Homeఅంతర్జాతీయంపాకిస్థాన్‌లో భయానక పరిస్థితులు..!

పాకిస్థాన్‌లో భయానక పరిస్థితులు..!

భారత పొరుగు దేశం శ్రీలంక పరిస్థితి 2022 సంవత్సరంలో చాలా దారుణంగా మారింది. ఆ దేశంలో దరిద్రం తాండవిస్తోంది. విదేశీ రుణాలు చెల్లించలేక, ఎగవేతదారుగా ముద్ర వేయించుకుంది. ఇప్పుడు దాదాపు ఇదే పరిస్థితి పాకిస్థాన్‌లోనూ కనిపిస్తోంది. పాకిస్థాన్‌ మరో శ్రీలంకలా మారింది.

పాకిస్తాన్ లో నిత్యావసర వస్తువుల కొరత అతి తీవ్రంగా ఉంది.. విదేశీ మారక ద్రవ్య నిల్వలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. ఆ దేశ విదేశీ మారక నిల్వలు 8 సంవత్సరాల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి, పాకిస్థాన్ మరో శ్రీలంకను తలపిస్తోంది.. శ్రీలంకలోని దయనీయ పరిస్థితులతో పాక్ కొట్టుమిట్టాడుతోంది.. ఆకలి కేకలతో అక్కడి ప్రజలు అలమటిస్తున్నారు. తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఏర్పడటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

గత ఏడాది భారీ వరదలు సంభవించి, దాని నుంచి కోలుకోకముందే మరో సంక్షోభంలో చిక్కుకుని విలవిల్లాడుతుంది. పాక్​ ఆర్థిక వ్యవస్థ మరో రూ.3.3 లక్షల కోట్ల మేర నష్టపోయింది. ఇలాంటి విపత్కర పరిస్థితులు తలెత్తడంతో పాక్ దివాళా తీసే స్థాయికి వెళ్లిపోయింది. ప్రస్తుతం పాక్ లో కరెంట్, ఆహారం, ఇంధనం, డబ్బుకు కొరత ఏర్పడింది. కరెంట్​ లేక ఆ దేశం చీకట్లలో మగ్గుతోంది.

ప్రభుత్వ ఆఫీసుల్లో కరెంట్​ వాడకాన్ని 30 శాతానికి తగ్గించాలని.. విద్యుత్ ను ఆదా చేసేందుకు షాపులు, షాపింగ్​ మాళ్లను రాత్రి ఎనిమిదిన్నరకే మూసేయాలని, రెస్టారెంట్లను రాత్రి 10 గంటల లోపు కట్టేయాలని ఆ దేశ ప్రధాని షెహబాజ్​ షరీఫ్​ ఆదేశాలిచ్చారు.పాక్ లో ఇప్పుడు విదేశీ మారక నిల్వలు గణనీయంగా పడిపోయాయి.

గతేడాది జనవరిలో 16.6 బిలియన్​ డాలర్లున్న ఆ దేశ విదేశీ మారక నిల్వలు.. ఇప్పుడు 5.6 బిలియన్​ డాలర్లకు పడిపోయాయంటేనే పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది… పెట్రోల్​, డీజిల్​పై పాకిస్థాన్​ ఎక్కువగా విదేశాలపైనే ఆధారపడడం, వాటి ధరలు విపరీతంగా పెరగడం, పాకిస్థాన్​ రూపీ విలువ పతనమవ్వడం వంటి కారణాలు డాలర్​ నిల్వలు తరిగిపోవడానికి కారణమైంది.

ఫలితంగా ఆ దేశంలో ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. పాకిస్థాన్​ బ్యూరో ఆఫ్​ స్టాటిస్టిక్స్​ ప్రకారం గతేడాది 24.5 శాతంగా నమోదైంది. గోధుమలు, కూరగాయలు ఇతర తిండి వస్తువుల ధరలు ఆకాశాన్నంటేశాయి. ఆహార ధాన్యాలకు తీవ్ర కొరత ఏర్పడింది. గోధుమ పిండి కోసం వీధుల్లో జనం ఎగబడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో తొక్కిసలాటలు జరుగుతున్నాయంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల ఆ గొడవల్లో నలుగురు చనిపోయారు. ఇప్పటికీ దుకాణాల ముందు నిత్యావసరాల కోసం జనం క్యూలు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.

  • ఆర్థిక సంక్షోభం ముంగిట పాక్ ఎంబసీలనూ మూసేస్తున్నది..!

ఈ పరిస్థితుల నుంచి జనాన్ని బయట పడేసేందుకు ప్రధాని షెహబాజ్​ షరీఫ్​ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జెనీవాలో జరిగిన ఓ సదస్సులో విదేశాల సాయం కోసం అర్థించారు షెహబాజ్​ షరీఫ్. ఇంటర్నేషనల్​ మానిటరీ ఫండ్​ నుంచి రావాల్సిన ఎక్స్​టెండెడ్​ ఫండ్​ ఫెసిలిటీ నిధుల కోసం పాక్​
అధికారులు ఐఎంఎఫ్​ అధికారులతో సమావేశమయ్యారు.

వాస్తవానికి 6 బిలియన్​ డాలర్ల ఈఎఫ్​ఎఫ్​ కోసం 2019లోనే ఒప్పందం కుదరగా.. దానిని ఆ తర్వాత 7 బిలియన్​ డాలర్లకు పెంచారు.. అయితే, గతేడాది నవంబర్​లో పాక్​కు 1.18 బిలియన్​ డాలర్ల ఈఎఫ్​ఎఫ్​ను ఐఎంఎఫ్​ ఇవ్వలేదు. ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్​ చేసేందుకు పన్నులు, కరెంట్​ చార్జీలు, ఎక్స్​చేంజ్​ రేట్​పై కృత్రిమ నియంత్రణ వంటి చర్యలకు పాక్​ అంగీకరించకపోవడంతోనే ఐఎంఎఫ్​ ఆ నిధులను ఆపేసింది.

ఈ పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు పాకిస్థాన్​ మరిన్ని అప్పులు చేసేందుకు సిద్ధమవుతోంది. చైనా నుంచి 2.1 బిలియన్​ డాలర్లు అప్పుగా తీసుకునేందుకు నిర్ణయించింది. అంతేగాకుండా పాక్​ స్టేట్​బ్యాంక్​లో సౌదీ ఫండ్​ ఫర్​ డెవలప్​మెంట్​ నిధులను 3 బిలియన్​ డాలర్ల నుంచి 5 బిలియన్​ డాలర్లకు పెంచేందుకు స్టడీ చేయాలని నిర్ణయించింది. ఈ రెండు ఫలిస్తే పాక్​కు అంతో ఇంతో ఊరట ఉంటుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. రాబోయే మరికొన్ని నెలలు పాకిస్థాన్​లో గడ్డు పరిస్థితులు తప్పవని అంచనా వేస్తున్నారు.

తీవ్ర ఆర్థిక సంక్షోభం పాకిస్థాన్‌ విదేశీ రుణాలు నిరంతరం పెరుగుతుండగా, విదేశీ మారక ద్రవ్యం ఎప్పటికప్పుడు క్షీణిస్తోంది. పాకిస్తాన్ ప్రధాన వార్తాపత్రిక డాన్ నివేదిక ప్రకారం… మార్చి 2022 నాటికి, దేశం నెత్తి మీద ఉన్న మొత్తం విదేశీ అప్పు 43 లక్షల కోట్ల పాకిస్తాన్ రూపాయలకు చేరుకుంది. ఈ అప్పులో ఎక్కువ భాగం ఇమ్రాన్ ఖాన్ హయాంలోనిది. అతను కేవలం 3 సంవత్సరాలలో మొత్తం 1400 వేల కోట్ల పాకిస్థానీ రూపాయల రుణం తీసుకున్నాడు.

దీంతో దేశంలో విదేశీ మారకద్రవ్యం దాదాపు ముగింపు దశకు చేరుకుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ వద్ద 2022 జనవరిలో మొత్తం 16.6 బిలియన్‌ డాలర్లు ఉంటే, ఇప్పుడు ఆ నిల్వ 5.6 బిలియన్‌ డాలర్లకు తగ్గింది. ఒక్క ఏడాదిలోనే ఆ బ్యాంక్‌ దగ్గర నిల్వలు సుమారు 11 బిలియన్‌ డాలర్ల మేర తగ్గాయి. ఈ క్షీణత వెనుకున్న అతి పెద్ద కారణం విదేశీ రుణాల వాయిదాలు చెల్లించడం.

  • పాకిస్థాన్‌లో ద్రవ్యోల్బణం అతి తీవ్రంగా పెరుగుతోంది.

పెరిగిన ధరల వల్ల ఆహారాన్ని కొనుక్కునేంత స్థోమత లేక మధ్య తరగతి ఆదాయ వర్గాలు కూడా ఆర్థాకలితో రోజులు వెళ్లదీస్తున్నాయి. ఇక, పిడికెడు మెతుకుల కోసం పేదలు అల్లాడిపోతున్నారు. ప్రభుత్వం సబ్సిడీలో అందిస్తున్న గోధుమ పిండి కోసం వేలాది ప్రజలు గంటల కొద్దీ ఎదురు చూడాల్సిన పరిస్థితి.

ఖైబర్‌ పఖ్తూన్‌ఖ్వా, సింధ్‌, బలూచిస్థాన్‌ వంటి ప్రాంతాల్లో గోధమ పిండి కోసం ప్రజలు ఎగబడుతుండడంతో తొక్కిసలాటలు జరిగి ప్రజల ప్రాణాలు పోతున్నాయి. చాలా ప్రాంతాల్లో సాయుధ బలగాల పహారాలో ఆహార పదార్థాలను పంపిణీ చేసే పరిస్థితి నెలకొంది.

తోపులాటలను నివారించడానికి, కొన్ని ప్రాంతాల్లో గాలిలోకి కాల్పులు కూడా జరుపుతున్నారు. ఈ పరిస్థితిని రాబందుల్లాంటి వ్యాపారులు సానుకూలంగా మార్చుకుంటున్నారు, శవాల మీద పేలాలు ఏరుకు తింటున్నారు. సరిగ్గా ఏడాది క్రితం, 2022 జనవరిలో రూ. 37గా ఉన్న కేజీ ఉల్లిపాయల రేటు ఇప్పుడు ఏకంగా రూ. 220కి చేరింది. డజను అరటి పళ్లు 119 రూపాయల ధర పలుకుతున్నాయి.

కిలో చికెన్‌ 384 రూపాయలు, లీటరు పాలు 150 రూపాయలు.. ఇలా ప్రతి వస్తువు ధరకు రెక్కలు వచ్చాయి. పెట్రోల్‌ ధరలు 48 శాతం, డీజిల్‌ ధరలు 61 శాతం పెరిగాయి. ఈ రేట్ల దగ్గర కొనలేక సంపన్నులు కూడా పాకిస్థాన్‌ ప్రభుత్వం మీద ఆగ్రహంగా ఉన్నారు. ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం, పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం “తీవ్రమైన” పరిస్థితిలో ఉంది. ఆ దేశాన్ని పాలిస్తున్న షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం, ప్రస్తుతం అంతర్జాతీయ ద్రవ్య నిధితో చర్చలు జరుపుతోంది. IMF ప్యాకేజీలోని తదుపరి విడతను వీలైనంత త్వరగా పొందడానికి ప్రయత్నిస్తోంది.

ఓ వైపు ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారు.. మరోవైపు.. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరులోని గిల్గిట్-బాల్టిస్థాన్‌లో ఆ దేశంపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పాకిస్థాన్ ప్రభుత్వ విధానాలు తమ పట్ల వివక్షాపూరితంగా ఉన్నాయని ఈ ప్రాంత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వీడియోలను బట్టి ప్రభుత్వంపై వీరి ఆగ్రహం ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

లడఖ్‌లో భారత దేశంతో తమను తిరిగి కలిపేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.. కార్గిల్ రోడ్డును తెరచి, భారత దేశంలోని లడఖ్‌లో ఉన్న తమ తోటి బాల్టిస్‌లతో తమను కలపాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రాంతంలో గత కొద్ది నెలల నుంచి నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. లోడ్ షెడ్డింగ్, చట్టవిరుద్ధ భూ ఆక్రమణలు, సహజ వనరుల దోపిడీ వంటి అంశాలపై వీరు పోరాడుతున్నారు.

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరు మాజీ ప్రధాన మంత్రి రజ ఫరూఖ్ హైదర్ కూడా నిరసన గళం వినిపించారు.

పాకిస్తాన్ లో ఎక్కడ చూసినా ఆకలి కేకలు, నిరసనలు, ఆందోళనలే కనిపిస్తున్నాయి.. తీవ్ర ఆర్థిక సంక్షోభం, ఆహార పదార్థాలు, నిత్యావసర వస్తువుల కొరత నుంచి పాక్ ప్రజలు ఎప్పటికి బయటపడతారో చెప్పలేని పరిస్థితి నెలకొంది..

Must Read

spot_img