- ఆదాయం, పొదుపులో క్షీణత కామన్ గా మారిందా..?
- లోకల్ సర్కిల్స్ సర్వేలో .. ఈ అంశం వెల్లడైందా..?
- ఇంతకీ ఈ క్షీణతకు కారణమేంటి..?
- దీనిపై ఆయా కుటుంబాలు ఏం చేస్తున్నాయి..?
అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి. అయితే ఈ పొదుపు క్షీణత .. కుటుంబ ఆదాయాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోందన్న వాదన మాత్రం వాస్తవమేనని నిపుణులు సైతం స్పష్టం చేస్తున్నారు.. కరోనా దెబ్బకు తక్కువ ఆదాయ వర్గాలు తీవ్ర ఇబ్బందులు పడ్డాయి.. దీంతో సుమారు 60 శాతం కుటుంబాలు క్షీణ పరిస్థితుల్ని ఎదుర్కొన్నారనితాజా సర్వేలు తేల్చి చెబుతున్నాయి.
ఇంతకీ ఎందుకు ఆదాయ క్షీణత జరుగుతోంది..? దీనిపై నిపుణులు ఏమంటున్నారు..? దీనికి కారణాలతో పాటు ప్రభావం ఏమిటన్నదే ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 60 శాతం కుటుంబాలు ఆదాయం, పొదుపులో క్షీణతను ఎదుర్కొంటున్నాయని కమ్యూనిటీ సోషల్ మీడియా ప్లాట్ ఫాం లోకల్ సర్కిల్స్ సర్వేలో తేలింది.
56 శాతం పొదుపులో తగ్గుదలని ప్రస్తావించగా.. సగం కంటే ఎక్కువ కుటుంబాలు ఆదాయంలో క్షీణతను ఎదుర్కొంటున్నట్లు పేర్కొంది. మరో ఏడాది వరకు ఆర్థిక అనిశ్చితి కొనసాగుతుందని 52 శాతం మంది అభిప్రాయపడ్డారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఆదాయం, పొదుపుల్లో భారీ తగ్గుదల ఉన్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా 25 శాతం కుటుంబాలు ఆదాయం పెరిగినట్లు, 7 శాతం మందికి ఎటువంటి మార్పు లేనట్లు చెప్పారు.
కొవిడ్ సంక్షోభం కారణంగా తక్కువ ఆదాయం, అధిక ఖర్చుల వల్ల భారతీయ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నట్లు సర్వే పేర్కొంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం వల్ల కుటుంబ అవసరాలు తీర్చుకోవడానికి సైతం ఏడాదిగా పరిస్థితులు సహకరించలేదని వెల్లడించింది. కొత్తగా ప్రవేశపెట్టనున్న బడ్జెట్ మీద ప్రజలు భారీగా ఆశలు పెట్టుకున్నట్లు తెలిపింది. కూరగాయలు, పప్పులు, నూనె, పాలు సహా ఇతర నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగినందున.. భారతీయ కుటుంబాల ఆదాయం, పొదుపులను అర్థం చేసుకోవడానికి లోకల్ సర్కిల్స్ సర్వే నిర్వహించింది. తమ ఇంటి ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టుకునేందుకు ప్రజలు ఎలా ప్లాన్ చేసుకుంటున్నారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించింది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, పలు దేశీయ, అంతర్జాతీయ అంశాల వల్ల నిత్యావసరాల ధరలు పెరిగినట్లు పలువురు అభిప్రాయపడ్డారు. ఉద్యోగాలు కోల్పోవడం, లే ఆఫ్ లు మధ్యతరగతి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల తరహా ఇతర అలవెన్సులు ప్రైవేట్ వారికి అందవు కాబట్టి పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో కుటుంబ ఆదాయాలు సరితూగవని అభిప్రాయపడుతున్నారు.
ఒకటో తారీకు ఎప్పుడొస్తుందా! అని నెలంతా ఎదురుచూస్తాం.. తీరా అది అలా వచ్చి ఇలా వెళ్లిపోతుంది.. మా కష్టాలు మాత్రం అలాగే ఉండిపోతాయి.. ఓ తెలుగు సినిమా డైలాగ్ ఇది.. ఇప్పుడు దేశంలోని వేతన జీవుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది.
అసలే అంతూపొంతూ లేకుండా పెరిగిపోతున్న నిరుద్యోగంతో కోట్ల మంది యువత, తమ స్థాయికి కాకపోయినా.. ఏదో ఒక పని ఇచ్చినా చేస్తామని తిరుగుతున్నారు.. ఇక ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్నవారి పరిస్థితి కూడా నిరుద్యోగులలానే తయారయ్యిందని పలు ఆర్థిక నివేదికలు చెప్తున్నాయి.
పేరుకు ఉద్యోగం చేస్తున్నా.. కనీస అవసరాలు తీర్చుకొనేందుకు కూడా జీతం రాళ్లు సరిపోవటంలేదని వేతన జీవులు వాపోతున్నారు. తాము అధికారం చేపట్టిన ఈ ఎనిమిదేండ్లలో దేశ జీడీపీని అమాంతం పెంచామని, ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చామని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పెద్దలు అంటున్నారు.
భారత్‌ను ధనిక దేశంగా మార్చేశామని ఊదరగొడుతున్నారు.. మరి దేశం ధనవంతమైతే మా జీతాల్లో కోతలెందుకు పడుతున్నాయని ఉద్యోగులు బుర్రలు గోక్కుంటున్నారు. దేశంలో వేతనాల రూపేణా కుటుంబాలకు వస్తున్న ఆదాయంలో వృద్ధిరేటు భారీగా తగ్గినట్టు పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వే వెల్లడించిన గణాంకాలు వేతన జీవుల వెతలకు అద్దం పడుతున్నాయి.
దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతుండగా, వేతనాలు నానాటికీ తగ్గిపోతున్నాయి. 2012-16 మధ్యలో 8.2% ఉన్న వేతనాల వృద్ధిరేటు.. 2017-21లో 5.7 శాతానికి తగ్గినట్టు పీఎల్‌ఎఫ్ తేల్చింది. పెరిగిన ద్రవ్యోల్బణాన్ని కూడా పరిగణనలోకి తీసుకొంటే ఈ వృద్ధిరేటు మరో 1%తక్కువగా ఉంటుందని స్పష్టంచేసింది. పట్టణాల్లో 5.5% ఉన్న వేతన వృద్ధిరేటు.. గ్రామాల్లో 2.8 శాతానికే పరిమితమైనట్టు తెలిపింది.
- కరోనాతో మధ్యతరగతిలో ఉన్న చాలా కుటుంబాలు.. ఒక్కసారిగా పేద వర్గంలోకి జారిపోయాయి.
ప్రస్తుత ద్రవ్యోల్బణానికి సర్దుబాటు చేశాక ఈ వృద్ధిరేట్లు ప్రతికూలంగా మారి గ్రామీణ ప్రాంతా ల్లో మైనస్ 3.7 శాతానికి, పట్టణ ప్రాంతాల్లో -1.6 శాతానికి పతనమైనట్టు పేర్కొన్నది. ఏ దేశంలోనైనా ప్రజల ఆదాయం, కొనుగోలు శక్తి పెరిగినప్పుడే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుంది. కానీ, మన దేశంలో అలాంటిదేమీ జరగలేదు. పైగా ద్రవ్యోల్బణం భారీగా పెరగడం వల్ల ప్రజల కొనుగోలు శక్తి దారుణంగా తగ్గింది. అయినా ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందిందని మోదీ సర్కార్ చెబుతోంది.
కుటుంబాల ఆదాయ వివరాలను అంచనా వేసేందుకు పరోక్షంగా దోహదపడే వినియోగదారుల వ్యయ సర్వేలను కేంద్రం చాలాకాలం గా ప్రచురించడంలేదు. తమ వైఫల్యాలు బయటపడతాయోనన్న భయమే ఇందుకు కారణమని నిపుణులు అంటున్నారు. అయినా శ్రామి కవర్గంలోని మూడు తరగతుల ఆదాయన్ని అంచనా వేసేందుకు పీఎల్‌ఎఫ్‌ఎస్ ఉపకరిస్తున్నాయి. 2020-21కి పీఎల్‌ఎఫ్‌ఎస్ వార్షిక నివేదిక ఈ ఏడాది జూన్‌లో ప్రచురితమైంది.
దీని ప్రకారం.. గ్రామాల్లో 55% మంది స్వయం ఉపాధితోనే జీవనం సాగిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది వ్యవసాయపైనే ఆధారపడుతున్నారు. మిగిలినవారిలో 24% రోజువారీ వేతనాలతో, 13% రెగ్యులర్ వేతనాలతో, 8% ఇతర రాబడితో జీవిస్తున్నారు. పట్టణాల్లో 33% స్వయం ఉపాధి, 48% రెగ్యులర్ వేతనాలతో, 13% క్యాజువల్ వేతనలతో, 12% మంది ఇతర రాబడితో జీవిస్తున్నారు.
ఈ మూడు తరగతుల కుటుంబాల సగటు సంపాదన కూడా అంతంతమాత్రంగానే ఉన్నట్టు పీఎల్‌ఎఫ్‌ఎస్ నివేదికలోవెల్లడైంది. పట్టణాల్లో పురుష కార్మికులు మాత్రమే నెలకు సగటున రూ.21 వేల వేతనం పొందుతున్నారని, ఇతర వర్గాల కార్మికులకు గౌరవప్రదమైన వేతనం లభించడం లేదని వెల్లడించింది.
గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ఉపాధికి ఎక్కువగా ఆధారపడుతున్న వ్యవసాయ రంగంలో నెలకు సగటున పురుషులు రూ.10,228, మహిళలు కేవలం రూ.4,561 సంపాదిస్తున్నట్టు తెలిపింది. భారతదేశంలో ఇటీవల ఓ సంస్థ వివిధ ప్రాంతాల్లో సర్వే నిర్వహించింది. కుటుంబ ఆదాయమెంత? ఏ ఆదాయ వర్గంలో ఉన్నారో వంటి వివరాలు సేకరించింది. అయితే ఈ సర్వేలో 50శాతం మందికి పైగా తమను తాము మధ్యతరగతి కుటుంబాలుగా చెప్పుకున్నారు.
అయితే ఇందులో 90శాతానికి పైగా మధ్యతరగతి వర్గానికి చెందిన వారు కాదు. వారు పేదరికం లేదా తక్కువ ఆదాయవర్గానికి చెందిన వారు. మధ్యతరగతి అంటే వారి కుటుంబ తలసరి ఆదాయం నెలకు 300 నుంచి 600 డాలర్లు ఉండాలి. అంటే కనీసం నెలకు రూ.23 వేల నుంచి 45వేల రూపాయలు సంపాదించాలి. అప్పుడే వారు మధ్య తరగతి వర్గంలోకి వస్తారు. సర్వే ప్రకారం.. ప్రతి రోజు 10 నుంచి 20 డాలర్లు సంపాదించే కుటుంబం, అంటే రూ.700 నుంచి రూ.1400 వరకు సంపాదించే కుటుంబాన్ని మధ్యతరగతిగా అభివర్ణించింది. దీని ప్రకారం చూసుకుంటే కేవలం రెండుశాతం కుటుంబాలు మాత్రమే మధ్యతరగతి పరిధిలోకి వస్తాయి. అయితే భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందినప్పుడు పేద ప్రజలు తక్కువ ఆదాయమున్న వర్గానికి మారారు తప్ప.. మధ్యతరగతి వర్గంలోకి రాలేదు.
కానీ తక్కువ ఆదాయ వర్గంలోని చాలా తక్కువ మంది మాత్రమే మధ్య ఆదాయ వర్గంలోకి మారారు. 2020 ఆక్స్‌ఫామ్ రికార్డుల ప్రకారం.. దేశంలోని ఒక శాతం ధనికుల వద్ద 42.5 దేశ సంపద పోగుబడి ఉంది. 50శాతం ప్రజల వద్ద కేవలం 2.8శాతం మాత్రమే సంపద ఉంది. కొవిడ్ మహమ్మారి తర్వాత లక్షలాది మంది మధ్యతరగతి ప్రజలు పేదరికంలో లేదా తక్కువ ఆదాయ వర్గంలోకి వెళ్లిపోయారు.
కరోనాతో ఉపాధి లేమి గణనీయంగా పెరిగింది. దీంతో అప్పటివరకు మధ్యతరగతిలో ఉన్న చాలా కుటుంబాలు.. ఒక్కసారిగా పేద వర్గంలోకి జారిపోయాయి. అయితే కరోనా తర్వాత కూడా పరిస్థితుల్లో మార్పులు రాకపోవడమే ఆదాయ క్షీణతకు కారణమని నిపుణులు అంటున్నారు.