తెలంగాణ ప్రముఖ గాయిని మంగ్లీ మరో వివాదంలో చిక్కుకుంది. శివుని పాట చిత్రీకరణపై ఆమె వివాదంలో ఇరుక్కుపోయింది. శ్రీకాళహస్తి ఆలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని పది రోజుల క్రితం ఆలయంలో ఓ పాటను మంగ్లీ బృందం…చిత్రీకరించింది. అంతేకాకుండా ఈ సాంగ్ ను సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేసింది. చాలా తక్కువ రోజుల్లోనే ఆ పాట ఎంతో వీవ్స్, లైక్స్ ను తెచ్చుకుంది. ఇంతవరకు బాగానే ఉన్న కాలభైరవ స్వామి వద్ద, అమ్మవారి సన్నిధిలో, స్పటిక లింగం దగ్గర పాటను చిత్రీకరించారు. రాయల మండపం, రాహు కేతు మండపం, ఊంజల్ సేవ మండపాలలో మంగ్లీ పాటకు నాట్యం చేసింది. అయితే చాలా ఏళ్లుగా ఆలయం లోపల వీడియో చిత్రీకరణ, పోటోలు పై నిషేధం విధించారు. అయితే ఇప్పుడు మంగ్లీ ఆ ప్రాంతాల్లో పాటను షూట్ చేయడం వివాదానికి తెరలేపింది. మంగ్లీ పాటకు ఎవరు అనుమతి ఇచ్చారు అన్నదానిపై వివాదం లేచింది. భక్తులు లేని సమయంలో తెల్లవారుజామున ఆలయం లోపల ఈ పాట చిత్రీకరణ జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం మంగ్లీ షూట్ చేసిన శివారత్రి పాట యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది.
ఈ వివాదంలో అధికారుల పాత్ర ఎంత..?
మంగ్లీ విషయంలో ఆలయ అధికారులే సహకరించారన్న విమర్శలు వస్తున్నాయి. సాయంత్రం 6 గంటలకు రాహు, కేతు పూజలు ముగిసిన తర్వాత మండపాన్ని సాధారణంగా మూసివేస్తూ ఉంటారు. మంగ్లీ డాన్స్ చిత్రీకరణ కోసం ఆ తర్వాత కూడా ప్రత్యేకంగా మండపాన్ని తెరిచి ఉంచారని, భక్తులు వెళ్లిపోయిన తర్వాత ఆమెకు వెసులుబాటు ఇచ్చి ఉంటారని భావిస్తున్నారు. అయితే మంగ్లీ వీడియో పై ఇంకా ఆలయ అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదు. ఎందుకు మంగ్లీకి అంతటి వెసులుబాటు ఇచ్చారు..?, ఎవరి ఒత్తిడి దాని వెనుక ఉంది..? అన్న దానిపైన చర్చ నడుస్తోంది. ఈ విషయంపై మంగ్లీ కి రాష్ట్ర దేవాదాయశాఖ నుంచి అనుమతులు పొందినట్లు సమాచారం. శ్రీకాళహస్తి ఆలయంలో పాట చిత్రీకరణకు రాష్ట్ర దేవాదాయశాఖ జీఓ విడుదల చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆమెకు ఎలా అనుమతి ఇస్తారంటూ.. పలువురు భక్తులు ప్రశ్నిస్తున్నారు. నిషేధం విధించిన చోట ఆమెకు పాట చిత్రీకరణకు ఎలా పర్మిషన్ ఇస్తారని భక్తులు అంటున్నారు. ఏదీ ఏమైన ఈ వ్యవహారంలో ఆలయ అధికారులకు చిక్కులు తప్పేలా లేవు.