Homeఅంతర్జాతీయంరష్యా యుద్దంలో పుతిన్ అంచనాలు అన్నీ తలకిందులు అయ్యాయా..?

రష్యా యుద్దంలో పుతిన్ అంచనాలు అన్నీ తలకిందులు అయ్యాయా..?

పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా ఉక్రెయిన్ పై యుద్దంతో విరుచుకుపడింది రష్యా.. రోజుల వ్యవధిలోనే ఉక్రెయిన్ ను ఆక్రమించాలనే లక్ష్యంగా దాడికి దిగిన రష్యాకు ఆదిలోనే పరాభవం ఎదురైంది.. అయినప్పటికీ.. పుతిన్ సేనలు దాడులకు తెగబడుతూనే ఉన్నాయి.. మరోవైపు ఉక్రెయిన్ నాటో దేశాల సహాయంతో రష్యాను ఎదుర్కొంటోంది.. ఇంతకూ పుతిన్ ఈ యుద్దంలో సాధించిందేమిటి..?

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం రెండో ఏడాదిలోకి ప్రవేశించింది.. దురాక్రమణ ప్రయత్నాలు జోరుగా కొనసాగుతూనే ఉన్నాయి. ఏడాది మారణహోమం తర్వాత కూడా వ్లాదిమిర్‌ వ్లాదిమిరోవిచ్‌ పుతిన్‌ కు రాజ్యకాంక్ష ఏమాత్రం చల్లారలేదు.పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా ఉక్రెయిన్‌ పై ఉరుకులు పరుగుల మీద విరుచుకుపడ్డ రష్యాకు, తన అస్త్రాలేవీ పనికి రాకుండా పోయాయని జ్ఞానోదయం కలగడానికి ఎంతోసేపు పట్టలేదు. బాహుబలిగా కాలుదువ్విన పుతిన్‌… ఏడాది తిరిగేసరికి ప్రపంచం దృష్టిలో విలన్‌ అయ్యారు. సొంత ప్రజల దృష్టిలోనూ బాహుబలి హోదాను ఒకింత కోల్పోయారు.

పూర్వపు సోవియట్‌ యూనియన్‌ రిపబ్లిక్ లు అన్నింటినీ మళ్లీ ఒకే తాటిమీదకు తేవాలన్నది తన లక్ష్యమని పుతిన్‌ చెప్పుకుంటారు. పొరుగు దేశాలైనఉక్రెయిన్, బెలారస్‌ కూడా ఒకప్పుడు రష్యాలోఅంతర్భాగమేనని అంటారాయన. రెండేళ్ల క్రితం పుతిన్ రాసిన ఓ సుదీర్ఘ వ్యాసంలో కూడా ఈ విషయాన్ని సుస్పష్టం చేశారు. బెలారస్‌తో రష్యాకు ఎలాంటి విభేదాలూ లేవు. పైగా ఉక్రెయిన్‌పై దాడిలో రష్యాకు ఆది నుంచీ అది వెన్నుదన్నుగా ఉంది. రష్యా తొలుత ఉక్రెయిన్‌లో చొరబడేందుకు తన భూభాగాన్ని అనుమతించింది కూడా. ఎటొచ్చీ పుతిన్‌కు సమస్య ఉన్నది కేవలం ఉక్రెయిన్‌తోనే… ఆ దేశ సార్వభౌమత్వాన్నిగుర్తించడానికి కూడా రష్యా ఎన్నడూ ఇష్టపడలేదు. రష్యా, ఉక్రెయిన్‌ ఒకే దేశమన్నదే పుతిన్‌ గట్టి నమ్మకం. లోగుట్టు నిగూఢంగా చూస్తే మాత్రం, ఈ గొడవంతా పైపై పటారమే. అసలు విషయం ఏమిటంటే సుదీర్ఘ కాలం పాటు రష్యాకు తిరుగులేని నాయకునిగా వెలిగిపోవాలన్నది పుతిన్‌లో అంతర్లీనంగా ఉన్న ఆశగా చెప్తారు.

మూడేళ్ల క్రితం పుతిన్ ఆ దిశగా ప్రయత్నం చేశారు. ప్రజాభిప్రాయ సేకరణతో రాజ్యాంగాన్ని మార్చి అధ్యక్షునిగా 16 ఏళ్ల పాటు నిరాటంకంగా కొనసాగేలా కొత్త చట్టం తెచ్చేందుకు క్రెమ్లిన్‌ ప్రయత్నించింది. ఆ సమయంలో రష్యా టీవీ పుతిన్‌ కీర్తనలు, గుణగనాలతో హోరెత్తేది.కల్లోల సాగరం లాంటి ప్రపంచంలో రష్యా నౌకను సమర్థంగా నడిపిస్తున్న కెప్టెన్‌ పుతిన్‌’ అంటూ ఊదరగొట్టేవారు. క్రెమ్లిన్‌ దృష్టిలో పుతిన్‌ సకల కళావల్లభుడు, సకలశాస్త్ర పారంగతుడు. అందుకే జూడో, రేసింగ్, స్విమ్మింగ్, హార్స్‌ రైడింగ్‌ విన్యాసాల్లో పుతిన్‌ సాహసకృత్యాల తాలూకు ఫొటోలను తరచూ ప్రపంచం ముందుకు తెస్తూంటుంది క్రెమ్లిన్‌. రష్యా ప్రజలను ప్రభావితం చేసి పుతిన్‌ పట్ల ఆరాధనా భావాన్ని పెంపొందించే ప్రయత్నాల్లో క్రెమ్లిన్‌ ఎంచుకున్న మార్గమిది.అసలు విషయమేమిటంటే 2024లో రష్యా అధ్యక్ష ఎన్నికలున్నాయి. ఆలోపు ఏదో ఒక ఘనకార్యం చేసి పుతిన్‌ కీర్తిని అమాంతం పెంచేయడం క్రెమ్లిన్‌ లక్ష్యం.

పశ్చిమ దేశాల కనుసన్నల్లో సాగుతున్న ఉక్రెయిన్‌ ను ఓ దారికి తెస్తే… పుతిన్‌ సత్తా ఏమిటో తెలుస్తుందని, అధ్యక్ష ఎన్నికల్లో మంచి ప్రచారాస్త్రంగా మారుతుందని క్రెమ్లిన్‌ థింక్‌టాంక్‌ అంచనా.అనుకున్నదే తడవుగా దాడికి దిగడం, ఆరంభంలో కొన్ని ప్రాంతాను ఆక్రమించి ఎగిరి గంతెయ్యడం… ఆ తర్వాత ఉక్రెయిన్‌ ధాటికి తట్టుకోలేక వాటిని వదిలేసి తోకముడవడం చకచకా జరిగిపోయాయి.అయినా సరే, ఇప్పటికీ ఉక్రెయిన్‌పై దాడిని తప్పుగా పుతిన్‌ అంగీకరించడం లేదు.

రెండు మూడు రోజుల క్రితం మాట్లాడుతూ ఇదంతా పశ్చిమ దేశాల కుట్రేనని చెప్పుకొచ్చారు… దానికి జవాబుగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఏకంగా ఉక్రెయిన్‌ యుద్ధభూమిలో అడుగుపెట్టారు.. ఈ పోరులో తమ వైఖరిని మరోసారి కుండబద్ధలు కొట్టారు. ఉక్రెయిన్‌ను గెలవడం రష్యా తరం కాదని అక్కడే మీడియా ముఖంగా ప్రకటించేశారు.బహుశా పుతిన్‌ కూడా ఇలాంటి సవాలు కోసమే ఎదురు చూస్తున్నట్టున్నారు… ఏదోలా వచ్చే ఏడాది రష్యా అధ్యక్ష ఎన్నికల దాకా యుద్ధం కొనసాగాలన్నదే ఆయన అభిమతమని పరిశీలకుల అంచనా. యుద్ధం సమాధుల మీద 2024 అధ్యక్ష ఎన్నికలను నెగ్గాలని పుతిన్‌ భావిస్తున్నట్టు చెబుతున్నారు.1999లో బోరిస్‌ యెల్సిన్‌ ఆకస్మిక రాజీనామాతో ఆపద్ధర్మ అధ్యక్షునిగా తొలిసారి గద్దెనెక్కిన పుతిన్‌… 2000-2004, 2004-08ల్లో రెండు దఫాలుగా అధ్యక్షునిగా కొనసాగారు. అప్పట్లో రష్యా అధ్యక్ష పదవీకాలం నాలుగేళ్లే. తర్వాత 2008 నుంచి 2012 వరకు పుతిన్ ప్రధానిగా కొనసాగారు.. ఈ దశలో రాజ్యాంగ సవరణల ద్వారా అధ్యక్ష పదవీకాలాన్ని ఆరేళ్లకు పెంచారు.

2012 నుంచి 2018 వరకు, 2018 నుంచి ఇప్పటి వరకు పుతిన్‌ అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. 2024 మార్చితో పదవీకాలం ముగుస్తుంది. ఒక వ్యక్తి వరుసగా రెండుసార్లకు మించి అధ్యక్షునిగా ఉండరాదన్న నిబంధనను కూడా రాజ్యాంగ సవరణ ద్వారా మార్చారు.ఫలితంగా 2024తో పాటు 2030 ఎన్నికల్లోనూ పోటీ చేసే అవకాశం పుతిన్‌ కు సంక్రమించింది. ఈ రెండుసార్లూ గెలిస్తే 2036 వరకు పుతినే రష్యా అధినేతగా చక్రం తిప్పుతారు. అలా ఒకే దెబ్బకు రెండు పిట్టల్లా ఒకే యుద్ధంతో అటు రాజ్యకాంక్షను, ఇటు పదవీకాంక్షనూ నెరవేర్చుకోవాలని పుతిన్‌ పట్టుదలగా ఉన్నారు. అందుకే యుద్ధానికి ఇప్పుడప్పట్లో ముగింపు పలికేందుకు ససేమిరా అంటున్నారు.

యుద్ధంలో వెనకబడుతున్నట్టు అన్పించినప్పుడల్లా అణ్వాయుధ బూచితో ప్రపంచాన్ని బెదిరిస్తున్నారు. అటు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కూడా అమెరికా మద్దతుతో లొంగేది లేదంటూ దీటుగా తలపడుతున్నారు. చివరికి గెలుపెవరిదైనా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం మాత్రం వైరి వర్గాలు రెండింటినీ వెంటాడుతూనే ఉంటాయి. చరిత్ర చెక్కిలిపై యుద్ధం ఎప్పుడూ ఓ కన్నీటి బిందువే… చెరిగిపోని మచ్చే… ఉక్రెయిన్ ను తక్కువ అంచనా వేసి.. దురాక్రమణకు పాల్పడుతోన్న పుతిన్.. ఆ దేశంపై యుద్దంలో విజయం సాధించలేకపోవడం రష్యా వైఫల్యానికి నిదర్శనం.. అప్పటి వరకు రష్యా అంటే ఎంతో శక్తి వంతమైన దేశంగా భావించిన ప్రపంచదేశాలు.. ఉక్రెయిన్ పై యుద్దంలో రష్యా పేలవ పోరుతో తన స్థాయిని తగ్గించుకుందనేది విశ్లేషకుల అభిప్రాయం..

మరోవైపు… ఉక్రెయిన్‌ ను యుద్ధంలో క్రమేపీ అణచివేయొచ్చని పుతిన్‌ ఇప్పటికీ ఆత్మవిశ్వాసంతో ఉన్నారని అమెరికా నిఘా సంస్థ సీఐఏ డైరెక్టర్‌ విలియం బర్న్స్‌ పేర్కొన్నారు. రష్యా ఇంటెలిజెన్స్‌ సర్వీస్‌ నవంబర్‌ మీటింగ్‌ వారి నమ్మకాన్ని సూచిస్తోందని పేర్కొన్నారు. ఇప్పటికీ సమయాన్ని తనకు అనుకూలంగా మార్చుకోగలనని, ఐరోపాలోని మా మిత్రులను అధిగమించగలనని, రాజకీయంగా వారు అలసిపోతారని పుతిన్‌ భావిస్తున్నారన్నారు. ”ప్రస్తుతం పుతిన్‌ తన సామర్థ్యంపై పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నారని నేను భావిస్తున్నాను.

ఉక్రెయిన్‌ను ఓడిస్తానని నమ్ముతున్నారు. ఒక దశలో అమాయక రష్యన్ల ప్రాణనష్టం పెరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు” అని బర్న్స్‌ పేర్కొన్నారు.ఈ యుద్ధం విస్తరిస్తున్న విధానాన్ని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ జాగ్రత్తగా గమనిస్తున్నారని విలియం బర్న్స్‌ పేర్కొన్నారు. మరోవైపు రష్యాకు ప్రమాదకర ఆయుధాలు చైనా నుంచి సరఫరా అయ్యే అవకాశం ఉందని బైడెన్‌ సర్కారు బలంగా విశ్వసిస్తోంది. ఒకవేళ చైనా నుంచి ఆయుధ సరఫరా జరిగితే అది నిజంగా చాలా పెద్ద తప్పుగా మిగులుతుంది.

చైనా – అమెరికా మధ్య సంబంధాలు మరింత దెబ్బతింటాయన్నారు.2027లో తైవాన్‌ను ఆక్రమించడానికి సిద్ధంగా ఉండాలని ఇప్పటికే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ సైన్యానికి చెప్పారని విలియం బర్న్స్‌ పేర్కొన్నారు. తాజాగా ఉక్రెయిన్‌-రష్యా యుద్ధాన్ని చూశాక చైనా సైనిక సామర్థ్యంపై జిన్‌పింగ్‌ మనసులో కొన్ని సందేహాలు ఉన్నాయని తాము భావిస్తున్నట్లు చెప్పారు. తైవాన్‌ను నియంత్రించాలనే జిన్‌పింగ్‌ కోర్కెను అమెరికా తీవ్రంగా పరిగణిస్తుందని పేర్కొన్నారు.

Must Read

spot_img