Homeజాతీయంరేవంత్ వర్సెస్ కేటీఆర్...

రేవంత్ వర్సెస్ కేటీఆర్…

పేపర్ లీకేజీ రచ్చలో మళ్లీ రేవంత్ వర్సెస్ కేటీఆర్ షురూ అయిందా..? తనకు సిట్ నోటీసులు జారీ చేయడంతో .. రేవంత్ .. కేటీఆర్ టార్గెట్ గా .. ఆరోపణలు గుప్పిస్తున్నారా.. దీంతో మళ్లీ వైట్ ఛాలెంజ్ తరహా చర్చ తెరపైకి రానుందా.. ? తమ ఎదుట హాజరు కావాలని టీఎస్పీఎస్సీ కేసును విచారిస్తున్న సిట్ అధికారులు రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్‌లోని ఆయన ఇంటికి ఈ నోటీసులు అంటించారు. ఈ సిట్‌ నోటీసులకు స్పందిస్తానని, వివరణ ఇస్తానని రేవంత్‌రెడ్డి ప్రకటించారు.

సిట్‌కు తన దగ్గర ఉన్న ఆధారాలు ఇస్తానని, సిట్‌ నోటీసులు ఊహించినదే అని ఎంపీ రేవంత్‌రెడ్డి చెప్పారు. సిట్‌ అధికారి శ్రీనివాస్‌, కేటీఆర్ బావమరిది ఇద్దరూ ఫ్రెండ్సే అని, ఇద్దరూ ఫ్రెండ్స్‌ అన్నందుకే తనకు సిట్‌ నోటీసులు ఇచ్చిందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కేటీఆర్‌కు సిట్‌ ఎందుకు నోటీసులు ఇవ్వలేదు?, తనతో పాటు కేటీఆర్, సబిత, శ్రీనివాస్‌గౌడ్‌కు సిట్ నోటీసులివ్వాలని, లేకపోతే సిట్ అధికారిపై హైకోర్టుకు వెళ్తానని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఓకే మండలంలో వందమందికి ర్యాంకులు వచ్చాయంటూ రేవంత్ రెడ్డి ఆరోపణ చేశారు.

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో జరుగుతున్న పరీక్షల ప్రశ్నాపత్రాలను కోట్ల రూపాయలకు అమ్ముకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. కేటీఆర్ నిందితులను స్పెషల్ ఇన్వేస్ట్ గేషన్ టీం వారు ఇన్వెస్ట్ గేషన్ చెయ్యకముందే ప్రవీణ్ కుమార్, రాజశేఖర్ రెడ్డి ఇద్దరు వ్యక్తులకు మాత్రమే ఇందులో సంబంధం ఉందని ఎలా చెబుతారన్నారు. నూటికి నూరు శాతం ఈ రాష్ట్రంలో జరిగే అవినీతి, ఆరాచకాలకు కారణం కేసీఆర్, కేటీఆర్ అని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో బాధ్యతాయుతంగా నిర్వహించాల్సిన పబ్లిక్ సర్వీస్ పరీక్షలు 30 లక్షల మంది విద్యార్థులతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు రేవంత్ రెడ్డి.

దీంతో రేవంత్ వద్ద ఉన్న వివరాలతో సహా ఆధారాలు అందజేయాలని సిట్ ఏసీపీ నోటీసులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న శాఖల్లో కంప్యూటర్ వాడాలన్నా, తెలంగాణ స్టేట్ టెక్నాలజీ ప్రతిపాదనకు పంపిస్తే, ఐటీ శాఖ అనుమతి ఇస్తేనే మంజూరు చేయటం జరుగుతుందన్నారు టీఎస్పీఎస్ అనే సంస్థ చైర్మన్ జగన్మోహన్ రావు. ఈయన కేసీఆర్ బంధువు. కేటీఆర్ సూచనమేరకే జగన్మోహన్ రావును 2021లో టీఎస్ పీయస్ చైర్మన్ గా కేసీఆర్ని యమించారు. ఐటీ శాఖ మంత్రి కింద తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సంస్థ పనిచేస్తుందన్నారు. అలాంటి ఐటీ శాఖకు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు తెల్వకుండాప్రశ్నాపత్రం ఎలా లీక్ అయ్యిందని ప్రశ్నించారు రేవంత్. ఈ అంశంలో .. రేవంత్ .. కేటీఆర్ ను టార్గెట్ చేయడం .. మరో రచ్చకు దారితీయనుందని..విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో పనిచేసే ప్రవీణ్ కుమార్ తండ్రి హరిచందర్ రావు రాజమండ్రికి చెందిన వ్యక్తి. ప్రవీణ్ కుమార్ ను జూనియర్ అసిస్టెంట్ గా ఎలా నియమించారని రేవంత్ ప్రశ్నిస్తున్నారు. అసలు కేసీఆర్ కు తెలంగాణ రక్తం ఉందా అని అడుగుతున్నా అని అన్నారు రేవంత్ రెడ్డి. లక్షలాది ఉద్యోగాలు నియమించాల్సిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు సంబంధించిన ముఖ్యమైన వాటిని ఆంధ్ర ప్రాంతానికి చెందిన ప్రవీణ్ కుమార్ కు ఎలాఅప్పజెపుతారని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. మొదట్నుంచీ ప్రశ్నపత్రాల లీక్ లో కేటీఆర్, కేసీఆర్ ఇద్దరే కారణమని స్పష్టం చేశారు.

రాజశేఖర్ రెడ్డిని కేటీఆర్ నియమించారు… కేసీఆర్ ప్రవీణ్ కుమార్ ను నియమించారన్నారు. దీనిపై సిట్ వేయడమంటే కేసును కాలగర్భంలో కలిపే ప్లాన్ అని రేవంత్ ఆరోపించారు. సినీ తారల డ్రగ్ విషయంలో కూడా సిట్ విచారణ అధికారిగా అకున్ సబర్వాల్ ను నియమించారు. అర్దాంతరంగా అతను మాయమయ్యారు. నయీమ్ కుంభకోణం విషయంలో కూడా సిట్ వేశారు. అది ఏమైందో ఇప్పటికీ తెలియదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా సిట్ విచారణతో న్యాయం జరగదని కాంగ్రెస్ భావిస్తోందని స్పష్టం చేశారు. అందుకే సీబీఐ విచారణ జరిపించాలి లేదంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ
డిమాండ్ చేస్తోందని అన్నారు రేవంత్ రెడ్డి.

ఉక్కిరిబిక్కిరి చేస్తున్న పేపర్ లీకేజీ ఉందతంపై తెలంగాణ హైకోర్టును ఆశ్రయించినకాంగ్రెస్ పార్టీ నేతలు.. తాజాగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సైతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ కు ఒక వినతిపత్రాన్ని అందించారు. పేపర్ లీక్ పై గవర్నర్ కు కంప్లైంట్ చేశాం. మంత్రి కేటీఆర్ పేషీకి చెందినఉద్యోగులదే పేపర్ లీక్ లో కీలక పాత్ర పోషించారు. మంత్రి కేటీఆర్ ను ప్రాసిక్యూట్ చేయటానికి గవర్నర్ కు అప్లికేషన్ పెట్టాం. వ్యాపం కుంభకోణంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కోట్ చేస్తూ దరఖాస్తు ఇచ్చాం. టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ కావటంతో లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని రేవంత్ వ్యాఖ్యానించారు. గవర్నర్ కు ఇప్పుడున్న టీఎస్ పీఎస్సీ ఛైర్మన్ ను.. సభ్యులను సస్పెండ్ చేసే అధికారం ఉందన్న రేవంత్.. అందరిని సస్పెండ్ చేసి పారదర్శక విచారణ చేస్తారని భావించామని.. కానీ ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. గవర్నర్ కు ఉన్న విశేష.. విచక్షణ అధికారాల్ని వినియోగించాలన్నారు.

మంత్రి కేటీఆర్.. జనార్దన్ రెడ్డి.. అనితా రామచంద్రన్ ను ప్రాసిక్యూట్ చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై గవర్నర్ సానుకూలంగా స్పందించారని, న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటానని అన్నారని తెలిపారు. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పరిధిలోనే ఐటీ శాఖ పనిచేస్తుందన్నారు. కానీ టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసు విషయంలో ఐటీ తన పరిధి కాదని, కేటీఆర్ తెలివిగా తప్పించుకుంటున్నారని, సిట్ అంటే సిట్, స్టాండ్ మాత్రమేనని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. గతంలో సిట్ విచారణ చేసిన కేసులన్నీ ఎక్కడపోయాయని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

తెలంగాణ వచ్చింది ఇందుకేనా అని ఆయన ప్రశ్నించారు. టీఎస్ పీఎస్ సీ తాళాల గుత్తి ఆంధ్రోడి చేతిలోనే పెట్టారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. సిట్ విచారణ అధికారి ఏఆర్ శ్రీనివాస్ ఆంధ్రప్రాంతానికి చెందినవాడేనని ఆయన చెప్పారు. సిట్ అధికారి ఆంధ్ర అధికారి ఐనప్పుడు రిపోర్ట్ ఎలా ఉంటదోఆలోచించుకోవాలని రేవంత్ రెడ్డి అన్నారు. విచారణ సరిగ్గా జరగాలని తాను కోరితే తనకు నోటీసులు ఇచ్చారని రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్లంతా ఎక్కడకు పోయారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రాజకీయాలలో టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారం ప్రభుత్వ వైఫల్యమే కాకుండా మంత్రి కేటీఆర్ బాధ్యుడిగా ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. మరోవైపు విద్యార్థి సంఘాలు కూడా తీవ్రంగా మండిపడుతున్నాయి.

ఈక్రమంలోనే ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి విమర్శల ఘాటు పెంచుతున్నాయి. టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారంఅంతా ఇద్దరు వ్యక్తుల దుశ్చర్య మాత్రమేనని మంత్రి కేటీఆర్ అంటున్నారని, ఈ స్కాంను కప్పిపుచ్చడానికి కేటీఆర్ తన వంతు ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. టీఎస్ పీఎస్సీ గత ఎనిమిదేళ్లుగా మెరుగైన సేవలు అందించిందని పొగడడం ద్వారా ఈ కుంభకోణం ఎపిసోడ్ ను తక్కువ చేసి చూపేందుకు కేటీఆర్ కృషి చేస్తున్నట్టు అర్థమవుతోందని తెలిపారు. ఈ వ్యవహారాన్ని సీబీఐ, ఈడీలకు సిఫారసు చేయాలని గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు. దీంతో పేపర్ లీకేజీతో మరోసారి రేవంత్,కేటీఆర్ రచ్చ షురూ కానుందన్న వాదనలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో వైట్ ఛాలెంజ్ తరహాలో విమర్శలు తలెత్తే అవకాశం ఉందని సైతం రాజకీయ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి.

Must Read

spot_img