Homeఅంతర్జాతీయంరష్యా ఉక్రెయిన్ యుధ్దాన్ని ఆపడం కోసం చైనా రంగంలోకి దిగిందా?

రష్యా ఉక్రెయిన్ యుధ్దాన్ని ఆపడం కోసం చైనా రంగంలోకి దిగిందా?

తైవాన్ తో యుధ్దానికి రంకెలు వేస్తోన్న డ్రాగన్ కంట్రీ శాంతి వచనాలు పలుకుతోంది. మొన్నటికి మొన్న ఇరాన్ సౌదీల మధ్య స్నేహం చిగురింపజేసి,ఉక్రెయిన్ విదేశాంగ మంత్రికి ఫోన్ చేసి యుధ్దం ముగింపు విషయంలో సంప్రదింపులు జరిపింది. చైనా విదేశాంగ మంత్రి స్వయంగా ఉక్రెయిన్ కు ఫోన్ చేసారు. ఇప్పుడు తాజగా యుధ్దాన్ని నిలిపేందుకు సాక్షాత్తూ షీ జిన్ పింగ్ రంగంలోకి దిగనున్నారు. పుతిన్ ఆహ్వానం మేరకు 3 రోజులు రష్యా పర్యటించనున్నారు..

ప్రపంచాన్ని అతాలకుతలం చేస్తున్న రష్యా ఉక్రెయిన్ యుధ్దాన్ని ఆపడం కోసం చైనా రంగంలోకి దిగింది. ఈ మేరకు ఇప్పటికే ఉక్రెయిన్ విదేశాంగ మంత్రికి ఫోన్ చేయడమే కాకుండా ఇప్పుడు చైనా జీవితకాలపు అధ్యక్షుడైన షీ జిన్ పింగ్ నడుం బిగించారు. యుద్ధాన్ని ఆపడమే లక్ష్యంగా రష్యాలో మూడు రోజులపాటు పర్యటించనున్నారు. ఈ రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఆహ్వానం మేరకు నెల 20 నుంచి 22 వరకూ జిన్‌పింగ్‌ మాస్కోలో పర్యటించనున్నారు. చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి హువా చున్‌యింగ్‌ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం దీర్ఘకాలంగా కొనసాగుతున్న తరుణంలో జిన్‌పింగ్‌ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. యుద్ధానికి ముగింపు పలికే దిశగా పుతిన్‌తో జిన్‌పింగ్‌ కీలక చర్చలు జరపనున్నట్లు సమాచారం. ఈ ప్రకటనను యూరప్ దేశాలు స్వాగతించాయి.

రష్యా ఉక్రెయిన్ మధ్య వివాదం కేవలం రాజకీయ చర్చల ద్వారానే పరిష్కారమవుతాయని మేము ఎప్పుడూ విశ్వసిస్తాం” అని చైనా విదేశాంగ శాఖకు చెందిన మరో అధికార ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ ఈ సందర్భంగా తెలిపారు. ఇటీవలే మూడోసారి చైనా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత జిన్‌పింగ్‌ చేస్తున్న ఈ తొలి విదేశీ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కనీసం రష్యా మిత్రదేశం చైనా అయినా ఈ సమస్యకు ఓ పరిష్కారం కనిపెడితే అంతకన్నా కావాలసిందేముందన్న అభిప్రాయం వినిపిస్తోంది. అయితే రష్యా పర్యటన తరువాత చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ద్వారా శుభవార్త వస్తుందా? అన్న విషయం ఉత్కంఠను కలిగిస్తోంది. మరోవైపు ఈ పర్యటనలో భాగంగా ఇరు దేశాల అధ్యక్షుల మధ్య సమగ్రమైన భాగస్వామ్యం, భవిష్యత్తులో వ్యూహాత్మకమైన పరస్పర సహకారంతోపాటు అనేక సంబంధిత అంశాలపై చర్చించనున్నారు.

చైనా అధ్యక్షుడి పర్యటనను రష్యా అధికార భవనం క్రెమ్లిన్ ఓ ప్రకటన ద్రువీకరించింది. జిన్‌పింగ్ రష్యా పర్యటనపై చైనా ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. మూడు రోజుల పర్యటనలో తమ దేశాల మధ్య సంబంధాలు, భవిష్యత్తులో వ్యూహాత్మక పరస్పర సహకారం వంటి అంశాలతో పాటు రష్యా – యుక్రెయిన్ మధ్య యుద్ధానికి ముగింపు పలికేలా జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య చర్చలు జరుగుతాయని తెలిపింది. పుతిన్ తో జిన్‌పింగ్‌కు గత పదేళ్లుగా మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో యుక్రెయిన్ యుద్ధాన్ని శాంతియుతంగా చర్చల ద్వారా ముగించాలని జిన్‌పింగ్ సూచనలను పుతిన్ తప్పక వింటారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఇప్పటికే ఈ విషయంపై ఇరుదేశాల అధ్యక్షులు ఫోన్ లో మాట్లాడుకున్నారని సమాచారం.యుక్రెయిన్ – రష్యా యుద్ధాన్ని శాంతియుతంగా ముగించాలన్న ప్రధాన అజెండాతోనే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ రష్యా వెళ్తున్నట్లు వాదనలుసైతం వినిపిస్తున్నాయి.

రష్యా, యుక్రెయిన్ మధ్య ఏడాదికాలంగా యుద్ధం కొనసాగుతోంది. యుక్రెయిన్ లోని అనేక నగరాలపై రష్యా సైన్యం క్షిపణుల దాడులతోవిరుచుకుపడుతుంది. వేలాది మంది మరణించగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. యుక్రెయిన్ పై యుద్ధాన్ని ఆపేందుకు అనేక దేశాలు ప్రయత్నిస్తున్నాయి, రష్యాకు హెచ్చరికలు సైతం చేస్తున్నాయి. అయినా రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం వెనక్కుతగ్గడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మూడు రోజుల రష్యా పర్యటనలో యుక్రెయిన్ కు ఏమేరకు శుభవార్త వినిపిస్తారోనన్న అంశం చర్చనీయాంశంగా మారింది.

ఉక్రెయిన్ లో యుద్ధ నేరాలకు పాల్పడ్డారని పుతిన్ ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ సంచలన నిర్ణయం తీసుకుంది. వ్లాదిమిర్ పుతిన్ ను అరెస్ట్ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు నెదర్లాండ్స్ ది హేగ్ లో గల ఈ కోర్ట్ న్యాయమూర్తి అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఉక్రెయిన్ లో యుద్ధ నేరాలకు పాల్పడిన కారణంగా వెంటనే పుతిన్ ను అరెస్ట్ చేయాలని ఆదేశించారు. పిల్లలను చట్టవిరుద్ధంగా బహిష్కరించడం, ఉక్రెయిన్ భూభాగం నుంచి ప్రజలను చట్టవిరుద్ధంగా తన దేశానికి తరలించారనే కారణంతో పుతిన్ అరెస్ట్ కోసం ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ వారెంట్ జారీ చేసింది. దీనిపై ఉక్రెయిన్ ప్రభుత్వం స్పందించింది. ఇది బిగినింగ్ మాత్రమేనని వ్యాఖ్యానించింది. మున్ముందు వ్లాదిమిర్ పుతిన్ ఇంకా ఎన్నో రకాల న్యాయపరమైన కేసులను ఎదుర్కొనడం ఖాయమని, దానికి తొలి అడుగు పడిందని పేర్కొంది.

Must Read

spot_img