నారా లోకేష్ పాదయాత్రకు వైసీపీ నేతలు ఇతోథికంగా ప్రచారం చేసిపెడుతున్నారా.. దీనికి మద్ధతుగా వైసీపీ సోషల్ మీడియా ప్రచారం ఉంటోందని టాక్. వైసీపీలో ఏది చేసినా అతిగానే ఉంటుంది. ఆ పార్టీ నేతలు తాముచేసింది చెప్పరు కానీ.. ప్రత్యర్థుల బలం, బలహీనతలపైనే ఎక్కువగా దృష్టిపెడతారు. వారిని మానసికంగా ఇబ్బందిపెట్టి పైశాచిక ఆనందం పొందుతారు. గ్రామస్థాయి నాయకుడి నుంచి సీఎం దాకా అదే పంథా. అయితే ఒకరోజు, రెండు రోజులు అయితే తెలియదు కానీ.. పార్టీ ఆవిర్భావం నుంచి అదే తెలివితేటలు ప్రదర్శిస్తుండడంతో ప్రజలు ఇప్పుడు వాస్తవాలను ఇట్టే పసిగట్టేస్తున్నారు. ఆ పార్టీ సోషల్ మీడియా, చివరకు అనుకూల మీడియా చేసే ప్రచారం, అందులో చూపే అంశాలను రివర్స్ చేసుకొని వాస్తవాలను నిర్థారణ చేసుకుంటున్నారు.
ఇప్పుడు లోకేష్ పాదయాత్రపై చేస్తున్న ప్రచారంలో అసలు వాస్తవాలను పసిగట్టేస్తున్నారు. లోకేష్ పాదయాత్ర కోసం వైసీపీ సోషల్ మీడియాలో 1,200 మందిని రిక్రూట్ చేసినట్టు తెలుస్తోంది. సజ్జల కుమారుడు భార్గవ్ పర్యవేక్షిస్తున్నారు. అయితే ఇలా నియమించుకున్న సోషల్ మీడియా స్ట్రాటజిస్టులు లోకేష్ పాదయాత్రను హైప్ చేస్తున్నారని సొంత పార్టీలో టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి లోకేష్ పాదయాత్రను టీడీపీ పెద్దగా ప్రచారం చేసుకోవడం లేదు. ఆ పార్టీకి చెందిన కొద్దిమంది మాత్రం పనిచేస్తున్నారు. పలకరింపులు, ప్రజల కష్టాలను తెలుసుకుంటూ లోకేష్ పాదయాత్ర ముందుకు సాగుతోంది.

ప్రభుత్వ ఆంక్షలతో సభలు, సమావేశాలు లేకుండా రోజువారి కార్యక్రమాలతో పాదయాత్ర కొనసాగుతోంది. వందలాది మంది వైసీపీ సోషల్ మీడియా స్ట్రాటజిస్టులు పాదయాత్రలోకి ప్రవేశిస్తున్నారు. పాదయాత్రను అనుసరిస్తున్నారు. టీడీపీకి జన సమీకరణకు శ్రమ లేకుండా చేస్తున్నారు. విచిత్రంగా దొరికిపోయే ఫేక్ ఫోటోలు, వీడియోలతో హడావుడి చేస్తున్నారు.నెలల కిందట బైక్ ర్యాలీలో లోకేష్ పాల్గొన్న ఫొటోలు తెచ్చి.. పాదయాత్ర బైక్ యాత్ర అయిందని ప్రచారం చేస్తున్నారు. కొంత మంది సెలబ్రిటీ అకౌంట్లను మాట్లాడుకుని పోస్టింగులు, కామెంట్లు పెడుతున్నారు.
వాటినే ట్రోల్ చేస్తున్నారు. ఎక్కడో పదో అంతస్తు నుంచి పెద్దగా జనం లేని ఫొటోను పెట్టి ఇక్కడ లోకేష్ ఉన్నారా అని వ్యంగ్యంగా ప్రశ్నిస్తున్నారు. లేనిపోని ప్రచారం చేసి లోకేష్ పాదయాత్రపై చర్చ జరిగేలా దోహదపడుతున్నారు. అయితే దీనిపై టీడీపీ సోషల్ మీడియా కూడా ధీటుగా స్పందిస్తోంది. వాస్తవం ఇది అంటూ ఆధారాలతో సహ సమాధానం చెబుతోంది. దీంతో ప్రజలు కూడా వైసీపీ చేస్తున్న పనిని ఏవగించుకుంటున్నారు. వాస్తవ పరిస్థితిని అర్ధం చేసుకుంటున్నారు.
లోకేష్ పాదయాత్రకు జనాదరణ లేనప్పుడు చిన్న గ్రామాల్లో సైతం ఆయన ప్రచారానికి ఆంక్షలు ఎందుకు పెడుతున్నారన్న ప్రశ్న నేరుగా ప్రజల నుంచి వినిపిస్తోంది. మాట్లడడానికి మైక్ లేకుండా చేయడం కూడా ఏమిటన్న వాదన వినిపిస్తోంది. వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న అతి ప్రచారంతో ప్రజలకు వాస్తవాలు తెలిసిపోతున్నాయి. అయితే వైసీపీ హార్ట్ కోర్ ఫ్యాన్స్ మాత్రం దీనిని తప్పుపడుతున్నాయి. చేజేతులా లోకేష్ పాదయాత్రకు మనమే హైప్ చేస్తున్నామన్న భావన వారిలో వ్యక్తమవుతోంది. కానీ హైకమాండ్ మాత్రం పట్టించుకోవడం లేదు.
లోకేష్ పాదయాత్రకు టీడీపీ నేతలు పబ్లిసిటీపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. కొంత మంది సోషల్ మీడియా కార్యకర్తలు మాత్రం కొంతపని చేస్తున్నారు. పాదయాత్ర ఉన్న గ్రామాల్లో ప్రజల్ని వ్యక్తిగతంగా పలకరించి కష్టసుఖాలు తెలుసుకుని భరోసా ఇవ్వడమే లక్ష్యంగా పాదయాత్రకు పెట్టుకున్నారు. అయితే వైసీపీ సోషల్ మీడియా మాత్రం లోకేష్ పాదయాత్రకు విస్తృతమైన కవరేజీ ఇస్తోంది. సాదారణంగా ఆ పార్టీ సోషల్ మీడియా పాజిటివ్ ఇస్తుందని ఎవరూ అనుకోరు. నెగెటివ్ గానే ఇస్తారు. ఎలా అయినా పాదయాత్రను ప్రచారంలో ఉంచడంలో వైసీపీ సోషల్ మీడియా ఎంతో సహకరిస్తోంది.
నారా లోకేష్ పాదయాత్రలో మాట్లాడే మాటలపై ట్రోలింగ్ వీడియోలు చేయడానికి, మార్ఫింగ్ ఫోటోలు చేయడానికి ట్రెండింగ్ లు చేయడానికి వైసీపీ సోషల్ మీడియా ఎందుకు హైర్ చేసుకుందని ప్రశ్నిస్తున్నారు. అయితే వీరి స్ట్రాటజీలు లోకేష్ కు హైప్ క్రియేట్ చేస్తూండటం ఆ పార్టీల్లో గుసగుసలకు కారణం అవుతోంది. అయితే అప్పుడు అధికార పార్టీ చేసిన తప్పే.. ఇప్పుడున్న అధికార పార్టీ చేస్తోంది. అప్పుడు వారు ఫోకస్ చేసిన అంశమే ఇప్పుడు వీరు కూడా ఫోకస్ చేస్తున్నారు. వారి బాటలోనే వీరు కూడా నడుస్తున్నారు. గతం తాలుకూ ఫలితాలను మర్చిపోయారు.
దీంతో అప్పటి ఫలితమే ఇప్పుడూ వస్తుందా ? అదే సీన్ మళ్లీ రిపీట్ అవుతుందా ? అన్న చర్చ ఏపీ మొత్తం జరుగుతోంది. 2019 ఎన్నికల ముందు జగన్ పాదయాత్ర మొదలుపెట్టారు. జగన్ తో పాటు జనం కదిలివస్తున్నారు. జగన్ అడుగులో అడుగు వేస్తున్నారు. జగన్ జనంతో మమేకం అవుతున్నారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. కానీ టీడీపీ వీటిని చూసిచూడనట్టు వదిలేసింది. జగన్ ముద్దులు పెట్టడంపై ఫోకస్ పెట్టింది. సోషల్ మీడియాలో అదే పనిగా ప్రచారం చేసింది. జగన్ పాదయాత్ర సమయంలో టీడీపీ జగన్ ను హేళన చేయడానికి, పాదయాత్ర ప్రభావాన్ని తక్కువ చేసి చూపడానికి ప్రయత్నించింది. తన శక్తియుక్తులన్నీ అందుకే ఖర్చుపెట్టిందని చెప్పవచ్చు.
- జగన్ ప్రభుత్వ వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశారు..
ప్రజలతో సంబంధాలు పెంచుకునే ప్రయత్నం చేశారు. చివరికి విజయం సాధించారు. టీడీపీ చేసిన ప్రయత్నాలు తేలిపోయాయి. 2019 ఎన్నికల సమయంలో టీడీపీ చేసిన పనినే ఇప్పుడు వైసీపీ చేస్తోంది. నారాలోకేష్ పాదయాత్రకు ప్రజల నుంచి స్పందన లేదని చెప్పే ప్రయత్నం చేస్తోంది. తెలుగులో లోకేష్ కొంచెం వీక్ అనే విషయం అందరికీ తెలిసిందే. తెలుగు పదాలను సరిగా ఉచ్చరించలేరు. దీంతో అక్కడక్కడ తప్పులు దొర్లుతాయి. వీటినే వైసీపీ ఫోకస్ చేస్తోంది. వీటిని కట్ చేసి సోషల్ మీడియాలో విరివిగా ప్రచారం చేస్తోంది. లోకేష్ అసమర్థుడని చెప్పే ప్రయత్నం చేస్తోంది.

కానీ టీడీపీ వీటిని వదలేసింది. నారాలోకేష్ ఆహార్యం, బాష పై పట్టుసాధించేలా ఫోకస్ చేసింది. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే లోకేష్ నడక, బాషలో కొంత మార్పు వచ్చింది. ప్రజల్లో కూడా మంచి స్పందనే వస్తోంది. పాదయాత్ర లక్ష్యం ప్రజలతో నేరుగా సంబంధాలు పెట్టుకోవడం. వారి బాధలు, కష్టాలు వినడం. వారితో ఉన్నామని భరోసా ఇచ్చే ప్రయత్నం. అంతే కానీ చిన్న చిన్న పొరపాట్లు, పదదోషాలు, ఉచ్చారణ లోపాలు కాదు. లోకేష్ ప్రజలతో సంబంధాలు పెట్టుకోవడం పైనే ఫోకస్ చేస్తున్నారు.
ప్రత్యర్థుల మాటలకు కుంగిపోవడం లేదు. స్పోర్టివ్ గా తీసుకుంటున్నారని చెప్పవచ్చు. గతంలో టీడీపీ చేసిన పనినే వైసీపీ చేస్తుందని చెప్పవచ్చు. వైసీపీలో మార్పు రాకపోతే అప్పటి ఫలితమే పునరావృతం అవుతుందని చెప్పవచ్చు. అయితే అదేసమయంలో వైసీపీ వ్యూహాన్ని గమనించిన టీడీపీ సైతం.. అందుకనుగుణంగా పావులు కదుపుతోంది.
వైసీపీ తప్పుడు ప్రచారాలకు చెక్ పెట్టేలా .. కౌంటర్లు ఇస్తూ, తనదైన స్టైల్లో వ్యూహాలు పన్నుతోంది. దీంతో విశ్లేషకులు సైతం వైసీపీ.. లోకేష్ యువగళానికి తమకు తెలియకుండానే మంచి ప్రచారం చేసిపెడుతున్నారని అంచనా వేస్తున్నారు. దీంతో కాగల కార్యం గంధర్వులే తీర్చారన్నట్లు పసుపు నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో లోకేష్ గ్రాఫ్ జనాల్లో పెరుగుతోందన్న అభిప్రాయాలు సైతం వెల్లడవుతున్నాయి.
మరి ఇప్పటికైనా అధికార పార్టీ వ్యూహం ఏమిటన్నదే ఆసక్తికరంగా మారింది..