Homeఅంతర్జాతీయంపాకిస్థాన్ లో ఘోరమైన ఆర్థిక సంక్షోభం..

పాకిస్థాన్ లో ఘోరమైన ఆర్థిక సంక్షోభం..

ఎట్టకేలకు పాకిస్తాన్ లో విద్యుత్ పునరుద్దరించారు. విద్యుత్ గ్రిడ్ ఫెయిల్ అయిన కారణంగా తలెత్తిన అసౌకర్యానికి చింతిస్తున్నామంటూ ప్రధాని షెహబాజ్ షరీప్ ఓ ప్రకటనలో దేశ ప్రజలను సంబోదించి మాట్లాడారు. జాతీయ గ్రిడ్‌లో వోల్టేజీలో హెచ్చుతగ్గుల కారణంగా నిన్న ఇస్లామాబాద్‌, కరాచీతో పాటు పలు ప్రధాన నగరాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో సాధారణ జనజీవనానికి తీవ్ర ఆటంకం ఏర్పడింది.

తాను ఇచ్చిన ఆదేశాల మేరకు విద్యుత్‌ వైఫల్యానికి గల కారణాలపై విచారణ జరుగుతోందన్నారు. మరోవైపు, ఇప్పటికే అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినప్పటికీ.. ఇంకా కొన్ని ప్రాంతాలు మాత్రం మంగళవారం కూడా అంధకారంలోనే ఉన్నట్టు సమాచారం. విద్యుత్ సరఫరాలో అంతరాయానికి గల కారణాలను తెలుసుకొనేందుకు ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ముగ్గురు సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు.

అయితే, పాక్‌ ఇంధన మంత్రి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా గ్రిడ్‌ స్టేషన్లలో మంగళవారం విద్యుత్‌ను పూర్తిస్థాయిలో పునరుద్ధరిస్తామన్నారు. విదేశీ మారకద్రవ్య నిల్వలు క్షీణిస్తుండటంతో గత కొన్నేళ్లుగా పాకిస్థాన్‌తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దీంతో ఇంధన పొదుపును పాటించేందుకు దేశవ్యాప్తంగా షాపింగ్‌ మాల్స్‌, మార్కెట్లలో రాత్రి 8.30గంటలకే మూసివేయాలని ఇటీవల ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

పాక్‌ విద్యుత్‌ రంగంలో నెలకొన్న ఇలాంటి పరిస్థితి ఆ దేశ ఆర్థిక దుస్థితికి అద్దంపట్టేలా ఉంది. కాలం చెల్లిన మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు నిధుల కొరత కారణంగా తరచూ విద్యుత్‌ సరఫరాలో ఇలాంటి ఆటంకాలు ఎదురవుతున్నాయని అంటున్నారు విశ్లేషకులు.

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న దాయాది దేశం పాకిస్థాన్‌లో దయనీయ పరిస్థితులు నెలకొంటున్నాయి. ద్రవ్యోల్బణం కూడా అన్ని రికార్డులనూ బద్దలు కొట్టింది. అన్నింటి ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వం పిండి, చక్కెర, నెయ్యి ధరలను 25 నుండి 62 శాతం పెంచినట్లు మీడియా నివేదికలు చెబుతున్నాయి.

అప్పుల ఊబిలో కూరుకుపోవడంతో నెల నెలా కట్టాల్సిన వడ్డీలకే పాకిస్తాన్ ఆదాయం సరిపోవడం లేదు. ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. చాలా కాలంగా జీతాలు ఇవ్వకుండా నెట్టుకొస్తోంది. కొన్ని నెలలుగా జీతాల కోసం చూస్తున్న రైల్వే ఉద్యోగులు ఇప్పుడు ఆందోళనలకు దిగారు. ఉగ్రవాదుల ఉచ్చులో చిక్కి.. ఆర్థికంగా నరకం చూస్తోంది. ఆకలి కేకలే కాదు.. అక్కడ ఏమీ లేదు. ఇదివరకు ఎప్పుడూ చూడనంత దారుణ ఆర్థిక ఇబ్బందుల్ని చూస్తోంది.

ఇన్నాళ్లూ చేయిచాచితే ఆదుకున్న అమెరికా, చైనా దేశాలు కూడా ఆదుకోకుండా చేతులెత్తేసాయి. ఆ రెండు దేశాలు తమ సోదర దేశాలని, వాటితో స్నేహం తేనెకన్నా తీయనిదని, ఇనుము కన్నా గట్టిదని ఇన్నాళ్లూ కథలు చెప్పిన పాలకు ఇప్పుడు బిక్కమొహం వేసుకుని జరుగుతున్న పరిణామాలను మౌనంగా చూస్తున్నారు. పాకిస్తాన్ ను అన్ని రకాలుగా సమస్యలు ఒక్కసారిగా చుట్టుముట్టాయి.

ఒక్క మాటలో చెప్పాలంటే ఆ దేశం దివాలా అంచుల్లో చేతులెత్తేసే పరిస్థితుల్లో ఉంది. శ్రీలంకలో సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్నే మనం కళ్లారా చూశాం. ఇప్పుడు ఆ లిస్టులో పాకిస్థాన్ కూడా వచ్చి చేరింది. అక్కడ జరిగినవే ఇక్కడా జరుగుతున్నాయి. ముఖ్యంగా రైల్వేల పరిస్థితి దారుణంగా ఉంది. డీజిల్ కొనేందుకు కూడా రైల్వేల వద్ద డబ్బు లేదు. దీంతో రైళ్లు సక్రమంగా నడవడం లేదు.

పాకిస్తాన్ రైల్వే శాఖకు చెందిన రైలు డ్రైవర్లు గత నెలలో తమకు జీతం రాకపోవడంతో దేశవ్యాప్తంగా నిరసన, సమ్మె చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత రైలు రాకపోకలు నిలిచిపోయాయి. చాలా నగరాల్లో రైల్వే ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ఒకవైపు ప్రజలకు జీతాలు అందడం లేదు. ఏడాది కాలంలో పదవీ విరమణ పొందిన చాలా మంది అధికారులు, ఉద్యోగులకు గ్రాట్యుటీ రూపంలో సుమారు 25 వేల కోట్ల రూపాయల అప్పులను తిరిగి చెల్లించేందుకు ఆయా శాఖల వద్ద డబ్బు లేని పరిస్థితి ఉంది. దీంతో పాటు ఉద్యోగులకు నెలవారీ జీతం, రిటైర్డ్‌ అధికారుల పెన్షన్‌ కూడా ఇవ్వడం లేదు.

  • పాకిస్తాన్‌లోని రైల్వే అధికారుల ప్రకారం.. చైనా నుంచి కొత్త కోచ్‌లు వచ్చినప్పటికీ, ప్యాసింజర్ రైలు కార్యకలాపాలలో సుమారు రూ. 20 నుండి 25 బిలియన్ల కొరత ఉంది..

గతంలో సింధ్, బలూచిస్థాన్‌లలో వరదలు రావడంతో రైళ్ల రాకపోకలు దెబ్బతిన్నాయి. దీంతో ఆదాయం తగ్గిపోయింది. దీని తర్వాత రైల్వే ఉద్యోగుల నిరసనలు పాకిస్థాన్ వెన్ను విరిచాయి. గత వారం పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ కూడా నాసిరకం ఆర్థిక వ్యవస్థ, ద్రవ్యోల్బణం, ఆహార కొరత, ఆర్థిక వినాశనానికి వ్యతిరేకంగా పాకిస్తాన్‌లోని ఫైసలాబాద్, హైస్‌పూర్, ఒకారా, కసూర్ ఇతర నగరాల్లో నిరసన వ్యక్తం చేసింది. గిల్గిత్ బాల్టిస్థాన్‌లోనూ ప్రజలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అక్కడ పెరుగుతున్న ద్రవ్యోల్బణంపై నిరసన తెలిపారు. ఇంత జరుగుతున్నా ఇన్నాళ్లూ ఆపన్న హస్తంతో ఆాదుకున్న చైనా ఇటు వైపు చూడటం లేదు. ప్రస్తుతం డ్రాగన్ చూపు ఆఫ్గనిస్థాన్ లోని ఖనిజ నిక్షేపాలపైనే ఉంది. అటు అమెరికా కూడా అడపా దడపా ఏదో రూపంలో సాయం అందించినా ఇప్పుడు అదీ లేకుండా పోయింది. పాకిస్తాన్ తో భవిశ్యత్తులో ఏ లాభమూ లేదని గుర్తించిన చైనా పాకిస్తాన్ ను వదిలించుకోవడానికి ప్రయత్నిస్తోంది.

అటు అమెరికా కూడా పాకిస్తాన్ ను వదిలంచుకునే దిశగానే అడుగులు వేస్తోంది. ఈ పరిణామాలు వాటంతటవే అంత తేలికగా జరగలేదు. భారత విదేశాంగ విధానం దౌత్యపరమైన వ్యూహాలను చాలా ఓపికగా చక్కగా ఒకదాని తరువాత ఒకటిగా అమలు చేస్తుండటం వల్ల జరుగుతున్నాయి. అలా జరిగినందు వల్లే దాయాది దేశం ఒంటరిగా మారిపోయింది. నిజానికి ఏ దేశమైనా తన సొంత లాభం చూసుకోనిదే మరో దేశం విషయం ఆలోచించదు. అలాగే చైనాలో పరిస్థితులు మామూలుగా లేవు.

అక్కడ కరోనా కల్లోలంతో ఆ దేశం అల్లాడుతోంది.బల్క్ డ్రగ్ తయారీలో చైనా ముందు ఉంది. కానీ కోవిడ్ కారణంగా ఉత్పత్తి తీవ్రస్థాయిలో దెబ్బతింది. కాబట్టి ఇప్పట్లో తనకు కావలసిన మందులను తయారుచేసుకునే స్థితిలో లేదు. వారం క్రితం భారత్ ప్రధాని నరేంద్ర మోదీ ఒక ప్రకటన చేస్తూ చైనా అడిగితే అత్యవసర మందులను సప్లై చేయడానికి భారతదేశం సిధ్దంగా ఉంది అన్నారు.

  • చైనాలో ప్రస్తుతం డిమాండులో ఉన్న మందులను సప్లై చేయడనానికి ఔషధాల ఉత్పత్తిని పెంచాలని ఆదేశాలు కూడా జారీ చేసారు..

రానున్న రెండు నెలల్లో చైనాలో కోవిడ్ వల్ల అక్కడ తీవ్రస్థాయిలో నష్టం జరగనుంది. కాబట్టి ఇప్పట్లో భారత్ తో పెట్టుకుంటే తనకే నష్టం అని గుర్తించిన చైనా భారత్ ప్రతిపాధించిన పాకిస్తాన్ ఉగ్రవాది మక్కీని ‘ది గ్లోబల్ టెర్రరిస్టు’గా ప్రకటించడానికి ఒప్పుకుంది. గతంలో ఎన్నో సార్లు ఈ ప్రతిపాధనను వీటో చేసిన చైనా ఇప్పుడు భారత్ ప్రాధాన్యతను విధి లేని పరిస్థితిలో ఒప్పుకుంది. అటు అమెరికాను కూడా భారత్ బాగానే ప్రభావితం చేసింది.

ఎందుకంటే ఈ మధ్య అమెరికాకు ఏదో కారణంగా మళ్లీ నిధులు విడుదల చేయడం మొదలుపెట్టింది. దీంతో అమెరికాను మేనేజ్ చేయడం ద్వారా ఇన్నాళ్లూ నాటో దేశాలకు అవతల ఉన్న ముఖ్యమైన స్నేహితుడు అన్న హోదాను రద్దు చేయించింది భారత్. పాకిస్తాన్ కు వ్యతిరేకంగా హోదాను రద్దు చేసే బిల్లును అమెరికన్ సెనెటర్ ఆండీ బిగ్స్ ద్వారా జనవరి 9న బిల్లును ప్రవేశపెట్టించడం వెనుక మనవారి హస్తం ఉంది.

దీంతో అసలే ఆర్థిక నష్టాలతో కొట్టు మిట్టాడుతున్న పాకిస్తాన్ పుండు మీద కారం చల్లడం జరిగిపోయింది. ఈ బిల్లు కారణంగా పాకిస్తాన్ కు ఇన్నాళ్లూ లభిస్తున్న రక్షణ రంగ సరఫరాలు, స్పేర్ మెటీరియల్ మీద రుణాలు, అమెరికా పాకిస్తాన్ దేశాల రక్షణ రంగం విషయంలో పార్టనర్ షిఫ్ తో సాగుతున్న రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ సహకారం రద్దయిపోతుంది. పాకిస్తాన్ ఎఫ్16 విమానాల కు కావలసిన స్పేర్స్ కోసం అమెరికా సంస్థలకు ఇండెంట్ పెట్టింది పాకిస్తాన్..

వీటికి అవసరం అయిన డబ్బు రుణం రూపంలో లభిస్తుంది. కానీ ఈ బిల్లు కారణంగా అది నిలిచిపోతుంది. అంటే ఏ రకంగానూ అమెరికా నుంచి పాకిస్తాన్ కు ఒక్క డాలరు సహకారం కూడా ఉండదు. ఈ పరిణామాలతో బిత్తరపోయిన పాకిస్తాన్ బిక్క మొహం వేసుకుని యూఏఈ దగ్గరకు వెళ్లింది. యూఏఈ పాకిస్తాన్ కు ఈ విషయం వివరించి భారత్ తో సంబంధాలు పెంచుకోవడం తప్ప మరో మార్గం లేదని జ్నానబోధ చేసింది.

అప్పడు గానీ ఇలా ఎందుకు జరుగుతోంది అన్న విషయం పాకిస్తాన్ కు అర్థం కాలేదు. అందుకే వారం రోజులుగా పాకిస్తాన్ శాంతికూతలు కూస్తోంది. ఆ కూసే కూతల్లో కూడా కశ్మీరు గురించిన ప్రస్తావన ఉండటం చూస్తే ఎలుక తోకను పట్టుకుని ఏడాది ఉతికినా రంగు మారదని మరోసారి రుజువైంది.

Must Read

spot_img