అది ఒకప్పుడు సుందరమైన పర్యాటక ప్రదేశం. సాల్ట్ అండ్ జిప్సమ్ గనులు ఆ ప్రాంతంలో కొకొల్లలు. ఇప్పుడు అది సర్వనాశనమైంది. ఒకప్పుడు జీవకళతో కళకళలాడిన నగరంలో ఇప్పుడు.. అది సర్వనాశనమైంది. ఇప్పుడు ప్రేతకళ తాండవిస్తోంది. చూద్దామన్నా మనుషులు కనిపించని పరిస్థితి. ఎక్కడా చూసినా బాంబుల మోత, బుల్లెట్ల వర్షమే. యుద్ధం ఆ ఊరి రూపాన్నే మార్చేసింది. ఆ నగరాన్ని కైవసం చేసుకుంటే శత్రుదేశంపై యుద్ధంలో గెలిచినట్టే. అదే ఉక్రెయిన్‌లోని బాక్‌ముఠ్ నగరం..
రష్యాతో యుద్ధంలో కకావికలమైన బాక్ ముఠ్ రష్యా సరిహద్దు నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తూర్పు ఉక్రెయిన్‌లోని డొనెట్సెక్ ప్రావిన్స్‌లో ఒకప్పుడు ప్రఖ్యాత పర్యాటక ప్రదేశం.19వ శతాబ్దపు కట్టడాలు చూస్తూ సందర్శకులు మైమరిచిపోయేవారు. కాని, ఇప్పుడదంతా గతం. మొదటి ప్రపంచయుద్ధ కాలంలో కనిపించిన దృశ్యాలు ఇప్పుడు బాక్‌ముఠ్‌లో కనిపిస్తున్నాయి. ఏడాదిగా రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం ఈ నగరాన్ని ఘోస్ట్ సిటీగా మార్చేసింది. భూగర్భంలోని గుహల్లో తయారయ్యే మద్యానికి బాక్‌ముఠ్ ఒకప్పుడు ఎంతో ఫేమస్. కాని, ఇప్పుడు ఇది శిధిలనగరం.
ఈ నగరాన్ని స్వాధీనం చేసుకుంటే ఉక్రెయిన్‌ను దాదాపు ఆక్రమించినట్టే. అందుకే బాక్‌ముఠ్‌పై పట్టు సాధించేందుకు ఆరునెలలుగా రష్యా బలగాలు టార్గెట్ చేశాయి. ఈ నగరాన్ని చుట్టుముట్టి ఆరునెలలుగా బాంబు దాడులు చేస్తున్నాయి. రష్యన్ బలగాలకు బాక్ ముఠ్ నగరం చిక్కలేదు కాని, నిరంతరంగా సాగుతున్న బాంబులు మోత, కాల్పుల కారణంగా ఇక్కడ ఇప్పుడు ఎవరూ ఉండటం లేదు. నివాసయోగ్యం కాకపోవడంతో ఈ నగరానికి చెందిన వాళ్లంతా దూరప్రాంతాలకు తరలివెళ్లారు. కొందరు మాత్రం ఇప్పటికీ ఈ శిధిల నగరంలోనే తలదాచుకుంటున్నారు.
వాస్తవానికి బాక్‌ముఠ్ సైనిక పరంగా అంత ముఖ్యమైన నగరమేమి కాదు.అలాగని అదేమి వ్యూహాత్మకమైన ప్రాంతమూ కాదు. అయినప్పటికీ దీన్ని వశపరుచుకోవడం అత్యంత ప్రాధాన్యత విషయంగా రష్యా పరిగణిస్తోంది. బాక్‌ముఠ్‌ను కైవసం చేసుకోవడమంటే నైతికంగా ఎంతో విజయం సాధించినట్టుగా రష్యా బలగాలు భావిస్తున్నాయి. ఈ నగరాన్ని వశపరుచుకొని రవాణా స్థావరంగా మార్చుకోవాలన్నది రష్యా ఆలోచన. అటు ఉక్రెయిన్ దళాలు కూడా బాక్‌ముఠ్‌ను సులభంగా వదిలేయవచ్చు.
ఇప్పటికీ ఆ నగరమంతా ఖాళీ అయిపోయింది. అయినప్పటికీ ఉక్రెయిన్ బలగాలు దీన్ని వదులుకునేందుకు సిద్ధంగా లేవు. బాక్‌ముఠ్ పరాధీనం కాకుండా చివరి నిమిషం వరకు పోరాటం చేస్తామని ఉక్రెయిన్ దళాలు ప్రతిజ్ఞ చేస్తున్నాయి. 80 వేల మంది జనాభాతో సందడిగా ఉండే బాకుముఠ్‌లో ఇప్పుడు వేళ్ల మీద లెక్కించే జనం మాత్రమే కనిపిస్తున్నారు. వాళ్లు కూడా వెలుతురును చూసి చాలా కాలమవుతోంది. ప్రాణాలు కాపాడుకునేందుకు చాలా మంది బేస్‌మెంట్లలో తలదాచుకుంటున్నారు. భూమ్మీద నరకం ఎలా ఉంటుందో చూడాలంటే బాక్‌ముఠ్‌ను సందర్శించాలని అక్కడి వారు చెప్తున్నారు.బాక్‌ముఠ్ నగరం రష్యన్ బలగాల వశం కాకుండా ఉక్రెయిన్ సేనలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ నగరాన్ని కైవసం చేసుకుంటే ఉక్రెయిన్‌కు రష్యా ఒక అడుగు దగ్గరైనట్టే.
రష్యా నుంచి నిరంతరాయంగా దాడులు జరుగుతుండటంతో బాక్‌ముఠ్‌లో పరిస్థితి దారుణంగా ఉందని స్వయంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించిన పరిస్థితి. మరో వైపు రష్యా సైన్యానికి చెందిన ప్రైవేట్ దళం వ్యాగ్నర్ గ్రూప్ బాక్‌ముఠ్‌ను మూడు వైపుల చుట్టుమట్టాయమని ప్రకటించింది. ఎంత ప్రయత్నం చేసినా బాక్‌ముఠ్‌ను రష్యన్ దళాలు తమ అధీనంలోకి తెచ్చుకోలేకపోతున్నాయి.వాస్తవానికి యుద్ధాలు చేస్తే సమస్యలు తక్షణమే పరిష్కారమవుతాయనే భావన ప్రపంచవ్యాప్తంగా ఉంది. కాని, అది నిజం కాదు. యుద్ధమంటే ఏళ్ల తరబడి కొనసాగే విధ్వంసం, మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధంలో అలాగే జరిగింది. వియత్నాంపై అమెరికా యుద్ధం, 1979లో అఫ్గానిస్థాన్‌పై సోవియట్ దాడి దీర్ఘకాలం పాటు సాగాయి. ఇప్పుడు రష్యా, ఉక్రెయిన్ విషయంలోనూ అదే జరుగుతోంది. ఇప్పటికే యుద్ధం మొదలై ఏడాది గడిచిపోయింది.
మరోవైపు.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఘోర అకృత్యానికి సిద్ధపడుతున్నట్లు ఓ నివేదిక పేర్కొంది. ప్రస్తుతం రష్యా బలగాలు యుద్ధంలో పలు నష్టాలను చవిచూస్తున్నాయి. ఓ వైపు ఆయుధాల కొరత, మరో వైపు నైపుణ్యవంతులైన బలగాల కొరతతో పోరాడలేక తీవ్రంగా సతమతమవుతోంది. దీంతో ఉక్రెయిన్‌పై గెలుపు కోసం సాముహిక ఆత్మాహుతి దాడులకు రష్యా రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. ఏ క్షణమైనా పుతిన్ దీన్ని అదేశించే అవకాశం ఉందని కూడా నివేదిక వెల్లడించింది. ఈ ఉత్తర్వు రాబోయే మూడు నెలల్లోనే అమలయ్యే అవకాశం లేకపోలేదని నివేదిక స్పష్టం చేసింది.విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్ర పరిణామాలను ఎదుర్కొనక తప్పదంటున్నారు. అవి.. రష్యా చర్యల కారణంగా పొరుగున ఉన్న దేశాలు దాడికి దిగే ప్రమాదం ఉంది.
ఉక్రెయిన్ పాశ్చాత్య దేశాల ఆయుధాల సాయంతో యుద్ధంలో పురోగతి సాధించడంతో పుతిన్ యుద్ధంపై విశ్వాసం కోల్పోయి.. మిలటరీ స్దబత ఏర్పడి రష్యా యుద్ధం వీగిపోవచ్చు అని చెబుతున్నారు. అదీగాక ఈ యుద్ధం ప్రారంభమైన ఒక ఏడాది తరువాత నుంచి రష్యా పెద్ద సంఖ్యలో సైనికులను, యుద్ధ విమానాలను కోల్పోయి పలు నష్టాలను ఎదుర్కొంటూ వచ్చింది. ఇప్పటి వరకు రష్యా దళాలు సంయుక్త దాడిని సమర్థవంతంగా సమన్వయం చేయలేకపోయాయి. గత కొన్ని వారాలుగా ప్రభావంతంగా రష్యన్లు సాముహిక దాడి కొన సాగించలేకపోయారు. పైగా భారీ ఫిరంగి దళాలకు తగిన శిక్షణ లేకపోవండంతో వారికి మిగిలి ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ సాముహిక ఆత్మాహుతి పదాతి దళ వ్యూహం. ఇది నిస్సందేహంగా వాయు రక్షణ క్షిపణుల కంటే ప్రాణాంతంకంగా మారే అవకాశం ఉంది…