బైడెన్ ఇంట్లో తాజాగా జరిగిన13 గంటల సోదాల నేపథ్యంలో మరో 6 రహస్య ఫైళ్లు లభించాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రైవేట్ ఇంట్లో లభించిన రహస్య ఫైల్స్ ఆయన గత పదవీకాలం నాటివిగా అధికారులు గుర్తించారు. దీంతో రహస్య ఫైల్స్ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మెడకు చుట్టుకుంటున్నాయని అంటున్నారు విశ్లేషకులు.. గతంలో పలు రహస్య ఫైల్స్ లభ్యమవగా.. ఆయన ప్రైవేట్ హైస్‌లో చేపట్టిన మరో సెర్చ్‌లో ఇప్పుడు ఇంకో 6 ఫైళ్లు దొరికాయి. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు దాదాపు 13 గంటలపాటు డెలావేర్‌లోని బైడెన్ ఇంట్లో అధికారులు సెర్చ్ చేశారు. ఈ ఫైళ్లను అధికారులు స్వాధీనం చేసుకుని ఉన్నతాధికారులకు నివేదించారు. డెలావేర్‌లోని ఇంట్లో సోదాలు జరుపుతున్న సమయంలో బైడెన్‌గానీ, ఆయన భార్యగానీ ఇంట్లో లేరు. శుక్రవారం బైడెన్ ఇంట్లో దొరికిన పత్రాల్లో కొన్ని ఆయన సెనేటర్‌గా ఉన్న కాలంనాటివిగా గుర్తించారు.
మరికొన్ని ఆయన గతంలో ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలోనివిగా నిర్ధారించారు. సోదాల సమయంలో ఇరుపక్షాలకు చెందిన లీగల్ టీమ్‌లు, వైట్‌హౌస్ అధికారి ఒకరు ఉన్నట్లు స్థానిక మీడియా తెలిపింది. బైడెన్ లివింగ్ రూం మొదలుకొని గ్యారేజి వరకు మొత్తం ఇంటిని శోధించారు. ఈ సెర్చ్‌లో ఇంటెలిజెన్స్ ఫైల్స్‌తో పాటు చేతి రాతతో ఉన్న కొన్ని నోట్స్ కూడా లభించినట్లు తెలుస్తున్నది. అయితే జో బైడెన్ స్వయంగా న్యాయ శాఖ అధికారులను పిలిచి ఇంటిని మరోసారి సోదా చేయించారని న్యాయవాది బాబ్ బోయర్ తెలిపారు. ఇంట్లో సెర్చ్ పూర్తయ్యే వరకు ఈ విషయాన్ని బహిరంగపరచవద్దని న్యాయ శాఖ విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. కాగా, సోదాలకు ఒకరోజు ముందు బైడెన్ మాట్లాడుతూ.. ఫైళ్లు దొరకడంపై తనకు ఎలాంటి విచారం లేదన్నారు.
దీనిని ప్రతిపక్ష రిపబ్లికన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇది తెలివితక్కువ ప్రకటన అని వారు పేర్కొన్నారు. బైడెన్ ఇంటిని ఖాళీ చేస్తున్న సమయంలో గత నవంబర్ నెలో 20 సెట్ల రహస్య ఇంటెలిజెన్స్ ఫైళ్లు లభించడంతో వివాదం మొదలైంది. పదవీకాలం ముగిసిన తర్వాత ఈ విధంగా రహస్య పత్రాలను కలిగి ఉండటం చట్టవిరుధంగా అమెరికా ప్రభుత్వం పరిగణిస్తుంది. అంతే కాదు..అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ఓ ల్యాప్‌టాప్ పెను సమస్యగా మారింది. ఆయన కుమారుడు హంటర్ బైడెన్ వినియోగించిన ఈ ల్యాప్‌టాప్‌లో సమాచారం విశ్లేషించే కొద్దీ బిత్తరపోయే వాస్తవాలు వెలువడుతున్నాయి. తన వద్ద రహస్య పత్రాలు అత్యంత సురక్షితంగా ఓ సీల్డ్ డబ్బాలో ఉన్నాయని బైడెన్ ఇటీవల సెలవిచ్చారు. ఆయన ప్రకటన వెలువడిన దాదాపు వారంలోనే న్యూయార్క్ పోస్టు పత్రిక సంచలన కథనం వెలువరించింది.

అమెరికాకు చెందిన అత్యంత రహస్య పత్రాలు బైడెన్ ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పడేసి ఉన్నట్లు పేర్కొంది. దీనికి తోడు ఆ రహస్యపత్రాలు అక్కడ ఉన్న సమయంలో బైడెన్ కుమారుడు హంటర్ పలుమార్లు ఆ ఇంటికి వచ్చినట్లు వెల్లడించింది. కీలక పత్రాల పెట్టెలుగా భావిస్తున్న ఫొటోలు హంటర్ ల్యాప్‌టాప్‌లో లభించడం బలమైన ఆధారంగా నిలిచింది. వీటిల్లో ‘ఇంపార్టెంట్ ఫైల్స్ ప్లస్ ఫొటోస్’ అని రాసి ఉన్న ఓ కార్డ్‌బోర్డ్ పెట్టె ఫొటో కూడా ఉంది. గతంలో జోబైడెన్ ‘ప్రామిస్ మి, డాడ్’ అనే పుస్తకం రాసే సమయంలో శ్వేతసౌధం నుంచి పత్రాలను తీసుకెళ్లినట్లు సమాచారం. బైడెన్ పాత కార్యాలయంలో నవంబర్ 2న కీలక పత్రాలను కనుగొన్నారు. ఆ తర్వాత జస్టిస్ డిపార్ట్‌మెంట్ సిబ్బంది రెండో బ్యాచ్ పత్రాలను డెలావేర్‌లోని విల్మింగ్‌టన్‌లో ఉన్న ఇంట్లో గుర్తించారు.
వీటిల్లో కొన్ని డెలావేర్‌లోని కార్ గ్యారేజీలో బైడెన్‌కు చెందిన కొర్వెట్టీ అనే కారు వెనుక ఉన్నాయి. ఇవన్నీ ‘సెన్సిటీవ్ కంపార్ట్‌మెంటెడ్ ఇన్ఫర్మేషన్’ కేటగిరికి చెందినవి. దీనిపై ఫాక్స్ న్యూస్ విలేకరి ఇటీవల ఆయన్ను ప్రశ్నించారు. దానికి బైడెన్ స్పందిస్తూ.. నా కొర్వెట్టీ కారు లాక్‌చేసిన గ్యారేజీలో ఉంది. అంతేకానీ వీధిలో లేదు అని సమాధానమిచ్చారు. వాస్తవానికి 2020లో జోబైడెన్ ప్రచార బృందం పోస్టు చేసిన ఓ వీడియోలో కూడా ఈ కారు పక్కన ఫైల్స్ ఉన్న పెట్టె కనిపిస్తోంది. 2017 ఫిబ్రవరి 14 నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు హంటర్ బైడెన్ ఈ ఇంటికి 162 సార్లు వచ్చినట్లున్న అతడి ఐఫోన్ ఫ్రీక్వెంట్ లోకేషన్ స్క్రీన్ షాట్‌ను అమెరికా పత్రికలు వెలుగులోకి తెచ్చాయి. అదే సమయంలో అతడు చైనాకు చెందిన కంపెనీతో వివాదాస్పదమైన డీల్స్ కుదుర్చుకోవడంపై చర్చలు జరుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి