చేజేతులారా తాము కూర్చున్న కొమ్మను తామే నరుక్కున్నారా..? తాజా పరిణామాలపై హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకోనుంది అన్నదే
ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

తెలుగుదేశం నుంచి వచ్చాడు.. మాపై పెత్తనం చేస్తున్నాడు అనుకున్నారు.. ఎలా అయినా ఆయనకు పీసీసీ పదవి దక్కకూడదని ప్లాన్ చేశారు. కానీ.. అది సాధ్యం కాలేదు. తాజాగా పీసీసీ కమిటీల ప్రకటనలో కూడా ఆయనదే పైచేయి అయింది. దీంతో తిరుగబాటు మొదలు పెట్టారు. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని ఆ పదవి నుంచి తప్పిద్దామనుకున్నారు. అసలైన కాంగ్రెస్‌వాదులం తామే అని.. ఆయన పెత్తనం ఏంటి అనే సందేశం అధిష్టానానికి పంపాలనుకున్నారు.
కానీ సీనియర్లు చేసిన రాజకీయం మాత్రం రివర్స్ అయింది. సీనియర్ల వ్యూహానికి ప్రతివ్యూహం పన్నిన రేవంత్‌రెడ్డి పార్టీని కంప్లీట్‌గా తన చేతుల్లోకి తీసుకున్నారు. టీపీసీసీ కమిటీలను ఏర్పాటు చేసిన హైకమాండ్ వాటి సమావేశాలనూ నిర్వహించాని ఆదేశించింది. రేవంత్‌రెడ్డి నిర్వహించారు. అందరూ వచ్చారు కానీ.. సీనియర్లుగా కొత్త కుంపటి పెట్టుకున్న 9 మంది మాత్రమే హాజరు కాలేదు.
దీంతో వారు తప్ప.. మిగతా పార్టీ అంతా ఏకతాటిపైకి ఉన్నట్లు తేలింది. అంతే కాదు.. ఆ పార్టీ అంతా రేవంత్ వైపు ఉన్నట్లుగా స్పష్టమయింది. తామే అసలైన
కాంగ్రెస్ వాదులం అని చెప్పుకుంటున్న 9 మంది సీనియర్లు ఉద్దేశపూర్వకంగా, స్వార్థపూరితంగా పార్టీకి నష్టం కలిగించే ప్రయత్నాలు చేస్తున్నట్లు టీపీసీసీ ఇప్పటికే హైకమాండ్‌కు నివేదిక పంపింది. కుట్ర పూరితంగా కాంగ్రెస్‌పై టీడీపీ ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారని నేతలు నివేదిక పంపారు.
కమిటీల్లో కనీసం 13 మంది కూడా టీడీపీ నుంచి వచ్చిన వారు లేకపోయినా సగం మందికిపైగా ఉన్నారని ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నారని వారు వీడియోలను హైకమాండ్‌కు సమర్పించారు. ఇక కార్యవర్గ సమావేశంలో రేవంత్‌రెడ్డి పాదయాత్రను ప్రకటించారు. పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక ఆయన పాదయాత్రకు తిరుగులేదని తేలిపోయింది.
మరోవైపు కార్యవర్గ సమావేశాలకే హాజరు కాలేదంటే.. ఇక కాంగ్రెస్ పార్టీలో.. సీనియర్ల పరిస్థితి ఉన్నా లేనట్లేనని భావిస్తున్నారు. వారిని ఇక కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా ప్రోత్సహించదని.. కనీసం అపాయింట్‌మెంట్లు కూడా ఇవ్వడం కష్టమేనని అంటున్నారు. కాంగ్రెస్‌లోని 9 మంది సీనియర్లు తాము నిజమైన కాంగ్రెస్ వాదులమని చెప్పుకుంటూ పార్టీని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్‌వర్గం ఆరోపిస్తోంది. ఈమేరకు హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లడంలోనూ రేవంత్ టీం సక్సెస్ అయినట్లేనని టాక్ వినిపిస్తోంది.
మరోవైపు ఈమేరకు అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేయాలని భావిస్తోంది. ఆ 9 మందిని డ్యామేజ్ బ్యాచ్‌గా పేర్కొంటూ.. కాంగ్రెస్ పార్టీని బలహీనపర్చి బీజేపీలోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారన్న ప్రచారం చేస్తోంది. ఇదే సమయంలో రాజగోపాల్‌రెడ్డి.. మరింత ముందుకెళ్లి అందరూ బీజేపీలోకి రావాలని పిలుపునివ్వడం రేవంత్ వర్గానికి కలిసి వచ్చింది. ఎలా చూసినా కాంగ్రెస్ సీనియర్ల వ్యవహారం.. రేవంత్‌రెడ్డికి ప్లస్‌గా మారింది.
ఆయన నాయకత్వంపై నమ్మకం ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఉండాలి.. లేకపోతే బయటకు వెళ్లిపోవాలన్న పరిస్థితిని ఆ తొమ్మిది మంది స్వయంగా తెచ్చుకున్నారు. దీంతో రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీపై పూర్తిస్థాయి పట్టు లభించింది. కొండనాలుకకు మందేస్తే.. ఉన్ననాలుక ఊడిందట.. అట్లున్నది తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ల తీరు.
రేవంత్‌రెడ్డికి చెక్‌పెడదామని తిరుగుబాటు మొదలు పెట్టిన సీనియర్లు.. ఇప్పుడు తామే డిఫెన్స్‌లో పడ్డారు. తామే అసలైన కాంగ్రెస్‌వాదులం అంటూ తెలంగాణ కాంగ్రెస్‌ను చిలువలు పలువలు చేస్తున్న సీనియర్లకు టీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సైలెంట్‌గా చెక్ పెట్టారు. వారి ఎత్తుకు పైఎత్తుతో డ్యామేజ్ బ్యాచ్‌ను ఒంటరి చేశారు.
టీపీసీసీ కొత్త కమటీలో చోటు దక్కిన తన వర్గానికి చెందిన 13 మందితో 9 మంది సీనియర్ల బ్యాచ్‌కు రివర్స్ పంచ్ ఇచ్చారు. తనపై అధిష్టానానికి ఫిర్యాదు చేయాలనుకున్న వారిపైనే అధిష్టానానికి ఫిర్యాదు చేయించి కాంగ్రెస్‌పై పట్టు సాధించారు. కాంగ్రెస్ హైకమాండ్ ఏ క్షణాన కొత్త పీసీసీ కమిటీలను ప్రకటించిందో కానీ నాయకులు ఒక్కొక్కరు తిరుగుబాటు చేస్తున్నారు.
కొండా సురేఖ నుంచి మొదలైన ఈ అసంతృప్తి జ్వాలలు బెల్లయ్య నాయక్ వయా కాంగ్రెస్ సీనియర్ల వరకు కొనసాగుతున్నాయి. అయితే కాంగ్రెస్ హైకమాండ్ లిస్ట్ రిలీజ్ చేసిన 2–3 రోజులు సైలెంట్‌గానే ఉన్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇదే అదునుగా రేవంత్‌రెడ్డి న్యాయకత్వంపై తిరుగుబాటు మొదలు పెట్టారు.
ఈ క్రమంలో కాంగ్రెస్‌లో మరో సంచలనం నెలకొంది. రేవంత్‌రెడ్డితోపాటు టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన వారిలో 13 మందికి టీపీసీసీ కమిటీల్లో పదవులు లభించాయి. ఇదే సాకుగా సీనియర్లు రేవంత్‌పై తిరుగబాటు మొదలు పెట్టారు. ఈ క్రమంలో సీసియర్ల ఎత్తుకు పైఎత్తు వేసిన రేవంత్‌రెడ్డి ఆ 13
మందితో రాజీనామా చేయించారు.
అందులో సీతక్క, ఎర్ర శేఖర్, వేం నరేందర్, విజయరామారావు, చారకొండ వెంకటేశ్, పటేల్ రమేశ్, సత్తు మల్లేశ్, విజయరమణారావు సహా మరికొంతమంది ఉన్నారు. రాజీనామా చేస్తూ మాణిక్యం ఠాగూర్‌కు లేఖ రాశారు. దీంతో సీనియర్లపై రేవంత్ వ్యూహం సక్సెస్ అయిందన్న టాక్ వెల్లువెత్తుతోంది.
వలస వచ్చిన నాయకులకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్న కాంగ్రెస్ సీనియర్ల ఆరోపణలతో టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన నేతలు రాజీనామా బాట పట్టడం ఇప్పుడు సంచలనంగా మారింది. భట్టి నివాసంలో భేటీ అయిన సీనియర్ నాయకులు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై పరోక్షంగా విమర్శలు కురిపించారు. కొత్త కమిటీల్లో 108 మంది ఉంటే అందులో 50 మంది వలస వచ్చిన వారే అని మండిపడ్డారు.
టీడీపీ నుంచి వలస వచ్చిన వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, తమను కోవర్టులుగా ముద్ర వేస్తున్నారని ఆరోపించారు. అందుకే ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులకు, వలస వచ్చిన వారికి మధ్య పోరాటం జరుగుతుందని, వలస వచ్చిన వారి నుంచి కాంగ్రెస్‌ను సేవ్ చేయాలనే తాము చూస్తున్నామని ప్రకటించారు. కాంగెస్ ను హస్తగతం చేసుకోవాలనే కుట్ర జరుగుతోందని, క్యారెక్టర్ లేని వాళ్లు పార్టీని నడిపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాము నాలుగు పార్టీలు మారి రాలేదు. అసలు కాంగ్రెస్ నాయకులం తామే. ఇందుకోసం ఢిల్లీ వెళ్లి హైకమాండ్ తో తేల్చుకుంటాం అని సీనియర్లు తెలిపారు. వలస వాదులతో కాంగ్రెస్‌కు నష్టం జరుగుతుంది. గెలిచే చోట డీసీసీ నియామకాలు ఆపారు. ఉపాధ్యక్షుడు, జనరల్ సెక్రటరీ పదవులు వలస వాళ్లకే కేటాయించారని మండిపడ్డారు. సీనియర్ల తిరుగుబాటుపై రేవంత్‌రెడ్డి సైలెంట్‌గా తన వ్యూహం అమలు చేశారు.
తన వర్గానికి చెందిన 13 మందితో పదవులకు రాజజీనామా చేయించారు. ఇదే సమయంలో తామే కాంగ్రెస్ పరిరక్షకులమని, పదవులు లేకున్నా పనిచేస్తామని చెప్పించారు. పదవుల కోసం పార్టీలో చేరలేదని ప్రకటించడం ద్వారా.. ఆ 9 మంది బ్యాచ్‌ను డిఫెన్స్‌లో పడేశారు.
మరోవైపు హైకమాండ్ ఆదేశాలతో గాంధీభవన్‌లో పీసీసీ సమావేశం నిర్వహించారు. సీనియర్ల తిరుగుబాటు గురించి కాకుండా ఎజెండా అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. సమావేశానికి జానారెడ్డి, పొన్నం ప్రభాకర్, షబ్బీర్ అలీ, మల్లు రవి సహా పలువురు నాయకులు హాజరయ్యారు. దీంతో సీనియర్ల వ్యూహం బెడిసికొట్టినట్లే కనిపిస్తోంది. దీంతో సీనియర్లు తమంతట తామే .. పార్టీని రేవంత్ చేతుల్లోకి అప్పగించినట్లైంది. రేవంత్ షాక్ తో ఇక సీనియర్లు ఏం చేస్తారన్నదే సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
మరి సీనియర్ల నెక్ట్స్ టర్న్ ఏమిటన్నదే ఆసక్తికరంగా మారింది.