HomePoliticsతెలంగాణ కాంగ్రెస్ పీసీసీ ఛీఫ్ పదవికి రేవంత్ రాజీనామా..!

తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ ఛీఫ్ పదవికి రేవంత్ రాజీనామా..!

  • తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ ఛీఫ్ పదవికి రేవంత్ రాజీనామా చేయనున్నారా..?
  • ఇంతకీ ఆయన వ్యాఖ్యల వెనుక అర్థమేమిటి..?
  • ఇక సీనియర్ల నెక్ట్స్ స్టెప్ ఏమిటన్నదే చర్చనీయాంశంగా మారింది.

కాంగ్రెస్ పార్టీకి ఊపిరిగా రేవంత్ రెడ్డి..!

తెలంగాణలో నాలుగేళ్లుగా వెంటిలేటర్ పై కొనసాగుతున్న కాంగ్రెస్ కు.. ఆక్సిజన్ల కనిపించారు రేవంత్ రెడ్డి. పార్టీ బతకడం కష్టమే అని సీనియర్లంతా చేతులు ఎత్తేసిన తరుణంలో పార్టీకి ఊపిరిగా మారారు. కాంగ్రెస్ ను మింగేస్తున్న కేసీఆర్ ను చూసి సీనియర్లంతా కన్నాల్లో నక్కిన సమయంలో పార్టీ పగ్గాలు అందుకున్నారు. టిడిపి నుంచి వచ్చిన వ్యక్తి అయినప్పటికీ కాంగ్రెస్ వాదాన్ని నర నారాన జీర్ణించుకొని పార్టీ బలోపేతం కోసం ప్రయత్నం ప్రారంభించారు.

జీవమే లేదు అనుకున్న కాంగ్రెస్ కేడర్ లో ఉత్తేజం నింపారు. పార్టీ కాస్త కుదురుపడుతుంది ఇన్నాళ్లు కన్నాలు నొక్కిన సీనియర్లకు తాము కాంగ్రెస్ వాదులమే అన్న విషయం గుర్తొచ్చింది. రేవంత్ తాను ఎదగడమే కాకుండా పార్టీని బలోపేతం చేస్తున్నాడు అన్న అనసూయ పుట్టింది. ఇంకేముంది.. వారిలోని సహజ బుద్ధిని బయట పెట్టుకున్నారు. సహచరుడు ఎదగడం ఊరలేని నైజం బహిర్గతమైంది.

పార్టీని చంపైనా పక్కోడు లేకుండా చేయడమే లక్ష్యం ఉన్నట్లుగా సంక్షోభానికి తెరలేపారు. రేవంత్ తప్పుకుంటే తప్ప తామపార్టీలో పనిచేయలేమన్నంతగా హైకమాండుకే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. తనకు పదవిపై ఎటువంటి ఆశ లేదన్నారు.

రేవంత్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ సీనియర్లు గళం విప్పుతున్న వేళ తాను పదవి నుంచి తప్పుకుంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందంటే రాజీనామాకు సిద్దమని ప్రకటించారు. తాను కాకుండా పిసీసీ పదవిలో ఎవరికి డిసైడ్ చేసినా వారిని కూర్చోపెట్టి తన భుజాలపై పల్లకి మోయటానికి సిద్దమని చెప్పారు. కాంగ్రెస్ అధిష్ఠానం చెప్పిన పని చేయటం మినహా తనకు ఎటువంటి ప్రత్యేక అజెండా లేదన్నారు.

పది పనులు చేస్తున్నప్పుడు ఒకటో రెండో తప్పులు దొర్లడం సహజమే. మనమంతా మానవ మాత్రులమేనని రేవంత్ వ్యాఖ్యానించారు. మనుషులం తప్పులు చేయటం సహజమని చెప్పుకొచ్చారు. అందరం కలిసి ముందుకు సాగాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాను ఎవరినీ ఇబ్బంది పెట్టాలని అనుకోలేదని అన్నారు. జానారెడ్డి, భట్టి విక్రమార్క, మధుయాష్కీ, సంపత్ సూచనలను స్వాగతిస్తున్నామని చెప్పారు.

అయితే ఈ వ్యాఖ్యలు తెలంగాణవ్యాప్తంగా రాజకీయ రచ్చకు కారణమవుతున్నాయి. దీంతో రేవంత్ కూడా రాజీనామా చేస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది.

కాంగ్రెస్ నేతల శిక్షణ శిబిరం ముగింపు సమావేశానికి పలువురు సీనియర్లు దూరంగా ఉన్నారు.

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హాజరయ్యారు. అయితే మధు యాష్కీ, దామోదర రాజనర్సింహ, జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు మరి కొందరు నేతలు గైర్హాజరయ్యారు. ఇదే సమయంలో తెలంగాణ సీనియర్ల ఫిర్యాదుతో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ బాధ్యతల నుంచి మాణిక్కం ఠాగూర్ ను తప్పిస్తూ ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు రేవంత్ మానవ సహజ పొరపాట్లు జరిగాయని.. పార్టీ అధికారంలోకి వస్తుందంటే తాను పీసీసీ పదవికి రాజీనామా చేస్తానని ప్రతిపాదించటం పైన ఇప్పుడు పార్టీ సీనియర్లు ఏ విధంగా స్పందిస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

గతంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ రాజకీయాలు అర్థం చేసుకోవడం అనుకున్నంత ఈజీ వ్యవహారం కాదని అన్నారు. ఇప్పుడు ఆయన పరిస్థితి చూస్తుంటే ఇప్పటికీ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ రాజకీయాలు పూర్తిగా అర్థమైనట్లు లేదు. నిజానికి రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి రాహుల్ గాంధీ సంపూర్ణ మద్దతుతోనే దక్కింది అనేది మాత్రం, రేవంత్ రెడ్డి సహా అందరూ హండ్రెడ్ పెర్సెంట్ అంగీకరిస్తున్న విషయం.

పంజాబ్ పీసీసీ చీఫ్ గా నవజ్యోతి సింగ్ సిద్దు, తెలంగాణ పీసీసీ రేవంత్ రెడ్డి పేర్లను రాహుల్ గాంధీనే ఓకే చేశారు. అందుకే, రేవంత్ రెడ్డి నియామకాన్ని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు చాలా వరకు అయిష్టంగా అంగీకరించారే కానీ, హృదయపూర్వకంగా స్వాగతించలేదు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిన సీనియర్ నాయకులు… ఎక్కడో పుట్టి ఇంకెక్కడో పెరిగి వచ్చిన రేవంత్ రెడ్డి మూడేళ్ళు అయినా నిండకుండానే, పార్టీ బాస్ గా పెత్తనం చెలాయించడం అనే ఉహనే, జీర్ణించుకోలేక పోయారు.

అందుకే ఆయన అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుంచి ఏదో ఒక రూపంలో అసమ్మతి సెగ రాజుకుంటూనే వుంది. మునుగోడు ఉప ఎన్నిక ఓటమికి కూడా రేవంత్ రెడ్డి నాయకత్వం పట్ల పార్టీ సీనియర్ నాయకుల అసమ్మతి, వ్యతిరేకతలే కారణం. అలాగే నిన్నటిదాక కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జిగా వ్యవహరించిన మాణిక్యం ఠాగూర్‌ కారాణాలు ఏవైనా రేవంత్ రెడ్డికి, అన్ని విధాల సహకరిస్తూ వచ్చారు.

నిజానికి మునుగోడు ఓటమి తర్వాత తిరుగుబాటు జెండా ఎగరేసిన తర్వాత, జీ 9 అసమ్మతి నేతలు రేవంత్ రెడ్డి వ్యవహర సరళిని, ఒంటెద్దు పోకడలను ఎంతగా వ్యతిరేకించారో, మాణిక్యం ఠాగూర్‌ వ్యవహార శైలిని అంతలా ఎండగట్టారు. ఆ ఇద్దరి కారణంగానే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పతనావస్థకు చేరుకుందని అధిష్టానానికి ఫిర్యాదు చేశారు.

సీనియర్ల నుంచి సమస్యలు ఎదుర్కుంటున్న రేవంత్ రెడ్డి.. !

రేవంత్ రెడ్డి తప్పొప్పులకు కర్త, కర్మ,క్రియ అన్నీ ఠాగూరే అని ఫిర్యాదు చేయడమే కాకుండా ఆయన స్థానంలో రాష్ట్ర రాజకీయల పట్ల అవగాహన ఉన్న సీనియర్ నాయకులను రాష్ట్ర వ్యవహారాల బాధ్యునిగా నియమించాలని కేంద్ర దూతగా వచ్చిన దిగ్విజయ్ సింగ్ వద్ద మొర పెట్టుకున్నారు. అయితే ఇది పార్టీని బతికించుకునేందుకు చేసిన ప్రయత్నమా అంటే కాదు. ఠాగూర్‌ కు ఉద్వాసన పలికితే పీసీసీ అధ్యక్ష పదవి నుంచి రేవంత్ రెడ్డిని సాగనంపడం ఈజీ అవుతుందని భావించిన సీనియర్లు వ్యూహాత్మకంగా పావులు కదిపారు.

ఏదైతే నేమి, చివరకు ఫస్ట్ రౌండ్ లో రేవంత్ పై సీనియర్లు విజయం సాధించారు. దిగ్విజయంగా …ఠాగూర్‌ ను గోవాకు పంపారు. ఆయన స్థానంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల నూతన బాధ్యునిగా, మహారాష్ట్రకు చెందిన సీనియర్ నాయకుడు మాణిక్‌రావు థాకరేను ఏఐసీసీ అధిష్టానం నియమించింది. దీంతో ఇప్పటికే సీనియర్ల నుంచి సమస్యలు ఎదుర్కుంటున్న రేవంత్ రెడ్డి ముందు ముందు మరింతగా సమస్యలు ఎదుర్కోక తప్పదని అంటున్నారు.

మాణిక్‌రావు థాకరే మహారాష్ట్రకు చెందిన నేత. గతంలో ఆయన మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. బీజేపీ, శివసేన ప్రభుత్వాలను తీవ్రంగా విమర్శించిన నాయకుడిగా ఆయనకు పేరుంది. ఆయన్ను తెలంగాణకు బాధ్యునిగా యమించడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. మాణిక్యం ఠాగూర్‌ ను దిగ్విజయంగా సాగనంపిన సీనియర్లకు నెక్స్ట్ టార్గెట్ రేవంత్ అవుతారని అంటున్నారు.

మరో వంక రాహుల్ గాంధీ పార్టీ వ్యవహారాలలో పెద్దగాజోక్యం చేసుకోవడం లేదు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ లతో దీర్ఘకాల సైద్ధాంతిక పోరాటానికే రాహుల్ ప్రాధాన్యత ఇస్తున్నారు. పార్టీ సంస్థాగత వ్యవహరాల్లో అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు గాంధీ ఫ్యామిలీ పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. చివరకు పార్టీలో తన పాత్ర ఏమిటో కూడా అధ్యక్షుడు ఖర్గేజీ నిర్ణయిస్తారని రాహుల్ గాంధీ పలు మార్లు స్పష్టం చేశారు.

భారత్ జోడో యాత్ర తెలంగాణలో సాగుతున్న సమయంలోనూ రాహుల్ గాంధీ అదే విషయం స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఇక ఎంతో కాలం పీసీసీ పదవిలో కొనసాగలేరని పరిశీలకులు అంటున్నారు. అందుకే కావచ్చు రేవంత్ రెడ్డి స్వరం మారిందని, దూకుడుకు బ్రేకులు పడ్డాయని అంటున్నారు. అందుకే నిన్న మొన్నటి వరకు సీనియర్ నాయకులను ప్రత్యక్షంగా, పరోక్షంగా ఛీ .. ఛా .. అంటూ అవమానించిన రేవంత్ రెడ్డిలో ఈ మార్పు దేనికి సంకేతం అనే చర్చ రాజకీయ వర్గాల్లో వినవస్తోంది. ఠాగూర్‌ ఉద్వాసనతో రేవంత్ సీటుకు ముప్పు పొంచి ఉన్నట్లేనని అంటున్నారు.

కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలను గమనిస్తే, రేవంత్ ఖేల్ ఖతం అనే మాట పార్టీ సీనియర్ నేతల నోట వినవస్తోందని అంటున్నారు. అయితే రాజకీయ పరిశీలకులు మాత్రం రేవంత్ రెడ్డికి తక్షణ ఉద్వాసన ఉండక పోవచ్చును కానీ, ఆయన దూకుడుకు మాత్రం బ్రేకులు పడినట్లే అంటున్నారు.

మరి రేవంత్ వ్యూహం ఏమిటన్నదే చర్చనీయాంశంగా మారింది…

Must Read

spot_img