Homeజాతీయం‘నేను భారతీయుడిని కాదు, సిక్కులు బానిసత్వాన్ని అనుభవిస్తున్నారు ’

‘నేను భారతీయుడిని కాదు, సిక్కులు బానిసత్వాన్ని అనుభవిస్తున్నారు ’

మొన్న సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరలైంది..వేలాది మంది జనం పోలీసుల బ్యారికేడ్స్ ను తొలగించుకుని పోలీసు స్టేషన్ లోకి దూసుకుపోయారు. అంత పెద్ద సంఖ్యలో కమ్ముకున్న జనానికి అడ్డుకట్ట వేయడం అక్కడి పోలీసులకు సాధ్యపడలేదు. చూస్తుండగానే జనం పోలీసులతో కుస్తీ పడి కస్టడీలో ఉన్న ఓ మత గురువును విడుదల చేయించుకుని దర్జాగా వెంట తెచ్చిన వాహనంపై ఊరేగింపుగా తీసుకుపోయారు ఆ గురువును ఫాలో చేస్తున్న మద్దతుదారులు. ఇది చూస్తే ఒకప్పటి బ్రిటిషు కాలంలో స్వాతంత్ర్య పోరాటం చేస్తున్న వారిని అరెస్ట్ చేసిన జైలులో నిర్భందిస్తే, వారి మద్దతుదారులు, ప్రజలు పోలీస్ స్టేషన్‭ను ముట్టడించి వారిని విడుదల చేసినట్లుగా కనిపించడం లేదూ..ఇవన్నీ మనం పుస్తకాల్లో చదివే ఉంటాం. పంజాబ్ రాష్ట్రంలో సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. తనను తాను దైవదూతగా ప్రకటించుకున్న మత బోధకుడి అనుచరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అంతే, అతడి మద్దతుదారులు గంటల్లోనే పోలీస్ స్టేషన్ ముట్టడించి అతడిని విడుదల చేశారు.

రాష్ట్రంలోని అమృత్‭సర్ పట్టణంలో గురువారం ఈ ఘటన వెలుగు చూసింది. కాగా, దీనికి సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ విషయమై అమృత్‌సర్ పోలీస్ కమిషనర్ జస్కరన్ సింగ్ స్పందిస్తూ “లవ్‌ప్రీత్ తూఫాన్ అనే ఆ వ్యక్తి నిర్దోషి అనీ.. అతడి మద్దతుదారులు అందుకు తగిన సాక్ష్యం ఇచ్చారనీ, తాము ఏర్పాటు చేసిన సిట్ఇప్పటికే పరిశీలించిందని వివరణ ఇచ్చారు. కొద్ది సమయంలోనే పరిస్థితులు అదుపులోకి వస్తాయి. చట్టం తన పని తాను చేసుకుంటుంది అంటూ చెప్పుకొచ్చారు. నిజానికి అక్కడేం జరుగుతోందంటే..మరోసారి ఖలిస్తాన్ ఉద్యమాన్ని వెలుగులోకి తీసుకువస్తున్నారు. సదరు ఖలిస్తాన్ భావజాలం కలిగిన అమృతపాల్ సింగ్ నాయకత్వం వహిస్తున్న ‘వారిస్ పంజాబ్ దే’ అనే సంస్థకు చెందిన వ్యక్తి లవ్‌ప్రీత్ తూఫాన్. కాగా, లవ్‌ప్రీత్‭ను విడుదల చేయకుంటే తుపాకులు, కత్తులతో సాయుధులైన వందలాది మంది అజ్నాలా పోలీస్ స్టేషన్‌ను ముట్టడిస్తారని హెచ్చరించారు.

అమృతపాల్ డిమాండ్ చేశారు. అన్నట్లే అది జరిగిపోయింది. అయితే అప్పటికే సిట్ దర్యాప్తు ముగించి లవ్‌ప్రీత్‭ను నిర్దోషిగా తేల్చారు పోలీసులు. అంటే తమ తప్పును ఒప్పుగా మార్చుకునేందుకు చట్టాన్నే బెండ్ చేసారు. నిజానికి ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి కొట్టిన కేసులో లవ్‌ప్రీత్‭ను పోలీసులు అరెస్ట్ చేశారు. ‘‘రాజకీయ ఉద్దేశ్యంతో మాత్రమే ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. వారు కేసును 1 గంటలో రద్దు చేయకపోతే, తదుపరి ఏమి జరిగినా దానికి అడ్మినిస్ట్రేషనే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అంటూ అమృతపాల్ సింగ్ ప్రభుత్వాన్ని నేరుగా హెచ్చరించడం చూస్తే పంజాబులో ప్రభుత్వం పనితీరును అంచనా వేసుకోవచ్చు. పైగా ఆపరేషన్ బ్లూ స్టార్ కోసం అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌లోకి సైన్యాన్ని పంపినందుకు మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీని ఆమె అంగరక్షకులే హత్య చేసినట్లు, అమిత్ షాకు కూడా అదే గతి పడుతుందని అమృతపాల్ సింగ్ ఇంతకు ముందు బెదిరింపులకు పాల్పడ్డట్టు తెలుస్తోంది.

‘‘ఖలిస్తాన్ ఉద్యమాన్ని ఉధృతం చేయనివ్వబోమని అమిత్ షా అన్నారు. ఇందిరా గాంధీ కూడా అదే చేశారని నేను గుర్తు చేస్తున్నాను. మీరు కూడా అలాగే చేయాలనుకుంటే దానికి తగిన పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది’’ అని అన్నారు. ఇక దేశంలో ‘హిందూ రాష్ట్రం’ డిమాండ్‌ వస్తున్న నేపథ్యంలో ఖలిస్తానీ ఉద్యమంపై చేస్తున్న హెచ్చరికల్నే హిందూ రాష్ట్రం డిమాండ్ చేస్తున్న వారితో చేస్తే అమిత్ షా ఎంతకాలం హోంమంత్రిగా ఉంటారో చూస్తామంటూ అమృతపాల్ సింగ్ అన్నారు. ఇంతకూ ఎవరీ అమృపాల్ సింగ్? ఏడాది క్రితం వరకు అమృతపాల్ ఎవరికీ తెలియదు. అందరిలాంటి ఓ సాధారణ వ్యక్తి. ఇప్పుడు నిండైన తలపాగాలో కనిపిస్తున్న అతడు, ఇంతకు ముందు తలపాగా కూడా ధరించేవాడు కాదు. చాలా రోజుల పాటు దుబాయ్‭లో నివసించాడు. సింగర్ దీప్ సిద్ధూ స్థాపించిన వారిస్ పంజాబ్ దే సంస్థలో సభ్యుడు.

అయితే దీప్ సిద్ధూ మరణం అమృతపాల్ జీవితాన్ని మార్చేసింది. సంస్థ అనుచరులకు మార్గనిర్దేశం చేసేవారు లేకపోవడాన్ని అవకాశంగా తీసుకున్న అమృతపాల్.. తనను తాను వారిస్ పంజాబ్ దే సంస్థ అధినేతగా ప్రకటించుకున్నాడు. మొదట్లో సిద్ధూ కుటుంబీకులు ఇందుకు అంగీకరించలేదు. కానీ, అమృత్‌పాల్ అవన్నీ పట్టించుకోకుండా తన పని చేసుకుంటూ వెళ్లాడు. క్రమంగా పంజాబ్‭లో పాపులర్‌ అయ్యాడు. తాజాగా జరిగిన ఘటనతో మొత్తం దేశ వ్యాప్తంగా అమృతపాల్ పేరు మారుమోగిపోతోంది. తన అనుచరుడు లవ్‌ప్రీత్‌ తుఫాన్‌ అరెస్టును వ్యతిరేకిస్తూ వందల మంది కత్తులతో పోలీస్ స్టేషన్ మీదకు దాడికి వెళ్లడం దేశంలో సంచలనంగా మారింది. ఈ దాడికి పోలీసులే భయపడి తుఫాన్ విడుదలకు ఆదేశాలు జారీ చేశారంటే అక్కడ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే అమృతపాల్ తక్కువ కాలంలో ఇంత పెద్ద మొత్తంలో పాపులారిటీని మద్దతును స్వీకరించడానికి కారణం, అతడు పంజాబ్ కేంద్రంగా ఖలిస్తానీ డిమాండ్‭కు అనుగుణంగా కార్యకలాపాలు నిర్వహిస్తుండడం.

ఇది పంజాబ్ రాష్ట్రంలో ఉన్న ఖలిస్తానీ సానుభూతిపరులను ఆకర్షించి, ఆయనకు మద్దతుదారులుగా తయారు చేసింది. గతంలో జరిగిన ఉద్యమ సమయంలో జర్నైల్‌ సింగ్‌ భింద్రన్‌వాలా ఎలాగైతే పాపులర్ అయ్యాడో అదే తరహాలోనే అమృపాల్ సింగ్ వ్యవహరిస్తున్నాడనే బలమైన విమర్శ అమృతపాల్ మీద ఉంది. అతడి వస్త్రధారణ, వ్యవహారశైలి, మాట తీరు అలాగే ఉంటున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం, దేశానికి వ్యతిరేకంగా వ్యవహరించడంలో భింద్రన్‭వాలాను కాపీ కొట్టినట్లు కనిపిస్తోంది. ఇక అప్పట్లో అమృత్‭సర్ పట్టణంలోని స్వర్ణదేవాలయాన్ని కేంద్రంగా చేసుకుని సమాంతర ప్రభుత్వాన్ని నడిపే ప్రయత్నం చేశారు భింద్రన్‌వాలా. ఇప్పుడు అమృతపాల్ సైతం స్వర్ణదేవాలయం కేంద్రంగానే కార్యకలాపాలు నిర్వహించాలని చూస్తున్నాడు. తుఫాన్ విడుదల కాగానే అతడిని స్వర్ణదేవాలయానికి తీసుకెళ్తానని ప్రకటించాడు.

1940లో సిక్కులకు ప్రత్యేక దేశం కావాలంటూ ఖలిస్తానీ ఉద్యమం ప్రారంభమైంది. ఖలిస్తాన్ అంటే ‘పవిత్రమైన భూమి’ అని పంజాబీలో అర్థం. తమకంటూ ఒక ప్రత్యేక మాతృభూమి కావాలనే డిమాండుతో ఇది లేచింది. అనేక సిక్కు సంఘాలు దీని కోసం పోరాటాలు చేశాయి. చాలా సార్లు హింస చెలరేగింది కూడా. ఇక అప్పటి నుంచి ఎన్నో మలుపులు తీసుకుంటూ 1970-80ల ప్రాంతంలో తీవ్ర స్థాయికి వెళ్లింది. కరుడుగట్టిన ఖలిస్తానీ నేత జర్నైల్‌ సింగ్‌ భింద్రన్‌వాలా..

అమృత్‭సర్ పట్టణంలోని స్వర్ణదేవాలయం కేంద్రం సమాంతర ప్రభుత్వాన్ని నడిపే ప్రయత్నం చేశాడు. అక్కడి నుంచే అన్ని సెటిల్‭మెంట్లు చేసేవాడు. అయితే 1984 జూన్ 1 నుంచి 10 వరకు జరిగిన ఆపరేషన్ బ్లూ స్టార్‎లో భాగంగా.. గోల్డెన్ టెంపులో నక్కిన ఖలిస్తానీ ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది. ఇందులో భాగంగా జూన్ 6న జవాన్ల ఎదురుకాల్పుల్లో ఖలిస్తానీ ఉగ్రవాద నాయకుడు భింద్రన్‌వాలా హతమయ్యాడు. ఈ ఘటన అనంతరం ప్రధానమంత్రి ఇందిరా గాంధీని ఆమె అనుచరుల్లో భాగంగా ఉన్న ఖలిస్తానీ సానుభూతిపరులు మట్టుబెట్టారు.

దీనికి ప్రతిగా సిక్కులపై మారణహోమం జరిగింది. ఆ తర్వాత ఖలిస్తానీ ఉద్యమం చల్లబడింది. మళ్లీ ఇన్నాళ్లకు లేచినట్టే కనిపిస్తోంది. అయితే ఇది ఎంత వరకు వెళ్తుందనేది చూడాలి. ఖలిస్తానీ ఉద్యమం.. పంజాబీ ప్రాంతాన్ని ప్రత్యేక దేశంగా గుర్తించాలంటూ సాగుతోన్న ఉద్యమం. కొన్ని దశాబ్దాల క్రితం ఉదృతంగా సాగిన ఈ ఉద్యమం భింద్రన్‭వాలా మరణం అనంతరం చల్లబడింది. ఇక ఇందిరా గాంధీ హత్య అనంతరం జరిగిన సిక్కుల ఉచకోత తర్వాత పెద్దగా చర్చలో లేకుండా పోయింది. అప్పుడప్పుడు ఎక్కడో ఒకచోట ఖలిస్తాన్ నినాదాలో, సానుభూతిపరుల చర్యలో కనిపించినప్పటికీ అవంత పెద్దగా చెప్పుకునేవి అయితే కావు. ఇక పంజాబీ రాజకీయ పార్టీలు, నేతలు కూడా ఖలిస్తాన్ అంశాన్ని పక్కన పెట్టేశారు. మళ్లీ ఇంత కాలానికి ఈ నినాదం చర్చలోకి వచ్చింది. కెనడా కేంద్రంగా ఈ ఉద్యమం మరోసారి బలపడుతున్నట్లుగానే కనిపిస్తోంది.

Must Read

spot_img