూజుగా అమ్మడాన్ని నిషేధించే ఆలోచనలో ఉంది.

దీంతో బోర్ కొట్టినప్పుడల్లా ఓ సిగరెట్ తాగేవాళ్ళు ఇకపై సింగిల్ సిగరెట్ కొనలేకపోవచ్చు. ఎందుకంటే ఇక నుంచి విడివిడిగా అంటే సింగిల్‌గా సిగరెట్‌ అమ్మకపోవచ్చు. ఇదిలా ఉంటే, జీఎస్టీ అమలయ్యాక కూడా పొగాకు ఉత్పత్తులపై పన్నుపెద్దగా పెరగలేదని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ గుర్తించింది. పొగాకు ఉత్పత్తులైన బీడీలపై 22 శాతం, సిగరెట్లపై 53 శాతం, నమిలే పొగాకుపై 64 శాతం జీఎస్టీ విధిస్తోంది.

అయితే సిగరెట్లపై 75 శాతం జీఎస్టీ విధించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత ప్రభుత్వాన్ని కోరింది. ఫౌండేషన్ ఫర్ స్మోక్ ఫ్రీ వరల్డ్ నివేదిక ప్రకారం పొగాకు వినియోగంలో భారత్‌ది ప్రపంచంలోనే రెండో స్థానం. దేశంలో 26.7 కోట్ల మంది పొగ తాగుతున్నారు. సిగరెట్లు, బీడీలు తాగే వారి సంఖ్య 10 కోట్ల వరకు ఉంటుందని అంచనా.

పొగాకు ఉత్పత్తుల్ని నమిలి తినేవారిలో పదిహేనేళ్లు పైబడిన వారు దాదాపు 20కోట్ల మంది ఉన్నారు. స్మోకింగ్ వల్ల ఏటా 12లక్షల మంది చనిపోతున్నారు. పొగాకు నమలడం వల్ల 3.5 లక్షల మంది మరణిసున్నారు.

2018లో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనమిక్స్ రిసెర్చ్ చేసిన సర్వేలో సిగరెట్లు తాగే వారిలో 46 శాతం మంది నిరక్షరాస్యులని, 16 శాతం మంది కాలేజ్ విద్యార్థులని తేలింది. భారత్‌లో బహిరంగ ప్రదేశాలలో స్మోకింగ్ బాన్ అమలులో ఉంది. అయితే దేశంలో పొగాకు ప్రత్యక్షంగా పరోక్షంగా మూడున్నర కోట్ల మందికి ఉపాధి కల్పిస్తోంది. లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతున్నా.. పొగాకు రైతులు నష్టపోతూనే ఉన్నారు. పొగాకుతో వ్యాపారం చేస్తున్న సంస్థలు కోట్ల రూపాయల లాభాలు ఆర్జిస్తుంటే.. రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి. పొగాకు ఉత్పత్తిలో ఖర్చులు పెరిగినంతగా.. పొగాకు ధరలు పెరగడం లేదనేది చేదు నిజం. పొగ తాగడం వల్ల క్యాన్సర్‌తో పాటు ఊపిరితిత్తులు, శ్వాసకోశ వ్యాధులు, దంతపరమైన సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. పొగ తాగడం, పొగాకు నమలడం వల్ల చాలా రకాల క్యాన్సర్లు వస్తున్నాయి.

సిగరెట్ వల్ల ప్రతి ఏటా 21 శాతం మంది కాన్సర్ బారిన పడుతున్నారు. ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా 80 లక్షల మంది పొగాకు వినియోగం కారణంగా
చనిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తోంది డబ్యూహెచ్ ఓ. ఈ నేపథ్యంలో సామాన్య ప్రజలు, యువతను దృష్టిలో పెట్టుకుని కేంద్రం మరో సంచలన
నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. దేశంలో సింగిల్ సిగరెట్లను విక్రయించడాన్ని నిషేధించాలని పార్లమెంటు స్టాండింగ్ కమిటీ ప్రతిపాదించింది.


వ్యక్తిగత సిగరెట్ స్టిక్స్, అన్‌టైడ్ పొగాకు ఉత్పత్తులను తక్కువ ఆదాయం కలిగిన వ్యక్తులు, యువతే ఎక్కువగా కొనుగోలు చేస్తారు. ఇలా విడి విడిగా ఒక్కొక్కటి కొనుగోలు చేయడం వారికి అనుకూలంగా ఉంటుంది. దీంతో ఈ విడి ఉత్పత్తులను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అటువంటి విక్రయాలను నిషేధించాలని ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. త్వరలోనే ఇది అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది.

రానున్న సాధారణ బడ్జెట్ లో పొగాకుఉత్పత్తులపై పన్ను పెంపు ఉంటుందన్న ఊహాగానాలు..!

భారతదేశంలో చాలా మంది ధూమపానం చేసేవారు మొత్తం ప్యాక్‌లకు బదులుగా విడి విడిగా సిగరెట్లను ఒకటి రెండు కొనుగోలు చేస్తారు.

ఈ కారణంగా, చాలా మంది యువకులు ధూమపానానికి అలవాటు పడ్డారు, అంతేగాక, తీవ్రమైన అనారోగ్యబారిన పడుతున్నారు. స్మోకింగ్ బెడదను అరికట్టేందుకు విమానాశ్రయాల్లోని స్మోకింగ్ జోన్లను మూసివేయాలని కూడా కమిటీ సిఫార్సు చేసింది. త్వరలో రానున్న సాధారణ బడ్జెట్ లో పొగాకు ఉత్పత్తులపై పన్ను పెంపు ఉంటుందన్న ఊహాగానాలు కూడా జోరందుకున్నాయి. వాటి ప్రకారం.. అన్ని పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ పెంచడం
అనేది కేంద్ర ప్రభుత్వానికి తక్షణమే ఆదాయాన్ని పెంచే అవసరాన్ని పరిష్కరించడానికి చాలా ప్రభావవంతమైన విధానం కాగా పొగాకు వినియోగం, సంబంధిత వ్యాధులను తగ్గించడానికి విజయవంతమైన ప్రతిపాదనగా చెబుతున్నారు.

అన్ని పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచడం వల్ల కేంద్ర ప్రభుత్వానికి గణనీయమైన ఆదాయం లభిస్తుంది. పొగాకు ఉత్పత్తులను తక్కువ ధరలో ఉండటం వల్లే యువత ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ధర భారీగా పెంచినా సిగిరెట్ల వాడకం ఏమాత్రం తగ్గలేదనే చెప్పాలి. పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించేందుకు పన్నులు పెంచుతున్నా ఫలితం ఉండడం లేదని కమిటీ అభిప్రాయపడింది. సిగరెట్‌పై ప్రస్తుతం అత్యధికంగా 28 శాతం జీఎస్టీ ఉందని, అలాగే కాంపెన్సేషన్ సెస్ కూడా ఉందని వెల్లడించింది. మొత్తంగా 290 శాతం వరకు ఎక్సైజ్ సుంకం ఉంది.

అన్నీ కలిపి లెక్క చేస్తే ఒక్కో సిగరెట్ ధరలో 64 శాతం వరకు ట్యాక్స్ ఉంటుంది. ధర పెరగితేనేం పెట్టె కొనే చోట.. అరపెట్టే కొంటాం లేదా ఒక్క సిగరెట్ కొంటాం కానీ ఊదడం మాత్రం మానవు అంటున్నారు పొగరాయుళ్లు.

పెట్టె ధర పెరగడం వల్ల చాలా మంది బాక్సు మొత్తం కొనుక్కోలేక సింగిల్ సిగిరెట్ ని విడిగా కొనుక్కుని తాగుతుంటారు. అలా సింగిల్ సిగిరెట్ల వాడకం కూడా భారీగా పెరిగింది. దీంతో ఇటువంటివేవీ కూడా సిగరెట్ల వినియోగాన్ని నియంత్రించలేకపోతున్నాయి. సిగరెట్ వినియోగంతో నోటి క్యాన్సర్ ముప్పు కూడా అంతకంతకూ పెరుగుతోంది. అయినా పొగరాయుళ్లు మాత్రం మానటంలేదు. దీంతో వారి ఆరోగ్యం దెబ్బతింటుంది.


ఆర్థికంగానే నష్టం జరుగుతుంది. అదే బలహీనతగా మారిపోవటంతో ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోని పరిస్థితి ఏర్పడుతోంది. మద్యపానం, ధూమపానం వంటికి మన ఆరోగ్యానికి ఎంత కీడు చేస్తాయో.. వాటిని వాడే ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా సరే చాలా మంది ఆ అలవాటు మార్చుకోవడానికి ఇష్టపడరు. ఇలాంటి అలవాట్ల వల్ల మన ఇళ్లు, ఒళ్లు గుల్ల అవుతుందని తెలిసినా సరే ఆ అలవాట్లను మానుకోలేరు.

ఇక పొగాకు, మద్యపానం వల్ల కలిగే నష్టాల గురించి ప్రభుత్వాలు ఎంత ప్రచారం చేసిన లాభం లేకుండా పోతుంది. తక్కువ ఆదాయం కలిగిన వ్యక్తులు,
యువత.. వ్యక్తిగత సిగరెట్‌​ స్టిక్స్‌, అన్‌టైడ్‌ పొగాకు ఉత్పత్తులను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఇలా విడివిడిగా.. ఒక్కొక్క సిగరెట్‌, పొగాకు
ఉత్పత్తులను కొనుగోలు చేయడం వారికి అనుకూలంగా ఉంది. ఈ క్రమంలోనే అటువంటి విక్రయాలను నిషేధించాలని ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.
ధూమపానాన్ని అరికట్టేందుకు ఎన్నో నిర్ణయాలు తీసుకుంటూ పలు చర్యలు చేపట్టినా కేంద్ర ప్రభుత్వం ప్రజల దగ్గర నుంచి ఎటువంటి మార్పు
రాకపోవడంతో ఇప్పుడు మరో నిర్ణయాన్ని అమలు చేయనుంది. పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని అరికట్టేందుకు కేంద్రం కసరత్తు ముమ్మరం
చేసింది.

ఇప్పటివరకు సింగిల్ సిగరెట్ తో సాగిన స్మోకింగ్ కు కేంద్ర నిర్ణయం .. ముందరి కాళ్లకు బంధం అవుతుందో లేదో అన్నదే చర్చనీయాంశంగా
మారింది.

Must Read

spot_img