Homeఅంతర్జాతీయంరష్యా, ఉక్రెయిన్ యుద్ధం విషయంలో అమెరికా యూ టర్న్

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం విషయంలో అమెరికా యూ టర్న్

రష్యాతో యుద్దం చేస్తోన్న ఉక్రెయిన్ కు అమెరికా సహా నాటో దేశాలు సహాయం చేస్తున్నాయి.. ముఖ్యంగా అమెరికా అందించే సహాయమే ఉక్రెయిన్ కు కీలకం.. అలాంటి అమెరికా తాజాగా ఉక్రెయిన్ కు యుద్ద విమానాలను సరఫరా చేసేది లేదని స్పష్టం చేసింది..

రష్యా – ఉక్రెయిన్ మధ్య రోజుల తరబడి హోరాహోరీగా యుద్ధం కొనసాగుతోంది. ఫిబ్రవరి 24వ తేదీతో ఈ యుద్ధానికి ఏడాది పూర్తి కానుంది.. ఇన్ని రోజులుగా నిరాటంకంగా ఈ రెండు దేశాలు తలపడుతూనే వస్తున్నాయి. నువ్వా – నేనా అన్నట్లు సాగుతున్న ఈ పోరులో ఉక్రెయిన్‌ లోని పలు నగరాలు ధ్వంసంఅయ్యాయి. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అదే స్థాయిలో ఆస్తినష్టం సంభవించింది. అయినప్పటికీ ఏ దేశం కూడా వెనక్కి తగ్గట్లేదు.

ఇన్ని రోజులుగా సాగుతున్న ఈ యుద్ధం వల్ల ఇప్పటికే ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని పలు నగరాలు నేలమట్టం అయ్యాయి. వాటిన్నింటినీ రష్యా సైనిక బలగాలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. మరియోపోల్, మెలిటొపోల్, క్రిమియా, డాన్‌బాస్, డొనెట్స్క్, లుహాన్స్క్, ఖేర్సన్, సుమి, ఒడెస్సా, చెర్న్‌హీవ్.. వంటి నగరాలను రష్యా సైనిక బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. పాశ్చాత్య దేశాల నుంచి ఎదురవుతోన్న ఒత్తిళ్లు, ఆంక్షలు, పలు రకాల నిషేధాలను కూడా రష్యా ధీటుగా ఎదుర్కొంటోంది.

రష్యా సైన్యానికి ఉక్రెయిన్ అంత తేలిగ్గా తలవంచట్లేదు. 11 నెలలుగా రష్యా సైన్యాన్ని ధీటుగా ఎదుర్కొంటోంది. కొన్ని సందర్భాల్లో పైచేయిని సాధించింది కూడా. రష్యా ఆధీనంలో ఉన్న కొన్ని కీలక నగరాలను విడిపించుకోగలిగింది. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, ఆస్ట్రేలియా సహా యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు అందిస్తోన్న ఆయుధాలు, యుద్ధ సామాగ్రితో రష్యా దూకుడుకు అడ్డుకట్ట వేయగలుగుతోంది. రాజధాని కీవ్‌ను స్వాధీనం చేసుకోవడానికి రష్యా సైన్యం చుట్టుముట్టినప్పటికీ.. వారిని వెనక్కి పంపించగలిగింది.

ఈ పరిణామాల మధ్య అమెరికా అధ్యక్షుడు కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్కు ఎఫ్ 16 యుద్ధ విమానాలను సరఫరా చేయడాన్ని నిలిపివేయనున్నట్లు వెల్లడించారు. ఉక్రెయిన్ కు ఆయుధ సహాయాన్ని అందించడంలో భాగంగా ఎఫ్ 16 యుద్ధ విమానాలను సరఫరా చేయడాన్ని తాను వ్యతిరేకిస్తోన్నానని స్పష్టం చేశారు. వైట్ హౌస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఎఫ్ 16తో పాటు అత్యాధునిక ఆయుధాలను సరఫరా చేయడానికి తాను వ్యతిరేకిస్తోన్నానని జో బైడెన్ నిర్మొహమాటంగా తేల్చేశారు. ఉక్రెయిన్ నైతిక మద్దతును తెలియజేయడానికి తానుపోలెండ్లపర్యటించనున్నట్లు పేర్కొన్నారు.

దీనికి సంబంధించిన షెడ్యూల్ ను ఖరారు చేయాల్సిందిగా తన స్టాఫ్ కు ఆదేశించానని చెప్పారు జో బైడెన్. 11 నెలలుగా రష్యాతో పోరాడుతున్న తమకు మరిన్నిఆయుధాలను అందించాలని, వాటి సరఫరాను వేగవంతం చేయాలంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ విజ్ఞప్తి చేసిన కొన్ని గంటల్లోనే జో బైడెన్ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.రష్యా ఉద్దేశపూరకంగానే యుద్ధాన్ని పొడిగించుకుంటూ పోతోందని, నార్త్ అట్లాంటిక్ ట్రీటి ఆర్గనైజేషన్, యూరోపియన్ యూనియన్.. ఇతర దేశాల నుంచి తమకు సకాలంలో ఆయుధాలు అందాల్సిన అవసరం ఉందని ఆయన కోరారు. ఇదే విషయాన్ని విలేకరులు జో బైడెన్ వద్ద ప్రస్తావించారు.

ఎఫ్ 16 వంటి అత్యాధునిక జెట్ ఫైటర్లు, ఆయుధ సామాగ్రిని సరఫరా చేయడానికి తాను వ్యతిరేకిస్తోన్నానని తేల్చి చెప్పారు.రష్యాతో జరుగుతోన్న యుద్ధంతో ఇబ్బందులు పడుతున్న ఉక్రెయిన్ కు మిలటరీ అసిస్టెన్స్ అందించేందుకు… గతేడాది అక్టోబర్ లో అమెరికా ముందుకు వచ్చింది. రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్ కు అమెరికా, పలు యూరోప్ దేశాలు దన్నుగా నిలుస్తున్నాయి.. ఇప్పటికే పలుమార్లు ఆయా దేశాలు ఉక్రెయిన్ కు సాయమందించాయి. రష్యాతో బీకరంగా పోరాడుతున్న ఉక్రెయిన్ కు 275 మిలియన్ డాలర్ల మిలటరీ సాయం అందించడానికి సిద్దమైంది..

అమెరికా అందిస్తున్న ఈ ప్యాకేజీలో హైమర్స్ ప్రెసిషన్ రాకెట్ లాంచర్ల కోసం అమ్యునిషన్, 155 ఎంఎం ఆర్టిలరీ రౌండ్స్, యాంటీ ఆర్మర్ సిస్టమ్స్, స్మాల్ఆర్మ్స్ అమ్యునిషన్, నాలుగు సాటిలైట్ కమ్యూనికేషన్ యాంటెన్నాలు ఉన్నాయని పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ సబ్రీనా సింగ్ వెల్లడించారు. ఉక్రెయిన్ కు అందిస్తున్న ఈ సాయం రష్యాను దీటుగా ఎదుర్కోవడానికేనని అమెరికా స్పష్టం చేసింది. ఉక్రెయిన్ మౌలిక సమాచార వ్యవస్థలు లక్ష్యంగా రష్యా దాడులు చేస్తోందని ఆరోపించింది. అందువల్ల, తాము పంపిస్తున్న యాంటెన్నాలు యుద్ధ క్షేత్రంలో ఉక్రెయిన్ దళాలకు ఉపయోగపడ్డాయని పేర్కొంది. 2021 జనవరి నుంచి ఇప్పటి వరకు అమెరికా ఉక్రెయిన్ కు 18.5 బిలియన్ డాలర్ల మిలిటరీ సాయం అందించింది.

అమెరికా ఆయుధాల సరఫరా ఆగిపోతే ఉక్రెయిన్‌ కు కష్టాలు మొదలవ్వనున్నాయి. అమెరికాతో పాటు పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌కు ఆయుధ సాయం అందిస్తున్నాయి. అయితే అమెరికాతో పోలిస్తే మాత్రం అవి చాలా తక్కువ సాయం చేస్తున్నాయి… ఇతర దేశాలు అందించే ఆయుధాలు రష్యాతో పోరాటానికి ఏ మాత్రం సరిపోవు. ఒక్క వారంలోనే ఉక్రెయిన్‌ పరిస్థితి తలకిందులయ్యే ప్రమాదం ఉంది.ఇప్పటివరకు రష్యాను ఎదుర్కొనడానికి ఉక్రెయిన్‌కు అందించిన సాయమంతా బూడిదలో పోసిన పన్నీరు కానున్నది.మరోవైపు ఉక్రెయిన్‌పై పుతిన్‌ సేనలు దాడులను మరింత ఉధృతం చేశాయి. అటు ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాల్లో క్షిపణులతో రష్యా బలగాలు విరుచుకుపడుతున్నాయి.

ఉక్రెయిన్ లోని పలు ప్రాంతాలను స్వాధీనం చేసుకుని యుద్దాన్ని కొనసాగిస్తోంది.. ఉక్రెయిన్‌ వద్ద ఆయుధాలు నిండుకుంటే పుతిన్‌ సేనల దాడులకు చేతులెత్తేసే అవకాశాలు ఉన్నాయి.పాశ్చాత్య దేశాల్లో ప్రధానంగా అమెరికా సాయంపైనే ఉక్రెయిన్ ఎక్కువగా ఆధారపడింది. అమెరికా అందించే అత్యాధునిక ఆయుధాలతోనే రష్యాను దీటుగా ప్రతిఘటిస్తోంది. అక్కడి నుంచే ఆయుధ సరఫరా ఆగిపోతే ఉక్రెయిన్‌కు రష్యా బలగాలను అడ్డుకోవడం సాధ్యం కాదు. అదే జరిగితే మాత్రం తొందరలోనే ఉక్రెయిన్‌ బలగాలు చేతులెత్తేసే అవకాశం ఉంది

ఇదిలా ఉండగా.. అణ్వాయుధాల నియంత్రణ ఒప్పంద ఉల్లంఘన జరిగేలా రష్యా ప్రమాదకరంగా మారుతోందని అమెరికా ఆరోపించింది. అమెరికా-రష్యా మధ్య ఉన్న అణ్వాయుధ నియంత్రణ ఒప్పందాన్ని రష్యా పాటించడం లేదని తెలిపింది. ఈ మేరకు అమెరికా కాంగ్రెస్ కు ఆ దేశ విదేశాంగ శాఖ నివేదిక సమర్పించింది.రష్యా అణ్వాయుధాల కేంద్రాలను పరిశీలించడానికి అమెరికాకు పుతిన్ సర్కారు అనుమతి ఇవ్వలేదని తెలిపింది.

ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో రష్యా ఈ చర్యలకు పాల్పడుతోంది… 2020 మార్చిలో కరోనా విజృంభణ కారణంగా ఇరు దేశాల మిలటరీ కేంద్రాల పరిశీలనకు బ్రేక్ పడింది. 2021 అక్టోబరులో ఒప్పందాన్ని ఐదేళ్ల పాటు పొడిగించారు.అయితే, 2022 ఆగస్టులో రష్యా అణ్వాయుధాలను అమెరికా నిపుణులు పరిశీలించాల్సి ఉండగా రష్యా అందుకు సహకరించలేదు. ఉక్రెయిన్ లో జరుగుతున్న యుద్ధంలో ఆ దేశానికి అమెరికా సాయం చేస్తున్న నేపథ్యంలో రష్యా ఈ చర్యకు పాల్పడింది. అణ్వాయుధాల నియంత్రణ ఒప్పందం కొనసాగకుండా రష్యా చేస్తోందని, అమెరికా-రష్యా మధ్య చర్చలు కూడా జరగకపోవడానికి రష్యానే కారణమని అమెరికా విదేశాంగ శాఖ తాజాగా ఆరోపించింది.

ఉక్రెయిన్ కు యుద్దంలో అత్యధిక సహాయం అందిస్తూ వస్తోంది అమెరికా.. ఇప్పటి కే భారీగా ఆర్థిక సహాయం చేసింది.. అయితే.. ఉక్రెయిన్ కు యుద్ద ట్యాంకుల సరఫరాను మాత్రం చేయలేమని స్పష్టం చేసింది.. అమెరికా సహాయం లేకుండా ఉక్రెయిన్ ఏ మేరకు పోరాడుతుందో చూడాలి మరీ.

Must Read

spot_img