అనాదిగా ఇటు సముద్రం అటు అంతరిక్షం రహస్యాలను దాచుకున్న పుట్టలాగే గంభీరంగా ఉంటాయి. బయటకు ఎలా కనిపించినా సముద్రం అట్టడుగున లోలోతుల్లో ఏం జరుగుతోందో ఎవరికీ తెలియదు. అలాగే విశ్వాంతరాలు కళ్లెదుటే ఉన్నా అక్కడ ఏం జరుగుతోందో విశ్వం అంతు ఎంత వరకో ఎవరికీ తెలియదు.. ఈ రెండు చోట్లా ఏయే రహస్యాలు, అరుదైన ఖనిజాలు దాగి ఉన్నాయన్న విషయం తెలుసుకునేందుకు అన్ని దేశాలు ప్రయత్నాలు చేసాయి, చేస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు వీటి గురించి తెలుసుకున్నది కేవలం పది శాతం మాత్రమేనని అంటున్నారు శాస్త్రవేత్తలు. అందులో భాగంగా ఈ సంవత్సరం మన దేశం నుంచి రెండు అరుదైన ప్రయోగాలు జరగబోతున్నాయి. వాటిలో మొదటిది అంతరిక్షంలోకి మానవ సహిత యాత్ర..కాగా రెండవది సముద్రంలోని ఖనిజాలను వెలికితీసే కార్యక్రమంలో భాగంగా సముద్రయాన్..
ఈ సంవత్సరమే ఇవి రెండూ నిర్వహించబోతున్నారు. విదేశాలలో ఈ రెండింటిపైనా దశాబ్దాలుగా ప్రయోగాలు జరిగాయి. కానీ మన దేశం మాత్రం ఈ దశాబ్ద కాలంగా చేస్తున్న పరిశోధనలు అంతంత మాత్రమే.. ఇప్పుడు మొదటిసారిగా డీప్ సీ ఎక్స్ పెరిమెంట్ చేయబోతోంది. సముద్రంలో 500 మీటర్ల లోతుకిముగ్గురు అక్వానాట్స్ ని పంపించడానికి నిర్ణయం జరిగింది. సముద్రయాన్ మిషన్ అంటే మాటలు కాదు..అంతంత లోతుల్లో భయంకరమైన పీడనం ఉంటుంది. ప్రమాదం జరిగితే ప్రాణాలకే ప్రమాదం పొంచి ఉంటుంది. అందుకే వారి బధ్రత గురించి కోసం ఇంజినీర్లు సర్వం సిద్ధం చేస్తున్నారు. అక్వానాట్స్‌లను సముద్రంలో 500 మీటర్ల లోతులో సురక్షితంగా ఉండటమే కాకుండా తమకు అప్పగించిన అన్ని ప్రయోగాలను నిర్వహించేందుకు ఈ ఓషియన్ క్రాఫ్ట్ లో అన్ని ఏర్పాట్లు చేశారు. దీనిని మత్స్య 6000 అని వ్యవహరిస్తున్నారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన సముద్రయాన్ నౌకను సముద్రం లోతుల్లోకి పంపేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని చర్యలు చేపట్టింది.
ఇందుకు చెన్నైలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ఇంజినీర్లు ఆక్వానాట్‌ల ప్రయాణానికి వీలుగా ఉక్కు గోళాన్ని తయారుచేశారు. అయితే, 6000 మీటర్ల లోతుకు సముద్రయాన్‌ను పంపే ప్రణాళిక ఆ లోతుల్లో ఒత్తిడిని తట్టుకోగల టైటానియం గోళాన్ని కొనుగోలు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతుండటంతో ప్రయోగం కొంత ఆలస్యమైంది. ప్రస్తుతం రూపొందించిన ఉక్కు గోళం 5000 మీటర్ల లోతు వరకు ఒత్తిడిని తట్టుకోగలదని, అయితే మరింత లోతుగా ప్రయాణిస్తే మాత్రం ప్రమాదకరంగా మారుతుందని ఇంజినీర్లు చెప్తున్నారు.
అందుకే ఇప్పుడు అంతకు మించిన సామర్థ్యం కలిగిన క్రాఫ్ట్ ను తయారు చేసారు. అంతరిక్షం ఎలాంటిదో సముద్రం కూడా అలాగే ఉంటుంది. అంటే అంతే ప్రమాదకరంగా ఉంటుంది. రెండు చోట్లా అవే పరిస్థితులుంటాయి. అప్రమత్తంగా ఉండకపోతే ప్రాణాలకే ప్రమాదం. అసలు అంతంత లోతులకు ఓ వాహనం చేరడమే కష్టం. ఎందుకంటే అక్కడ అత్యంత పీడనంతో కూడిన పరిస్థితి ఉంటుంది. అయితే ఇప్పుడు టెక్నాలజీలు పెరిగాయి. సబ్ మెరిన్ టెక్నాలజీ అభివ్రుద్ది కారణంగా అలాంటి అండర్ వాటర్ క్రాఫ్ట్ రూపకల్పన జరిగింది.
ఆరువేల మీటర్ల లోతు వరకు వెళుతుంది కాబట్టి దానికి మత్స్య 6000 అని పేరు పెట్టడం జరగిందని చెబుతున్నారు. ఈ క్రాఫ్ట్ సాయంతో సముద్రంలో 6 వేల మీటర్ల వరకు ముగ్గురు వ్యక్తులను పంపించడం లక్ష్యంగా ప్రయోగం జరగనుంది. వీరితో పాటు సదరు వాటర్ క్రాఫ్ట్ లో సైంటిఫిక్ సెన్సర్లు, ఇతర పరికరాలు ఉంటాయి. డీప్ ఓషెన్ ఎక్స్ ప్లోరేషన్ కార్యక్రమం ద్వారా అనేక సముద్ర రహస్యాలు వెలుగు చూడనున్నాయి. 12 గంటల డ్యూరేషన్ లో ఈ ప్రయోగం ముగుస్తుంది. అత్యవసర పరిస్తితులలో 96 గంటల పాటు ఉండేలా దీనిలో ఏర్పాట్లు చేసారు. సముద్రం అట్టడుగున భూమి పైన ఉన్నట్టే అనేక ఖనిజాలు, అరుదైన మినరల్స్ ఉంటాయి. వాటిని ఇంతవరకూ మైనింగ్ చేయడం కుదరలేదు.
ఇప్పుడు భూమిపై వాటి నిల్వలు తరగిపోవడంతో సముద్రంలోనూ వాటిని వెలికి తీయడానికి చేసే ప్రయత్నాలలో భాగంగా సముద్రయాన్ ప్రాజెక్టును చేపడుతున్నారు. భూమిపై నాలుగింట మూడు వంతులుండే సముద్రం మన జీవితాలలో ముఖ్యపాత్ర పోశిస్తోంది. మీకు తెలుసా ఇప్పటి వరకు జరిగిన పరిశోధనలలో 90 శాతం సముద్రం గురించి మనకు పూర్తిగా తెలియదు. మన దేశం విషయానికొస్తే మూడు వైపులా మూడు మహా సముద్రాలున్నాయి. రవాణా విషయమైనా మత్సపరిశ్రమ విషయానికైనా దేశంలో అత్యధిక కార్యక్రమాలు సముద్రం ఆధారంగానే జరుగుతుంటాయి.
దేశంలో 30శాతం జనాభా సముద్రతీరాలలోనే స్థిరపడ్డారు. వీరికి సముద్రమే జీవనోపాది కల్పిస్తోంది. అందుకే ఆర్థికపరంగా చూస్తే సముద్రం పెద్ద పాత్ర పోశిస్తోంది. సముద్రం ద్వారా ఫిషరీస్, అక్వాకల్చర్, టూరిజం, జీవనోపాది, బ్లూ ట్రేడ్ లాంటివి జనానికి ఉపాది కల్పిస్తున్నాయి. మొత్తం 7వేల 517 కి.మీల పొడవాటి తీరం మనదేశానికి ఉంది. ఈ తీరం 9 రాష్ట్రాలకు ఆధారంగా ఉంది. అంతే కాదు..సముద్రంలో ఒక వేయి 382 ద్వీపాలు కూడ ఉన్నాయి. భారత ప్రభుత్వం తన విజన్ అయిన న్యూ ఇండియా లో బ్లూ ఎనామీని కూడా చేర్చి అభివ్రుద్ద పరిచేందుకు సన్నాహాలు చేస్తోంది.
అందులో భాగంగానే ఇప్పుడు మత్స్య 6000 ప్రయోగం జరపనుంది. ఈ వెహికల్ కూడా మన దేశంలో జరుగుతున్న అంతరిక్ష ప్రయోగాలకు ధీటుగా నిలవబోతోంది. మత్స్య6000 ఓ మానవ సహిత సబ్మెర్సిబుల్ వెహికిల్ గా ఉంటుంది. దీని ద్వారానే మన దేశపు మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ప్రయోగాలను నిర్వహించబోతోంది. ఈ ప్రయోగంలో పలు సంస్థలు కూడా పాల్గొనబోతున్నాయి. ఈ ప్రయోగ లక్ష్యం ఏమిటంటే 1000 మీటర్ల నుంచి 5500 మీటర్ల సముద్రపు లోతుల్లో పాలిమెటాలిక్ మాంగనీస్, గ్యాస్ హైడ్రేట్స్, హైడ్రో థెర్మల్ సల్పైడ్స్, కోబాల్ట్ క్రస్ట్ అవశేషాలను కనిపెట్టడం జరుగుతుంది.
అయితే ఈ పనులకు మానవ రహిత వెహికిల్స్ కూడా సరిపోనుండగా మనుషుల ప్రాణాలకు రిస్కు కలిగే ప్రయోగాలు ఎందుకు చేయడం అని అనుకోవచ్చు. కానీ మానవ సహితంగా జరిగే ప్రయోగాలతో ఫలితాలు వందశాతం ఉంటాయి. పైగా శాస్త్రవేత్తలు స్వయంగా అక్కడి వరకు వెళితే మరెంతో విశాల ద్రుక్పదంతో ఆలోచనలు చేయగలుగుతారు. అందుకే మత్స్య6000లో ముగ్గురు ఓషియోనాట్స్ వెళుతున్నారు.
అయితే ఈ ప్రయోగానికి భారీగానే ఖర్చు కానుంది. డీప్ఓషియన్ మిషన్ ఆధ్వర్యంలో మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ తలపెట్టిన ఈ ప్రాజెక్టుకు 4వేల 77 కోట్ల బడ్జెట్ ను అయిదు సంవత్సరాల వ్యవధి కోసం భారత ప్రభుత్వం ఓకే చేసింది. అంటే ప్రాజెక్ట్ టైమ్ లైన్ అయిదు సంవత్సరాలుగా ఉంటుంది. 2020-21 నుంచి 2025-26 మధ్యలో ప్రయోగాలు పూర్తవుతాయి. సముద్రంలో లభించే ఖనిజాలు ఇప్పటి వరకు అడుగు పెట్టనివిగా ఉంటాయి. మనకు ఇన్నాళ్లూ తెలియని ఎన్నో కొత్తవి కూడా బయటపడతాయి.. ఒకవేళ అలాంటి అరుదైన ఖనిజాల గని తగిలితే దేశం ఆర్థికపరంగా దూసుకుపోవడం ఖాయం.