Homeఅంతర్జాతీయంకులవివక్షను నిషేధించిన తొలి నగరం ఇదే..!

కులవివక్షను నిషేధించిన తొలి నగరం ఇదే..!

కులమే లేని అమెరికాలో కుల వివక్షకు వ్యతిరేకంగా ఓ నగర కౌన్సిల్ తీర్మానం చేయడం ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది మనదేశం నుండి అక్కడికి పాకిన అగ్ర కుల అహంకార ఫలితమే అంటున్నారు విశ్లేషకులు. మొత్తానికి అమెరికాలో కూడ కులాల కుమ్ములాటకు తెరతీసారు. అది కాస్తా శ్రుతి మించుతుండటంతో అమెరికాలోని సియాటెల్‌ నగరం సంచలన నిర్ణయం తీసుకుంది. నగరంలో కుల వివక్షను నిషేధిస్తూ తీర్మానించింది.

అమెరికాకు బతకడానికి వెళ్ళిన భారతీయులు తమతో పాటు తమ కులాన్ని కూడా తీసుకెళ్ళారు. కింది కులాలను వివక్షకు గురి చేసే అగ్రకుల మనస్థత్వాన్ని కూడా తీసుకెళ్ళారు. దాంతో అక్కడ కూడా దళితులు, ఇతర బహుజన కులాలు అగ్రకులాల నుండి అమెరికాలో కూడా వివక్ష ఎదుర్కోవాల్సి వస్తున్నది. దీంతో ఇక లాభం లేదనుకున్న సియాటెల్ నగరం కుల వివక్షను నిషేధిస్తూ తీర్మానం చేసింది. అమెరికా చరిత్రలోనే ఈ రకమైన తీర్మాణం చేసిన తొలినగరంగా నిలిచింది సియాటెల్‌.

కుల వివక్షను నిషేధించాలన్న ప్రతిపాదనపై సియాటెల్ నగర కౌన్సిల్‌లో మంగళవారం ఓటింగ్ జరగ్గా.. 6-1 తేడాతో ఆమోదం పొందింది. ఇండియన్-అమెరికన్ క్షమా సావంత్ కౌన్సిల్‌లో ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు.

మంగళవారం జరిగిన నగర కౌన్సిల్ సమావేశంలో ఈ అంశంపై మాట్లాడేందుకు 100 మందికిపైగా గతవారం ప్రారంభంలోనే నమోదు చేసుకున్నారు. కాగా, ఈ ఆర్డినెన్స్‌కు మద్దతుగా సియాటెల్‌లో, ఇతర ప్రాంతాల్లో దళితులు ర్యాలీలు తీశారని కాలిఫోర్నియాకు చెందిన ఈక్వాలిటీ ల్యాబ్స్ వ్యవస్థాపకుడు తేన్‌మొళి సౌందరరాజన్ తెలిపారు. కానీ ఇలాంటి చట్టం చేయడం వల్ల ప్రత్యేకంగా ఓ కమ్యూనిటీని కించపరిచినట్లే అవుతుందని కొందరు హిందూ అమెరికన్లు వాదిస్తున్నారు. కుల వివక్షను నిషేధిస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు మద్దతు పలికిన వారి వాదన మరోలా ఉంది. దేశాల సరిహద్దులు దాటినా కుల వివక్ష తప్పట్లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో ప్రస్తుతం ఉన్న సివిల్ రైట్స్ ప్రొటెక్షన్ చట్టాలలో కుల వివక్ష నుంచి రక్షణ లేదని చెప్పారు.

అందుకే ఈ ఆర్డినెన్స్ అవసరం ఉందని, కుల వివక్షకు పాల్పడితే శిక్ష తప్పదనే భయం ఉండాలని చెబుతున్నారు. దీనిని దేశమంతటా వ్యాపింపజేయడానికి ఓ ఉద్యమంగా ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. కాంగ్రెస్‌ మహిళ పరిమళా జయపాల్‌ ఈ ఉద్యమానికి మద్దతు తెలిపారు. అమెరికా సహా ప్రపంచంలో ఎక్కడా వివక్షకు తావుండకూడదని పరిమళా జయపాల్‌ అన్నారు. కొన్ని కాలేజీలు, యూనివర్శిటీలు ఈ వివక్షపై నిషేధం విధించాయని, ఇదే కేసుల్లో కార్మికులు తమ హక్కుల కోసం గౌరవం కోసం పోరాడుతున్నారని అన్నారు. కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఈక్వాలిటీ ల్యాబ్స్‌ ఈచర్యను స్వాగతించింది. దేశంలోనే సియాటిల్‌ మొదటిస్థానంలో నిలవడంతో ప్రేమ గెలిచిందని తెలిపింది.

నిజానికి కుల వివక్ష ఓ అంటువ్యాధి లాంటిది. మొదట అమెరికాలో ఉద్యోగాల కోసం వెళ్లినవారంతా భారతీయులంతా ఒకటే అన్నట్టుగా ఉండేవారు. ఆపై రాష్ట్రాల వారిగా విడిపోయారు. అక్కడితో ఆగకుండా కులాభిమానం మొదలుపెట్టారు. వీకెండ్స్ లో కులాలవారీగా వనభోజనాలు మీటింగులు సంఘాలుగా ఏర్పడ్డారు. మొత్తానికి మనవారు అక్కడికి వెళ్లి విడిపోయి బతుకుతున్నారు. అమెరికాకు బతకడానికి వెళ్ళిన భారతీయులు తమతో పాటు తమ కులాన్ని కూడా తీసుకొచ్చారని అమెరికన్లు హేళన చేస్తున్నారు. కింది కులాలను వివక్షకు గురి చేసే అగ్రకుల మనస్థత్వాన్ని కూడా మనవాళ్లు అమెరికాకు తీసుకెళ్ళారు. దాంతో అక్కడ కూడా దళితులు, ఇతర బహుజన కులాలు అగ్రకులాల నుండి వివక్ష ఎదుర్కోవాల్సి వస్తున్నది.

అనేక కార్పోరేట్ కంపెనీలలో భారతీయులు ఈ కుల వివక్షకు బలవుతున్నారు. అగ్రకుల భారతీయులు ముఖ్యమైన పోస్టుల్లో ఉన్న చోట దళితులు మరింత వివక్షను ఎదుర్కోవడమే కాక , హేళనలు ఎదుర్కోవడం, ఉద్యోగాలు కోల్పోవడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సియాటిల్ నగర కౌన్సిల్ కుల వివక్షను నిషేధిస్తూ తీర్మానం చేసింది.

అన్ని రకాల అణచివేతలకు వ్యతిరేకంగా జరిగే పోరాటాల్లో కుల పక్షపాతానికి వ్యతిరేకంగా జరిగే పోరాటం కూడా ఒక భాగం ” అని చట్టాన్ని ప్రవేశపెట్టిన కౌన్సిల్ ఉమెన్ క్షమా సావంత్ అన్నారు. యుఎస్‌లో కుల పక్షపాతం మరింత ప్రబలంగా మారకుండా నిరోధించడానికి ఇది అవసరమని ఆమె అన్నారు. ఇటీవలి సంవత్సరాలలో US విశ్వవిద్యాలయాల క్యాంపస్‌లలో, కార్పోరేట్ కంపెనీలలో సాగుతున్న కుల పక్షపాతంపై యుద్దమే ఈ నిషేధ తీర్మానం అని సావంత్ అన్నారు.


Must Read

spot_img