HomePoliticsఓవైపు షిండే వర్గం, మరోవైపు థాక్రే వర్గం ..

ఓవైపు షిండే వర్గం, మరోవైపు థాక్రే వర్గం ..

  • మహా రాజకీయాల్లో శివసేన ప్రస్థానం అందరికీ తెలిసిందే.
  • అయితే ఇప్పుడీ పార్టీ .. చీలికపేలికలు కానున్న వేళ .. పార్టీ గుర్తు ఎవరికి చెందనుందన్నదే చర్చనీయాంశంగా మారుతోంది.
  • శివసేన ఎవరిది..
  • బాల్ ఠాక్రే వారసుడైన ఉద్దవ్ ఠాక్రే దా.. లేక బాలసాహెబ్ అనుచరుడైన ఏక్ నాథ్ షిండే దా.. ?
  • ఇప్పుడీ అంశం కోర్టులో ఉన్నప్పటికీ దీనిపై న్యాయ నిపుణుల వాదనలు .. చర్చోపచర్చల్ని రేకెత్తిస్తున్నాయి.

మహా రాజకీయాల్లో మహాప్రస్థానమున్న మహాపార్టీ.. అయితే ఇదంతా గతం.. ఇప్పుడా పార్టీ గతి ఎటు పోతుందో తెలియని పరిస్థితి. ఒకప్పుడు ప్రత్యర్థి పార్టీలకు, గ్రూపులకు వెన్నులో వణుకు పుట్టించిన శివసేన.. ఇప్పుడు అంతర్గత కుమ్ములాటలతో పరువు పొగొట్టుకుంటోంది. మహారాష్ట్రలో ఉద్ధవ్‌ థాక్రే నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత జరుగుతున్న పరిణామాలు సగటు శివసేన పార్టీ కార్యకర్తను తీవ్రంగా బాధిస్తున్నాయి.

ప్రస్తుత సీఎం ఏక్‌నాథ్ షిండే‌ వర్గం, మాజీ సీఎం ఉద్ధవ్‌ థాక్రే వర్గం మధ్య జరుగుతున్న ఇంటర్నల్‌ ఫైట్‌.. ఆ పార్టీ పరువును ఎప్పుడో ముంబై బీచ్‌లో కలిపేసింది. పార్టీ గుర్తు కోసం ఈ ఇద్దరి నేతల మధ్య జరుగుతున్న రచ్చ.. ఈసీ, సుప్రీంకోర్టు మధ్య నలుగుతోంది.

దీనిపై ఈ నెల 30న ఈసీ, ఫిబ్రవరి 14న సుప్రీంకోర్టు విచారించనుండగా.. ఈ వివాదంపై న్యాయ నిపుణులు ఏమంటున్నారన్నదే ఆసక్తికరంగా మారింది. శివసేన పార్టీ గుర్తు విల్లు, బాణం ఎవరిది? రియల్‌దా, రెబల్‌దా? అంటే, రాజకీయాల్లో ఫిరాయింపులు అసలు కొత్తే కాదు.

శివసేన చీలికకు ముందు..శివసేన చీలికకు తర్వాత కూడా ఇలాంటి ఘటనలు చాలా చూశామని నిపుణులు అంటున్నారు. భారత రాజకీయాల్లో ఫిరాయింపులు సాధారణమే. 1987-88 సమయంలో కూడా తమిళనాడులో ఇలాంటి పరిస్థితే ఏర్పడింది.

డీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీఆర్‌ మరణానంతరం జరిగిన పరిణామాలు కూడా ఇలాంటివే. అప్పుడు జయలలిత, ఎంజీఆర్‌ భార్య జానకి మధ్య అంతర్గత పోరు జరిగింది. పార్టీకి ఎవరు అధ్యక్షత వహించాలనే విషయంలో వాగ్వాదం జరిగింది.

జయలలితకు ప్రజాప్రతినిధుల మద్దతు లభించగా.. జానకికి పార్టీ బెస్‌పై పూర్తి పట్టు ఉంది. అయితే ఈ విషయంపై ఈసీ ఏం తేల్చకముందే జయలలిత, జానకి ఇద్దరూ రాజీకి వచ్చారు.

  • మహారాష్ట్రలోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది..

ఉద్ధవ్ ఠాక్రే వర్గం తామే పార్టీకి నాయకత్వం వహిస్తున్నామని.. ఎన్నికల గుర్తు తమకే దక్కాలని వాదిస్తోంది. మరోవైపు షిండే టీమ్‌ తమదే అసలైన శివసేన అని కౌంటర్‌ ఇస్తోంది. 55మంది శివసేన ఎమ్మెల్యేలలో మెజారిటీ 39 మంది తమతోనే ఉన్నారని గుర్తుచేస్తోంది. ఇదే సమయంలో రాజకీయ నాయకులు పార్టీలు మారకుండా కంట్రోల్‌ చేయడానికి ఫిరాయింపుల నిరోధక చట్టం ఉంది. అయితే మెజారిటీ ఎమ్మెల్యేలు షిండే వైపే ఉన్నారు.

అది షిండేకు పార్టీపై ఉన్న బలమే కదా అన్న వాదనపై నిపుణులు .. ఇది బలాలకు, బలహీనతలకు సంబంధించిన ప్రశ్న కాదని అంటున్నారు. క్లియర్‌కట్‌గా షిండేకు మెజారిటీ ఉంది. కానీ అదే సమయంలో, ఉద్ధవ్‌కు పార్టీ బెస్‌పై పూర్తిగా పట్టు ఉంది. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ఎన్నికల తర్వాత పార్టీ ఫిరాయింపులను నిరోధిస్తోంది. అయితే ఈ షెడ్యూల్‌కు పార్లమెంటు ద్వారా ఎప్పటికప్పుడు సవరణలు జరిగాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.

ఇక మహారాష్ట్రలో ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందుగా ఎవరూ ఊహించలేదు. అటు పదో షెడ్యూల్ ప్రకారం రెండు పరిస్థితుల్లో పార్టీ సభ్యత్వాన్ని నేతలు కోల్పోవచ్చని, అందులో ఒకటి పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకోవడం కాగా రెండోది, సంబంధిత ప్రజాప్రతినిధి పార్టీ విప్‌ను ధిక్కరిస్తే, ఆ ఎమ్మెల్యేని అనర్హుడిగా ప్రకటించవచ్చు.

ఇప్పుడు షిండే టీమ్‌పై ఉద్ధవ్‌ వర్గం ఆరోపిస్తున్నది సరిగ్గా ఇలాంటిదే. పార్టీ విప్‌ను షిండే, అతని ఎమ్మెల్యేలు పాటించలేదన్నది ఉద్ధవ్‌ టీమ్‌ ప్రధాన ఆరోపణ.
అదే రూల్ తో వీరందరినీ అనర్హులుగా ప్రకటించాలంటూ ఉద్దవ్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై కోర్టు విచారణ నిర్వహిస్తోంది.

ఇక ఉద్ధవ్‌, షిండే పంచాయితీలో ఈసీ ఎవరి వాదనకు ఎక్కువగా వెయిటేజ్‌ ఇచ్చే ఛాన్స్‌ ఉందంటే, మొత్తం పార్టీ తన వద్ద ఉందని ఉద్ధవ్‌ చెబుతుండగా.. మెజారిటీ ఎమ్మెల్యేలు తన వెంటే ఉన్నారని షిండే వాదిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో దేనికి ఎక్కువ ప్రాధాన్యమిస్తారన్నదే కీలకమని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఒక రాజకీయ పార్టీ వివాదాన్ని నిర్ణయించడానికి ఈసీ ప్రజాప్రతినిధులకే ప్రాధాన్యతనిస్తుంది.

2016-17లో ఇలాంటి సీనే ఉత్తరప్రదేశ్‌ రాజకీయాల్లోనూ జరిగింది. ములాయం సింగ్‌, ఆయన కుమారుడు అఖిలేశ్‌ యాదవ్ మధ్య పార్టీ గుర్తు విషయంలో అభిప్రాయ భేదాలు వచ్చాయి. సైకిల్ గుర్తును అఖిలేశ్‌కు ఇవ్వకూడదని ములాయం సింగ్‌ యాదవ్‌ ఈసీ తలుపు తట్టారు. తానే పార్టీ వ్యవస్థాపకుడిని.. తన చేతిలోనే పార్టీ ఉందని వాదించారు. అయితే ఎమ్మెల్యేల బలమున్న అఖిలేశ్‌ వైపే ఈసీ మొగ్గుచూపింది.

దీంతో సైకిల్ గుర్తు అఖిలేష్ నేతృత్వంలోని పార్టీకే ఈసీ కేటాయించింది. గతేడాది అంధేరి ఈస్ట్ బైపోల్‌ సమయంలో శివసేన గుర్తును ఈసీ తాత్కాలికంగా ఫ్రీజ్‌ చేసింది. అయితే పార్టీ గుర్తును శాశ్వతంగా ఫ్రీజ్‌ చేసే అవకాశముందా అన్న అంశంపైనా నిపుణులు క్లారిటీని ఇస్తున్నారు. శాశ్వతంగా పార్టీ గుర్తును ఫ్రీజ్‌ చేసే అవకాశాలు లేవని చెప్పలేము గానీ 1969లో కాంగ్రెస్‌ వర్సెస్‌ ఇందిరాగాంధీ అంతర్గత పోరులో పార్టీ గుర్తును ఈసీ ఫ్రీజ్‌ చేసింది.

రెండు గ్రూపులకు వేర్వేరు గుర్తులు ఇవ్వబడ్డాయి. ఇప్పుడు జరుగుతున్న షిండే వర్సెస్‌ ఉద్ధవ్‌ కేసు కూడా దాదాపు అలాంటిదే. వాదనలు, ప్రతివాదనలతో ఏం డెసిషన్‌ తీసుకోవాలో ఈసీ నిర్ణయించుకోలేకపోతే పార్టీ గుర్తును శాశ్వతంగా ఫ్రీజ్‌ చేసే ఛాన్స్ ఉంది. అయితే ఈ విషయంలో ఈసీదే కీలక నిర్ణయమన్న విషయాన్ని గుర్తించుకోవాలని సూచించారు.

  • శివసేనపై హక్కు కోసం ఆ పార్టీ అధినేత ఉద్దవ్ ఠాక్రే, తిరుగుబాటు నేత, సీఎం ఏక్‌నాథ్‌ షిండే మధ్య పోరు నెలకొంది.

పార్టీ తమదంటే తమదని రెండు వర్గాలు అంటున్నాయి. శాసనసభా పక్షంలో చీలిక వచ్చినా, పార్టీ అలాగే ఉంటుందని ఉద్దవ్ ఠాక్రే వర్గం చెబుతోంది. మెజార్టీ ఎవరిది ఉంటే వారిదే పార్టీ అని షిండే వర్గం కుండబద్దలు కొడుతోంది. ఈ క్రమంలో అసలైన శివసేన తమదేనని, నియంత్రణ తమకే అప్పగించాలని షిండే వర్గం
ఈసీకి లేఖ రాసింది. ఈనేపథ్యంలో ఈసీ స్పందించింది.

శివసేన పార్టీ కోసం ఇరువర్గాలు మెజార్టీ నిరూపించుకోవాలని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే, దాదాపు 50 మంది ఎమ్మెల్యేలు షిండే వర్గంలోనే ఉన్నారు. 15 మంది ఎంపీలు సైతం షిండే వర్గంలో చేరారు. దీంతో శివసేన రెండు ముక్కలైంది. పార్టీ గుర్తు కోసం షిండే వర్గం ఈసీని ఆశ్రయించింది. దీంతో బాల్ ఠాక్రే రాజ‌కీయ‌, హిందుత్వ వార‌స‌త్వాన్ని, శివ‌సేన పార్టీని, పార్టీ గుర్తును కైవ‌సం చేసుకునే పోరులో విజ‌యం ఎవ‌రిదన్నదే ఆసక్తికరంగా మారింది.

అస‌లైన శివ‌సేన మాదేనంటే మాదేన‌ని ఉద్ధ‌వ్ వ‌ర్గం, షిండే వ‌ర్గం వాదిస్తున్నాయి. మెజారిటీ ఎమ్మెల్యేల మ‌ద్ద‌తుంద‌ని, మెజారిటీ కార్య‌క‌ర్త‌లు కూడా త‌మ‌వెంటే ఉన్నార‌ని, అందువ‌ల్ల నిజ‌మైన శివ‌సేన త‌మ‌దేన‌ని ముఖ్య‌మంత్రి షిండే వాదిస్తున్నారు. మొద‌టి నుంచి పార్టీ త‌మ‌దేన‌ని, ఒక అసంతృప్త వ‌ర్గం పార్టీ నుంచి వెళ్లిపోయినంత మాత్రాన.. అస‌లైన శివ‌సేన కాకుండాపోమ‌ని ఉద్ధ‌వ్ ఠాక్రే వ‌ర్గం స్ప‌ష్టం చేస్తోంది.

వ్య‌వ‌స్థాగ‌త స్థాయిలో పార్టీలో త‌మ‌కే మ‌ద్దతుంద‌ని వాదిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు వ‌ర్గాల వాద‌న‌లు, చూపిన ఆధారాల మేర‌కు ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యం తీసుకోనుంది. సాధార‌ణంగా, పార్టీ సంస్థాగ‌త స‌భ్య‌లు, చ‌ట్ట స‌భ‌ల స‌భ్యుల మెజారిటీ ఆధారంగా ఈసీ తుది నిర్ణ‌యం తీసుకుంటుంది. దీంతో ఈ అంశంపై ఈసీ నిర్ణయాన్ని ఆపేందుకు ఠాక్రే సుప్రీంను ఆశ్రయించారు.

ఓవైపు షిండే వర్గం, మరోవైపు ఠాక్రే వర్గం .. విల్లు తమదంటే తమదే అంటున్నా .. దీనిపై కీలక నిర్ణయం ఈసీదే అవుతుందన్నది చర్చనీయాంశమవుతోంది.

Must Read

spot_img