సొంత పార్టీ సభ్యులే మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపుకు షాక్ ఇస్తున్నారు. రాబోయే అధ్యక్ష ఎన్నికల కోసం ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టిన ట్రంప్ జరుగుతున్న పరిణామాలను చూసి షాక్ తింటున్నారు. ఒకప్పుడు తనకు వీర విధేయులుగా ఉన్నవారే ఇప్పుడు అడ్డం తిరుగుతున్నారు. అధ్యక్ష పదవి కోసం పోటీ చేసే అభ్యర్థిగా ఆయనకే సవాల్ విసురుతున్నారు. ఇది చూసి ట్రంప్ తట్టుకోలేకపోతున్నారని సమాచారం.
ఒకప్పుడు రిపబ్లికన్ పార్టీ సభ్యులంతా డోనాల్డ్ ట్రంప్‌కి వీరవిధేయులుగా పనిచేసారు. దాంతో ట్రంప్ ఆడిందే ఆటగా పాడిందే పాటగా కొనసాగింది. ఇప్పుడు రెండోసారి అధ్యక్ష పదవికి పోటీ చేయాలనుకుంటున్న మాజీ అధ్యక్షుడికి సవాల్ విసురుతున్నారు. గతంలో ట్రంప్ ఓటమిపాలైనప్పుడు వారంతా ఆయన వెన్నంటి నడిచారు. కేపిటల్ హిల్‌పై దాడి జరిపినప్పుడు ఆయనకు మద్దతుగా ఉన్నారు. ఇప్పుడు ఆయనకు ఎదురు తిరుగుతున్నారు.
రిపబ్లిక్ పార్టీలో అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీలో ట్రంప్ సన్నిహితులే సై అంటున్నారు. అమెరికాలో అధ్యక్ష బరిలో దిగడం కోసం రిపబ్లికన్ పార్టీలో పోటీ పెరిగిపోతోంది. భారతీయ సంతతికి చెందిన నిక్కీ హేలీ తాను పోటీలో ఉన్నట్టు ప్రకటించగానే ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. అమెరికాలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ట్రంప్ అనుచరులందరూ ఓటమి పాలవడంతో పార్టీలో ఆయనపై విశ్వాసం సన్నగిల్లుతోంది. అధ్యక్ష ఎన్నికల సమయానికి ఆయనకు 78 సంవత్సరాలు మీద పడతాయి. దీంతో ఒకప్పుడు ట్రంప్‌కు మద్దతు ఇచ్చినవారే ఇప్పుడు ఆయనపై పోటీకి సై అంటున్నారు.
అయితే పోటీ ప్రధానంగా డొనాల్డ్ ట్రంప్, ఫ్లోరిడా గవర్నర్ రాన్ డెసాంటిస్ మధ్య ఉంటుందని అంచనాలున్నాయి. ట్రంప్‌కి గట్టి పోటీ ఇచ్చే వారిలో ఫ్లోరిడా గవర్నర్ రాన్ డెసాంటిస్ ముందు వరుసలో ఉంటారనే అంచనాలున్నాయి. ఇప్పటివరకు ఆయన తాను బరిలో ఉన్నట్టు ప్రకటించకపోయినప్పటికీ పార్టీలో ట్రంప్ వ్యతిరేక వర్గం రాన్‌కు జై కొడుతోంది. మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున ఫ్లోరిడా గవర్నర్‌గా 15 లక్షల ఓట్ల భారీ మెజారీ్టతో రాన్ నెగ్గారు.
నలబై నాలుగేళ్ల వయసున్న రాన్ హార్వార్డ్‌లో లా డిగ్రీ పొందారు. నేవీలో పనిచేశారు. అమెరికన్ కాంగ్రెస్‌లో ప్రజాప్రతినిధుల సభ్యునిగా 2013 నుంచి 2018 వరకు ఉన్నప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు. రాన్ డెసాంటిస్‌కు రాజకీయాల్లో గుర్తింపు, ఒక లైఫ్ ఇచ్చింది ట్రంపే. 2019 ఎన్నికల్లో ఫ్లోరిడా గవర్నర్‌గా రాన్ అభ్యర్థిత్వాన్ని ట్రంప్ బాహాటంగా బలపరచడంతో ఆయన నెగ్గగలిగారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఫ్లోరిడా గవర్నర్‌గా గత 40 దశాబ్దాల్లో ఎవరికీ దక్కని మెజారీ్టతో తిరిగి ఎన్నికయ్యారు. కరోనా సంక్షోభం సమయంలో ప్రజలకు విపరీతమైన స్వేచ్ఛ ఇచ్చారు. మాస్క్ లు, టీకాలు తప్పనిసరి చేయకపోవడంతో ప్రజలు ఆయనను బాగా అభిమానించారు. దాదాపుగా ట్రంప్ భావాలే ఉన్నప్పటికీ, దుందుడుకు ధోరణితో కాకుండా సౌమ్యంగా వ్యవహరించడం వల్ల ట్రంప్ వ్యతిరేక వర్గానికి ఒక ఆశాదీపంలా కనిపిస్తున్నారు.
ఇటు భారతీయ సంతతికి చెందిన నిక్కీ హేలీ సైతం తాను అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం బరిలో ఉన్నట్టు ప్రకటించి ప్రచారం మొదలుపెట్టడంతో రాజకీయాలు హీటెక్కాయి. ట్రంప్ తర్వాత అధికారిక ప్రకటన చేసిన రెండో అభ్యర్థి నిక్కీ. ఒకప్పుడు రిపబ్లికన్ పార్టీలో యువ కెరటంగా చరిష్మా ఉన్నప్పటికీ, ఇటీవల ఆమె ప్రభ నెమ్మదిగా తగ్గుతూ వచ్చింది. పంజాబ్ నుంచి అమెరికాకు వలస వెళ్లిన కుటుంబానికి చెందిన నిక్కీ అక్కడి దక్షిణ కరోలినా తొలి మహిళా గవర్నర్‌గా చేశారు. 2016లో ట్రంప్‌ను తీవ్రంగా వ్యతిరేకించినా ఆయన అధ్యక్షుడయ్యాక ఆమె రాజీకొచ్చారు.
ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగా పని చేశారు. ఐరాస భద్రతా మండలి సమావేశం జరుగుతుండగా నాటకీయ పరిణామాల మధ్య పదవి నుంచి వైదొలిగారు. డొనాల్డ్ ట్రంప్ హయాంలో సీఐఏ డైరెక్టర్‌గా, విదేశాంగ మంత్రిగా పదవులు నిర్వహించిన మైక్ పాంపియో చివరి వరకు ఆయనకు విధేయుడిగానే ఉన్నారు. ట్రంప్ విదేశీ విధానాలను ముందుకు తీసుకువెళ్లడంలో కీలకంగా వ్యవహరించారు. కేపిటల్ హిల్‌పై దాడి జరిగిన సమయంలో కూడా ట్రంప్‌కు మద్దతుగా ఉన్నారు. వెస్ట్ పాయింట్ మిలటరీ అకాడమీలో గ్రాడ్యుయేషన్, హార్వార్డ్ యూనివర్సిటీ లా డిగ్రీ చేసిన పాంపియో ఇప్పుడు తన మాజీ బాస్‌నే ఎదిరించడానికి సిద్ధమవుతున్నారు. అధ్యక్ష అభ్యరి్థత్వానికి పోటీ పడతానని సన్నిహితుల వద్ద వెల్లడించారు.
ఇక అధికారికంగా బరిలో దిగడమే మిగిలి ఉంది. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఉపాధ్యక్షుడిగా అత్యంత విధేయత ప్రకటించిన మైక్ పెన్స్ ఈసారి అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడతారని చెబుతున్నారు. 2021 జనవరిలో కేపిటల్ హిల్‌పై దాడి జరిగే వరకు ఇరువురి మధ్య మంచి అనుబంధం కొనసాగింది. ఆ దాడుల తర్వాత ట్రంప్, పెన్స్ సంబంధాలు క్షీణించాయి. 2020 అధ్యక్ష ఎన్నికల్లో కిందపడినా పై చేయి తనదేనని చాటి చెప్పడానికి ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు సహకారం అందించడానికి పెన్స్ నిరాకరించారు.