ఆ జిల్లా సీనియర్ నేతలకు రేవంత్ వ్యూహాత్మకంగా చెక్ పెడుతున్నారా ? “రేవంత్ వర్సెస్ సీనియర్స్” ఎపిసోడ్ లో రేవంత్ సక్సెస్ అయినట్లేనా ? అసలు రేవంత్ టీమ్ కు మాత్రమే పీసీసీ కమిటీలో చోటిచ్చి, సీనియర్ లను పక్కన పెట్టడంలో ఆంతర్యమేంటి ? ఇన్నాళ్లు పార్టీలో ఎదురులేని ఆధిపత్యం సాగించిన దిగ్గజాల హవాకు ఇక బ్రేకులు పడ్డట్లేనా ?
రాష్ట్రం మొత్తం కారు హవా నడుస్తున్నా, మ్మడి నల్గొండ జిల్లాలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఉనికి ఇంకా బలంగానే ఉందనే చెప్పాలి. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో కారు జోరులో కాంగ్రెస్ పార్టీ చతికిల పడ్డా, జిల్లాకు చెందిన 2 పార్లమెంట్ స్థానాలు గెలిచి సత్తా చాటింది. దీంతో నల్గొండ జిల్లాలో తన పట్టు అలాగే ఉందని హస్తం నిరూపించింది. ఆ పార్టీ సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కుందూరు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ మంత్రి ఆర్.
దామోదర్ రెడ్డిలు రాష్ట్ర రాజకీయాల్లోనే కాక దేశ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పగల సమర్థ నేతలన్నది అందరికీ తెలిసిందే. అంతేకాక .. ఈ నేతలంతా ఇన్నాళ్లు వారి వారి నియోజక వర్గాల్లో ఎదురు లేని హవా సాగించారు. హై కమాండ్ వద్ద కూడా వీరు చెప్పిందే ఫైనల్. వీరిని కాదని జిల్లాలో ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే ఒకటికి రెండుసార్లు హైకమాండ్ కూడా ఆలోచించాల్సిందే.
వీళ్లలో ఎవరైనా పార్టీ నిబంధనలు తిరస్కరిస్తే, షోకాజ్ నోటీసులు జారీ చేయాలన్నా హైకమాండ్ సాహసం చేసినట్లే.. అయితే ఇప్పుడు ఆ సీన్ రివర్సైనట్లేనని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే, ఇప్పుడు సీనియర్లకు చెక్ పెట్టే టైం వచ్చేసిందని టాక్ వెల్లువెత్తుతోంది. రేవంత్ పీసీసీ పీఠమెక్కాక కథ మొత్తం మారుతోంది. చాప కింద నీరులా సీనియర్స్ కు చెక్ పెడుతూ వస్తున్నారు రేవంత్. వారి ఆధిపత్యం, హవాకు బ్రేకులు వేస్తూ వస్తున్నారు. అయితే రేవంత్ ఈ నిర్ణయానికి రావడం వెనుక కూడా .. సీనియర్ల వ్యవహార శైలే కారణమన్న వాదనలు సైతం వినిపిస్తున్నాయి.
రేవంత్ పీసీసీ గా నియమితమైన తర్వాత .. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆయన్ని కాలు మోపనీయకపోవడమే దీనికి కారణమని సమాచారం. కేవలం మునుగోడు ఉప ఎన్నికలకు తప్ప జిల్లాలో పార్టీ పరిస్థితులు చక్కదిద్దే అవసరమే లేదని ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లాంటి నేతలు రేవంత్ కు బాహాటంగానే చెప్పారు. రాష్ట్రం మొత్తం బాధ్యత రేవంత్ కే ఉంటే, ఇక్కడ మాత్రం రేవంత్ కు వ్యతిరేకంగా సీనియర్లు మోకాలడ్డే ప్రయత్నం చేశారు.
దీంతో ఈ పరిణామాలే రేవంత్ ను మండించాయని విశ్లేషకులు సైతం అంచనా వేశారు. ఆ పరిణామాల అనంతరం సీనియర్ లను హోంగార్డుతో పోలుస్తూ రేవంత్ చేసిన కాంట్రవర్సీ కామెంట్స్ కాంగ్రెస్ పార్టీలో పెద్ద దుమారాన్నే లేపాయి. అయినా రేవంత్ వివాదాస్పద వ్యాఖ్యలను హైకమాండ్ పెద్దగా పట్టించుకోలేదు. దాంతో సీనియర్ లు రేవంత్ పై రివర్స్ అయ్యారు. వరుస పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు పార్టీలో రేవంత్ వర్సెస్ సీనియర్స్ వార్ ఓ రేంజ్ కు చేరుకుంది.
సీనియర్ లకు హై కమాండ్ ఊహించని షాకిచ్చింది.
ఆ వార్ హాట్ హాట్ గా నడుస్తున్న క్రమంలో సీనియర్ లకు హై కమాండ్ ఊహించని షాకిచ్చింది. పీసీసీ కమిటీలో సీనియర్ ల పేర్లు కానీ, వారి అనుచరులకు కానీ స్థానం లేకుండా చేసేసింది. దాంతో రేవంత్ వర్సెస్ సీనియర్స్ ఎపిసోడ్ లో రేవంత్ పై చేయి సాదించినట్లయ్యింది. అదేసమయంలో రేవంత్ .. ఉమ్మడి నల్గొండ జిల్లాపై పట్టు సాధించాలంటే, సీనియర్ లకు చెక్ పెట్టి, తన టీమ్ ని విస్తరించుకోవాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు సైతం వెల్లడించారు.
అందుకే ఆయన టీం కు మాత్రమే పదవులు ఇప్పించి, పార్టీలో పట్టు సాధించాలనే ప్రయత్నాలు షురూ చేశారని సమాచారం. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రస్తుతం సీనియర్ నేత కుందూరు జానారెడ్డి తో తప్పా.. రేవంత్ ఎవరితో పెద్దగా సఖ్యతగా లేరు. అందుకే జానా తనయుడు రఘువీర్ రెడ్డికి మాత్రమే పీసీసీ కమిటీలో పదవి దక్కింది. కాగా రఘువీర్ రెడ్డి 2018 లోనే మిర్యాలగూడ టికెట్ ఆశించి భంగపడ్డారు. ఈసారి మాత్రం ఆ స్థానంపై సీరియస్ గానే గురి పెట్టారు.
ఆ మేరకు తీవ్ర స్థాయిలో పైరవీలు మొదలెట్టారు. రేవంత్ అండదండలు ఉండడంతో మిర్యాలగూడ టికెట్ తనదేనన్న ధీమాతో ఉన్నారు రఘువీర్ రెడ్డి. తాజాగా పీసీసీ కమిటీలో చోటుదక్కడం కూడా టికెట్ కు గ్రీన్ సిగ్నల్ అనే అంచనాతో ఉన్నారాయన. ఇక ఆలేరు నియోజకవర్గానికి చెందిన బీర్ల ఐలయ్య కు కూడా పీసీసీ ప్రధాన కార్యదర్శి పదవి దక్కింది. ఈయన కూడా రేవంత్ కోటరీలోకి వెళ్లిపోయాడనే టాక్ వినిపిస్తుంది.
సామాజిక సేవలు, పార్టీ పిలుపు ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతో హై కమాండ్ దగ్గర కూడా ఐలయ్య కు మంచిపేరుంది. ఇటు రేవంత్ అండదండలు సైతం పుష్కలంగా ఉన్నాయి. దాంతో బీర్ల ఐలయ్య దూకుడు, ఆయన పెంచుకున్న పట్టుతో ఆశావాహులంతా సైడ్ అయిపోయారని తెలుస్తుంది.
కాగా వివాదాలకు చాలా దూరంగా ఉండే బీర్ల ఐలయ్య…ఇటు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తో కూడా గ్యాప్ రాకుండా, పార్టీలో గ్రూపులకు తావు లేకుండా ఆయనతో కూడా రిలేషన్ మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం పీసీసీ కమిటీలో పదవితో రేవంత్ కోటరిలోకి వెళ్ళిపోయిన ఐలయ్య కు హై కమాండ్ ఆలేరు టికెట్ పై గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. ఆ క్రమంలోనే పని చేసుకుంటూ వెళ్లాలని సూచించిందట కూడా.
ఇక హై కమండ్ ఆదేశాలు, రేవంత్ ఆశీస్సులతో ఆలేరు కాంగ్రెస్ పార్టీలో ఎదురు లేని ఆధిపత్యం కొనసాగిస్తున్నారు బీర్ల ఐలయ్య.ఇన్నాళ్లు టికెట్ ఆశించిన నేతలు కూడా ఐలయ్య వెంట నడుస్తున్నారు.
మొదటి నుంచి రేవంత్ రెడ్డి అనుచరుడిగా ముద్రపడ్డ పున్న కైలాష్ ను కూడా హై కమాండ్ గౌరవించింది..!
పీసీసీ కమిటీలో చోటిచ్చి, ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. వాస్తవానికి మునుగోడు ఉపఎన్నికల్లో బీసీ ఈక్వేషన్ లో టికెట్ కోసం గట్టి ప్రయత్నాలు చేసారు కైలాష్. పరిస్థితుల ప్రభావంతో కైలాష్ ను బుజ్జగించి, ఆ టికెట్ ను పాల్వాయి స్రవంతికి ఇచ్చింది హై కమాండ్. అయినా హై కమాండ్ ను నిర్ణయాన్ని వ్యతిరేకించ లేదు కైలాష్. ఆ క్రమంలోనే అధికార పార్టీ ఆఫర్ ఇచ్చినా, రేవంత్ హామీతో పార్టీని వదలకపోవడం అప్పట్లో చర్చనీయాంశంగా కూడా మారింది.
అందుకే కైలాష్ కు కూడా పీసీసీ ప్రధాన కార్యదర్శిగా పదవి ఇవ్వడంతో రేవంత్ టీం ఫుల్ జోష్ లో ఉంది. వచ్చే ఎన్నికల నాటికి పున్న కైలాష్ ను బీసీ ఈక్వేషన్ లో మునుగోడు అసెంబ్లీ నుంచి, లేదంటే, ఇంకెక్కడి నుంచైనా పోటీకి దింపే ఆలోచనలో అధిష్టానం ఉందని తెలుస్తుంది. ఇక రేవంత్ ప్రధాన అనుచరుడు పటేల్ రమేశ్ రెడ్డికి కూడా పీసీసీ ప్రధాన కార్యదర్శి పోస్ట్ వచ్చింది. ఈయన రేవంత్ తో టీడీపీలో చాలా కాలం పాటు పనిచేశారు.
రేవంత్ తో పాటే కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత ఎన్నికల్లో సూర్యాపేట టికెట్ ఆశించి నిరాశకు గురయ్యారు. ఈసారి ఆ ఛాన్స్ కోసం ప్రయత్నాలు ఆపడం లేదు. ఇక్కడ సీనియర్ నేత ఆర్.దామోదర్ రెడ్డిని పాలేరు సెగ్మెంట్ కు పంపించి, తన అనుచరుడైన రమేష్ రెడ్డికి సూర్యాపేట టికెట్ ఇప్పించాలనే పట్టుదలతో ఉన్నారట రేవంత్. సూర్యాపేటలో రమేష్ రెడ్డిని పని చేసుకుంటూ వెళ్లాలని ఆల్రెడీ రేవంత్ ఆదేశాలిచ్చారని సమాచారం.
రేవంత్ అండతో సూర్యాపేటలో పట్టుకోసం తన ప్రయత్నాల్లో తానున్నారు రమేష్ రెడ్డి. ఇదిలా ఉండగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో నాలుగు పీసీసీ ప్రధాన కార్యదర్శి పదవులు రేవంత్ టీమ్ కే దక్కడం తో సీనియర్లు కారాలు మిరియాలు నూరుతున్నారు. సీనియర్ల అనుచరుల్లో ఒక్కరికి కూడా పదవి ఇవ్వకపోవడంతో హై కమాండ్ వైఖరిపై అసంతృప్తి తో ఉన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, సీఎం పదవి చేజిక్కించుకోవడం కోసం ఇప్పటినుంచే సీనియర్ లకు రేవంత్ చెక్ పెడుతున్నారని రాజకీయ విశ్లేషకుల అంచనా. అందుకే తన అనుచరులకు టికెట్లు ఇప్పించుకునేలా పావులు కదిపారని టాక్ వినిపిస్తోంది.
అందుకే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కూడా పొమ్మన లేక పొగ పెడుతున్నారని సమాచారం. ఇక జానారెడ్డి వల్ల తనకు ఇబ్బంది లేదు \కాబట్టే, ఆయనతో దోస్తీ సాగిస్తున్నారని తెలుస్తోంది. ఇక ఉత్తమ్, దామోదర్ రెడ్డి సంగతి హై కమాండ్ చూసుకుంటుందని లైట్ తీస్కున్నారని టాక్.
మరి సీనియర్ లపై రేవంత్ ఎత్తుగడలు ఏమేరకు సక్సెస్ అవుతాయో తేలాలంటే, వేచి చూడాల్సిందే..