- తెలంగాణలో హాట్ హాట్ గా సాగిన రాజకీయాలు .. ఒక్కసారిగా ఎందుకు సైలెంట్ అయ్యాయి..?
- ఇక అరెస్టులే తరువాయి అన్నంతగా సాగిన రచ్చ ఇప్పుడెందుకు వినిపించడం లేదు..?
- ఇప్పుడిదే .. తెలంగాణవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఇదిగో అరెస్టులే అంటూ హడావుడి చేసిన బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు సైలెంట్ అయిపోయాయి. ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారం అంతా సైలెంట్ అయిపోయింది. మెల్లగా నిందితులకు బెయిల్స్ కూడా వస్తున్నాయి. ఫామ్ హౌస్ కేసు సీబీఐకి చేరింది..కానీ ఇంకా కేసు టేకప్ చేయలేదు. ఆరు నెలలు సాధన చేసి మూలనున్న ముసలమ్మను కొట్టినట్లుగా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ, ఈడీ అధికారులు వ్యవహరిస్తున్నారు.
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, కవిత లాంటి వారిని టార్గెట్ చేశారని చెబుతున్నా, ఈడీ, సీబీఐ మాత్రం ఇప్పటి వరకూ వారిపై ఎఫ్ఐఆర్ కానీ చార్జిషీటు దాఖలు చేయడం వంటివి కానీ చేయలేదు. ఓ నిందితుడి చార్జిషీటులో మాత్రం ఢిల్లి లిక్కర్ పాలసీలో లాభం పొందిన సౌత్ లాబీలో కవిత అసలైన భాగస్వామి అని ఆరోపించారు. అంటే ఈ దిశగా ఈడీ, సీబీఐ వద్ద ఆధారాలు ఉన్నాయని అనుకోవచ్చు.
కానీ మరి ఎందుకు ఆలస్యం చేస్తున్నారు ? ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు మాత్రమే కాదు.. ఎమ్మెల్యేలకు ఎర కేసులోనూ సీబీఐ ఇంకా కదల్లేదు. విచిత్రంగా తెలంగాణ ప్రభుత్వం కూడా అటు హైకోర్టు డివిజన్ బెంచ్ కు అయినా లేదా సుప్రీంకోర్టుకు అయినా అప్పీల్‌కు వెళ్తుందన్న ప్రచారం జరిగింది. అయితే అదీ జరగలేదు. అటు సీబీఐ దూకుడు చూపించ లేదు.. ఇటు బీఆర్ఎస్ కూడా ఈ అంశంపై న్యాయపోరాటానికి ఆసక్తి చూపించడం లేదు.
దీం ఈ మొత్తం వ్యవహారానికి రాజకీయవర్గాలు రెండు కారణాలు చెబుతున్నాయి. అందులో మొదటిది బీఆర్ఎస్, బీజేపీ ఓ అండర్ స్టాండింగ్ కు రావడమేనని టాక్ వినిపిస్తోంది. ఇది ఎంత వరకూ నిజమవుతుందో చెప్పలేం కానీ.. రాజకీయాల్లో ఇలా పార్టీల అంతర్గతంగా కొన్ని అంశాలపై సర్దుకుపోవడం కామన్ గానే జరుగుతూ ఉంటుంది. మరో కారణం.. టైమింగ్ చూసి ఎటాక్ చేసేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు వేచి చూస్తూ ఉండటం.
రెండు ఆయుధాలు బీజేపీ చేతికి అందిన తర్వాత ఇక రాజీకి ఎందుకు వస్తారన్నది బీజేపీ నేతల వాదన. అయితే ముందు ముందు కూడా ఇంతే సైలెంట్ అయిపోయి..ఇతర అంశాలపై రాజకీయం నడిస్తే.. ఈ అంశంలో బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఓ అండర్ స్టాండింగ్ వచ్చిందనుకోవచ్చు. తెలంగాణలో ఇటీవలి కాలంలో తీవ్ర సంచలనం సృష్టించిన రెండు కేసుల విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ వ్యవహరిస్తున్న తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. రాజకీయ లెక్కలు సరి చేసుకునేందుకు తమ అధీనంలో ఉన్న దర్యాప్తు సంస్థలను తమ ఇష్టం వచ్చనట్లు వ్యవహరిస్తున్నాయా అన్న అనుమానాలు వ్యక్త మౌతున్నాయి.
తెలంగాణ పార్టీల్లో జోష్ మళ్లీ అధికారం కోసం బీఆర్ఎస్..
తెలంగాణలో రెండు పార్టీల్లో జోష్ కనిపిస్తోంది. మళ్లీ అధికారం నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్.. ఎలాగైనా ప్రగతి భవన్ లో పాగా వేసేందుకు బీజేపీ..పోటా పోటీ విమర్శలు, వ్యూహ ప్రతివ్యూహాలతో దూసుకుపోతున్నాయి. రెండు పార్టీలు… అందివచ్చిన అవకాశాలను, చోటుచేసుకుంటున్న పరిణామాలను రాజకీయ ఎదుగదల కోసం సమర్థవంతంగా ఉపయోగించుకుంటున్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ద్వారా ఒకరిని మరొకరు కార్నర్ చేస్తూ.. పాలిటిక్స్ చేస్తున్నారు.
డ్రగ్స్ కేసు, దిల్లీ మద్యం కుంభకోణం కేసులపై మాటల యుద్దానికి దిగారు. రీచ్ ఎక్కువగా ఉండే.. రైతు అంశాన్ని రెండు పార్టీలు ఎత్తుకున్నాయి. ఉపాధి హామీ నిధుల విషయంలో కేంద్ర వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్… రుణమాఫీ పూర్తి చేయడం లేదని ఆరోపిస్తూ బీజేపీ… పోటా పోటీ ధర్నాలు నిర్వహించాయి. నిత్యం వార్తల్లో నిలిచే తీరుతో.. రాష్ట్రంలో ప్రధాన పోరు.. ఈ రెండు పార్టీల మధ్యే ఉందన్నట్లుగా పరిస్థితిని మార్చేశాయి. బీఆర్ఎస్ టార్గెట్ క్లియర్ గా ఉంది.
ఎలాగైనా, ఏం చేసైనా.. ఈ సారి 100 సీట్లు సాధించాలన్న వ్యూహంతో.. గులాబీ దళం పావులు కదుపుతోంది. ఈ దిశగా సీఎం కేసీఆర్ ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. బాస్ నుంచి ఆర్డర్ అందుకున్న ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో ఇప్పటికే ప్లానింగ్ మొదలు పెట్టారు. ఇన్నాళ్లు నియోజకవర్గాల్లో తమకు వ్యతిరేకంగా పనిచేసిన ఇతర పార్టీల నేతలకు గాలం వేస్తున్నారు. వ్యతిరేక వర్గంలో పేరున్న లీడర్లను కారెక్కిస్తున్నారు.
తద్వారా.. ఎన్నికల నాటికి సమీకరణాలన్నీ తమకు అనుకూలంగా ఉండేలా చూసుకుంటున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి ఏ స్థానంలో ఎవరు పోటీ చేస్తారన్న అంశంలో ఇప్పటికీ స్పష్టత లేకపోవడం బీఆర్ఎస్ కు కలిసివస్తోంది. ఆయా పార్టీల నుంచి అభ్యర్థులు ఖరారయ్యేలోపు గ్రౌండ్ మొత్తం గులాబీమయం చేస్తే.. తమకు తిరుగుండదన్నది… అధికార పార్టీ ఎమ్మెల్యేల వ్యూహంగా కనిపిస్తోంది.
మరోవైపు కేసీఆర్ ను గద్దె దించే శక్తి తమకే ఉందంటున్న బీజేపీ… స్థానిక బలాబలాలు ఎలా ఉన్నా.. భారీ వ్యూహాలనే సిద్ధం చేసుకుంది. మిషన్ 90 లక్ష్యంగా నిర్దేశించుకుని.. ప్రణాళికలు అమలు చేస్తోంది. ఇదే లక్ష్యంతో డిసెంబర్ 29న హైదరాబాద్ లో విస్తారక్ ల సమావేశం నిర్వహించింది. బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బి.ఎల్. సంతోష్ ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై… నేతలకు దిశానిర్దేశం చేశారు.
90 సీట్లతో అధికారం బీజేపీదే అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇదే వేదికగా విశ్వాసం వ్యక్తం చేశారు. టార్గెట్ ని రీచ్ అయ్యేందుకు 10 నెలల రోడ్ మ్యాప్ సైతం రూపొందించుకొంది.. తెలంగాణ బీజేపీ. సంక్రాంతి తర్వాత నుంచి బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర.. ముఖ్య నేతలతో 10 వేల స్ట్రీట్ కార్నర్ సమావేశాలు.. ఫిబ్రవరిలో అసెంబ్లీ స్థాయి సమావేశాలు.. ఆ తర్వాత ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో బహిరంగ సభలు. ఇలా.. పక్కా ప్లానింగ్ తో బీజేపీ తెలంగాణలో పాగా వేసేందుకు కసరత్తు మొదలుపెట్టింది.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసుల చుట్టూ తెలంగాణ రాజకీయం..!
బూత్ లెవల్ నుంచి క్యాడర్ పెంచుకోవడంపై దృష్టి సారించింది. దీని కోసం ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించిన కమలం నేతలు… ఈ వ్యూహాన్ని ఇంకా వేగంగా అమలు చేసేందుకు సమాయత్తమవుతున్నారు. ఇలా… బీఆర్ఎస్, బీజేపీ దూకుడు రాజకీయాలతో జోరు చూపిస్తున్నాయి. అదే సమయంలో ఢిల్లీ మద్యం కుంభకోణం, ఎమ్మెల్యేల కొనుగోలు కేసుల చుట్టూ తెలంగాణ రాజకీయం తిరిగింది. బీజేపీ, బీఆర్ఎస్ లు ఈ రెండు కేసుల విషయంలో పరస్పర విమర్శలు గుప్పించుకున్నాయి.
మద్యం కుంభకోణం కేసు లో కవిత అరెస్టే తరువాయి అన్నట్లుగా హడావుడి జరిగింది. అలాగే ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసులోనూ కేసీఆర్ బ్రహ్మాండాన్ని బద్దలు కొట్టేసి నంత బిల్డప్ ఇచ్చారు. కేంద్రానికేనా మాకు లేవా దర్యాప్తు సంస్థలంటూ ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసును సిట్ కు అప్పగించారు.
ఈ రెండు కేసులలోనూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఈ కేసులను విచారిస్తున్న దర్యాప్తు సంస్థలు తమ తమ ప్రభుత్వాల జేబు సంస్థలు అన్నట్లుగా వ్యవహరించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత అరెస్టే తరువాయి అంటూ బీజేపీ, ఎమ్మెల్యేల కుంభకోణం కేసులు బీఎల్ సంతోష్ నిండా ఇరుక్కున్నారు, ఆయన సిట్ దర్యాప్తునకు ఇహనో ఇప్పుడో రాక తప్పదంటూ బీఆర్ఎస్ హడావుడి చేసింది. అయితే.. ఈ హంగామా, హడావుడీ అంతా ఒక్కసారిగా ఆగిపోయింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో నిందితులకు బెయిల్స్ వస్తున్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలుబేరసారాల కేసు సిట్ నుంచి సీబీఐకి చేరింది. అయితే ఇంకా సీబీఐ కేసు తీసుకోలేదు. ఈ రెండు కేసులలోనూ కూడా దర్యాప్తు సంస్థల దూకుడు హఠాత్తుగా ఆగిపోయింది. దీంతో హాట్ హాట్ గా నడిచిన స్కాం రాజకీయాలు .. ఒక్కసారిగా ఎందుకు సైలెంట్ అయ్యాయన్నదే చర్చనీయాంశంగా మారింది.
దీంతో ఈ కేసుల విషయంలో బీఆర్ఎస్, బీజేపీల మధ్య అవగాహన కుదిరిందన్నఅనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగితే ఈ రెండు కేసుల కథ కంచికి వెళ్లినట్లేనని కూడా అంటున్నారు. మొత్తంగా తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారిన రెండు కీలక కేసుల విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ ల మౌనం ఆ రెండు పార్టీల మధ్యా లాలూచీకి నిదర్శనం అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మరి బీఆర్ఎస్, బీజేపీ .. నెక్ట్స్ ఏమిటన్నదే ఆసక్తికరంగా మారాయి.