Homeఅంతర్జాతీయంరబ్బరు తయారీ వెనుక ఓ వ్యక్తి ప్రమేయం ఉంది...

రబ్బరు తయారీ వెనుక ఓ వ్యక్తి ప్రమేయం ఉంది…

మనం ఇప్పుడు ఎంతో హాయిగా రోడ్డుపై వాహనాలపై ప్రయాణిస్తున్నామంటే అందుకు కారణం ఆ మెత్తనైనా ఇనుము కన్నా గట్టిదైన రబ్బర్ టైర్ల వల్లనే అంటే అతిశయోక్తి కాదు. చెట్టు నుంచి తీసిన పాలను ప్రాసెస్ చేయడం ద్వారా రబ్బరు తయారవుతుంది. ఆ రబ్బర్ ఎన్ని రకాలుగా మన నిత్యజీవితంలో ఉపయోగపడుతోందన్నది మనకు బాగా తెలుసు. సైకిల్ దగ్గర్నుంచి విమానాల దాకా రబ్బరు లేనిదే ఏ పనీ కానే కాదు.. అంతటి ప్రశస్తమైన రబ్బరు తయారీ వెనుక ఓ వ్యక్తి ప్రమేయం ఉంది. అతని క్రుషి దాగి ఉంది. ఇంతా చేసి అంత కష్టపడిన ఆ వ్యక్తి ఏమైనా సుఖపడ్డాడా అంటే అదీ లేదు. జీవితమంతా తాను కనిపెట్టిన వల్కనైజ్ డ్ రబ్బరు గురించిన పేటెంట్ హక్కుల రాక కోసం ఎదురుచూడ్డంలోనే గడచిపోయింది. తానే ఆనాడు ఆ ప్రయోగాలు చేయనట్టైతే మనకు ఇంత ఉపయోగకరమైన వల్కనైజ్ డ్ రబ్బరు తయారయ్యే అవకాశమే లేదు. అదేంటో ఈ రోజటి ఇండెప్త్ లో చూద్దాం..చార్లెస్ గుడ్ ఇయర్..గుడ్ ఇయర్ అన్న పేరును మనం చాలా సార్లు చూసే ఉంటాం..

ఆ పేరు ప్రపంచానికి సుపరిచితమైన టైర్ల కంపెనీ పేరు. అయితే మనం ఇప్పుడు ఉపయోగిస్తున్న రబ్బరు టైర్లకు ముందు రబ్బరు పరిస్థితి వేరుగా ఉండేది. ఒకప్పుడు ఆ రబ్బరుతో చేసిన స్లిప్పర్లు కాలికి అతుక్కుపోయేంత జిగురుగా ఉండేవి. అయితే ఆ రబ్బరునే వల్కనైజింగ్ అనే ప్రక్రియ ద్వారా బహుళ ప్రయోజనకారిగా మార్చారు చార్లెస్.. నిజానికి తాను పెద్దగా చదువుకోలేదు. తన పన్నెండో ఏటన బడి మానేసాడు. కనెక్టికట్ లో ఉండే తన తండ్రి హార్డ్ వేర్ షాపులో పనిచేయడం కోసం చదువును వదిలేసాడు. అయితే తన 23వ ఏట క్లారిసా బీచర్ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వారిద్దరికీ ఒక కొడుకు పుట్టాడు. ఫిలడెల్పియాలో మరో హార్డ్ వేర్ స్టోర్స్ సొంతంగా తెరిచాడు చార్లెస్. నిజానికి చార్లెస్ గుడ్ ఇయర్ సమర్థుడైన వ్యాపారిగానే ఉండేవాడు.

కానీ తనకు కెమిస్ట్రీ, మెటీరియల్ సైన్స్ ద్వారా ఆవిశ్క్రుతమయ్యే విషయాలపై చాలా ఆసక్తిగా ఉండేవాడు. అది 1820..అంటే ఇప్పటికి రెండు వందల ఏండ్ల క్రితం ఇండియన్ రబ్బర్ అనబడే నేచురల్ రబ్బర్ మీద బాగా పరిశోధనలు సాగించాడు. ఆ రోజుల్లో చార్లెస్ గుడ్ ఇయర్ చేసిన ప్రయోగాలు పరిశోధనలు టైర్ల పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు వచ్చేందుకు దోహదం చేసాయి. నిజానికి తన ప్రయోగాలు ప్రపంచగతినే మార్చేసాయి. అయితే తన బతుకే తనకు పెద్ద చాలెంజింగ్ గా అయిపోయింది. 1830..అంటే తన 29వ ఏట ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి. చేస్తున్న ప్రయోగాలు కాస్ట్ లీగా ఉంటాయి. వాటి కోసం ఎప్పటికప్పుడూ అప్పులు చేసేవాడు చార్లెస్. మొదట తన ప్రయోగాలన్నీ వరుస వైఫల్యాలతో మొదలుపెట్టాడు చార్లెస్. రబ్బరును మరింత గట్టిగా వాహనాలకు టైర్లుగా వినియోగంచడం అన్న విషయంపై పరిశోధనలు జరిపాడు.

కానీ అవేమో ఏమాత్రం సక్సెస్ కావడం లేదు. ఆ సంవత్సరం ఈ ఖర్చుల కారణంగా చార్లెస్ బిజినెస్ బాగా దెబ్బతినడం జరిగింది. అప్పుల ఊబిలో అడ్డంగా కూరుకుపోయాడు. తనకు అప్పు ఇచ్చినవారు చార్లెస్ పై ఫిర్యాదులు జరిపించి జైలు పాల్జేసారు. నిజానికి తన ప్రయోగాల కెరీర్ కు ఇది ఓ చేదు ఆరంభం అనే చెప్పుకోవాలి. అయితే చార్లెస్ రబ్బరు గురించి ఏ ప్రయోగాలు చేసాడు అన్న విషయానికొస్తే..అప్పట్లో ఉపయోగంలో ఉన్న రబ్బరు అంత మన్నికగా ఉండేది కాదు.. ఉష్ణోగ్రత కాస్త పెరిగినా జిగటగా మారిపోయేది. దీన్ని ఎలా దారికి తీసుకురావాలో అర్థం అయ్యేది కాదు. ఇదిలా ఉండగా అప్పుల పాలయి జైలుకు చేరిన చార్లెస్ అక్కడ కూడా తన ప్రయోగాలు కంటిన్యూ చేసాడు. జైలు అధికారులను వేడుకుని తనకు కావాలసిన వస్తువులను తెప్పించుకునేవాడు. జైలులోనే కొన్ని కొత్త ప్రయోగాలు నిర్వహించాడు. అనేకమైన వైఫల్యాల తరువాత తనకు ఓ కెమికల్ సొల్యుషన్ దొరికింది.

రబ్బర్ ను సల్ఫర్ ప్లస్ సహా మరికొన్ని రసాయనాలను కలిపి వేడి చేయడంతో తాను అనుకున్న రబ్బరు తయారైంది. దీనికి వల్కనైజేషన్ అని పేరు పెట్టాడు చార్లెస్..అప్పటికి తన ప్రయోగాలకు 14 ఏళ్లు గడిచాయి. చివరకు 1844లో వల్కనైజ్ డ్ రబ్బరుకు పేటెంట్ హక్కుల కోసం 1844 సంవత్సరం ప్రయత్నించాడు చార్లెస్ గుడ్ ఇయర్. చాలా కష్టంగా నాలుగు నెలల తరువాత పేటెంట్ జారీ అయింది. ఆ రబ్బరుతో టైర్లు, షూ సోల్, గొట్టాలు లాంటి అనేక వస్తువులను తయారు చేయడం ఈజీ అయిపోయింది. 19వ శతాబ్దపు అతి ముఖ్యమైన సాంకేతిక ఆవిష్కరణ ఇదీ ఒకటి అని అప్పట్లో వ్యాఖ్యానించారు. అయితే ఈ ఆవిష్కరణలతో చార్లెస్ గుడ్ ఇయర్ అపర కుబేరుడైపోయాడా అంటే నిజానికి అలా జరగలేదు. అలవికాని ఆర్థిక కష్టాలు చార్లెస్ ను వెంటబడి తరిమాయి. తన పేదరికం చార్లెస్ కు శాపంగా మారింది.

అంత కష్టపడి తయారుచేసిన వల్కనైజ్డ్ రబ్బరు పేటెంట్ మీద ప్రత్యర్థులు వివాదాలు లేదీశారు. దాంతో తాను కనిపెట్టిన ఈ అద్భుతమైన టెక్నాలజీ తనకు ఏమాత్రం లాభం చేయలేకపోయింది. అంతే కాదు కుటుంబంలోనూ చార్లెస్ కు కష్టాలు తప్పలేదు. తన భార్య క్లారిసాకు క్షయ వ్యాధి సోకింది. అరకొరగా వస్తున్న సంపాదన మొత్తం ఆమె వైద్యఖర్చులకే సరిపోయింది. చికిత్స కోసం పలు ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఖర్చులు తడిసిమోపెడయ్యాయి. చివరకు చార్లెస్ భార్య 1848లో తన 39వ ఏట కన్ను మూసింది. ఆరుగురు పిల్లల పెంపకం బాధ్యత చార్లెస్ పైన పడింది. వారంతా నాలుగు నుంచి 17 ఏల్లలోపు పిల్లలు. మరి 54ఏళ్ల వయసున్న చార్లెస్ అటు పిల్లల్ని ఇటు తాను కష్టపడి తయారుచేసిన టెక్నాలజీకి పేటెంటును రక్షించుకోవడానికి చేయని ప్రయత్నం అంటూ లేదు. దాన్నించి ఎలాగైనా ఆర్థికంగా లాభం పొందాలని శతవిధాలుగా ప్రయత్నించాడు. ఆ క్రమంలో 40 ఏళ్ల వయసున్న మేరీ స్టార్ అనే యువతిని వివాహం చేసుకున్నాడు.

వారిద్దరికీ మరో ఇద్దరు పిల్లలు కలిగారు. వారిద్దరికీ అది హ్యాపీ మ్యారేజీగానే ఉన్నా ఎక్కువ కాలం సంతోషాన్ని ఇవ్వలేకపోయిందనే చెప్పాలి. చార్లెస్ గుడ్ ఇయర్ వల్కనైజ్ రబ్బరు తయారీ కోసం చేసిన ప్రయోగాలలో అనేక రసాయనాలు వాడేవాడు. వాటి ప్రభావం తన ఆరోగ్యంపై పడింది. 1860లో న్యూయార్క్ సిటీలోని ఓ హోటల్ లో కుప్పకూలిపోయేలా చేసింది. అప్పటికి తన వయస్సు 59 సంవత్సరాలు. మరణించేనాటికి తన దగ్గర యధా ప్రకారం చిల్లిగవ్వ లేదు. పైగా ఎటు చూసినా బోలెడన్ని అప్పులు. చివరకు తన మరణం తరువాత మరో 40 సంవత్సరాలు గడచిపోయిన అనంతరం ఓహియోలోని అక్రాన్ లో ‘ది గుడ్ ఇయర్ టైర్ అండ్ రబ్బరు కంపెనీని స్థాపించడం జరిగింది. కానీ దానిని స్థాపించిన వ్యక్తి పేరు ఫ్రాంక్ సీబర్లింగ్. చార్లెస్ గుడ్ ఇయర్ ప్రాజెక్టును కాస్త మార్పులు చేర్పులు చేసి తన పేరును గౌరవసూచకంగా వాడుకున్నాడు.

అయితే ఈ కంపెనీ వల్ల చార్లెస్ కుటుంబానికి పైసా అందలేదు. పైగా ఏ సంబంధమూ లేదు. ప్రస్తుతం ప్రపంచం మొత్తంగా గుడ్ ఇయర్ రబ్బర్ టైర్ల గురించి తెలియని వారుండరు. గుడ్ ఇయర్ సాధించిన ఈ అనామక విజయం గురించి శామ్యూల్ ఎలియట్ మారిసన్ అనే చరిత్రకారుడు ఏం రాసాడో తెలుసా.. ‘గుడ్ ఇయర్ తయారు చేసిన వల్కనైజేషన్ డిస్కవరీ సైన్స్ అండ్ ఇండస్ట్రీకి సంబంధించి ఓ గొప్ప ఆసక్తికరమైన ఆవిష్కారం. ఈ ప్రాజెక్టు కోసం తన జీవితాన్ని ధారపోసాడు చార్లెస్ గుడ్ ఇయర్. జీవితమంతా అప్పులు అనారోగ్యంతో పోరాటం చేసాడు. తను నాటిన గింజ నుంచి కాయలు కోసుకునే అద్రుష్టం తనకు కానీ తన సంతానానికి కానీ కలగలేదు. అయితే చార్లెస్ జీవతాన్ని డాలర్లు సెంట్లతో కొలవడం కష్టం..తను విత్తనం నాటిన చెట్టు కాయలు మాత్రం ప్రపంచం మొత్తానికి ఉపయోగపడుతోంది. ఆ విషయం తన ఆత్మను శాంతింపజేస్తుందని చెబుతున్నారు ఆ రంగంలోని నిపుణులు. ఏది ఏమైనా ఓ అద్భుతమైన ఆవిష్కారానికి కారణమైన చార్లెస్ నిజంగా అభినందనీయుడన్న విషయం మాత్రం ప్రపంచం గుర్తించింది

Must Read

spot_img