Homeఅంతర్జాతీయంఅమెరికాలో విద్యా వ్యవస్థ నియమాలు..

అమెరికాలో విద్యా వ్యవస్థ నియమాలు..

అమెరికాలో ఆరేళ్లు పూర్తయితే కానీ ఒకటో తరగతిలో చేరడం సాధ్యం కాదు..అంటే పిల్లలు ఆ వయసులో విద్యను నేర్చుకునే అబిలిటీ వస్తుందని నిర్ణయించిన ప్రమాణాల మేరకు ఆ నిర్ణయం అక్కడ తీసుకోవడం జరిగింది. సరిగ్గా అదేమాదిరిగా మన దేశంలోనూ ఒకటో తరగతిలో చేర్చుకునే చిన్నారులకు ఆరేళ్లు ఉండాల్సిందేనని కేంద్రం కొత్త రూల్ గురించిన కీలక ప్రకటన చేసింది. ఈ నిబంధనను పక్కాగా అమలు చేయాలని రాష్ట్రాలకు సూచనలు జారీ చేసింది.

కనీసం ఆరేళ్లు ఉంటేనే ఒకటో తరగతిలో చేర్చుకోవాలని ఈ నిబంధనల అమలయ్యేలా చూడాలని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉత్తర్వులు జారీ చేసింది. నూతన విద్యా విధానంలో ఈ మేరకు నిబంధన ఉన్న విషయాన్ని విద్యాశాఖ గుర్తు చేసింది. ఈ రూల్ మేరకు మూడేళ్ల నుంచి ఎనిమిదేళ్ల మధ్య ఉన్న పిల్లలకు ఫౌండేషన్ స్టేజిలో భాగంగా విద్య నేర్పాల్సి ఉంటుందని కేంద్రం సూచించింది. ఇందులో మూడేళ్ల నుంచి ఐదేళ్ల మధ్య వయసు ఉన్న పిల్లలకు ప్రీ-స్కూల్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఆటపాటలతో చదువుపై ఆసక్తి కలిగించేలా ప్రీ-స్కూల్ విద్య ఉంటుందని కేంద్రం ఆ ఉత్తర్వుల్లో వెల్లడించింది.

ఆ తర్వాత ఒకటి, రెండు తరగతులు ఫౌండేషన్ దశలో ఉంటాయి. అయితే ఒకటో తరగతిలో చేరే ముందే చిన్నారులకు నాణ్యమైన ప్రీస్కూల్ విద్య అందేలా చూడాలని రాష్ట్రాలకు కేంద్ర విద్యాశాఖ సీనియర్ అధికారి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించారు. ఆయా రాష్ట్రాలలో ఉన్న వయసు నిబంధనను నూతన విద్యా విధానానికి అనుగుణంగా మార్చుకోవాలని స్పష్టం చేసారు. దేశ విద్యా వ్యవస్థను సమూలంగా మార్చేందుకు కేంద్రం నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చింది.

ఈ నూతన విద్యా విధానాన్ని బట్టి చదువులకు స్వస్తి పలికి స్రుజనాత్మకతకు పెద్ద పీట వేయడమే లక్ష్యంగా కేంద్రం ఈ విధానాన్ని రూపొందించింది. ప్రస్తుతం ఉన్న ప్రాథమిక ఉన్నత విద్య తీరుతెన్నులను మార్చేసింది. ఇప్పటివరకు విద్యా విధానం టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీగా ఉండగా, దాన్నిఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ గా మార్చింది. ఆర్ట్స్ సైన్స్ విద్య మధ్య విభజనలు లేకుండా నచ్చిన సబ్జెక్టులు ఎంపిక చేసుకునే వెసులుబాటును కల్పించేలా నూతన విద్యా విధానాన్ని రూపొందించింది. జాతీయ విద్యా విధానంలో భాగంగా పాఠశాలల్లోనూ ప్లే స్కూల్స్ ఏర్పాటు చేస్తామని కేంద్రం గతంలోనే ప్రకటించింది.

సమగ్ర శిక్షా అభియాన్ 2.0 కింద ప్లే స్కూల్స్ ఏర్పాటు చేసి, అందుకోసం ఉపాధ్యాయులకు తగిన శిక్షణ ఇవ్వనున్నట్టు స్పష్టం చేసింది. అయితే ఒకటో తరగతికి ఆరేళ్లకు పైగా వయసు తప్పనిసరి చేసే నిర్ణయంపై నిపుణులు ఏమంటున్నారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇది అమల్లోకి వస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఎక్కువ ప్రభావాన్ని చూపించే అవకాశం ఉందని విద్యా వేత్తలు అంటున్నారు. తెలుగు రాష్ట్రాలలో చాలా మంది తల్లిదండ్రులు ఐదేళ్ల వయసులోనే పిల్లలను ఒకటో తరగతిలో చేర్పిస్తుంటారు.

రెండు, రెండున్నరేళ్ల వయసులో నర్సరీతో ప్రీస్కూలింగ్ చదువు మొదలవుతోంది. తర్వాత అయిదేళ్ల వయసులోనే ఒకటో తరగతిలో చేర్పిస్తున్నారు. అయితే ఇది ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు. గత కొన్నేళ్లుగా మన సమాజంలో భాగమైపోయిందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. పిల్లలను ఒక సంవత్సరం ముందుగా స్కూల్స్‌లో చేర్పిస్తే వాళ్ల ఉన్నత చదువులు ఏడాది ముందుగానే పూర్తవుతాయి. కాబట్టి, పోటీ పరీక్షలకు ఉండే వయసు పరిమితి విషయంలో వారికి ఏడాది కలిసి వస్తుందని అలా చేస్తున్నారు.

అంతే కాదు వారికి త్వరగా ఉద్యోగాలు కూడా వస్తాయి అన్న ఆలోచన తల్లిదండ్రులలో ఉంటోందని ఉపాధ్యాయులంటున్నారు. అయితే ఇప్పుడున్న మన సమాజంలో పిల్లలను ఎంత త్వరగా బడికి పంపిస్తే అంత ఎక్కువ నేర్చుకుంటారనే భావన బలంగా నాటుకుపోయి ఉంది. రెండేళ్లకే అంగన్‌వాడీ, ప్రీ ప్రైమరీలో చేర్పిస్తుంటాం. కానీ, అక్కడే ఓ లోపం మనకు తెలియకుండానే జరిగిపోతోంది. చిన్నతనంలో పిల్లలు తల్లిదండ్రులు, గ్రాండ్ పేరెంట్స్‌తో గడిపితే కుటుంబపు బంధాలు గట్టిపడతాయని గ్రహించాలి.

  • ఫిన్‌లాండ్ వంటి దేశాలలో ఏడేళ్ల వయసులో ప్రాథమిక విద్యలో చేర్పిస్తుంటారు..

అక్కడ విద్యా వ్యవస్థ సక్సెస్ కూడా అయ్యింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వయసు నిబంధన తీసుకువచ్చినా, మన సమాజంలో పరిస్థితుల దృష్ట్యా తల్లిదండ్రులు ఎంత వరకు అంగీకారంతో ఉంటారనేది చూడాల్సిన అంశం అని నిపుణులు చెబుతున్నారు. నిజానికి గత కొన్నేళ్లుగా విద్య ఓ వ్యాపారంగా మారిపోయింది. ఇంటర్నేషనల్ అన్న పేరుతో పాఠశాలలు తెరుస్తూ విద్య పేరుతో పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తున్నారు. లక్షలకు లక్షలు డిమాండ్ చేస్తూ పిల్లల వయసును ఏమాత్రం పట్టించుకోకుండా ప్రీస్కూలింగ్ దశలోనే పిల్లలను చేర్పించుకుంటున్నారు.

రెండేళ్ల వయసులోనే ప్లే గ్రూప్ అనీ, నర్సరీ వంటి సెక్షన్లు తీసుకువచ్చి వీలైనంత ఎక్కువ సంఖ్యలో పిల్లలను చేర్పించుకుంటున్నారు. ఒకటో తరగతికి ఐదేళ్ల వయసులోనే చేరుతున్నారు. పిల్లల సంఖ్య ఎక్కువగా ఉంటే అదనపు సెక్షన్లు పెట్టి మరీ జాయినింగ్ చేస్తున్నారు. తల్లదండ్రులు కూడా తమ పిల్లలు ఎక్కడ వెనుకబడిపోతారో అన్న అనుమానంతో అందరితోపాటు నిర్ణయం తీసేసుకుంటున్నారు. 2021-22 యూనిఫైడ్ డిస్ర్టిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ లెక్కల ప్రకారం ఏపీలో అన్ని మేనేజ్‌మెంట్లలో కలిపి 61,948 స్కూళ్లు ఉన్నాయి. తెలంగాణలో 43,083 స్కూళ్లు ఉన్నాయి.

ఇవికాకుండా ఏపీ, తెలంగాణలో కలిపి వేల సంఖ్యలో ప్రీప్రైమరీ స్కూళ్లు నడుస్తున్నాయి. ప్రస్తుతం కొన్ని కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల్లో వయసు నిబంధన అమలు చేస్తున్నారు. ఆన్ లైన్లో దరఖాస్తు చేసే సమయంలోనే కిండర్ గార్టెన్‌లో చేరేందుకు నాలుగేళ్లుగా నిర్ణయించి దరఖాస్తు తీసుకుంటున్నారు. దీని ప్రకారం ఒకటో తరగతిలోకి వచ్చేసరికి ఆరేళ్లు ఉండాలనే నిబంధన అమలు చేస్తున్నారు. అయితే వయసు విషయంలో కచ్చితంగా ప్రభుత్వ నిబంధనలేవీ లేకపోవడంతో ప్రభుత్వ, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో అయిదేళ్లకే చేర్చుకుంటున్నారని విద్యా రంగ నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల మరీ నష్టమేమీ ఉండదని కూడా వారంటున్నారు.

అయితే కేంద్రం సూచించిన ఈ ఆరేళ్ల నిబంధనలను ఇప్పటికే కర్ణాటక వంటి రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. కానీ ఫార్మల్ ఎడ్యుకేషన్ ఏ వయసులో ప్రారంభిస్తే మంచిదనే విషయంపై లోతైన చర్చ జరగాలని అంటున్నారు నిపుణులు.. ఆరేళ్లు దాటితేనే బాగుంటుంది. దానివల్ల పిల్లల్లో మెచ్యురిటీ స్థాయిలు పెరుగుతాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేసిన ఆరేళ్ల వయసు సూచన తప్పనిసరిగా అమలు చేయాలన్న పట్టింపులేమీ రాష్ట్రాలకు ఉండదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల తమ ఇష్టంపై ఆధారపడి ఉంటాయి.

ఈ విషయంలో ముందుగానే రాష్ట్రాలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేదని నిపుణులు అంటున్నారు. నిజానికి జాతీయ విద్యా విధానంలోనూ ఆరేళ్ల వయసు ప్రస్తావన ఉంది. ప్రస్తుతం మన దేశంలో 10-2 విద్యా విధానం అమలవుతోంది. 2020లో తీసుకువచ్చిన జాతీయ విద్యా విధానంలో ప్రాథమిక, ఉన్నత విద్యలో ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ విధానం ప్రతిపాదించింది. ఇందులో మూడేళ్ల ప్రీ స్కూలింగ్ విద్య, రెండేళ్ల ప్రాథమిక విద్య తరగతులు కూడా ఉంటాయి. పిల్లలు ఒకటో తరగతిలో చేరే వయసు ఆరేళ్లుగా ఉండాలని జాతీయ విద్యా విధానం ప్రతిపాదించింది.

ఇది అమల్లోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచిపోయాయి. నేటికీ చాలా రాష్ట్రాలు అమలు చేయడం లేదు. ఆరేళ్ల వయసు నిబంధనను అన్ని రాష్ట్రాలు అమలు చేస్తే పిల్లలపై పసితనంలోనే పడే హోంవర్కుల భారం తగ్గుతుందని విద్యావేత్తలు చెబుతున్నారు. పిల్లల విషయంలో ఏడాది కాలం పెరిగితే.. మెచ్యురిటీ లెవెల్స్ పెరుగుతాయని అంటున్నారు. పిల్లలకు ఉపశమనం కలిగి.. మానసికంగా భారం తగ్గే అవకాశం ఉంటుంది. ఆరేళ్ల వయసు అన్న రూల్‌ని గతంలో సుప్రీంకోర్టు సైతం సమర్థించింది. గతేడాది కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతిలో ప్రవేశాలకు ఆరేళ్ల వయసు ఉండాలని దిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.

దీనిపై దిల్లీకి చెందిన కొందరు తల్లిదండ్రులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. దిల్లీ హైకోర్టు చెప్పినట్లుగా ఒకటో తరగతికి ఆరేళ్ల వయసు ఉండాల్సిందేనని గతేడాది ఏప్రిల్లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుతం కేంద్ర సూచనను పరిగణనలోకి తీసుకుంటే జాతీయ విద్యా విధానం ప్రకారం స్కూలింగ్ మొదలవుతుంది.

Must Read

spot_img