- ఆ ఎస్సీ రిజర్వడ్ సెగ్మెంట్ లో రేవంత్ వర్సెస్ కోమటిరెడ్డి గ్రూప్ వార్ ఓ రేంజ్ లో నడుస్తుందా..?
- తన అనుచర వర్గానికే టికెట్ ఇవ్వాలని ఇద్దరు నేతలు పావులు కదుపుతున్నారా.. ?
- దాంతో ఆశావహులు కూడా టికెట్ వేటలో … ఎవరికి వారే బల నిరూపణకు సిద్దమవుతున్నారా..?
- ఇంతకీ టికెట్ రేసులో ఉన్న ఆ ఆశావహులెవరూ ?
- ఎక్కడా ఈ హాట్ పాలిటిక్స్ ?
ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం నకిరేకల్. గత కొన్ని దశాబ్దాలుగా ఈ అసెంబ్లీ సెగ్మెంట్ లో సిపిఎం వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా రాజకీయాలు సాగాయి. 2009 లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత సిపిఎం కనుమరుగు కాగా, కాంగ్రెస్, బీఅర్ఎస్ పార్టీలు పట్టు సాధించాయి. నకిరేకల్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సొంత సెగ్మెంట్ కావడంతో ఈయన హవా సాగుతూ వచ్చింది. మొదటి నుంచి కోమటిరెడ్డి ముఖ్య అనుచరుడు చిరుమర్తి లింగయ్య చక్రం తిప్పాడు. కోమటిరెడ్డి రాజకీయ శిష్యుడిగా పనిచేశారు. కానీ 2018 ఎన్నికల తర్వాత గురువుకు పంగనామాలు పెట్టి కారెక్కారు లింగయ్య.
దీంతో.. ఈ అసెంబ్లీ సెగ్మెంట్ లో కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకుడు లేకుండా పోయారు. దీంతో కేడర్ బలంగా ఉన్నా, సరైన లీడర్ లేకుండా పోయారని కార్యకర్తలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఇక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పాత నేతలు చక్రం తిప్పే ప్రయత్నం చేస్తుండగా, ఇంకొందరు టికెట్ రేసులో నేనున్నా అంటూ వ్యూహాత్మకంగా తెరపైకొచ్చారు. కాగా చిరుమర్తి పార్టీ వీడాకా… ప్రస్తుతం టీపీసీసీ కార్యదర్శిగా కొనసాగుతున్న కొండేటి మల్లయ్య అన్ని తానై వ్యవహరిస్తున్నారు. ఈయనతో పాటు దైద రవీందర్, చెరుకు లక్ష్మి వంటి వారు కూడా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్నారు.

ఆ లక్ష్యంగానే పనిచేస్తున్నారు. అందులో భాగంగానే .. పార్టీకి అవసరం అయిన ప్రతీసారి.. పార్టీ పిలుపునిచ్చిన సందర్భంలో ఆర్థికంగా, రాజకీయంగా తమ
వంతు ప్రయత్నం చేస్తున్నారు కొండేటి మల్లయ్య. కాగా చిరుమర్తి లింగయ్య trలోకి వెళ్ళిన తర్వాత జరిగిన లోకల్ ఎలక్షన్స్ లో పార్టీ ఇచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ వచ్చారు మల్లయ్య. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా చేపట్టిన ప్రతి పార్టీ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఆనాటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లోను.. ప్రస్తుత తెలంగాణా రాష్ట్రంలోను రాజకీయ కురువృద్దుడు కుందూరు జానారెడ్డి శిష్యుడిగా.. కొండేటి మల్లయ్య కు పేరుంది.
నిజానికి.. 2009 లోనే కొండేటి మల్లయ్యకు హస్తం పార్టీ టికెట్ దక్కాల్సి ఉండగా.. ఆనాటి రాజకీయ పరిస్థితులు, కోమటిరెడ్డి సోదరుల హవా నేపధ్యంలో.. అప్పట్లో వారి అనుచరుడిగా ఉన్న చిరుమర్తి లింగయ్యకు టికెట్ దక్కింది. 2018లోనూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇచ్చిన హామీతోనే.. పోటీకి దిగకుండా సపోర్ట్ చేశారంటున్నారు మల్లయ్య.
ఇక తాజా వార్ తో నకిరేకల్ కాంగ్రెస్ పార్టీలో.. కుమ్ములాటల పర్వం కనిపిస్తోంది. నియోజకవర్గం కోసం పదేళ్లుగా పనిచేసిన కొండేటి మల్లయ్యని కాదని.. మరొకరికి టికెట్ ఇప్పించుకోవాలని ఎంపీ కోమటిరెడ్డి చూస్తున్నారని ఆయన వర్గం ఆరోపిస్తోండగా.. రవీందర్ వర్గం మాత్రం తమ నాయకుడికే టికెట్ అంటోందట. ఇలా ఎవరికి వారే టికెట్ లక్ష్యంగా సెగ్మెంట్ లో దూకుడు పెంచారు. పార్టీ కార్యక్రమాలను సైతం వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. సీనియర్ల మద్దతుతో ఢిల్లీ లో చక్రం తిప్పే ప్రయత్నాలూ ముమ్మరం చేశారు.
ఇక ఈ గొడవ ఇలా ఉండగా ఇటీవల నకిరేకల్ నియోజకవర్గం లో వాల్ పోస్టర్ లు కలకలం రేపాయి. కోమటిరెడ్డి కి వ్యతిరేకంగా గోడలపై పోస్టర్ లు వెలిశాయి. కోమటిరెడ్డి కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసిన అంశాలను ప్రస్తావిస్తూ, వాల్ పోస్టర్ లు వేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఇదంతా కొండేటి మల్లయ్య పనే అని…ఆయనపై కోమటిరెడ్డి వర్గం ఆరోపణలు గుప్పిస్తోంది. ఇటు మల్లయ్య వర్గం కూడా కోమటిరెడ్డి కి ఘాటు కౌంటర్ ఇస్తోంది. పార్టీకి ద్రోహం చేసే కార్యక్రమాలు కోమటిరెడ్డి కే చెల్లుతాయని, పార్టీ స్టాండ్ దాటే నైజం మాది కాదని మల్లయ్య వర్గం ఘాటుగా ఫైరవుతుందట.
ఇలా రెండు వర్గాల మధ్య అంతర్గత పోరు రోజురోజుకూ ముదిరి పోతుంది. ఇప్పటికే కోమటిరెడ్డికి చెక్ పెట్టేందుకు రేవంత్ ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పే వ్యూహాలు అమలు చేస్తుండగా, గ్రౌండ్ లెవల్లో కూడా కోమటిరెడ్డి అనుచరవర్గ ఆధిపత్యంపై దెబ్బకొట్టెందుకు రేవంత్ వర్గం కూడా సీరియస్ ప్లాన్ అమలు చేస్తున్నట్టే కనిపిస్తోంది. దీంతో నకిరేకల్ లో రేవంత్ తనపంతం నెగ్గించుకుంటాడో..లేక సొంత సెగ్మెంట్లో కోమటిరెడ్డి పైచేయి సాధిస్తారో అన్నదే చర్చనీయాంశంగా మారింది.
ఈ నేపథ్యంలో నకిరేకల్ రాజకీయాలు.. టీ కాంగ్రెస్ లోనూ కాక రేపుతున్నాయని, వీరిద్దరి టగ్ ఆఫ్ వార్ .. ఎవరికి ప్లస్ కానుందని చర్చలు సెగ్మెంట్ వ్యాప్తంగా
వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ వార్ లో సీనియర్లు సైతం గెలుపు ఎవరికి దక్కుతుందన్నఆసక్తిని కనబర్చుతున్నారు. దీంతో ఈ సెగ్మెంట్లో రాజకీయాలు .. కాక రేపుతున్నాయని విశ్లేషకులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఇరు నేతలు తమ పట్టు నిరూపించుకునేందుకు పోటీకి సిద్ధమవుతున్న వేళ.. ఎవరికి హైకమాండ్ మద్ధతు లభిస్తుందన్నదీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
మరి నకిరేకల్ లో ఏం జరుగుతుందనేది ఆసక్తిగా మారింది..