Homeఅంతర్జాతీయందేశంలో నియామక పరీక్షల స్కాం నిరుద్యోగులకు కష్టాల్ని తెస్తోందా..?

దేశంలో నియామక పరీక్షల స్కాం నిరుద్యోగులకు కష్టాల్ని తెస్తోందా..?

  • ఈ స్కాంల ఎఫెక్ట్ .. వారి భవిష్యత్ ను ప్రభావితం చేస్తోందని వీరంతా వాపోతున్నారు.
  • అసలు స్కాం ఏ ఏ రూపాల్లో, ఏవిధంగా జరుగుతుందన్నదే చర్చనీయాంశంగా మారుతోంది.
  • దీనివల్ల తమకు ఉద్యోగాలనేవి ..అందని ద్రాక్షగా మారుతున్నాయని అంటున్నారు..

పరీక్షా పత్రాల లీకేజీ .. ముఖ్యంగా నిరుద్యోగ యువతకు తీరని వేదనను మిగుల్చుతోంది. అయితే లీకేజే కాక..పలు మార్గాల్లో దందాలు కొనసాగుతుండడం.. ఉద్యోగాలు తెచ్చుకోవాలన్న వీరి ఆశలపై నీళ్లు జల్లుతోంది. దీంతో వివిధ రాష్ట్రాల్లోనూ స్కాంలు బహిర్గతమవడం..చర్చనీయాంశమవుతోంది.

రాజస్థాన్‌లో గత డిసెంబరు నెలలో ఒక రోజు ఉదయం ఉదయ్‌పుర్ దిశగా వెళ్తున్న ఒక బస్సును పోలీసులు చూశారు. దాని వెంటే వారు కూడా వెళ్లారు. దీనికి ఒక రోజు ముందే, రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామక పరీక్ష పత్రం లీకయ్యే అవకాశముందని వారికి సమాచారం అందింది. అయితే, తెల్లవారితే లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు కూర్చోనున్నారు. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఈ పరీక్షను ఎట్టకేలకు డిసెంబరు 24న నిర్వహించాలని నిర్ణయించారు. దీని కోసం 1,193 పరీక్షా కేంద్రాలు కూడా ఏర్పాటుచేశారు. అయితే, పరీక్షకు కొన్ని గంటల ముందే పోలీసులకు ఆ లీక్‌పై సమాచారం వచ్చింది.

మిగతా రాష్ట్రాల్లానే రాజస్థాన్‌లో కూడా ప్రభుత్వ ఉద్యోగాలకు లక్షల మంది దరఖాస్తు చేస్తుంటారు. అయితే, కొన్నిసార్లు కొందరు తప్పుడు మార్గాల్లో ఉద్యోగాలు సంపాదించేందుకు ప్రయత్నించే ఘటనలు వెలుగు చూస్తుంటాయి. మోసపూరితంగా ఉద్యోగాలు సంపాదించేందుకు అనుసరించే మార్గాల్లో ప్రశ్న పత్రాలను కొనేయడం లేదా వేరొకరితో పరీక్షలు రాయించడం లాంటివి ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఉదయ్‌పుర్‌కు వెళ్తున్న ఆ బస్సు ఒక పరీక్షా కేంద్రానికి వెళ్తోంది. అయితే, పరీక్ష పత్రాలను లీక్ చేసేందుకు ప్రయత్నిస్తున్న వారు ఆ బస్సులో ఉన్నట్లు పోలీసులు భావించారు.

దూరం నుంచే ఆ బస్సును పోలీసులు గమనించారు. ఒక బిల్డింగ్ పరిసరాల్లో ఆ బస్సు తిరుగుతూ కనిపించింది. వెంటనే దాన్ని పోలీసులు ఆపారు. బస్సు లోపల మాకు నలుగురు ప్రభుత్వ టీచర్లు కనిపించారు. వీరు దాదాపు 20 మంది అభ్యర్థుల కోసం పత్రాల్లోని ప్రశ్నలకు సమాధానాలు నింపుతున్నారని ఒక పోలీసు అధికారి చెప్పారు. ఈ నలుగురు టీచర్లకు కూడా ఆ పరీక్ష నిర్వహణ కేంద్రం వద్ద ఏర్పాట్లు చూసుకోవాల్సిన బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది.

అయితే, వీరు కొందరి అభ్యర్థుల దగ్గర డబ్బులు తీసుకొని, వారి కోసం పత్రాలను నింపుతున్నారు. అయితే, డబ్బులు ఎంత మొత్తంలో చేతులు మారాయో పోలీసులు వెల్లడించలేదు. మరోవైపు తమ తరుఫున పరీక్ష రాసేందుకు దాదాపు 20 మంది అభ్యర్థులు ఏర్పాటుచేసుకున్న ‘‘డమ్మీ కేండేట్లు’’ కూడా ఆ బస్సులో ఉన్నారు. వీరి దగ్గర ఫేక్ ఐడీలు కూడా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ కుంభకోణానికి సంబంధించి దాదాపు 48 మందిని ఆ రోజు ఉదయం పోలీసులు అరెస్టు చేశారు. దీంతో వెంటనే ఆ పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

అయితే, ఈ కేసులో ఇద్దరు ప్రధాన నిందితులు ఇప్పటికీ పరారీలోనే ఉన్నారు. వారిని పట్టించే వారికి రూ.1.2 లక్షలు ఇస్తామని ఉదయ్‌పుర్ పోలీస్ చీఫ్
వికాస్ శర్మ చెప్పారు. ఇటీవల కాలంలో ఇలాంటి లీక్‌లు వరుసగా వెలుగుచూస్తున్నాయి. 2018 నుంచి నేటి వరకు ఇలా ఇక్కడ 12 నియామక పరీక్షలు రద్దయ్యాయి. కొన్ని పరీక్షలు రోజుల ముందు, మరికొన్ని గంటల ముందు కూడా రద్దయ్యాయి. అయితే, ఇలా వరుసగా పరీక్షలు వాయిదా పడటంతో నియామక విధానాలపై తమకు నమ్మకం తగ్గిపోతోందని ఆశావహ అభ్యర్థులు చెబుతున్నారు.

దీంతో తాము మళ్లీ పరీక్ష రాయడానికి వస్తానని అనుకోవడం లేదని కొందరు మహిళా అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఒకసారి రద్దు చేశారు.
రెండోసారి అయితే, పరీక్షకు కూర్చోబెట్టి మధ్యలోనే పత్రాలను తీసేసుకున్నారు. అడిగితే ప్రశ్న పత్రం లీక్ అయ్యిందని చెప్పారని వీరంతా చెబుతున్నారు. అయితే, ఈ సమస్య కేవలం రాజస్థాన్‌కే పరిమితం కాదు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఇలానే ప్రశ్న పత్రాలు లీక్ అవుతున్నాయి. ఈ పరీక్షలు మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారోనని లక్షల మంది ఎదురుచూస్తున్నారు.

  • ఎలాగైనా .. ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలన్నది యువత టార్గెట్..

ప్రభుత్వ ఉద్యోగానికి ఒక క్రేజ్ ఉంటుంది. దీని కోసం కొంతమంది ఎంతకైనా తెగిస్తుంటారని ఉత్తర్ ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు చైర్మన్‌గా పనిచేసిన
పొలిటికల్ సైంటిస్ట్ పంకజ్ కుమార్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఉద్యోగం ఒకసారి వస్తే, జీవితం స్థిరపడిపోయినట్లే. వీటి కోసం లక్షల మంది ఏళ్లపాటు
ఎదురుచూస్తుంటారు. కొందరు మాత్రం ఇలా మోసపూరితంగానైనా ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకోవాలని చూస్తుంటారని ఆయన అన్నారు. ప్రధాన మంత్రి సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో 2014 నుంచి పేపర్ లీక్‌ల వల్ల తొమ్మిదిసార్లు టీచర్లు, జూనియర్ క్లర్కుల పరీక్షలు వాయిదాపడ్డాయి.

మరోవైపు పశ్చిమ బెంగాల్‌లోనూ గత ఏడాది పరీక్షకు కొన్ని గంటల ముందే ఉపాధ్యాయ నియామక పరీక్ష పత్రం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై కూడా అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. మధ్యప్రదేశ్‌లో అయితే, 2009లో ఒక భారీ నియామకాల కుంభకోణం సంచలనం రేపింది. ఇక్కడ మెడికల్ పరీక్షలు రాయించేందుకు కొంతమంది అభ్యర్థులు పొరుగు రాష్ట్రాల నుంచి డమ్మీ కేండేట్లను తీసుకొచ్చేవారు. కొన్నిసార్లు ఇక్కడ పరీక్ష పత్రాలు కూడా లీక్ అయ్యాయి. మొత్తంగా ఈ కేసుల్లో వేల మందిని అధికారులు అరెస్టు చేశారు. మరోవైపు బిహార్, ఉత్తర్ ప్రదేశ్‌లోనూ ఇలాంటి లీక్‌లు వెలుగు చూశాయి.

బిహార్‌లో నియామక పరీక్షల్లో అభ్యర్థులు మోసం చేయకుండా కొన్నిసార్లు షూలు, సాక్సులు వేసుకుని రాకూడదని నిబంధనలు పెడుతుంటారు. అభ్యర్థులకు సాయం చేసిన అధికారులకు గతంలో జరిమానాలు, జైలు శిక్షలు కూడా విధించారు. ఉత్తరప్రదేశ్‌లో సీసీటీవీల నిఘాలో పరీక్షలను నిర్వహిస్తుంటారు. అయితే, పరీక్ష కేంద్రాలకు ప్రశ్నపత్రాలను తరలించే మార్గాల్లో ఎక్కువగా లీక్‌లు జరుగుతుంటాయని పోలీసులు చెబుతున్నారు.

ఉదయ్‌పుర్ లాంటి చోట్ల అయితే, మరొకరితో పరీక్షలు రాయించేందుకు అభ్యర్థులు ఏకంగా ఫేక్ ఐడీ కార్డులే సృష్టిస్తున్నారు. దీంతో వీరిని పట్టుకోవడం అధికారులకు సవాల్‌గా మారుతోంది. మరోవైపు ఈ సమస్యకు అడ్డుకట్ట వేసేందుకు ప్రస్తుతం పక్కా చట్టాలు అందుబాటులో లేవు. ఫ్రాడ్, చీటింగ్ లాంటి కేసులపై అరెస్టైన వారిలో చాలా మంది బెయిలుపై బయటకు వచ్చేస్తున్నారు. ఉత్తరాఖండ్‌లో మాత్రం మోసంచేసే వారికి జీవిత ఖైదు విధించేలా చట్టం తీసుకొచ్చారు. అయితే, పరిస్థితుల్లో పెద్ద మార్పేమీలేదని విమర్శకులు అంటున్నారు.

ఈ సమస్యను పరిష్కరించాలంటే అధికారులు కొత్త మార్గాల్లో నిఘా పెట్టాల్సి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. ఓట్లు లెక్కించే వరకు బ్యాలెట్ బాక్సులను ఎలా భద్రపరుస్తారో అలానే పరీక్ష మొదలుకాకముందే పత్రాలకు పోలీసులు, స్థానిక పరిపాలనా యంత్రాంగం పటిష్ఠ భద్రత కల్పించేలా మార్పులు చేయాలని ప్రభుత్వానికి సూచిస్తున్నామని అంటున్నారు. మరోవైపు ఈ పేపర్ లీక్‌లు దేశంలోని నిరుద్యోగ పరిస్థితిని మన కళ్లకు కడుతున్నాయని కొందరు నిపుణులు అంటున్నారు. డిసెంబరు 2022లో నిరుద్యోగ రేటు 8 శాతానికి పెరిగినట్లు సెంటర్ ఫర్ మోనిటరింగ్ ఇండియన్ ఎకానమీ వెల్లడించింది.

2021లో ఇది 7 శాతం కంటే తక్కువే ఉండేది. దేశంలో మొత్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో దాదాపు రెండు కోట్ల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. మరోవైపు
పది లక్షలకుపైగా ఉద్యోగాలు ప్రస్తుతం ఖాళీగా ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే, పదేపదే పరీక్షలు వాయిదా పడటంతో అసలు తమ భవిష్యత్ ఏమిటో అర్థం కావడంలేదని కొందరు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మరికొందరు అయితే, వయో పరిమితి మించిపోతుందని ఆందోళన
చెందుతున్నారు.

ఎలాగైనా .. ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలన్నది యువత టార్గెట్.. కానీ ఆ ఆశలపై నీళ్లు జల్లుతున్నారు.. కొందరు అక్రమార్కులు.. దీంతో ప్రభుత్వ ఉద్యోగం అన్న ఆశ కొండెక్కుతోందని వీరంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Must Read

spot_img