Homeఅంతర్జాతీయంసూర్యుడిపై పరిశోధనలు ఫలించిందా ?

సూర్యుడిపై పరిశోధనలు ఫలించిందా ?

ఈ శతాబ్దం అనేక ఖగోళ వింతలకు పరిణామాలకు వేదికయింది. తాజగా నాసా శాస్త్రవేత్తలు సౌర కిరీటం అనే అద్భుతాన్ని చూశారు. సూర్యుడి ఉత్తర ధ్రువ ప్రాంతంలో వింత వెలుగుల వలయాన్ని గమనించారు. ఇప్పటికే సూర్యుడిపై పరిశోధనలకు పంపించిన పార్కర్ స్పేస్ క్రాఫ్ట్, జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఈ పరిణామాలను నిశితంగా పరిశీలించాయి. ఇంతకీ నాసా శాస్త్రవేత్తలు ఆ అద్భుతాన్ని అనుకోకుండా చూడటం జరిగిందని చెబుతున్నారు. అంటే ఎవరూ ఊహించని విధంగా జరిగిపోయింది. సహజంగానే సూర్యుడిపైనుంచి ఉద్ఘారాలు వెలువడుతుంటాయి. వాటిని మొదటి నుంచీ పరిశీలిస్తూ వచ్చారు. కానీ ఈసారి జరిగింది మాత్రం అందుకు భిన్నంగా ఉంది.

సాధారణంగా సూర్యుడిని నిరంతరం శాస్త్రవేత్తలు పరిశీలించడం జరుగుతుంటుంది. అలాగే సూర్యుడిపై కార్యకలాపాల వీడియో ఒకటి చూస్తూండగా ధ్రువ ప్రాంతంలోంచి ప్లాస్మా పోగు ఒకటి బయటకొచ్చింది. కుతకుత ఉడుకుతూండే ఈ పోగు చూస్తూండగానే విడిపోయింది. అది అలా అలా ఎగురుతూ ఓ రింగు ఆకారాన్ని సంతరించుకుంది..ఆపై సూర్యుడి ఉత్తర ధ్రువ ప్రాంతంలో గిరికీలు కొట్టడం మొదలుపెట్టింది. సూర్యుడి నుంచి ఇలా ఓ ప్లాస్మా పోగు విడిపోవడమేమిటి, ధ్రువ ప్రాంతంలో రింగులా చక్కర్లు కొట్టడమేమిటని నాసా శాస్త్రవేత్తలూ కాసేపు ఆశ్చర్యపోయారు.

ఇలా జరగడం ఇదే తొలిసారని అంటున్నారు. ఈ పరిణామానికి కారణం సూర్యుడి అయస్కాంత క్షేత్రం రివర్స్‌ అవుతూండటం అయి ఉండొచ్చునని అంచనా వేస్తున్నారు… సూర్యుడు భగభగ మండే అగ్నిగోళమని మనందరికీ తెలుసు. హైడ్రోజన్, హీలియం మూలకాలు ఒకదాంట్లో ఒకటి లయమైపోతూ విపరీతమైన శక్తిని ఉత్పత్తి చేస్తూంటాయి. ఈ క్రమంలో అక్కడి పదార్థం ప్లాస్మా స్థితిలో ఉంటుంది. ప్లాస్మా అంటే ఆవేశంతో కూడిన వాయువు అని చెబుతున్నారు. అప్పుడప్పుడు సూర్యుడి ఉపరితలంపై పెద్ద ఎత్తున పేలుళ్లు జరగడం కనిపిస్తూ ఉంటుంది.

ఫలితంగా కొన్ని కిలోమీటర్ల ఎత్తుకు ఈ ప్లాస్మా పోగులు ఎగసిపడటం మామూలే. వీటిల్లో కొన్ని సూర్యుడి నుంచి విడిపోతూంటాయి కూడా. అయితే ఏ ప్లాస్మా పోగు కూడా ఇప్పటిదాకా ఇలా రింగులా మారి తిరగడం చూడలేదని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పోగు సూర్యుడి 55 డిగ్రీల అంక్షాంశం వద్ద మొదలై ధ్రువ ప్రాంతాల వైపునకు ప్రయాణించిందని అమెరికాలో కొలరాడో రాష్ట్రంలోని బౌల్డర్‌లో ఉన్న నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ అట్మాస్ఫరిక్‌ రీసెర్చ్‌ డైరెక్టర్‌ స్కాట్‌ మాకింతోష్‌ వివరించారు. ”పదకొండేళ్లకోసారి ఇలా జరగడం, పోగు కచ్చితంగా ఒకే ప్రాంతం నుంచి మొదలై ధ్రువం వైపు ప్రయాణించడాన్ని పరిశీలించాం. ఈ పోగు పదకొండేళ్ల సోలార్‌ సైకిల్‌లో ఒకే చోట ఎందుకు పుడుతోంది? కచ్చితంగా ధ్రువాలవైపే ఎందుకు ప్రయాణిస్తోంది? ఉన్నట్టుండి మాయమైపోయి, మూడు నాలుగేళ్ల తరువాత అకస్మాత్తుగా అదే ప్రాంతంలో మళ్లీ ఎలా ప్రత్యక్షమవుతోంది? ఇవన్నీ ఎంతో ఆసక్తి రేపే విషయాలుగా ఆయన వివరించారు. సూర్యుడి నుంచి ప్లాస్మా పోగులు విడిపోవడాన్ని శాస్త్రవేత్తలు గతంలోనూ గుర్తించారు.

2015లో కొద్ది వ్యవధిలోనే రెండు భారీ పోగులు విడిపోయాయి. మొదటిది సూర్యుడి ఉత్తర భాగంలో సంభవించింది. ప్లాస్మా కిలోమీటర్ల ఎత్తుకు ఎగసింది. తరువాత కింది భాగంలోకి కలిసిపోయింది. రెండు గంటల తరువాత మరో పోగు విడిపోయింది. అయితే రెండు సందర్భాల్లోనూ ప్లాస్మా పోగు రింగులా మారడం, చక్కర్లు కొట్టడం జరగలేదు.తాజాగా మాత్రమే అలా జరగడానికి కారణాలేమిటో శాస్త్రవేత్తలు నిర్ధారించాల్సి ఉంది. ఇటీవలి కాలంలో సూర్యుడిపై కార్యకలాపాలు చాలా చురుకుగా సాగుతున్నాయని.. పదకొండేళ్ల సోలార్‌ సైకిల్‌లో కీలకదశకు ఇది నిదర్శమని వారంటున్నారు. ఈ సోలార్‌ సైకిల్‌ 2024లో పతాక స్థాయికి చేరుతుంది.

అప్పుడు సూర్యుని ఉత్తర, దక్షిణ ధ్రువాలు తారుమారవుతాయి. బహుశా ఆ క్రమంలోనే ఉత్తర ధ్రువ ప్రాంతంలో ప్లాస్మా రింగ్‌ ఏర్పడి ఉండవచ్చు” అని పరిశోధకులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. సౌరకుటుంబ పెద్ద అయిన సూర్యుడు ఇప్పుడు మధ్య వయసులోకి అడుగుపెట్టాడని అంచనా… యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ శాస్త్రవేత్త ‘గియా అంతరిక్ష నౌక’తో చేసిన ప్రయోగాల ద్వారా ఈ అంచనాకు వచ్చారు. ప్రస్తుతం సూర్యగ్రహం వయసు 457 కోట్ల సంవత్సరాలని, ఇంకో 500 కోట్ల ఏళ్ల తర్వాత సహజంగానే నశించిపోతుందని గత ఆగస్టులో శాస్త్రవేత్తలు ప్రకటించారు. చివరి దశలో సూర్యుని సైజు విపరీతంగా పెరుగుతుందని, రెడ్‌జెయింట్‌గా మారి భూమితోపాటు ఇతర గ్రహాలను కూడా మాడ్చి మసి చేసేస్తుందని అంచనా.

ఆ తర్వాత వేడి తగ్గిపోయి మరుగుజ్జు నక్షత్రంగా మారిపోతుందని సిద్దాంతాలు చెబుతున్నాయి. సూర్యుడు విద్యుదావేశంతో కూడిన భారీ వాయుగోళం. ఈ విద్యుదావేశపు వాయువు కదలికల వల్ల సూర్యుడి చుట్టూ శక్తిమంతమైన అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. దీని ఉత్తర, దక్షిణ ధ్రువాలు పదకొండేళ్లకోసారి తారుమారవుతూంటాయి. ఇదే సోలార్‌ సైకిల్‌. దీని ప్రభావం సూర్యుడి ఉపరితలంపై జరిగే కార్యకలాపాలపైనా ఉంటుంది. సూర్యుడిపై జరిగే పేలుళ్ల ఫలితంగా నల్లటి మచ్చల్లాంటివి కనిపిస్తూంటాయి. వీటినే సన్‌ స్పాట్స్‌ అంటారు. ఒక ఏడాదిలో వీటి సంఖ్యను బట్టి సూర్యుడిపై కార్యకలాపాల తీవ్రత తెలుస్తూంటుంది. సన్‌స్పాట్స్‌ ఎక్కువ అవుతున్నాయంటే పదకొండేళ్ల సోలార్‌ సైకిల్‌ పతాక స్థాయికి చేరుతోందని అర్థం. ఆ తర్వాత ఏటా ఇవి తగ్గుతూ దాదాపుగా శూన్యమవుతాయి. తర్వాత మళ్లీ ఇంకో సోలార్‌ సైకిల్‌ ప్రారంభానికి సూచికగా క్రమంగా పెరుగుతాయి. సూర్యుడిపై నుంచి పదార్థం అంతరిక్షంలోకి ఎగసిపడే తీవ్రత కూడా సోలార్‌ సైకిల్‌కు అనుగుణంగానే హెచ్చుతగ్గులకు గురవుతూంటుంది. వీటి ప్రభావం అంతరిక్షంలోని ఉపగ్రహాల ఎలక్ట్రానిక్‌ పరికరాలను నాశనం చేసేంత తీవ్రంగా ఉంటుంది.

అగ్నిగోళంలా నిరంతరం మండిపోయే సూర్యుడిపై ఏదో జరుగుతోంది. ఇంతకీ అక్కడేం జరుగుతోందన్న దానిపై శాస్త్రవేత్తలు ఇప్పుడు ద్రుష్టిపెట్టారు. మొన్నీ మధ్య సూర్యుడిపై కేవలం రెండు వారాల వ్యవధిలోనే 35 భారీ విస్ఫోటనాలు, 14 సన్‌స్పాట్‌లు‌, ఆరు సౌర జ్వాలలు సంభవించాయి. సూర్యుని ఉపరితలంపై సంభవించే భారీ విస్ఫోటనాలను కరోనల్ మాస్ ఎజెక్షన్ లేదా ఉద్ఘారం అని అంటారు. ఈ విస్పోటన సమయంలో బిలియన్ టన్నుల పదార్థం అంతరిక్షంలోకి విడుదలవుతుంది. అది సౌరకుటుంబం మొత్తంగా గంటకు లక్షల కి.మీల వేగంతో ప్రయాణిస్తుంది.

ఈ పరిణామాలు భూమిపై ఉన్న జీవరాశులు, సాంకేతికత, అలాగే కృత్రిమ ఉపగ్రహాలు, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం, వ్యోమగాముల పైన కూడా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమిపై సకల జీవరాశుల మనుగడకు సూర్యరశ్మి ఆధారభూతంగా నిలుస్తున్నది. గ్రహాల గమనాన్ని నియంత్రించే కేంద్రకంగానూ సూర్యగోళం పాత్ర ఎంతో ప్రధానమైనది. ఇలాంటి సంక్లిష్ట చర్యల్లో కీలకంగా ఉన్న సూర్యుడు ఉన్నట్టుండి ప్రకాశించే గుణాన్ని కోల్పోతే? భూమి మీద జీవరాశులు ఏమవుతాయి? సౌరకుటుంబంలో గ్రహాల పరిస్థితి ఏమిటి? నిజంగానే సూర్యుడు ఉన్నట్టుండి మృత నక్షత్రంగా మారిపోతే సౌరకుటుంబంలో అన్ని గ్రహాలు నిర్జీవంగా మారి.. నాశనమవుతాయి.

అయితే బృహస్పతిపై ఈ ప్రభావం ఉండబోదు. సూర్యుడి నుంచి ఆ గ్రహానికి ఉన్న సగటు దూరం, అక్కడి వాతావరణం, నేల స్వభావం, గురుత్వాకర్షణ, భ్రమణ-పరిభ్రమణ వేగాలు దీనిపై ప్రభావం చూపుతున్నట్టు పరిశోధకులు తెలిపారు.సూర్యుడు లేకపోతే భూమిపై చీకటి అలుముకుంటుంది. కిరణజన్య సంయోగ క్రియకు అంతరాయం ఏర్పడి చెట్లు, మనుషులు, జీవజాలమంతా నశిస్తుంది. ఉష్ణోగ్రతలు మైనస్‌ వేల డిగ్రీల సెంటీగ్రేడ్‌ కిందకు వెళ్తాయి. భూమి గురుత్వాకర్షణశక్తి, భ్రమణ వేగంలో మార్పులు చోటుచేసుకుంటాయి. అయితే వచ్చే 500 కోట్ల ఏండ్లవరకూ సూర్యుడు అంతరించే ప్రమాదం లేదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

Must Read

spot_img