HomePoliticsకేసీఆర్ పై రేవంత్ కీలక వ్యాఖ్యలు

కేసీఆర్ పై రేవంత్ కీలక వ్యాఖ్యలు

ఖమ్మం సభ వేళ కేసీఆర్ పై రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారా..? మోడీతో దోస్తీ తీరులో కేసీఆర్ వ్యవహరిస్తున్నారన్న రేవంత్ వ్యాఖ్యలు కాక రేపుతున్నాయా..? మళ్లీ ముందస్తు టాక్ తెలంగాణలో వెల్లువెత్తనుందా..?

ఖమ్మం బీఆర్ఎస్ సభలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశాన్ని బీజేపీ చెర నుంచి విడిపించి అభివృద్ధి పథంలో నడిపిస్తానన్న కేసీఆర్.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున ఎందుకు పోటీ చేయలేదని ప్రశ్నించారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవకుండా కేసీఆర్ కుట్రలు మొదలు పెట్టారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

కర్ణాటకలో 25 మంది కాంగ్రెస్ నేతలతో సీఎం కేసీఆర్ ఇటీవల మాట్లాడి వారికి రూ. 500 ఆఫరిచ్చారని రేవంత్ ఆరోపించారు. తక్కువ మెజారిటీతో గెలిచే నేతలను లక్ష్యంగా పెట్టుకుని కేసీఆర్ ఆపరేషన్ ప్రారంభించారని మండిపడ్డారు. ఈ విషయం కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తెలియడంతో వారిని ఏఐసీసీ పిలిచి మాట్లాడిందన్నారు. సునీల్ కనుగోలు కార్యాలయంపై దాడి వెనుక చాలా కారణాలున్నాయని రేవంత్ తెలిపారు. ఈ విషయం కుమారస్వామికి కూడా తెలీదని.. ఇవాళ బీఆర్ఎస్ సమావేశానికి రాకపోవడానికి అదే కారణమని రేవంత్ చెప్పారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్, ఆప్ నేతలు భాగస్వాములు అని రేవంత్ అన్నారు. ఎల్ఐసీ, ఎయిర్ ఇండియాను కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిందన్నారు.

కాంగ్రెస్ నిర్మించిన కర్మాగారాలను మోడీ అమ్ముకుంటున్నారన్నారు. పార్లమెంటులో మోడీకి మద్దు ఇచ్చింది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. ఏళ్ల తరబడి మోడీతో కేసీఆర్ అంటకాగారన్నారు. అక్కడ మోడీ.. ఇక్కడ కేసీఆర్ వేల కోట్లు అప్పులు చేస్తున్నారన్నారు. సునీల్ కనుగోలు కార్యాలయంపై దాడి వెనుక చాలా కారణాలున్నాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఫిబ్రవరి చివరి వారంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేసే అవకాశం ఉందని జోస్యం చెప్పారు. సీఎం కేసీఆర్‌ వ్యూహాల్ని నిశితంగా గమనిస్తే ఫిబ్రవరి చివర్లో శాసనసభను రద్దు చేసే అవకాశం ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. ఏప్రిల్‌లోపే ఎన్నికలు నిర్వహించేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని నియంత్రించడం కోసమే డిసెంబరులో జరగాల్సిన అసెంబ్లీ శీతాకాల సమావేశాలను కేసీఆర్‌ నిర్వహించలేదని ఆరోపించారు. చట్టప్రకారం సమావేశాలను ఆరు నెలల్లోపు జరపకుంటే శాసనసభ రద్దు అవుతుందన్నారు. వానాకాల సమావేశాలు గతేడాది సెప్టెంబరు 13న ముగియగా, శీతాకాల సమావేశాలు నిర్వహించకపోవడంతో మార్చి 15 కల్లా ఆరు నెలల గడువు ముగియనుందన్నారు.

గతేడాది డిసెంబరులో శీతాకాల సమావేశాలు పెట్టి ఉంటే ఈ ఏడాది జూలై, ఆగస్టు వరకు సీఈసీకి వెసులుబాటు దొరికే అవకాశం ఉండేదన్నారు. కేసీఆర్‌ మనసులో ఉన్న ఆలోచన ప్రకారం ఫిబ్రవరి చివర్లో శాసనసభను రద్దు చేస్తే కొత్త ప్రభుత్వం బడ్జెట్‌ను పెట్టేందుకు వీలుగా ఏప్రిల్‌లోపు ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి సీఈసీకి ఏర్పడిందని అన్నారు.

అయితే కేసీఆర్‌ను నిశితంగా గమనిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ.. యథాలాపంగా ఏమీ లేదని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉందని అన్నారు. వివిధ నియోజక వర్గాల్లో పోటీలో ఉంటారన్న నాయకులను అప్రమత్తం చేశామని చెప్పారు. తెలంగాణలోనూ వ్యాపారాలు ఉన్న కర్ణాటక నేతను ఫాం హౌస్‌కు పిలిపించి బేరసారాలకు పాల్పడ్డారని, ఒత్తిడి తెచ్చి లొంగదీసుకునేందుకు ప్రయత్నించారన్నారు. కాంగ్రెస్‌ వ్యూహకర్త సునీల్‌ కనుగోలు కార్యాలయంపై దాడి చేసిన తర్వాత కర్ణాటకలో 120 నుంచి 130 స్థానాల్లో గెలిచి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని తెలుసుకున్న కేసీఆర్‌.. అందులో 20 నుంచి 30 సీట్లలో ఓడించడం కోసం పార్టీ కీలక నేతతో కేసీఆర్‌ బేరసారాలు చేశారన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ ఓడితే లాభం ఎవరికి అని ప్రశ్నించారు. కాంగ్రె్‌సను ఓడించేందుకు కేసీఆర్‌కు సుపారీ తీసుకున్నారని, ఆ సుపారీ ఇచ్చిందెవరని ప్రశ్నించారు.

కర్ణాటకలో కాంగ్రె‌స్ ను ఓడించేందుకు కేసీఆర్‌ చేస్తున్న కుట్రను తిప్పికొట్టాలని ఆ రాష్ట్ర పార్టీ నేతలకు విజ్ఞప్తి చేశారు. బెంగళూరులో కేసీఆర్‌కు సన్నిహితులైన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులపైనా నిఘా పెట్టాలని సూచించారు. కేసీఆర్‌కు నిజంగా ప్రధాని మోదీని ఓడించాలని ఉంటే గుజరాత్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఎందుకు పోటీ చేయలేదని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. యూపీ ఉప ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీకి, ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో కేజ్రీవాల్‌కు అనుకూలంగా ఎందుకు ప్రచారం చేయలేదన్నారు. మోదీని రక్షించేందుకే బీజేపీతో కలిసి కాంగ్రెస్ ను కేసీఆర్‌ నిందిస్తున్నారని ఆరోపించారు. 1947 నుంచి 2014 వరకు పనిచేసిన ప్రధానులంతా కలిసి రూ.56 లక్షల కోట్ల అప్పులు చేస్తే, ఈ 8 ఏళ్లలో మోదీ చేసిన అప్పు వంద లక్షల కోట్లు అని చెప్పారు. ప్రతి నెలా రూ.లక్ష కోట్లు అప్పు తెచ్చి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారన్నారు.

కేసీఆర్‌ సీఎం అయ్యాక నిజాం సుగర్స్‌ను, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ పేపర్‌ మిల్లు తదితరాలను మూయించారన్నారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో కాంగ్రెస్‌ ఏం చేసింది.. బీజేపీ ఏం చేసింది.. టీఆర్‌ఎస్‌ ఏమి చేసిందన్నదానిపై ప్రజల ముందు చర్చకు తాము సిద్ధమన్నారు. కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ పేరు ఎలాగైనా మార్చుకోవచ్చు కానీ.. కేసీఆర్ ఉపన్యాసాలు చూస్తుంటే మోదీ తో వైరం ఉందని నమ్మించే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ కు మోదీని ఓడించాలని ఉంటే గుజరాత్ లో బీఆర్ఎస్ ఎందుకు పోటీ చేయలేదని ప్రశ్నించారు. యూపీలో అఖిలేష్ ను గెలిపించాలని ఎందుకు మద్దతు ఇవ్వలేదన్నారు.

ఢిల్లీలో తన వ్యాపార భాగస్వామి కేజ్రీవాల్ పార్టీని గెలుపు కోసం ఎందుకు మద్దతు ఇవ్వలేదన్నారు. డి.రాజా, కేరళ సీఎం, ఢిల్లీ సీఎం, పంజాబ్ సీఎం, అఖిలేష్ యాదవ్ బీఆర్ఎస్ సభలో పాల్గొన్నారు. వీళ్లంతా ఒక బృహత్ ప్రణాళిక తో ముందుకు వస్తారని చివరి వరకు గమనించా.. కానీ కాంగ్రెస్, బీజేపీ లను కలిపి విమర్శించే ప్రయత్నం చేశారన్నారు. మిషన్ భగీరథతో నీళ్లు ఇస్తున్నామంటున్నారు.. కానీ గజ్వేల్ లో మంచి నీళ్లు అందని గ్రామాలు ఎన్నో ఉన్నాయన్నారు. కాళేశ్వరం ఖర్చుపై నిజ నిర్ధారణ కమిటీ వేయడానికి సిద్ధమా అని సవాల్ చేశారు.

కాలువల ద్వారా నిజంగా నీళ్లిస్తే, ఎనిమిదేళ్లలో 25 లక్షల పంపుసెట్లు రైతులు ఎందుకు ఉపయోగిస్తారని ప్రశ్నించారు. రైతులకు 24 గంటల కరెంటు అవసరం ఎందుకు ఉంటుందన్నారు. మోదీని రక్షించడానికి కాంగ్రెస్ ను దూషిస్తోంది నిజం కాదా కేసీఆర్ అని ప్రశ్నించారు. కేసీఆర్ వ్యవహార శైలి అన్ని అనుమానాలకు తావిస్తోందని, రాజకీయస్వార్థంకోసం, ఆర్ధిక లాభాల కోసం దేశాన్ని కూడా తెగనమ్మే నాయకుడు కేసీఆర్ అని రేవంత్ రెడ్డి విమర్శించారు. విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగాలు, ప్రాజెక్టులు.. ఏ అంశంపై అయినా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.

కేసీఆర్ వ్యూహాత్మకంగానే డిసెంబర్ లో జరపాల్సిన శీతాకాల సమావేశాలు జరపలేదని.. ఫిబ్రవరి చివరిలో ప్రభుత్వాన్ని రద్దు చేసినా ఆశ్చర్యపోనవసరం లేదని రేవంత్ వ్యాఖ్యానించారు. రేవంత్ వ్యాఖ్యలతో కేసీఆర్ రాజకీయాలపై తెలంగాణవ్యాప్తంగా చర్చోపచర్చలు సాగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో జాతీయ పార్టీగా నిలబడాలని కేసీఆర్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని, అయితే తొలుత .. తెలంగాణలో మళ్లీ హ్యాట్రిక్ సాధిస్తేనే, సాధ్యమని విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో .. కేసీఆర్ ముందస్తుకు వెళ్లే అవకాశముందని సర్వత్రా అంచనాలు వెల్లువెత్తుతున్నాయి. రేవంత్ తాజా వ్యాఖ్యలతో మళ్లీ తెరపైకి ముందస్తు టాక్ వచ్చిందని, విపక్షాలు .. మళ్లీ ఎన్నికల రాజకీయాలకు సిద్ధమవుతున్నాయని టాక్ వినిపిస్తోంది.

మరి రేవంత్ వ్యాఖ్యలపై కేసీఆర్ ఏం చేస్తారన్నదే చర్చనీయాంశంగా మారింది.

Must Read

spot_img