ఎవరైనా ఆరోపణలు చేస్తే, వాళ్లకే నోటీసులు ఇస్తారా.. ఇప్పుడు రాజకీయాల్లో అదే ట్రెండ్ గా మారుతోంది. తెలంగాణలో పేపర్ లీకేజీపై పీసీసీ ఛీఫ్ రేవంత్ తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే ఇప్పుడు ఆ ఆరోపణలకు ఆధారాలు చూపాలంటూ .. సిట్ నోటీసులివ్వడం .. హాట్ టాపిక్ గా మారింది. దేశ రాజధానిలో మహిళలపై దాడులు పెచ్చరిల్లాయి అన్నందుకు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు కీలక నేత రాహుల్ గాంధీకి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆధారాలు చూపమని, అలాగే తెలంగాణలో టీఎస్పీఎస్పీ పేపర్ లీకేజిపై అధికార పార్టీ అగ్రనేతలపై ఆరోపణలు చేసిన రేవంత్ కు నోటీసులు ఇచ్చారు పేపర్ లీకేజీ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు. అలాగే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రిపై ఆరోపణలు చేసినది రేవంత్ ఒక్కరే కాదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సైతం ఇవే ఆరోపణలు చేశారు. అయినా ఆరోపణలపై దర్యాప్తు చేసి నిగ్గు తేల్చాల్సిన పోలీసులు ఆరోపణలు చేసిన వారికే నోటీసులు ఇచ్చి ఆధారాలు ఇవ్వాలనడం, తాము చేయాల్సిన పనిని వదిలేయడం గానే భావించాల్సి ఉంటుంది.
ఇదిలా ఉండగా కేంద్రంలో బీజేపీ, తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వాలు తమపై ఆరోపణల విషయంలో స్పందించిన తీరు ఒకలాగే ఉండటం ఎంతమాత్రం కాకతాళీయం కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక పోతే సిట్ నోటీసులకు భయపడేది లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సిట్టింగ్ జడ్జితో విచారించాలన్న తన డిమాండ్ ను పునరుద్ఘాటించారు. సిట్ దర్యాప్తుపై విశ్వాసం లేదన్న ఆయన తన వద్ద ఉన్న ఆధారాలను సీట్ కు ఇచ్చే ప్రశక్తే లేదన్నారు. స్వయంగా కేసీఆర్ కేంద్రం వద్ద సీబీఐ, ఈడీ, ఐటీ వంటి సంస్థలుంటే తమకు రాష్ట్ర దర్యాప్తు సంస్థలున్నాయని ప్రకటించారనీ, అటువంటి సిట్ ను నమ్మి ఆధారాలెలా ఇస్తామని రేవంత్ అన్నారు. పేపర్ లీకేజీపై సిట్టింగ్ న్యాయమూర్తి చేత విచారణ జరిపిస్తే అప్పుడు తన వద్ద ఉన్న ఆధారాలను బయటపెడతానని స్పష్టం చేశారు.
అయితే పేపర్ లీకేజీ వ్యవహారంపై రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం మొత్తం కేటీఆర్ పీఏ తిరుపతి నడిపించారని ఆయన అన్నారు. లీకేజీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజశేఖర్, కేటీఆర్ పీఏ తిరుపతివి పక్క పక్క గ్రామాలని రేవంత్ రెడ్డి తెలిపారు. కేటీఆర్ పీఏ తిరుపతి, రాజశేఖర్ సన్నిహితులకే గ్రూప్ 1లో అత్యధిక మార్కులు వచ్చాయని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. గ్రూప్ 1లో 100 మార్కులకు పైగా వచ్చిన వారందరి వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ పీఏ తిరుపతి సూచన మేరకు… రాజశేఖర్‌కు టీఎస్‌పీఎస్సీలో ఉద్యోగం ఇచ్చారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇప్పించి రాజశేఖర్ ను టీఎస్ పీఎస్సీకి పంపించారన్నారు.
ఈ ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి వాటన్నింటికీ ఆధారాలు అందజేయాలని సిట్ తన నోటీసులో కోరింది. ఒక్క రేవంత్ కే కాకుండా పేపర్ లీకేజీ వ్యవహారంలో ఆరోపణలు చేస్తున్న ఇతర ప్రతిపక్ష పార్టీల నేతలకు కూడా సిట్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా పేపర్ లీకేజీ వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు చేశారు. వీటికి సంబంధించిన వివరాలు, ఆధారాలు అందించాలని సిట్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, తనకు సిట్ నోటీసులు ఇంకా అందలేదని రేవంత్ రెడ్డి అన్నారు. సిట్ నోటీసులకు మాకు భయం లేదని, సిట్‌కు ఎటువంటి ఆధారాలు ఇవ్వబోమని ప్రకటించారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తే ఆధారాలు ఇస్తామన్నారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ సమస్య పరిష్కారం కావాలంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని రేవంత్ డిమాండ్ చేశారు. తెలంగాణలో టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతోంది. రాజకీయాలకు అతీతంగా వేగంగా దర్యాప్తు చేసి నిజాలను బయట పెట్టి ఉద్యోగార్థుల్లో నమ్మకం పెంచాల్సిన సిట్ .. రాజకీయ నేతలను టార్గెట్ చేసుకోవడంతో సీరియస్ నెస్ తగ్గిపోతోంది. ఏపీ పోలీసుల మాదిరిగా ఆరోపణలు చేసిన రాజకీయ నేతలకు ఆధారాలు ఇవ్వాలని నోటీసులు జారీ చేస్తోంది. ఇటీవల రేవంత్ రెడ్డి కేటీఆర్ పీఏ తిరుపతి వ్యవహారంపై ఆరోపణలు గుప్పించారు. ఇదంతా కేటీఆర్ కనుసన్నల్లో జరిగిందన్నారు. దీనికి సంబంధించిన ఆధారాలు కావాలంటూ.. సిట్ రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. అయితే రేవంత్ రెడ్డి మాత్రం ఇంకా నోటీసులు రాలేదని.. నోటీసులు అందుకున్న ఆధారాలు ఇచ్చేది లేదని ప్రకటించారు. సిట్టింగ్ జడ్జితోనే విచారణ చేయిస్తే ఇస్తామన్నారు.
30 లక్షల మంది నిరుద్యోగులకు అండగా ఉంటామని TSPSC పేపర్ లీకేజ్ బాగోతం బయటపడాలంటే సిట్టింగ్ జడ్జ్ తోనే విచారణ జరిపించాలని రేవంత్ డిమాండ్ చేశారు. కేసీఆర్, కేటీఆర్ గద్దె దిగేదాక మా పోరాటం కొనసాగుతుందన్నారు. కేసును కావాలనే నీరుగారుస్తున్నారని ఆరోపిస్తున్నారు. బండి సంజయ్ కూడా తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆయనకు నోటీసులు ఇచ్చినా దుమారం రేగే అవకాశం ఉంది. విచారణ జరిపే కొద్దీ అసలు లీక్ కాని పరీక్ష పేపర్ ఏదైనా ఉందా అనే డౌట్ అందరికీ వస్తోంది. ఇలాంటి సమయంలో పోలీసులు, దర్యాప్తు సంస్థలు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి నిజాలను వెల్లడించాల్సి ఉంది. నిజాయితీగా కష్టపడిన నిరుద్యోగులకు న్యాయం చేయాల్సి ఉంది. అలా కాకుండా రాజకీయ ఆరోపణలు చేసుకుంటున్న వారి విషయంలో జోక్యం చేసుకుని నోటీసులు జారీ చేస్తే, విషయం అంతా రాజకీయం అవుతుంది. నిరుద్యోగులు అన్యాయమైపోతారు.
తెలంగాణలో సంచలనంగా మారిన పబ్లిక్ సర్వీసు కమిషన్ ప్రశ్నపత్రాల లీక్ వ్యవహారంలో కొత్త ట్విస్ట్. రాజకీయ నేతలపైన సిట్ ఫోకస్ చేసింది. ఇప్పటికే ఈ కేసులో కీలకంగా భావిస్తున్న ఇద్దరు ఉద్యోగులతో పాటుగా సహకరించిన వారిని సిట్ విచారిస్తోంది. ఈ కేసు విచారణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేసింది. ప్రశ్నాపత్రాలు టీఎస్పీఎస్సీలో పని చేసే వారి ద్వారానే బయటకు వెళ్లినట్లు గుర్తించారు. అటు ఇదే సమయంలో హైకోర్టులోనూ ఈ వ్యవహారంపై పిటీషన్ దాఖలైంది. ప్రభుత్వం తిరిగి పరీక్షలు నిర్వహిస్తామని..పారదర్శకంగా వ్యవహరిస్తామని చెబుతోంది. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. వ్యవహారంలో నిందితులను విచారిస్తున్న సిట్..రాజకీయంగా ఆరోపణలు చేస్తున్న వారిపైనా ఫోకస్ చేసింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ వ్యవహారంలో ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఆరోపణలు చేసారు.
మంత్రి కేటీఆర్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. మంత్రి కేటీఆర్ వద్ద పని చేసే వ్యక్తి సొంత గ్రామంలో పరీక్షల్లో వంద మందికి మంచి మార్కులు వచ్చాయని ఆరోపించారు. ఇప్పటికే ప్రభుత్వం సున్నితమైన ఈ అంశంలో రాజకీయాల కోసం ఆరోపణలు చేసి..ఉద్యోగాల కోసం వేచి చూస్తున్న యువతని ఇబ్బంది పెట్టవద్దని సూచించింది. ఇప్పుడు సిట్ నేరుగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఆరోపించినట్లుగా ఎవరెవరికి ఇందులో భాగస్వామ్యం ఉంది.. ఎటువంటి ఆధారాలు ఉన్నాయో వాటితో సహా హాజరు కావాలని పేర్కొంది. రేవంత్ రెడ్డితో పాటుగా ఇదే తరహాలో ఆరోపణలు చేస్తున్న రాజకీయ నేతలను సిట్ విచారించే అవకాశం కనిపిస్తోంది. ఎవరి దగ్గర ఎటువంటి సమాచారం ఉన్నా..తమకు ఇవ్వాలని కోరుతోంది. దీంతో…ఇతర పార్టీ ల నేతలకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇటు పేపర్ లీక్ కేసులో నిందితులను సిట్ విచారించింది. పేపర్ లీక్ కేసులో 9 మంది నిందితులను సిట్ అధికారులు మూడో రోజు విచారిస్తున్నారు. అధికారులు నిందితుల లావాదేవీలపై కూపీ లాగుతున్నారు. రాజశేఖర్ రెడ్డి , ప్రవీణ్, రేణుక వీళ్ల మధ్య జరిగిన ట్రాన్సక్షన్స్ గురించి ఆరా తీస్తున్నారు. అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు పేపర్ ఎవరెవరు తీసుకున్నారో వారిని గుర్తించి కేసులు నమోదు చేయనుంది. అయితే ఈ అంశంలో రాజకీయ నేతలకు నోటీసులివ్వడమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.