ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కనీసం అభ్యర్థులే లేని పరిస్థితుల్లో ఈ లెక్కేంటన్నదే చర్చనీయాంశమవుతోంది. దీంతో కేసీఆర్
తరహాలో రేవంత్ మైండ్ గేమ్ ఆడుతున్నారా అన్న చర్చ వెల్లువెత్తుతోంది.
అసలే దూకుడుగా ఉండే రేవంత్ రెడ్డి.. పీసీసీ అధ్యక్షుడు అయ్యాక స్పీడ్ మరింత పెంచారు. తెలంగాణ కాంగ్రెస్ బాస్ గా బాధ్యతలు చేపట్టే కార్యక్రమాన్ని సీఎంగా ప్రమాణ స్వీకారోత్సవం అన్నంత హడావుడి చేశారు. దళిత, గిరిజన దండోరా సభల పేరుతో ప్రజల్లోకి వెళ్లి, ధూం ధాం చేశారు. రెండేళ్లలో రానున్న అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో తాము గెలవబోయే సీట్ల గురించి కూడా మాట్లాడుతున్నారు. రేవంత్.. కాంగ్రెస్ పార్టీ 72 సీట్లలో గెలుస్తుందని ధీమాగా చెప్పారు. ఇలా 72 సీట్ల గురించి మాట్లాడటం ఇదే తొలిసారి కాదు.. గతంలోనూ ఒకటీరెండు సార్లు ప్రత్యేకంగా ‘72’ నంబర్ చెప్పారు. రాష్ట్ర సీనియర్ నేతలు వ్యతిరేకించినా.. పీసీసీ పగ్గాలను రేవంత్ రెడ్డికే అప్పగించింది కాంగ్రెస్ అధిష్టానం. మాటలే ఆయుధాలుగా రాజకీయాలు చేసే రేవంత్ రెడ్డి.. అప్పుడప్పుడు కొన్ని లెక్కలు చెబుతుంటారు. మొన్న పెట్రోల్ ధరల పెరుగుదలపై చేపట్టిన నిరసనల్లో పాల్గొన్న ఆయన .. ఏడేళ్లలో ఇంధన పన్నుల రూపంలో మోదీ సర్కారు రూ.36 లక్షల కోట్లు, కేసీఆర్ ప్రభుత్వం రూ.12 లక్షల కోట్లు ప్రజల నుంచి దోచుకుందని ఆరోపించారు. ఇందులో నిజమెంత అనేది ఎవరికీ తెలియదు.
ఇలాంటి లెక్కలు చెప్పి ఆరోపణలు చేస్తుంటారాయన. ఇప్పుడు కూడా తనకున్న రాజకీయ అవగాహన ప్రకారం తమ పార్టీకి 72 సీట్లు వస్తాయని అంచనా వేశారు. ఈ అంచనాకు ప్రాతిపదిక ఏంటనేది మాత్రం చెప్పలేదు. హుజూరాబాద్ లో అభ్యర్థి దొరక్క కాంగ్రెస్ ఎలాంటి అవస్థలు పడుతోందో అందరికీ తెలుసు. అక్కడ మాత్రమే కాదు.. అన్ని జిల్లాల్లోని ప్రధాన నాయకులు టీఆర్ఎస్, బీజేపీలో చేరిపోయారు.. ఇంకా చేరుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి కాంగ్రెస్ లో ఎంత మంది ఉంటారో, ఎంత మంది పోతారో తెలియని పరిస్థితి. ఈ క్రమంలో రేవంత్వ్యూ హాత్మకంగానే సీట్ల వ్యాఖ్యలు చేస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అటు అధికార టీఆర్ఎస్, ఇటు బీజేపీలో ఆలోచన రేకెత్తించేందుకు, తన గురించి ప్రజల్లో చర్చ జరిగేందుకు ఇలా మైండ్ గేమ్ ఆడుతున్నారే వాదనలూ ఉన్నాయి. అయితే రేవంత్ రెడ్డి 72 సీట్ల లెక్క వెనుక కేసీఆర్ తరహా వ్యూహం ఉందేమో అనే టాక్ కూడా వినిపిస్తోంది.
ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం ఇలాంటి గణాంకాలను చెబుతుంటారు. సర్వేలు తమకు అనుకూలంగా ఉన్నాయని చెబుతూ పార్టీ శ్రేణులను ఉత్సాహపరుస్తుంటారు.
గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్‌కు వంద సీట్లు కచ్చితంగా వస్తాయని సీఎం కేసీఆర్ పదే పదే చెప్పారు. అయితే టీఆర్ఎస్ మంచి మెజార్టీతో అధికారంలోకి వచ్చినప్పటికీ… కేసీఆర్ చెప్పిన వంద సీట్ల లెక్క మాత్రం తప్పింది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు గతంలో కేసీఆర్ అనుసరించిన వ్యూహాన్నే ఫాలో అవుతున్నారేమో అనే చర్చ కూడా సాగుతోంది. రేవంత్ రెడ్డి చెబుతున్న సీట్ల సంఖ్య.. మెజారిటీ కంటే డజను ఎక్కువ. కానీ తెలంగాణ ఏర్పాటయ్యాక జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ కు వచ్చిన సీట్లు కేవలం 21. ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా ప్రజల్లోకి వెళ్లినా వచ్చిన సీట్లు అవి. ఇక గత ఎన్నికల్లో గెలిచినవి 19 సీట్లు. 99 సీట్లలో పోటీ చేస్తే వచ్చిన రిజల్ట్ అది. ఇందులో రేవంత్ కూడా ఓడిపోయారు. ప్రజాకూటమి పేరుతో మరో మూడు పార్టీలతో కలిసి ఎన్నికలకు వెళ్తే ప్రజలు తిరస్కరించారు. నిజానికి ఆ సమయంలో టీఆర్ఎస్ తిరుగులేని పార్టీగా కనిపించింది. కానీ ఇప్పుడున్న పరిస్థితి వేరు. కేసీఆర్ పై జనంలో వ్యతిరేకత ఉందని చెబుతూ కొన్ని సర్వేలు వస్తున్నాయి. అయినా.. ఇప్పటికీ తెలంగాణలో కేసీఆర్ ను మించిన మాస్ లీడర్ లేరు. ఎన్నికల నాటికి తన గ్రాఫ్ ను పెంచునేందుకు చేయాల్సిన అన్ని పనులను కేసీఆర్ చేయక మానరు.
మరోవైపు బీజేపీ కూడా మూడేళ్లలో బాగా బలపడింది. కేంద్రం సపోర్టుతో తెలంగాణలో పుంజుకుంటోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ 70కి పైగా సీట్లు సాధిస్తుందనేది అతిశయోక్తి తప్ప మరొకటి కాదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చతుర్ముఖ వ్యూహం అమలు చేస్తామంటున్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. హాథ్ సే హాథ్ జోడో యాత్రతో కాంగ్రెస్ శ్రేణులు ఏకమవుతున్నాయని, అన్నిచోట్లా కాంగ్రెస్ కి బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. కనీసం 72 స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని జోస్యం చెప్పారు రేవంత్ రెడ్డి. పాలసీ(P), క్యాలిక్యులేషన్(C), కమ్యూనికేషన్(C), ఎగ్జిక్యూషన్ (E) .. PCCE అనే చతుర్ముఖ వ్యూహంతో తాము ముందుకెళ్తున్నామని అన్నారు. తెలంగాణలో పార్టీ సభ్యత్వ నమోదును తాను క్యాజువల్ గా తీసుకోలేదని, చాలా క్యాలిక్యులేటెడ్ గా చేశామని చెప్పారు. తెలంగాణలో ఏ పార్టీ గెలిచి అధికారంలోకి రావాలన్నా 80లక్షల ఓట్లు అవసరమని అన్నారు. కాంగ్రెస్ లో 43 లక్షల మంది సభ్యులుగా చేరారని, పార్టీ సానుభూతిపరులు, పార్టీకి ఓటు వేయాలనుకునే సామాన్య ప్రజలు వీరికి అదనం అన్నారు.
ఈసారి తమ లెక్క తప్పదని, అత్యధిక మెంబర్షిప్ తో ఉన్న తమ పార్టీ కచ్చితంగా విజయంసాధిస్తుందన్నారు రేవంత్ రెడ్డి.
తెలంగాణలో కాంగ్రెస్ తో పోటీ పడే ప్రధాన రాజకీయ పార్టీలు బీఆర్‌ఎస్, బీజేపీ… ఎన్నికల్లో కోట్లు ఖర్చుపెడతాయని, లేకపోతే ఫిరాయింపులను ప్రోత్సహిస్తాయని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. ఆ రెండు పార్టీలకు ఫిరాయింపులే ప్రధాన టాస్క్ అన్నారు. గతంలో బీఆర్‌ఎస్ నేతలు కాంగ్రెస్ గురించి మాట్లాడేవారు కాదని, హాథ్ సే హాథ్ జోడో పాదయాత్రల తర్వాత పరిస్థితి మారిందని, ఇప్పుడు బీఆర్‌ఎస్ నేతలు తమపై కూడా ఫోకస్ పెట్టారన్నారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి 38 శాతం ఓట్లు, 72 అసెంబ్లీ సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు రేవంత్ రెడ్డి. బీజేపీ సింగిల్ డిజిట్ కి పరిమితం అవుతుందన్నారు. ఫలితాలు ఎలా ఉంటాయనే దానిపై తమ అంచనాలు తమకున్నాయని చెప్పారు.
50 శాతానికిపైగా అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేశామని చాలా చోట్ల పొటీ చేసే అభ్యర్థుల విషయంలో స్పష్టత ఉందన్నారు. 60మందికి పైగా నేతల పేర్లు
ప్రకటించడమే బ్యాలెన్స్ ఉందన్నారు. వారంతా కార్యక్షేత్రంలో దూకడానికి రెడీగా ఉన్నారని చెప్పారు రేవంత్ రెడ్డి. ఇదిలా ఉంటే, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాత్ సే హాత్జో డో పాదయాత్రకి, దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న బహిరంగసభలకి ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తున్న మాట నిజం. గత 8 ఏళ్లుగా కేసీఆర్ కుటుంబ పాలనతో ప్రజలు విసుగెత్తిపోయున్నారు. కనుక వచ్చే ఎన్నికల్లో మార్పు తధ్యం. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ మేము పొత్తులు పెట్టుకోకుండా ఒంటరిగానే పోటీ చేస్తాము. ఇప్పటికే 60 సీట్లకు అభ్యర్ధులను ప్రకటించాము. కనుక ఎన్నికలకు ఆరు నెలల ముందుగానే మిగిలిన అభ్యర్ధులని ఎన్నికల మ్యానిఫెస్టో ప్రకటించి ప్రజల మద్యకు వెళ్తామని చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్‌లో చాలా బలమైన సీనియర్ నేతలు చాలామందే ఉన్నారు. అయితే పార్టీ బలహీనపడినప్పటికీ ఇంతకాలం సీనియర్ నేతలు కుమ్ములాడుకొంటూ కాలక్షేపం చేయడం వలన పార్టీ తీవ్రంగా నష్టపోయింది.
కానీ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా మాణిక్‌రావు థాక్రే వచ్చిన తర్వాత పార్టీలో కుమ్ములాటలు తగ్గి అందరూ కలిసికట్టుగా పనిచేయడం ప్రారంభించారు. అందుకే రేవంత్ రెడ్డి సభలకి అంతమంచి స్పందన వస్తోందని భావించవచ్చు. ఇదే లెక్కన సీనియర్లందరూ కలిసి పనిచేస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బిఆర్ఎస్‌కి ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశం ఉంది. కానీ కాంగ్రెస్ నేతల ఐక్యత ఎంతకాలం నిలుస్తుందో వారికే తెలియదు. ఎన్నికల గంట మ్రోగితే కాంగ్రెస్
పార్టీలో మళ్ళీ టికెట్ల కోసం కుమ్ములాటలు మొదలైపోతాయని అందరికీ తెలుసు. అసంతృప్తుల సంఖ్య ఎక్కువగా ఉండే కాంగ్రెస్ వంటి పార్టీలో అందరినీ ఒకతాటిపైకి తీసుకురావడం అంత ఈజీకాదు. ఈ నేపథ్యంలో రేవంత్ 72 సీట్ల లెక్క ఏంటనే అంశంపై కాంగ్రెస్‌తో పాటు తెలంగాణ రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
మరి రేవంత్ లెక్కేంటన్నదే హాట్ టాపిక్ గా మారింది.