Homeఅంతర్జాతీయంరష్యా అధ్యక్షుడు కీలక ప్రకటన… అమెరికాతో ఒప్పందం

రష్యా అధ్యక్షుడు కీలక ప్రకటన… అమెరికాతో ఒప్పందం

ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్దం కాస్తా.. అమెరికా, రష్యాల కీలక ఒప్పందంపై తీవ్ర ప్రభావం చూపుతోందా..? అమెరికాతో న్యూస్టార్ట్ ఒప్పందంలో రష్యా తన భాగస్వామ్యాన్ని నిలిపివేస్తున్నట్లు పుతిన్ ప్రకటించడం దేనికి సంకేతం…?

ఉక్రెయిన్, రష్యాల యుద్దం కారణంగా ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? అమెరికాతో న్యూస్టార్ట్ ఒప్పందం నుంచి రష్యా తన భాగస్వామ్యాన్ని నిలిపివేయడం వల్ల మళ్లీ దేశాల మధ్య ఆయుధాల రేసు తప్పదా..? ప్రపంచదేశాలకు కొత్త ఆందోళన మొదలైందా..?

ఉక్రెయిన్‌పై దాడికి దిగి… ఏడాది కావొస్తున్న వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక ప్రకటన చేశారు. అణ్వాయుధ వినియోగంపై పరిమితి విధిస్తూ అగ్రరాజ్యంతో చేసుకున్న ఒప్పందంలో రష్యా భాగస్వామ్యాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. ఇరుపక్షాల వ్యూహాత్మక అణ్వాయుధాలను పరిమితం చేసే అమెరికాతో న్యూ స్టార్ట్‌ ఒప్పందంలో రష్యా తన భాగస్వామ్యాన్ని నిలిపివేస్తున్నట్లు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. “అమెరికాతో రష్యా వ్యూహాత్మక ప్రమాదకర ఆయుధాల ఒప్పందంలో తన భాగస్వామ్యాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు నేను ప్రకటించవలసి వచ్చింది” అని ఉక్రెయిన్‌లో యుద్ధానికి దాదాపు ఒక సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా పార్లమెంటులో ప్రధాన ప్రసంగం ముగింపులో పుతిన్ చట్టసభ సభ్యులతో అన్నారు. . అయితే ఒప్పందం నుంచి ఇప్పుడే పూర్తిగా బయటకు రావట్లేదని పుతిన్‌ చెప్పడం కొసమెరుపు..

ఉక్రెయిన్‌ తో యుద్దం చేస్తోన్న రష్యాను ఓడించాలన్న లక్ష్యాన్ని అమెరికా, నాటో దేశాలు బహిరంగంగానే ప్రకటిస్తున్నాయని, వ్యూహాత్మకంగా మమ్మల్ని ఓడించి.. మా అణు కేంద్రాలను చేరుకోవడానికి వారు ప్రయత్నిస్తున్నారని పుతిన్‌ వెల్లడించారు.. ఒప్పందం ప్రకారం రష్యా అణ్వాయుధ సామర్థ్యాలపై అమెరికా తనిఖీలు చేస్తోందన్నారు. అదే సమయంలో నాటో దేశాలు మా వైమానిక స్థావరాలపై ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడులు చేసేందుకు సాయం చేస్తున్నాయని పుతిన్ తన ప్రసంగంలో తెలిపారు. అమెరికా ఇలాంటి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే అణ్వాయుధ ప్రయోగాలను పునరుద్ధరించేందుకు తాము సిద్ధంగా
ఉన్నామని రష్యా అధ్యక్షుడు ఒప్పందంపై తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. వాస్తవానికి ఈ న్యూ స్టార్ట్‌ ట్రిటీ ఒప్పందంపై 2010లో ఇరు దేశాలు సంతకం చేశాయి. ఆ తర్వాత ఏడాదే ఇది అమల్లులోకి వచ్చింది. మళ్లీ 2021లో జో బైడెన్‌ పదవీ భాద్యతలు స్వీకరించిన తర్వాత ఈ ఒప్పందం మరో ఐదేళ్ల పాటు పొడిగించడం జరిగింది. ఇది అమెరికా రష్యా వ్యూహాత్మక అణు వార్‌హెడ్‌లను సంఖ్యను పరిమితం చేసేలా, భూమి, జలాంతర్గామీ ఆధారిత క్షిపణులు, బాంబులను మరింతగా విస్తరింప చేస్తోంది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రష్యా వద్ద దాదాపు 6 వేల వార్‌హెడ్‌లతో ప్రపంచంలోనే అతిపెద్ద అణ్వాయుధాల నిల్వ ఉన్నట్లు సమాచారం. అంతేగాదు రష్యా, అమెరికాలే ప్రపంచంలోని 90 శాతం అణు వార్‌హెడ్‌లను కలిగి ఉన్నాయని, ఇవి ఒక గ్రహాన్ని పూర్తిగా నాశనం చేయగలవని చెబుతున్నారు. 2010లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, రష్యా అధ్యక్షుడు దిమిత్రి మెద్వెదేవ్‌ మధ్య న్యూ స్టార్ట్‌ ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం.. ఇరు దేశాలు 1550 కంటే ఎక్కువ న్యూక్లియర్‌ వార్‌హెడ్‌లు, 700 కంటే ఎక్కువ క్షిపణులు, బాంబర్లను మోహరించకూడదు. 2021 ఫిబ్రవరి నాటికి ఈ ఒప్పందం గడువు ముగియగా.. దీన్ని మరో ఐదేళ్లు పొడగించుకునేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి.

ఈ ఒప్పందం కింద అమెరికా, రష్యాలు పరస్పరం తనిఖీలు చేసుకుంటాయి. అయితే కొవిడ్ మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా ఈ తనిఖీలను నిలిపివేశారు. ఇటీవల అమెరికా ఈ తనిఖీలను పునరుద్ధరించాలని ప్రయత్నించగా.. ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో రష్యా తిరస్కరిస్తూ వస్తోంది. తాజాగా ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు పుతిన్‌ ప్రకటించారు.

ఉక్రెయిన్‌పై దాడికి ఏడాది కావొస్తున్న వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలో రష్యన్‌ స్టేట్‌ మీడియా వెబ్‌సైట్లు డౌన్‌ అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలువురు పాత్రికేయులు రష్యా స్టేట్ టెలివిజన్ అండ్‌ రేడియో బ్రాడ్‌కాస్టింగ్‌ కంపెనీ వెబ్‌సైట్‌ సేవలను పొందలేకపోయారు. దీనిపై ఆ కంపెనీ స్పందించింది. సాంకేతిక పరంగా కొన్ని పనులు చేపడుతున్నామని వెల్లడించింది.

ఉక్రెయిన్‌ కు మద్దతిస్తున్న పాశ్చాత్యదేశాలపై రష్యా గుర్రుగా ఉంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ఉక్రెయిన్‌ లో పర్యటించడం పుతిన్‌ కు ఆగ్రహం తెప్పించింది. ఈ నేపథ్యంలో పుతిన్ రష్యా పార్లమెంటులో మాట్లాడుతూ… ఏకంగా ‘స్టార్ట్‌’ ఒప్పందాన్ని సస్పెండ్‌ చేస్తున్నట్టు ప్రకటించారు. రెండో ప్రపంచయుద్ధంలో హిరోషిమా, నాగసాకిలపై అణుబాంబు ప్రయోగం తరువాత ఇవి ఎంత ప్రమాదకరమో ప్రపంచానికి తెలిసింది. అప్పటికే ఈ రంగంలో అమెరికా, రష్యాలు ముందున్నాయి. ప్రచ్ఛన్నయుద్దంలో భాగంగా రెండు దేశాలు వేలాది అణ్వాయుధాలను తయారు చేశాయి. ఈ ప్రపంచాన్ని అనేకసార్లు
భస్మీపటలం చేసే సామర్థ్యం ఈ అణ్వాయుధాలకు ఉంది.

ఒక వేళ మూడో ప్రపంచయుద్ధం జరిగితే ఆ తరువాత నాలుగో ప్రపంచయుద్ధం కర్రలు, రాళ్లతో చేయాల్సి వస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.. న్యూస్టార్ట్‌ అంటే.. వ్యూహాత్మక అణ్వాయుధాల తగ్గింపు ఒప్పందం అని అర్థం. 2010 కన్నా ముందు సోవియట్‌ యూనియన్‌, అమెరికాల మధ్య అనేక ఒప్పందాలు కుదిరాయి. దీనిలో భాగంగా అణ్వాయుధాల నిల్వలను, వ్యూహాత్మక ఆయుధాలను తగ్గించుకున్నాయి. కాలపరిధి దాటిన వెంటనే ఈ ఒప్పందాలను కొత్తగా చేసుకునేవారు. ఇందులో భాగంగానే 2010లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామా, రష్యా అధ్యక్షుడు మెద్వెడెవ్‌లు ఒప్పందంపై సంతకాలు చేశారు. ఇది 2011 నుంచి అమలులోకి వచ్చింది. దీని ప్రకారం క్షిపణులు, బాంబర్లను 700కు పరిమితం చేయడం, వార్‌హెడ్స్‌ను 1550కు తగ్గించడం, ఇతర బాంబర్లను 800 కు తగ్గించాలని నిర్ణయించారు.

2021లో రష్యా, అమెరికాలు న్యూస్టార్ట్ ఒప్పందాన్ని మరో ఐదు సంవత్సరాల పాటు పొడిగించారు. తాజాగా పుతిన్‌ ఈ ఒప్పందాన్ని నిలుపుదల చేయడంతో మళ్లీ ఆయుధాల పోటీ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం రష్యా, అమెరికా, చైనా, ఇంగ్లాండ్‌, ఫ్రాన్స్‌ల దగ్గర వేలాది అణ్వాయుధాలు ఉన్నాయి. భారత్‌, పాక్‌ల వద్ద పరిమితంగా ఉన్నాయి. ఇజ్రాయెల్‌, ఉత్తరకొరియాల వద్ద కూడా ఉండవచ్చని తెలుస్తోంది. మాస్కో-వాషింగ్టన్‌ల మధ్య చర్చలు ప్రారంభం కావాల్సి ఉండగా… కరోనా అనంతరం ఉక్రెయిన్‌ ఘటనతో వాయిదా పడింది. ఇప్పుడు ఏకంగా ఆ ఒప్పందాన్ని నిలుపుదల చేయాలని పుతిన్‌ తీసుకున్న నిర్ణయం అంతర్జాతీయ సమాజాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర, ఉక్రెయిన్‌కు పాశ్చాత్యదేశాల ఆయుధ సరఫరాతో ప్రపంచం మరోసారి అణు భయాన్ని ఎదుర్కొంటోంది.

రష్యా- ఉక్రెయిన్ మధ్య జరుగుతన్న యుద్ధం కారణంగా తలెత్తిన పరిస్థితుల నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా, రష్యాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇదే తరహా వాతావరణం కొనసాగితే భవిష్యత్తులో అమెరికా, రష్యా మధ్య అణుయుద్ధం వచ్చే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన రట్జర్స్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తల పరిశోధన కీలక అంశాలను వెల్లడించింది. నేటి ఆధునిక కాలంలో అమెరికా- రష్యా మధ్య పూర్తిస్ధాయి అణు యుద్ధం జరిగితే తలెత్తే పరిణామాల వల్ల దాదాపు 500 కోట్ల మంది ప్రాణాలు కోల్పోతారని
అంచనావేసింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తత కారణంగా అణుయుద్ధం సంభవించవచ్చనే అనుమానాల మధ్య తాజా అధ్యయనం సంచలన విషయాలను వెల్లడించింది.

అమెరికా రష్యా మధ్య పూర్తిస్థాయి అణుయుద్ధం వల్ల సగానికి పైగా మానవాళి తుడుచు పెట్టుకుపోతుందని, పంట ఉత్పత్తి 90 శాతం పడిపోతుందని రట్జర్స్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు తమ నివేదికలో పేర్కొన్నారు. అత్యాధునిక అణుయుద్ధం తలెత్తితే వాతావరణంలోకి చేరే ధూళి, ఉద్గారాలు, సూర్యకాంతిని నిరోధించే మసి, కరువు కారణంగా కనీసం 500 కోట్ల మంది మరణించవచ్చని ఈ పరిశోధనలో తేలింది. రట్జర్ విశ్వవిద్యాలయంలోని శాస్త్ర వేత్తల బృందం అణుయుద్ధం జరిగేందుకు ఉన్న 6అవకాశాలను విశ్లేషించింది. వీటిలో అమెరికా, రష్యా మధ్య జరిగే అణు యుద్ధం భూగోళంపై భయంకరమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని తేలింది. సగానికి పైగా మానవాళి తుడుచుపెట్టుకుపోతుందని వెల్లడించింది.

వ్యూహాత్మక అణ్వాయుధాల తగ్గింపు ఒప్పందమే న్యూస్టార్ట్.. 2010 కన్నా ముందు సోవియట్‌ యూనియన్‌, అమెరికాల మధ్య అనేక ఒప్పందాలు కుదిరాయి. దీనిలో భాగంగా అణ్వాయుధాల నిల్వలను, వ్యూహాత్మక ఆయుధాలను తగ్గించుకున్నాయి. ఇందులో భాగంగానే 2010లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామా, రష్యా అధ్యక్షుడు మెద్వెడెవ్‌లు ఒప్పందంపై సంతకాలు చేశారు.

Must Read

spot_img