ఐటీ రంగంలో లేఆఫ్స్ .. హడలెత్తిస్తున్నాయి. మాంద్యం దెబ్బకు .. కొత్తగా నియామకాలు జరగకున్నా, ఊస్టింగులు మాత్రం ఆగడం లేదు. దీంతో ఖర్చులు తగ్గించుకునే పనిలో కంపెనీలు నిండా మునిగిపోతున్నాయి.
కరోనా సమయంలో ఎన్ని రంగాలు ప్రభావితమైనా తట్టుకొని నిలబడగలిగింది, మరింత పుంజుకుంది ఐటీ సెక్టార్ ఒక్కటే. అప్పుడు వర్క్ ఫ్రమ్ హోంతో పని చేయించుకున్న కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులను నియమించుకున్నాయి. ఇప్పుడు డిమాండ్ లేకపోవడంతో వారికి ఉద్యోగులు కంపెనీలకు భారంగా మారారు. దీంతో లక్షల మందిని లేఆఫ్స్ పేరిట తీసేస్తున్నారు. ఒక్కసారిగా తీసేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. కొత్తగా నియామకాలు కూడా పెద్దగా జరగట్లేదు.
2020, 21ల్లో కరోనా సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఎందరో ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది బతుకు ఛిన్నాభిన్నమైంది. మరీ ముఖ్యంగా ఉద్యోగాలు కోల్పోయి ఎందరో రోడ్డున పడ్డారు.ఇది దాదాపు అన్ని రంగాలకు విస్తరించింది. అయితే ఇదే సమయంలో ఐటీ తీరు వేరు. అన్నింటికి ఒక లెక్క. ఐటీది ఒక లెక్క అన్నచందంగా మారింది. కరోనా సమయంలో తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం కల్పించాయి ఐటీ కంపెనీలు. డిమాండ్ పెరిగిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఉద్యోగులను నియమించుకున్నాయి. దీంతో వారిటి ఎలాంటి డోకా లేకుండా పోయింది.
అయితే ఇది కొంతవరకే. ఇక గతేడాది ఐటీ ఉద్యోగుల పరిస్థితి చాలా కష్టంగా మారింది. అధిక ద్రవ్యోల్బణంతో ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచడం ప్రారంభించాయి. ఇది ఆర్థిక మాంద్యానికి సంకేతాలన్న భయాలను పెంచాయి. ఈ నేపథ్యంలోనే ఉద్యోగులకు కష్టకాలం నడిచింది. దిగ్గజ కంపెనీలు అయినటువంటి యాపిల్, గూగుల్, మెటా, ట్విట్టర్, అమెజాన్ పెద్ద ఎత్తున ఉద్యోగులను ఇంటికి పంపించేశాయి. లేఆఫ్స్ పేరిట తొలగించుకున్నాయి. ఇది భారత్‌పైనా పడింది. ముఖ్యంగా ఐటీ కంపెనీలు, ఎడ్యుటెక్ కంపెనీలపై ఈ ప్రభావం కనిపించింది.
కొవిడ్ సమయంలో అప్పటి అవసరాలను బట్టి ఎక్కువ వేతనం ఇచ్చి మరీ ఉద్యోగుల్ని నియమించుకున్న కంపెనీలు ఇప్పుడు వారిని తీసేస్తున్నాయి. చేస్తున్న పనికి మించి వేతనం పొందుతున్నవారిని సహా.. తమ అంచనాలకు అనుగుణంగా పనిచేయని వారిని పీకేస్తున్నాయి.దాదాపు రెండేళ్లు బాగా నడిచిన ఐటీ రంగం.. గతేడాది మాత్రం సంక్షోభం అంచున నిలిచింది. ప్రాజెక్టులు లేక, డిమాండ్లు లేక ఉద్యోగులకు సరిగా జీతాలు కూడా చెల్లించలేకపోయాయి. ముఖ్యంగా అమెరికా, ఐరోపాల్లో ఆర్థిక మందగమనం పరిస్థితుల నేపథ్యంలో ఈ ఐటీ కంపెనీలకు ప్రాజెక్టులు తగ్గిపోయాయి.
అక్కడ పరిస్థితి మరింత క్షీణిస్తే గనుక ఇంకా కష్టమవుతుంది. అందుకే లాభాల్లేని పరిస్థితుల సమయంలో ఖర్చులను తగ్గించుకోవడం కోసం ఉద్యోగులను వదిలించుకునేందుకు ప్రణాళికలు చేస్తున్నాయి. ఇక 2022 సంవత్సరంలో మొత్తం ప్రపంచవ్యాప్తంగా 1018 సంస్థలు కలిపి 1,53,678 మంది ఉద్యోగులను తొలగించినట్లు వెల్లడైంది. ఇక కొవిడ్ ప్రారంభమైనప్పటి నుంచి చూస్తే 1546 కంపెనీలు 2,57,729 మంది ఉద్యోగులను ఇంటికి పంపించేశాయి. కన్జూమర్, రిటైల్ రంగంలోనే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే అమెరికాలో ముఖ్యంగా ఆదాయం తగ్గిన నేపథ్యంలోనే ఖర్చులను తగ్గించుకునేందుకు యాపిల్, మెటా, అమెజాన్, గూగుల్ వేలల్లో ఉద్యోగులను తొలగించుకున్నాయి.
ఆ తర్వాతే దీనిని ఇతర కంపెనీలు అనుసరించాయి. ఉద్యోగులను తొలగించడంతో పాటే కొత్తగా ఉద్యోగ నియామకాలను కూడా నిలిపివేశాయి. ఏ రోజు
ఏ కంపెనీ పింక్ స్లిప్ ఇస్తుందో తెలియని కంగారు పుట్టిస్తోంది. మనదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా నేడు ఆర్థిక మాంద్యం ముంచుకొస్తున్న సంకేతాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా అమెరికా, యూరప్ దేశాల్లో ఆర్థిక మాంద్యం భయాలు వెంటాడుతున్నాయి.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాల్లో కోత పెడుతున్నవన్నీ ఉత్పత్తి ఆధారిత కంపెనీలే. సేవల ఆధారిత కంపెనీల్లో.. అందునా భారతదేశానికి చెందిన సర్వీస్ బేస్డ్ కంపెనీల్లో కోతలు తక్కువ. ఉత్పత్తి ఆధారిత సేవలందించే అమెరికన్ కంపెనీల్లో టాప్-5.. ఫేస్‌బుక్ (మెటా), యాపిల్, అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, గూగుల్ ఈ ఐదింటినీ కలిపి ఫాంగ్ కంపెనీలుగా పిలుస్తారు. అలాగే మనదేశం నుంచి సేవలు అందించే ఐదు సర్వీస్ బేస్డ్ కంపెనీలు… హెచ్‌సిఎల్, విప్రో, ఇన్ఫోసిస్, టిసిఎస్, కాగ్నిజెంట్.
అయితే, కాగ్నిజెంట్ ఒక్కటే అమెరికన్ బహుళజాతి కంపెనీ. ఆ ఒక్క సంస్థే ఇటీవలి కాలంలో.. బ్యాక్‌గ్రౌండ్ చెక్ సరిగా లేదన్న నెపంతో, ఫేక్ సర్టిఫికెట్లు సమర్పించారన్న కారణంతో భారతదేశంలోని 12 వేల మంది ఉద్యోగులను తీసేసింది. ఇలా ఫేస్‌బుక్, అమెజాన్, ట్విటర్ వంటి కంపెనీల్లో పనిచేస్తూ ఉద్వాసనకు గురైనవారి పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా ఉంది. వారి నుంచి భారతదేశానికి వచ్చే రెమిషన్స్ తగ్గుతున్నాయి. ఫలితంగా వారి కుటుంబాలపై, వారి వ్యయ సామర్థ్యంపైనా.. పరోక్షంగా దేశ ఆర్థికవ్యవస్థపైనా ప్రభావం పడుతోంది.
ప్రపంచానికి మెడ మీద కత్తిలా వేలాడుతున్న మాంద్యం, యుద్ధం భయపెడుతున్న వేళ అంతర్జాతీయ,జాతీయ టెక్ సంస్థలు ఒత్తిడిలోకి జారుకుంటున్నాయి. అమెరికన్ టెక్ సంస్థలు అనేకం ఉద్యోగుల్ని తగ్గించుకొనే పనిలో పడడంతో వేలాది మంది వీధిన పడుతున్నారు. ఉద్యోగాలు కోల్పోతున్న వారిలో ఎక్కువగా భారతీయులు. హెచ్-1బి వీసాలపై వచ్చిన కొలువు పోతే పరిస్థితి కష్టమే. అరవై రోజుల్లోగా మరో ఉద్యోగం వెతుక్కోకుంటే ఇంటికే. భారత ఆర్థిక వ్యవస్థపైనా ఉద్వాసనల పరోక్ష ప్రభావం పడనుంది. సదరు సంస్థల భారతీయ శాఖల్లో పనిచేస్తున్న మనవాళ్లమీద అనివార్యంగా ఆ ప్రభావం పడుతోంది.

ఉద్యోగులను తీసివేసే ప్రణాళికలతో పాటు కొత్త నియామకాలపై ఐటీ కంపెనీలు అచీతూచీ వ్యవహారిస్తున్నాయి. అవి ఇప్పుడు పొదుపు మంత్రాన్ని జపిస్తోన్నాయి. అమెరికాతో పాటు పలు దేశాల్లో సహా అనేక పరిణామాలతో ద్రవ్యోల్బణం పెరిగి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అస్తుబిస్తుగా మారిన నేపథ్యంలో ఆర్థిక మాంద్యం ప్రపంచాన్ని ఆవరిస్తుందన్న భయం పెరిగింది. ఆ సంకేతాలు రోజు రోజుకు ఉధృతమవుతూ వస్తున్నాయి. ఇలానే పరిస్థితి కొనసాగితే మున్ముందు ఐటీ రంగంలో 2008 నాటి గడ్డు పరిస్థితి పునరావృతం అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఐటీ రంగం కుదేలవ్వడానికి ప్రధాన కారణం అధిక ద్రవ్యోల్బణం. దీనిని అదుపు చేసేందుకు, ద్రవ్య చలామణిని అరికట్టేందుకు అన్ని దేశాలు పూనుకుంటున్నాయి. సంక్షోభం నుండి గట్టెక్కడానికి అమెరికా ఫెడ్ ఇటీవల వడ్డీ రేట్ల పెంపు ప్రయత్నాలు గూగుల్, మైక్రోసాఫ్ట్ సహా ఇతర కంపెనీలపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. అమెరికా అనుసరిస్తున్న విధానాన్ని ఇతర దేశాలు అనుసరిస్తున్నాయి. మన రిజర్వు బ్యాంకు సైతం వడ్డీ రేట్లను పెంచింది. ఐటీ కంపెనీలు శ్రామికశక్తి పునర్మూల్యాంకనంతో ఈ ఏడాది ఇప్పటివరకు 850కి పైగా టెక్ కంపెనీల్లో లక్షా 37 వేల వైట్ కాలర్ ఉద్యోగాలు ఇంటి బాట పట్టాల్సి వచ్చిందని ఓ అంతర్జాతీయ అంచనా.
లిఫ్ట్, స్ట్రైప్, కాయిన్‌బేస్, షాపిఫై, నెటిఫ్లిక్స్, శ్నాప్, రాబిన్‌హుడ్, చైమ్, టెస్లా వంటి అనేక దిగ్గజ సస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. అమెరికా కేంద్రంగా నడుస్తున్న భారీ సంస్థలు ఒక్క గత నెలలోనే 33,843 ఉద్యోగాలకు మంగళం పలికాయి. ఉద్యోగాల కోత సుమారు 13 శాతానికి ఎగబాకింది. 2008లో గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ (జిఎఫ్‌సి) వచ్చినప్పుడు వేలాది మంది ఐటీ ఉద్యోగులు రోడ్డుమీద పడ్డారు. ఇప్పుడు అదే పరిస్థితి వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆర్థిక సంక్షోభంతోనే ఉద్యోగాల కోత వెల్లువలా సాగుతోందని, ఇదే పరిస్థితి ఇంకా కొనసాగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదీ ఇవాల్టి ఫోకస్.. రేపటి ఫోకస్ లో మళ్లీ కలుద్దాం..