Homeఅంతర్జాతీయంసాఫ్ట్వేర్ ఉద్యోగులకు షాక్..

సాఫ్ట్వేర్ ఉద్యోగులకు షాక్..

మరో దిగ్గజ టెకీ సంస్థ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది.. ఏకంగా 3వేల 900 మందిని ఇంటికి సాగనంపింది. అది మరేదో కంపెనీ కాదు. ప్రపంచవ్యాప్తంగా బాగా పాపులర్ అయిన ఐబీఎంలో ఈ ఉద్వాసనలు జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా టెక్ దిగ్గజ సంస్థలన్నీ లేఆఫ్ బాట పడుతుండటం ఉద్యోగుల్లో కలవరానికి గురిచేస్తోంది. గూగుల్ 12వేల మంది ఉద్యోగులను తొలగించింది. ఇప్పుడు ఐబీఎం లాంటి సంస్థ కూడా గూగుల్ బాటే పట్టింది. నాలుగో త్రైమాసికంలో ఆదాయ అంచనాలను అధిగమించినందుకు IBM సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థ భారీగా నష్టపోయిందని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐబీఎం తెలిపింది. మెటా, గూగుల్, ట్విటర్, మైక్రోసాఫ్ట్‌లతో పాటు ఇప్పుడు ఐబీఎం కూడా తాజాగా భారీ ఉద్యోగాల కోతలో చేరింది.

వాల్ స్ట్రీట్ జర్నల్ ఆర్థిక వ్యవస్థ గురించి ఆందోళనలు, సంభావ్య మాంద్యం ఆలస్యమైనందున ఖర్చులో మందగమనం కారణంగా సాంకేతిక కంపెనీలు పెద్దగా ప్రభావితమయ్యాయని పేర్కొంది. దీని ఫలితంగా లేఆఫ్ లు జరగుతున్నట్లు వివరించారు. దీనిపై వైట్ హౌస్ స్పందించింది. ఉద్యోగాల కోత ప్రభావాన్ని వాషింగ్టన్ అర్థం చేసుకుంటుందని, అమెరికా ఆర్థిక వ్యవస్థ స్థిరంగా వృద్ధి చెందుతోందని పేర్కొంది. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీనా జీన్-పియర్ మాట్లాడుతూ.. “మన ఆర్థిక వ్యవస్థ స్థిరమైన.. పద్ధతిలో వృద్ధి చెందుతూనే ఉంది. ఉద్యోగుల తొలగింపులపై డేటా సేకరిస్తున్నట్లు వివరించారు.

మరింత వేగంగా జరుగుతున్న లే-ఆఫ్స్.. మాంధ్యం దెబ్బకు ఐటీ రంగం బేజారవుతోంది. ..లక్షల సంఖ్యలో జాబ్స్ కోల్పోతున్న టెకీల జీవితం అయోమయంలో పడింది. ప్రపంచ ఆర్థికవేత్తలు ఊహించినట్టుగానే అమెరికా ఆర్థిక మాంధ్యంలో కూరుకు పోతోంది. అమెరికాలో మొదలైన ఆర్థిక మాంధ్యం ఇతర దేశాలపైనా, ఇతరత్రా రంగాల మీద ఏ మేరకు ప్రభావం చూపుతుందో కానీ టెక్ కంపెనీల మీద మాత్రం పెను ప్రభావాన్ని చూపుతోంది. అయితే ఈ కంపెనీలేమైనా నష్టపోయాయా అంటే అదీ లేదు. ఇప్పటికే లక్షల కోట్ల లాభాలు అర్జించాయి. అయితే ఆ లాభాలలో తరుగుదల ఉండొద్దని పొదుపు చర్యలు చేపడుతున్నాయి.

ప్రస్తుతం మాత్రం ఆర్థిక మాంద్యం సాకుతో ప్రధాన టెక్ కంపెనీలు వేలం వెర్రిగా వేలాది సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. ఇందులో వేల కోట్ల డాలర్ల బిజినెస్ చేసే ఫేస్‌బుక్, మెటా, అమెజాన్ మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీలు ఉండగా తాజాగా రిసెషన్ దరి చేరదనుకున్న గూగుల్ సంస్థ కూడా వేల సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు కార్యక్రమానికి పూనుకుంది. గూగుల్ మాతృ సంస్థగా భావించే ఆల్ఫాబెట్ కూడా లే- ఆఫ్ ప్రకటించింది. ఈ పరిణామాలను పరిశీలిస్తున్న ఆర్థికవేత్తలు అమెరికాలో మొదలైన ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ పలు ప్రపంచ దేశాలకు విస్తరించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

సత్యనాదెళ్ళ లాంటి వారైతే ఆర్థిక మాంధ్యం ప్రభావం 2023 జూన్, జులైదాకా వుండే అవకాశం వుందంటున్నారు. ఆర్థిక మాంద్యం ఒక్క టెక్ కంపెనీలపైనే కాకుండా అన్ని రంగాలను తీవ్రంగా ప్రభావితం చేసే ప్రమాదం ఉందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ మాంద్యం తొలుత ఐటి కంపెనీల మీద ప్రభావం చూపుతుండగా మెల్లిగా మాంధ్యం ప్రభావం ఇతర రంగాలపై కూడా చూపే అవకాశం ఉందంటున్నారు.

2022 జనవరి నుంచి అమెరికాలో పలుటెక్ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించడం ప్రారంభించాయి. నవంబర్ నుంచి ఉద్యోగాల తొలగింపు ఊపందుకుంది. 2023 జనవరి మొదటి వారంలో ఈ ప్రక్రియ మరింత జోరందుకుంది. జనవరి ఒకటవ తేదీ నుంచి 24వ తేదీ మధ్యకాలంలో రోజుకు సగటున 3 వేల మంది ఐటీ ఉద్యోగులు తమ జాబ్స్ కోల్పోయారని అంచనా. మొత్తమ్మీద 166 ఐటీ కంపెనీలు 65 వేల మందికిపైగా ఉద్యోగులను ఇప్పటివరకు తొలగించినట్లు సమాచారం . వీరంతా ఆరు నెలల్లోగా కొత్త ఉద్యోగం వెతుక్కోవాలి.

లేదంటే అమెరికా లాంటి దేశంలో ఉండేందుకు అర్హత కోల్పోతారు. ఆ సమస్య ఇప్పుడు ఉద్యోగులను వేదిస్తోంది. వీరిలో అత్యధికులు భారతీయులు కాగా అందులో తెలుగువారే అత్యధిక సంఖ్యలో కనిపిస్తున్నారు. అంటే అమెరికాలో మొదలైన ఈ ఆర్థిక మాంధ్యం ప్రభావం మెల్లిగా తెలుగు రాష్ట్రాలకు పాకే ప్రమాదం కనిపిస్తోంది.

  • అమెరికాలో పనిచేస్తున్న టెకీలలో చాలామంది హెచ్1బీ వీసాలపై కొనసాగుతున్న వారే..

ఈ వీసాలపై కొనసాగుతున్న వారిలో ఉద్యోగాలు కోల్పోయిన వారు మనం ముందు చెప్పుకున్నట్టుగా 60 రోజులలోగా మరో ఉద్యోగంలో చేరకపోతే వారి వీసాలు పనిచేయకుండా పోతాయి. ఫలితంగా వారు ఇండియాకు తిరిగి రావాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుంది. ఇంకా ఉద్యోగాలు పోని వారికీ భయం వెంటాడుతోంది. ఐటీ కంపెనీలలో ఇంకా పనిచేస్తున్నవారి మెడపై కత్తులు వేలాడుతున్నాయి. ఏ క్షణాన ఏ వార్త వినాల్సి వస్తుందోనని అందరూ భయం భయంగా ఉన్నారు.

ఏ క్షణంలో పింక్ స్లిప్పు వస్తుందో, ఏ మెయిల్ ఉన్నపళంగా ఊడగొడుతుందోనని వారంతా భయపడుతున్నారు. వర్క్ ఫ్రొం హోమ్‌తో దాదాపు మూడేళ్ళుగా రిలాక్స్డ్‌గా ఫీలవుతున్న టెకీలు ఇప్పుడు ఆర్థిక మార్గం దెబ్బతో విపరీతమైన టెన్షన్ కు గురవుతున్నారు. దాంతో దిగ్గజ కంపెనీలలో పనిచేస్తున్న వారు కూడా తమకు ఉద్యోగ భద్రత లేదని వాపోతున్నారు. భవిష్యత్తులో ఆర్థిక మాంధ్యం మరింత తీవ్ర రూపం దాల్చే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్న ఐటీ కంపెనీలు వీలైనంతవరకు కాస్ట్ తగ్గించుకునే ప్రయత్నాలు తీవ్రతరం చేశాయి. అందుకే ఉద్యోగులను తొలగిస్తున్నాయి.

ఖర్చులను తగ్గించుకునే పనిలో, వ్యయ నియంత్రణలో భాగంగా ఉద్యోగుల కుదింపు ప్రధాన అంశంగా టెక్ కంపెనీలకు కనిపిస్తోంది. ఇన్నాళ్లు ఉద్యోగుల సేవలను వినియోగించుకొని కోట్లు కొల్లగట్టిన ఐటీ సంస్థలు ఇప్పుడు ఉద్యోగుల భవిష్యత్తును ప్రశ్నార్థకంలో పడేస్తూ తమ కంపెనీల బాగోగులకు మాత్రమే ప్రాధాన్యతనిస్తున్నాయి. ఆయా దిగ్గజ కంపెనీల ఎదుగుదలలో తాము భాగస్వాముల మైనప్పటికీ ఇప్పుడు తమ భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందని అమెరికాలోని పలు కంపెనీలలో పని చేస్తున్న భారతీయులు కలవరం చెందుతున్నారు. 2020, 21 సంవత్సరాలలో యావత్ ప్రపంచం కరోనా కాటుకు గురైంది. నెలల తరబడి వ్యాపార లావాదేవీలు నిలిచిపోవడంతో చాలా కంపెనీలు ఆర్థికంగా కూదేలయ్యాయి.

అయితే పూర్తిస్థాయిలో తమ కంపెనీలు దెబ్బతినకుండా చూసుకునేందుకు.. ఆల్మోస్ట్ అన్ని ఐటీ కంపెనీలు ఉద్యోగులను వెంటనే తొలగించేయకుండా వారందరినీ వర్క్ ఫ్రం హోం చేయించాయి. . తాజాగా 2022 సంవత్సరం మొదటి భాగం నుంచి కరోనా కనుమరుగవ్వడం, తమ వ్యాపార లావాదేవీలు మాత్రం సాధారణ స్థాయికి చేరుకోకపోవడంతో కాస్ట్ కటింగ్‌పై దృష్టి సారించాయి.టెక్ కంపెనీలు. కరోనా కారణంగా ప్రజలు, కంపెనీల కొనుగోలు శక్తి తగ్గిపోవడంతో టెక్ కంపెనీలకు రాబడులు తగ్గిపోయాయి. దాంతో కాస్ట్ కటింగ్‌లో భాగంగా ఉద్యోగుల తొలగింపునకే కంపెనీలు ప్రాధాన్యమిస్తున్నాయి.

2022 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా 965 కంపెనీలు మొత్తం మీద లక్షన్నర మoది ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. గత నవంబర్ నుంచి ఇప్పటివరకు అంటే కేవలం మూడు నెలల కాలంలో దాదాపు రెండు లక్షల మందికి పైగా ఉద్యోగులు తమ జాబ్స్ కోల్పోయారని డేటాబేస్ ప్రకటించింది. జరుగుతున్న పరిణామాలను చూస్తే వచ్చే ఆరు నెలల కాలం మరింత గడ్డు కాలమని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రముఖ ఐటీ కంపెనీలన్నీ ఉద్యోగుల సంఖ్యకు కోతపెట్టే పనిలో పడ్డాయి. రెండు నెలల క్రితం ట్విట్టర్‌ని పూర్తిస్థాయిలో టేకోవర్ చేసిన ఎలాన్ మస్క్.. వచ్చి రావడంతోనే 12 వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించారు. ట్విట్టర్‌తో పాటు మెటా, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి కంపెనీలు ఉద్యోగులను తగ్గించుకుంటున్నాయి.

ఈ దిగ్గజ కంపెనీలతోపాటు చాలా ఐటీ సంస్థలు కూడా ఉద్యోగుల కుదింపునకు పూనుకున్నాయి. ఇటీవల భారత దేశ పర్యటనకు వచ్చిన మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్ల ఈ సంవత్సరం జూన్, జూలై నాటికి ఆర్థిక మాంధ్యం చాలా దేశాలపై పెను ప్రభావాన్ని చూపనుందని హెచ్చరించారు. ఇదే జరిగితే దీని ప్రభావం భారతదేశంలో ఎలా ఉంటుందన్న భయాందోళన ఇప్పుడు మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా ఐటీ శకం మొదలయ్యాక లక్షలాదిమంది తెలుగు టెకీలు అమెరికాతో పాటు పలు దేశాలకు వలస పోయారు.

ప్రస్తుతం దిగ్గజ ఐటీ కంపెనీలలో ఉద్యోగాలు కోల్పోయిన వారిలో దాదాపు 40 శాతం వరకు భారతీయ ఐటీ ప్రొఫెషనల్ ఉన్నట్టు ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దాదాపు 80వేల మందికి పైగా భారతీయులు ఇప్పటివరకు ఉద్యోగాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఇందులో 60 శాతం తెలుగు ప్రజలు ఉన్నారని చెప్పుకుంటున్నారు. ఇదే నిజమైతే ఇప్పుడు వారంతా తమకక్కడ వేరే ఉద్యోగాలు దొరక్కపోతే, తమ స్వస్థలాలకు తిరిగి రావాల్సిన పరిస్థితి వస్తే ఏమిటన్న ఆందోళన సర్వత్రా వినిపిస్తోంది.

Must Read

spot_img