కొత్త ఏడాది .. కశ్మీర్ వాసుల్ని కన్నీటిపాలు చేసింది. అభం శుభం తెలియని చిన్నారులు .. ఉగ్రదాడిలో బలికావడం .. తీరని ఆవేదనను మిగిల్చింది. ఈ ఘటన వెనుక .. పాక్ హస్తం ఉందని వాదనలు వినిపిస్తున్నాయి.
జమ్మూ కాశ్మీర్ వాసులు .. కొత్త ఏడాది ఇలా ఆరంభం అవుతుందని ఊహించలేదు.. అందరూ శాంతి, సంతోషాలను కోరుకుంటున్న వేళ జమ్మూలో తీవ్రవాదం జడలు విప్పి, 12 గంటల్లో ఆరుగుర్ని పొట్టన పెట్టుకున్న తీరు మనసును కలిచివేస్తోంది. కశ్మీర్ లోయతో పోల్చితే, ప్రశాంతమైన జమ్మూలోఇలాంటి ఘటనలు జరగడం విషాదం. 2019లో ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసి, కేంద్ర పాలిత ప్రాంతంగా భారత్ ప్రకటించిన జమ్మూ కాశ్మీర్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించి, ఎన్నికల ప్రక్రియను పునరుద్ధరించకుండా అడ్డు కోవడమే లక్ష్యంగా తీవ్రవాదులు ఈ దుశ్చర్యకు దిగినట్లు కనిపిస్తోంది. ఇది పాక్ ప్రేరేపిత తీవ్రవాద చర్య అని అర్థం చేసుకోవడం బ్రహ్మవిద్యేమీ కాదు. కాకపోతే, భారత విదేశాంగ మంత్రి జై శంకర్ ..
ఐక్యరాజ్యసమితిలో ప్రసంగిస్తూ.. తీవ్రవాద కేంద్ర స్థానంగా పాకిస్తాన్ ను ప్రస్తావించి, ఈ ధోరణిని మార్చుకోవాలంటూ హితవు చెప్పిన పక్షం రోజులకే ఈ ఘాతుకం జరగడం శోచనీయం. మారని పాక్ వక్రబుద్దికి తార్కాణం. తాజా ఘటన పూర్వాపరాలు దిగ్భ్రాంతికరం. జమ్మూ కాశ్మీర్ సరిహద్దు జిల్లాల్లో రజౌరీ పట్నానికి 8కి.మీ. దరంలో ధాంగ్రీలో జనవరి 1 సాయంత్రం 7 గంటల వేళ ఖాకీ దుస్తులు ధరించిన తీవ్రవాదులు అక్కడి అల్పసంఖ్యాక వర్గానికి చెందిన మూడు ఇళ్లలోకి జొరబడ్డారు. విచక్షణా రహితంగా కాల్పులు జరిపి, నలుగురి ప్రాణాలు తీశారు. పలువురిని గాయపరిచి, అక్కడి నుంచి ఉడాయించారు. ఆ తుపాకీ దాడులు ముగిసిన కొద్ది గంటల్లోనే ఆ ఇళ్ల దగ్గరే ఒకచోట తీవ్రవాదులు ఉంచిన బాంబులు పేలి ఇద్దరు చిన్నారులు బలయ్యారు. దర్యాప్తుకు వచ్చే భద్రతాదళాల ఉన్నతాధికారులే లక్ష్యంగా ఆ బాంబులు పెట్టడం, ఆధార్ కార్డుల ద్వారా గుర్తుపట్టి మరీ ఎంపిక చేసిన వారినే తుపాకీ కాల్పులతో చంపడం తీవ్రవాదుల కక్షను తేటతెల్లం చేస్తోంది.
కశ్మీర్ లో తీవ్రవాదం వైపు కొత్తగా ఆకర్షితులవుతోన్న వారిని వేగంగా నిర్వీర్యం చేస్తున్నామని అక్కడి ఉన్నతాధికారుల ఉవాచ. నిన్న గాక మొన్న ముగిసిన 2022లో 100 మంది కొత్తగా తీవ్రవాద మార్గంలోకి రాగా, 65 మందిని ఎన్ కౌంటర్ చేశామని, వారిలోనూ 58 మందిని చెడుతో తొక్కిన తొలినెలలోనే మట్టి కరిపించామని లెక్కలు చెబుతున్నాయి. ఎంతమంది తీవ్రవాదులు కొత్తగా వస్తున్నదీ .. పోతున్నదీ మన పాలకులు, పోలీసులు ఇంతని నిర్దిష్టంగా చెప్పగలగడం ఆశ్చర్యమైతే, వారి ప్రతి అడుగూ ఇంత తెలిసిన వారు .. అడ్డుకట్ట వేయలేకపోవడం అమితాశ్చర్యం.
పైగా ఆదివారం దాడి తర్వాత ఆ రాత్రి అణువణువూ జల్లెడ పట్టామని భద్రతా దళాలు చెప్పినా, ఆ దగ్గరే దండుగులు పెట్టిన బాంబులు .. మర్నాడు పేలి, మృతుల సంఖ్య పెరగడం .. మన పనితీరును ప్రశ్నిస్తోంది. రజౌరీ జిల్లాలో కొన్నిచోట్ల ముప్పుందని కొంతకాలంగా అనుమానిస్తున్నారు. గాలింపులూ జరిగాయి. అయినా సరే .. ఇలా ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు సాగడం అటు తీవ్రవాదుల తెగింపుకూ, ఇటు మన భద్రతా వైఫల్యానికి నిలువుటద్దం.
జిల్లాలో ఓ సైనిక శిబిరం బయట కాల్పుల్లో ఇద్దరు పౌరుల ప్రాణాలు పోయిన రెండు వారాల్లోనే ఈ ఘటన జరగడం గమనార్హం. సరిహద్దుల్లో అల్ప సంఖ్యాకులే గురిగా పాకిస్తాన్ ప్రేరేపతి తీవ్రవాదులు చేస్తోన్న ఈ అరాచకంతో దాయాది దేశం సాధించదలుచుకున్నదేమిటో చెప్పకనే చెబుతోంది. పొరుగుదేశాలన్నింటితో భారత్ సదా సత్సంబంధాలే కోరుకుంటుంది. అలాగని తీవ్రవాదాన్ని బూచిగా చూపించి, మనల్ని చర్చలకు తలొగ్గేలా చేయాలనుకుంటే అది కుదిరే పనికాదు. ఆ మాటే ఆ మధ్య జైశంకర్ కుండబద్దలు కొట్టారు.
జై శంకర్ వ్యాఖ్యానించినట్లు .. అనేక దశాబ్దాలుగా సీమాంతర తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తోన్న పాకిస్తాన్ పద్దతులను యూరోపియన్ దేశాల సహా అంతర్జాతీయ సమాజం ఖండించకపోవడం మరీ ఘోరం. తీవ్రవాదాన్ని సహించేది లేదని జబ్బలు చరిచే అమెరికా సైతం భారత్ తో భుజంభుజం కలుపుతూనే, పాక్ తోనూ మంచిగా ఉంటోంది. 2018లో ట్రంప్ హయాంలో పెట్టిన నిషేధాన్ని తొలగిస్తూ, బైడెన్ హయాంలో అమెరికా గతేడాది పాక్ తో ఎఫ్ 16 విమానాల ఒప్పందం పునరుద్ధరించుకుంది.
తీవ్రవాద వ్యతిరేక పోరాటంలో పాక్ భాగస్వామి కనుకనే ఈ సైనిక రక్షణ సాయమన్నఅమెరికా మాట .. అతిపెద్ద జోక్ అని విశ్లేషకులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ఇటీవలే భారత్, పాక్ లలో దేన్నీ తాము వదులుకోలేమంూ విదేశాంగ ప్రతినిధి చేసిన వ్యాఖ్య అగ్రరాజ్యపు నైజానికి తార్కాణం.. మాదకద్రవ్యాలు, అక్రమ ఆయుధాల వ్యాపారం సహా అంతర్జాతీయ నేరాలెన్నో ముడిపడిన సీమాంతర తీవ్రవాదాన్ని కేవలం నా దేశపు తలనెప్పిలెమ్మని ఊరుకుంటే, ముప్పు మీదకొస్తుంది.
రోజూ తీవ్రవాదుల్ని భారత్ కు ఎగుమతి చేస్తున్న పొరుగుదేశం పక్కలో పాములాంటిదే. గతంలో హిల్లరీ క్లింటన్ అన్నట్లు .. పెరట్లో పాములను పెట్టుకుని, అవి కేవలం పొరుగువారినే కాటేస్తాయనుకుంటే .. పొరపాటే. భారత్ సైతం పాక్ పై అంతర్జాతీయ వేదికలపై ధ్వజమెత్తుతూనే, అమెరిరాకపై కన్నేసి ఉంచాలి. మన పాలకులు కశ్మీర్ లోయలో పండిట్లు సహా స్థానికులపై తీవ్రవాద దాడులు 2019 తర్వాతే పెరిగిన చేదు నిజాన్ని గుర్తించాలి. తీవ్రవాదుల్ని కాకతీవ్రవాదాన్ని అంతం చేసే పనికి దిగాలి. స్థానికుల ఆశలు, ఆకాంక్షలకు పెద్ద పీట వేస్తూ, వారి పాలకులయ్యేలా చూడాలి. సానుకూల వాతావరణం కల్పించాలి.. ఇప్పటికే అపరిమితంగా ఆలస్యమైన అసెంబ్లీ ఎన్నికల్ని జరిపించి, స్థానిక ప్రభుత్వ ఏర్పాటుతో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. ఇప్పుడు అదే మాత్రం ఉందని విశ్లేషకులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు.
క్యాలెండర్లు మారుతున్నా కశ్మీర్లో రక్తపాతం తగ్గడం లేదు. నూతన సంవత్సరం తొలి రోజే.. రాజౌరీలో హిందువుల ఇళ్లే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. మృతులను దీపక్ కుమార్, సతీష్ కుమార్, ప్రీతమ్ లాల్ గా గుర్తించారు. తుపాకీ గాయాలతో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రాజౌరి మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించడంతో అక్కడ గందరగోళం నెలకొంది. గత రెండు వారాల్లో జిల్లాలో పౌర హత్యలు జరగడం ఇది రెండోసారి. డిసెంబరు 16న రాజౌరిలోని సైనిక శిబిరం వెలుపల ఇద్దరు పౌరులు మరణించారు.
నూతన సంవత్సరం రోజు, హిందువులకు పవిత్రమైన వైకుంఠ ఏకాదశి వేళ హిందు కుటుంబాలను టార్గెట్‌గా చేసుకొని ఉగ్రవాదులు దాడి జరిపారు. ఈ కాల్పుల ఘటనను నిరసిస్తూ.. అనేక సంస్థలు రాజౌరీ జిల్లా బంద్‌కు పిలుపునిచ్చాయి. ప్రజలను కాపాడడంలో జిల్లా యంత్రాంగం విఫలమైందంటూ
స్థానికులు ఆందోళన చేపట్టారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా స్వయంగా వచ్చి, తమ డిమాండ్లను వినాలని, అప్పటి వరకు ఆందోళన ఆపేదిలేదని నిరసనకారులు తేల్చిచెప్పారు. గ్రామంలో మెజార్టీ ముస్లింలు కాగా.. ఊరికి కొద్ది దూరంలో ఉన్న మూడు ఇళ్లు మైనార్టీలకు చెందినవని తెలుస్తోంది. జమ్మూ శివార్లలోని సిధ్రా సమీపంలో లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన వారిగా అనుమానిస్తోన్న నలుగురు టెర్రరిస్టులను భద్రతా బలగాలు ఎన్‌కౌంటర్ చేశాయి.
ట్రక్‌లో ఏకే 47 రైఫిల్స్, ఎం4 రైఫిల్, గ్రెనేడ్లతో ఈ ఉగ్రవాదులు జమ్మూలోకి చొరబడేందుకు ప్రయత్నించారు. దీనికి ప్రతీకారంగానే ఉగ్రవాదులు దాడులకు తెగబడుతున్నారని భావిస్తున్నారు. కాల్పుల ఘటన నేపథ్యంలో ఈ గ్రామంలో సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేశారు.రాజౌరీ గ్రామంలో దాడులకు తెగబడ్డ ఉగ్రవాదులు.. మైనార్జీ వర్గాలపైనే కాల్పులకు దిగడం .. చర్చనీయాంశంగా మారింది.