Homeతెలంగాణవిగ్రహ రాజకీయాలకు తెర..ఏమిటా విగ్రహ రాజకీయాలు..?

విగ్రహ రాజకీయాలకు తెర..ఏమిటా విగ్రహ రాజకీయాలు..?

రాజకీయాలకు కాదేది అనర్హం అన్నది అందరికీ తెలిసిందే. అనంతలోని ఓ నియోజకవర్గంలో తాజాగా ఓ మహనీయుని విగ్రహం .. రాజకీయాలకు సెంటర్ ఆఫ్ ద పాయింట్ గా మారిందట. మొన్నటి వరకు ప్రతి చిన్న అంశాన్ని రాజకీయం చేసిన నాయకులు.. ఇప్పుడు విగ్రహ రాజకీయాలకు తెరలేపారు.

విగ్రహం తాము చెప్పిన చోట .. చెప్పిన సమయంలో పెట్టాలని కొందరంటే, తాము అన్నీ సిద్ధం చేశాక.. ఓ కొత్త నాటకానికి తెర తీస్తున్నారంటూ మరికొందరు మండిపడుతున్నారట.

అనంతపురం జిల్లాలో రాజకీయాలు ఎప్పుడూ వాడీ వేడిగా ఉంటాయి. కానీ జిల్లా కేంద్రంలో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ అంతా చదువుకున్న వారు, ఉద్యోగులు కావడంతో రాజకీయాలపై పెద్దగా ఫోకస్ చేయరు. కానీ అలాంటి చోట ఇప్పుడు రాజకీయలు టెన్షన్ వాతావరణానికి దారి తీస్తున్నాయి. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, ప్రస్తుత ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డిల మధ్య పొలిటికల్ వార్ పీక్ స్టేజ్ కి చేరుకుంటోంది.

వాస్తవంగా ఈ ఇద్దరు నేతలు గతంలో ఎప్పుడూ నేరుగా విమర్శించుకోలేదు. కానీ గత కొన్ని రోజులుగా ఇప్పుడు పేరు పెట్టి మరీ విమర్శల దాడి చేసుకుంటున్నారు. తాజాగా వీరిద్దరి మధ్య విగ్రహా రాజకీయాలు నడుస్తున్నాయి. అసలు రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేని ఒక మహానీయున్ని ఇందులోకి లాగడం .. చర్చనీయాంశంగా మారింది. అందునా ఆయన మరణించిన చాలా ఏళ్లకు విగ్రహరూపంలో రాజకీయాలు మొదలయ్యాయి.

ఇంతకీ ఎవరా మహానీయుడంటే.. ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్. అనంతపురం జిల్లాకు ఎంతో చరిత్ర ఉంది. ఆ చరిత్రలో కొందరు మరపురాని వ్యక్తులు ఉన్నారు. వారిలో స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు. రాజకీయ నాయకులు ఉన్నారు. కానీ వారందరినీ మించి జిల్లా ప్రజలు తమ గుండెల్లో పెట్టుకున్న వ్యక్తి.. ఆర్డీటీ వ్యవస్థాపకులు ఫాదర ఫెర్రర్. ఫెర్రర్ ది మన ప్రాంతం కాదు.. మన దేశం కూడా కాదు.. ఎక్కడో స్పెయిన్ లో పుట్టారు.

చిన్నతనం నుంచి దైవ సేవలో ఉన్న ఆయన నిజమైన భక్తి అంటే నలుగురికీ సేవ చేయడమే అని భావించారు. ఇందుకు సరైన ప్రాంతం కోసం అన్వేషించారు. మన దేశంలో పేదరికం గురించి తెలిసింది. మరో ఆలోచన లేకుండా ఎల్లలు దాటుకుని ఇక్కడికొచ్చేశారు. అందులోనూ అనంతపురం జిల్లా వెనుకబాటుతనం, కరవు ఆయన్ను కదిలించాయి. దీంతో జిల్లాలోనే స్థిరపడిపోయి సేవా యజ్ఞాన్ని ప్రారంభించారు.

రూరల్ డెవలప్ మెంట్ ట్రస్ట్ ఆర్డీటీని స్థాపించి.. ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. పేదల పాలిట ఆశాజ్యోతి అయ్యారు. అనంత ప్రజల హృదయాల్లో ఫాదర్ గా స్థిరపడిపోయారు. ప్రపంచంలో ఏ స్వచ్ఛంద సంస్థ చేయని విధంగా భారీ సేవా కార్యక్రమాలు చేపట్టారు. పేదలకు ఇళ్ల దగ్గరి నుంచి మొదలు పెడితే.. వ్యవసాయం, విద్య, ఆటలు, వైద్యం ఇలా ఒకటేంటి.. ఎక్కడ ఎవరికి ఏ అవసరం ఉన్నా సాయం కొనసాగుతూనే ఉంది.

ప్రభుత్వాలు కూడా చేయలేని విధంగా ఫాదర్ ఫెర్రర్ చేసి చూపించారు. అందుకే ఆయన జిల్లా ప్రజల గుండెల్లో చిర స్థాయిగా నిలిచిపోయారు.

ఆయన సేవలను గుర్తించిన మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి చాలా ఏళ్ల క్రితం కలెక్టరేట్ ఎదురుగా ఆవే సంస్థ ద్వారా ఫాదర ఫెర్రర్ విగ్రహాన్ని ఏర్పాటు
చేశారు. అప్పట్లో రాజకీయాలకు అతీతంగా నేతలంతా హాజరై.. దీనిని అభినందించారు. ఇందులో అప్పటి ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్యే అనంత
వెంకట్రామిరెడ్డి కూడా ఉన్నారు. ఫాదర్ ఫెర్రర్ జయంతి జరిగినా వర్ధంతి జరిగినా..ఇక్కడే పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.

ఫాదర్ అంటే అందరికీ గౌరవం.. ఇందులో రెండో మాటకు ఛాన్సే లేదు. కానీ ఇప్పుడు ఆయన విగ్రహం విషయంలో జరుగుతున్న రాజకీయాలు అంతా ఇంతా
కాదు. దీనికి ప్రధాన కారణం.. ఇటీవల ఫాదర్ ఫెర్రర్ విగ్రహం తొలగించడం. జిల్లాకు ఎంతో సేవ చేసిన మహానీయుని విగ్రహాన్ని తొలగించడం
ఏంటనుకుంటున్నారా.. దీనికి ఒక కారణం ఉంది. ఇటీవల జాతీయ రహదారి విస్తరణ మీద పెద్ద రగడే జరిగింది.

సుమారు 3వందల కోట్ల నగరంలో జాతీయ రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఈ పనులతో నగరం రూపు రేఖలు మారుతున్నాయి. రోడ్ల విస్తరణలో భాగంగా నగరంలో రోడ్డు మీద ఉన్న సుమారు 16మంది మహానీయుల విగ్రహాలు తొలగించారు. ఇందులో ఫాదర్ ఫెర్రర్ విగ్రహం కూడా ఉంది.
ఇక్కడ ఎలాంటి వివాదం లేదు. కేవలం విస్తరణ పనుల కోసమే విగ్రహాల్ని తొలగించారు. దీనిపై మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి కూడా అభ్యంతరం చెప్పలేదు. కానీ వీటిని పునః ప్రతిష్టించడంలో జాప్యం జరుగుతోంది.

దీంతో మాజీ ఎమ్మెల్యే అతని బ్యాచ్ మహానీయుల విగ్రహాలు ఏం చేశారంటూ ఆందోళనలు మొదలు పెట్టారు. చాలా రోజుల తరువాత దీనికి అధికారులు కూడా స్పందించి.. విగ్రహాలు జాగ్రత్తగా పెట్టామని చెప్పారు. ఆ తరువాత మాజీ ఎమ్మెల్యే చౌదరి దీనిని వదల్లేదు. విగ్రహాలు పునఃప్రతిష్టించాలంటూ నిరసనలు చేపట్టారు. అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో ఈ సారి ఫాదర్ విగ్రహంపై ఒక ఉద్యమాన్నే తీసుకొచ్చారు. దీనిపై చాలా సార్లు నిరసనలు తెలిపారు.

ఇటీవల అధికారులంతా సమావేశమై నిబంధనల మేరకు, రోడ్డుకు ఇబ్బంది లేని చోట విగ్రహాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈక్రమంలో ఈనెల 5న ఎమ్మెల్యే అనంత తండ్రి మాజీ ఎంపీ అనంత వెంకటరెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అదే రోజు హఠాత్తుగా కొందరు దళిత సంఘాల నాయకులు ఫాదర్ ఫెర్రర్ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజకు శ్రీకారం చుట్టారు. ఓ వైపు వర్ధంతి.. మరోవైపు విగ్రహ ఏర్పాటు.. వేళ దీనికి .. హాజరైన మాజీ ఎమ్మెల్యే చౌదరిని అరెస్ట్ చేయడంతో, రచ్చ షురూ అయింది.

  • ఈ అంశంపై ఓ రేంజ్ లో ఫైరైన ప్రభాకర్ చౌదరి ..

నన్నే అరెస్ట్ చేయిస్తావా అంటూ ఎమ్మెల్యే టార్గెట్ గా రాజకీయాన్ని షురూ చేశారు. విన్సెంట్ ఫెర్రర్ విగ్రహ పునః ప్రతిష్ట కమిటీని ఏర్పాటు చేయించారు. వైసీపీ మినహా మిగిలిన రాజకీయ పార్టీలను ఒక వేదికపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దళిత సంఘాలు, ప్రజా సంఘాలు, మేధావులు ఇలా అందర్నీ ఏకతాటిపైకి తెచ్చి ఉద్యమం నడిపిస్తున్నారు. ఎమ్మెల్యే అనంత, మేయర్, డిప్యూటీ మేయర్లు దీనికి ధీటుగా స్పందిస్తున్నారు.

మరో 15 రోజుల్లో విగ్రహం పెడతారని తెలిసే ఇప్పుడు ప్రభాకర్‌ చౌదరి తానే చేస్తున్నట్లు బిల్డప్‌ ఇస్తున్నారని విమర్శించారు. టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు కలహాల కుంపటితో గడిపారన్నారు. టీడీపీ పాలనలో ఐదేళ్లు ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతికే పరిస్థితి ఉండేదన్నారు. ప్రభాకర్‌ చౌదరి ఎప్పుడూ ఏదో ఒక అంశంతో గొడవలు పడుతుంటారంటూ కౌంటర్ ఇస్తున్నారు.

కానీ చౌదరి మాత్రం వెనక్కు తగ్గలేదు. ఫాదర్ విగ్రహం విషయాన్ని జిల్లా అంతటా తీసుకెళ్లాలని ఫిక్స్ అయ్యారు. ఇందులో భాగంగా విన్సెంట్ ఫెర్రర్
విగ్రహ ప్రతిష్ట కమిటీ జిల్లా అంతటా పర్యటనలు ప్రారంభించింది. జిల్లాలో అన్ని వర్గాలను ఏకం చేయాలని భావిస్తున్నారు. ఈనెల 25వరకు విగ్రహ
ఏర్పాటుకు అవకాశం ఇచ్చారు. అలా చేయని పక్షంలో తామే వేలాది మందితో విగ్రహం ఏర్పాటు చేస్తామని అల్టిమేటం కూడా జారీ చేస్తున్నారు.

ఇలా జిల్లాకు ఎంతో సేవ చేసిన మహానీయుని విషయంలో రాజకీయాలపై సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రోడ్ల విస్తరణలో తొలగించిన
విగ్రహం విషయంలో అధికారులు క్లారిటీ ఇవ్వకపోవడమే అసలు సమస్యగా మారింది. దీనిని రాజకీయ పార్టీల నాయకులు అడ్వాంటేజ్ తీసుకోవడంతో వివాదం ముదిరింది. విగ్రహ ఏర్పాటుపై తలెత్తిన రచ్చ .. రాజకీయ చర్చకు దారితీయడం చర్చనీయాంశంగా మారింది.

ఈ అంశంలో తాజా, మాజీ ప్రజా ప్రతినిధుల రాజకీయాలు .. సెగ్మెంట్లోనే కాక జిల్లావ్యాప్తంగా కాక రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో విగ్రహ ఏర్పాటుపై ఈనెల 25
వరకు అల్టిమేటం ఇవ్వడం .. మరింత రచ్చ తప్పదన్న అంచనాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో వీరిద్దరి విబేధాలు .. సైలెంట్ గా ఉండే
సెగ్మెంట్లో హాట్ పుట్టిస్తున్నాయని స్థానికంగా చర్చోపచర్చలు వినిపిస్తున్నాయి.

మరి ఈనెల 25లోగా వారు ఎలా స్పందిస్తారో చూడాలి…

Must Read

spot_img