Homeఅంతర్జాతీయంసిసోడియా అరెస్ట్..

సిసోడియా అరెస్ట్..

  • ఢిల్లీ సర్కార్ కు ఇప్పుడు సంక్షోభం తప్పదా..?
  • మంత్రి సిసోడియా అరెస్ట్ .. ఇప్పుడు ఆ పార్టీ చిక్కుల్లో పడనుందా..?
  • ఇంతకీ .. ఢిల్లీ లిక్కర్ స్కాం..ఆప్ కు..తీరని కష్టాల్ని చూపించనుందా..?
  • ఇంతకీ అసలు..ఢిల్లీ లిక్కర్ స్కాం..ఆప్‌ కు చెక్ పెట్టనుందా..?

ఆప్ క్యాబినెట్ .. చిక్కుల్లో చిక్కుకోనుందా..? కీలక మంత్రులపై అరెస్ట్ ల పంజా వెనుక కథేంటి..? ఛార్జిషీట్ లో పేరు లేకుండానే.. సిసోడియా అరెస్ట్ చర్చనీయాంశంగా మారిందా..? దీంతో సీబీఐ అస్త్రంగా ఢిల్లీ సర్కార్ పై కేంద్రం తనదైన స్టైల్లో పని చేస్తోందా..? ఇంతకీ.. ఇప్పుడు ఈ సంక్షోభం నుంచి ఆప్ ఎలా బయటపడనుంది..?

ఢిల్లీ కేబినేట్ లో కీలక శాఖలకు మంత్రులుగా ఉన్న సత్యేందర్ జైన్, మనీశ్ సిసోడియాలు అరెస్టు కావడంతో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం సంక్షోభంలో కూరుకుపోయింది. గతేడాది జూన్‌లో అప్పటి ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ అరెస్టు తర్వాత తాజాగా సిసోడియా అరెస్ట్ కావడంతో ఢిల్లీ రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. వీరిలో సిసోడియా ఆరోగ్యం, విద్య, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్, సర్వీసెస్, ఫైనాన్స్, పవర్, హోమ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్‌తో సహా 18 శాఖలను చూస్తున్నారు. ప్రత్యేకంగా ఏ మంత్రికి కేటాయించని శాఖలన్నింటిని కూడా ఆయనే నిర్వహిస్తున్నారు.

విద్య , ఆరోగ్య శాఖలను విజయవంతంగా ముందుకు నడిపించి.. పార్టీ ప్రజాదరణ, ఎన్నికల విజయానికి దోహదపడిన వీరిద్దరూ అరెస్టు కావడం పార్టీలో సంచలనంగా మారింది. కేబినేట్ లో వీరి గైర్హాజరు అరవింద్ కేజ్రీవాల్‌కు తీరని లోటుగా మారింది. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం సిసోడియాను భర్తీ చేసేలా ఢిల్లీ బడ్జెట్‌ను సమర్పించడం కేజ్రీవాల్‌కు తక్షణ సవాలుగా గోచరిస్తోంది. దీంతో బడ్జెట్ ను ఎవరు ప్రవేశపెడతారనే విషయం సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఢిల్లీ ప్రభుత్వ బడ్జెట్‌ను రెవెన్యూ మంత్రి కైలాష్ గహ్లోట్ సమర్పించే అవకాశం ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు ఇప్పటికే వెల్లడించాయి. గహ్లోట్ గత కొన్ని రోజులుగా బడ్జెట్ సంబంధిత సమావేశాలకు హాజరవుతుండడంతో ఇదే ఖరారవనున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీ ప్రభుత్వ వెబ్‌సైట్ల ప్రకారం మొత్తం 33 శాఖలున్నాయి. ఢిల్లీ ప్రభుత్వంలో కేజ్రీవాల్ తో పాటు ఆరుగురు కేబినేట్ మంత్రులుండగా.. గతేడాది మనీలాండరింగ్ కేసులో సత్యేంద్ర జైన్ ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది.

దీంతో సిసోడియాకు 18శాఖలు కేటాయించగా.. పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్‌కు మూడు శాఖలు ఇచ్చారు. ఇమ్రాన్ హుస్సేన్ ఆహారం అండ్ పౌర సరఫరాలు, ఎన్నికలకు మాత్రమే ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. కైలాష్ గహ్లోట్ రెవెన్యూ, రవాణా సహా ఆరు శాఖలకు ఇన్‌ఛార్జ్‌గా ఉండగా, రాజ్ కుమార్ ఆనంద్‌కు నాలుగు పోర్ట్‌ఫోలియోలు ఉన్నాయి.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితుడిగా లేకపోయినా సిసోడియా అరెస్ట్ కావడం చర్చనీయాంశంగా మారింది. సీబీఐ చెబుతున్నదాని ప్రకారం.. ఆయన పేరు రిమాండ్ రిపోర్ట్స్ లో ఉంది. ఫోన్లు మార్చారన్న అభియోగాలున్నాయి. ఇవే.. మనీష్ సిసోడియా అరెస్టుకు దారి తీశాయి. ఢిల్లీ డిప్యూటీ సీఎంగా ఉన్న సిసోడియా అరెస్టుతో కేజ్రీవాల్ సర్కారు సంక్షోభం అంచుకు చేరింది. సీఎం కాకుండా క్యాబినెట్ లో కీలక మంత్రులు సిసోడియా, సత్యేంద్ర జైన్ ఇద్దరూ జైలుపాలయ్యారు.

ఇప్పుడు ఆప్ ముందున్న ఆప్షన్స్ ఏంటి? మరీ ముఖ్యంగా లిక్కర్ స్కాంలో మున్ముందు జరిగేదేంటి? అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే ఢిల్లీ డిప్యుటీ సీఎం మనీశ్ సిసోడియాకు లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు మరోసారి CBI నుంచి పిలుపు వచ్చింది. ఈ విషయాన్ని వెల్లడించిన సిసోడియా విచారణకు సహకరిస్తానని స్పష్టం చేశారు. అయితే ఇంతలోనే విచారణకు హాజరు కాలేనని CBIకి రిక్వెస్ట్ పెట్టుకున్నారు. పోస్ట్‌పోన్ చేయాలని కోరారు. ఉన్నట్టుండి ఆయన ఈ తేదీని మార్చాలని అడిగారు.

సీబీఐ తనను అరెస్ట్ చేసే అవకాశముందని అన్నారు. రాష్ట్ర బడ్జెట్‌ను తయారు చేసే పని తుది దశకు చేరుకుందని, ఇది పూర్తయ్యాక విచారణకు
హాజరవుతానని చెప్పారు. ఆర్థిక శాఖ కూడా తన పరిధిలోనే ఉందని, బడ్జెట్ తయారు చేసే పనిలో ఉన్నానని తెలిపారు. తాను ప్రతిసారి సీబీఐ అధికారులకు సహకరించానని, కానీ ఢిల్లీ ప్రజలకు ఇదెంతో కీలక సమయమని, బడ్జెట్‌ను ప్రిపేర్ చేస్తున్నామని చెప్పారు. ఫిబ్రవరి నెలాఖరులోగా ఆ ప్రతులను కేంద్ర ప్రభుత్వానికి పంపించాల్సి ఉంటుంది. తనను అరెస్ట్ చేసే అవకాశముందని, అందుకే బడ్జెట్‌ను ఫైనలైజ్ చేసే వరకూ ఆగాలని సీబీఐని కోరానని, ఆర్థిక మంత్రిగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం తన బాధ్యతని తెలిపారు.

అందుకే ఫిబ్రవరి చివరి వారం వరకూ సమయం ఇవ్వాలని కోరానని సిసోడియా తెలిపారు. అయితే CBI తదుపరి విచారణ తేదీని ఇంకా ఖరారు చేయలేదు. అటు బీజేపీ మాత్రం సిసోడియాపై మండి పడుతోంది. విచారణ నుంచి తప్పించుకోడానికి ఇదో సాకు అని విమర్శిస్తోంది. ఇలా ఎన్ని రోజులు తప్పించుకుని తిరుగుతారో చూస్తామని సెటైర్లు వేసింది. ఇదిలా ఉండగానే, ఢిల్లీ డిప్యుటీ సీఎం మనీశ్ సిసోడియాకు సీబీఐ మరోసారి సమన్లు జారీ చేసింది. లిక్కర్ స్కామ్ విచారణలో భాగంగా మరోసారి హాజరు కావాలని వెల్లడించింది. ఇదే విషయాన్ని సిసోడియా ధ్రువీకరించారు. ట్విటర్ ద్వారా వివరాలు వెల్లడించారు.

సీబీఐ నుంచి తనకు మరోసారి పిలుపు వచ్చింది. సీబీఐతో ఈడీలకు పూర్తి అధికారాలు ఇచ్చి తనపైకి వదులుతున్నారని సిసోడియా మండిపడ్డారు. తన ఇంటిని సోదా చేశారు. బ్యాంక్ లాకర్‌నూ సెర్చ్ చేశారు. కానీ వాళ్లకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఢిల్లీలోని విద్యార్థులకు మంచి చదువు అందాలని
ఎన్నో చర్యలు తీసుకున్నానని, అందుకే వాళ్లు తనను నియంత్రించాలని చూస్తున్నారని ఆరోపించారు. తాను ఇప్పటి వరకూ విచారణకు సహకరించానని, ఇకపై కూడా ఇదే విధంగా సహకరిస్తానని సిసోడియా అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో వరుస అరెస్టులు కొనసాగుతున్నాయి.

ఇప్పుడు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా వంతు వచ్చింది. సీబీఐ, ఈడీ రెండూ దూకుడుగా దర్యాప్తు చేస్తున్నాయి. 2021-22 ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ అంతా ముడుపులు, కమీషన్ల చుట్టే ఉందన్న ఆరోపణలతో రంగంలోకి దిగిన సీబీఐ ఒక్కో విషయాన్ని లాగుతోంది. ఇందులో మనీ లాండరింగ్ కూడా జరిగిందన్న సమాచారంతో ఈడీ కూడా ఎంక్వైరీ చేస్తోంది. సీబీఐ కొందరిని, ఈడీ మరికొందరిని ఇప్పటికే అరెస్ట్ చేసింది.

ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి నమోదైన FIRలో 15 మంది పేర్లను సీబీఐ చేర్చింది. అందులో మనీష్ సిసోడియా పేరు మొదటగా ఉంది. ఢిల్లీ లిక్కర్ పాలసీని భారీ అవకతవకలతో అమలు చేసేందుకు ప్రయత్నాలు చేశారంటూ సీబీఐ అభియోగాలు మోపింది. విజయ్ నాయర్, సమీర్ మహేంద్రు, మనోజ్ రాయ్, అమన్ దీప్ దల్ సహా మరికొందరు ఉన్నారు.

  • సిసోడియాకు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు,లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనాకు కాపీ పంపారు..

ఢిల్లీ లిక్కర్ పాలసీని స్టడీ చేసిన చీఫ్ సెక్రెటరీ.. లోపాలున్నాయంటూ తన ప్రశ్నలకు జవాబు చెప్పాలంటూ సిసోడియాకు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు,
లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనాకు కాపీ పంపారు. దీనిపై విచారణ జరపాలన్నారు. దీంతో అక్కడి నుంచి కథ మొదలైంది. LG అప్రూవల్ లేకుండానే మార్పులకు ఆమోదం తెలిపారని అన్నారు. సీబీఐ రంగంలోకి దిగడంతో ఈ పాలసీకి లింక్ ఉన్న వారంతా ఒకే రోజు ఫోన్లు మార్చేశారని, ఆధారాలు దొరక్కుండా జాగ్రత్త పడ్డారని సీబీఐ పలు రిమాండ్ రిపోర్ట్స్, ఛార్జిషీట్లలో పేర్కొంది. సిసోడియా సహకరించకపోవడం వల్లే ఇప్పుడు అరెస్ట్ చేసినట్లు సీబీఐ తెలిపింది.

సిసోడియా పేరు ఛార్జ్ షీట్ లో ఉన్నా.. నిందితుడిగా చేర్చలేదంటున్నారు. డిప్యూటీ సీఎం ఇతర వ్యక్తుల పేర్లమీద ఫోన్లు, ఫోన్ నెంబర్లు తీసుకున్నారని, మొత్తం 18 ఫోన్లు, 4 నెంబర్లు వాడారని సీబీఐ ఆరోపిస్తోంది. లిక్కర్ స్కాం ఇష్యూ వెలుగులోకి రాగానే ఒక్కరోజులోనే 3 ఫోన్లు మార్చారని అంటున్నారు. రౌస్ అవెన్యూ కోర్టులో సీబీఐ, సిసోడియా మధ్య వాద ప్రతివాదాలు జరిగాయి. ఢిల్లీ ఎల్జీ అప్రూవల్ ఇచ్చారని సిసోడియా తరపు లాయర్ వాదించారు.

ఈ పాలసీపై బహిరంగంగానే చర్చ జరిగిందని, కుట్రలు ఏవీ లేవని కోర్టుకు తెలిపారు. సిసోడియా అరెస్ట్ తో ఆమ్ ఆద్మీ పార్టీ దేశవ్యాప్తంగా నిరసనలు తెలిపింది. విపక్షాలను ఎదుర్కోలేక ఇలాంటి కేసుల్లో ఇరికిస్తున్నారంటూ ఆరోపించారు నేతలు. ఆప్ కు కొన్ని రాజకీయ పార్టీలు మద్దతు పలికాయి. నిజానికి సిసోడియా అరెస్ట్ తో కేజ్రీవాల్ సర్కార్ లో సంక్షోభం వస్తుందా అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. ఎందుకంటే.. ఢిల్లీ హెల్త్ మినిస్టర్ సత్యేంద్ర జైన్ ఇప్పటికే జైలుపాలయ్యారు.

ఇప్పుడు 18 శాఖలను చూస్తున్న సిసోడియా కూడా ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ గెలుపులో సిసోడియా, జైన్ కీలకంగా
వ్యవహరించారు. విద్య, వైద్య రంగాల్లో సమూల మార్పులు తీసుకొచ్చారు. ఈ పాలసీలతోనే ఆప్ కు ప్రజల్లో గుర్తింపు వచ్చింది. మొహల్లా క్లినిక్స్,
అలాగే కార్పొరేట్ స్కూళ్ల మాదిరి సర్కారీ స్కూళ్ల ఏర్పాటు మంచి ఫలితాలనిచ్చాయి.

సిసోడియా అరెస్ట్ .. ఆప్ సర్కార్ని టెన్షన్ పెట్టక మానదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో దీనిపై ఆప్‌ ఏం చేయనుందన్నదే సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Must Read

spot_img