మనం చరిత్ర చదువుతున్నప్పుడు తరచూ వినే పదం మీకు గుర్తుందా.. సేతు హిమాచలం..అంటే మన దేశపు సరిహద్దుల గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు ‘ఆసేతు హిమాచల పర్యంతం’ వింటుంటాం.. అంటే దక్షిణాదిన ఉండే సేతు సముద్రం నుంచి ఉత్తరాన ఉండే హిమాలయాల దాకా అని అర్థం. కశ్మీరు నుంచి కన్యాకుమారి అని ఎలాగైతే అంటుంటామో ప్రాచీన కాలం నుంచి ఆసేతు హిమాలయాలు అనడం జరుగుతోంది.
సేతు సముద్రం అన్న ప్రాజెక్టు గురించి ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇంతకీ సేతు సముద్రం అంటే ఏంటి..? రామాయణ పురాణంలో లంకలో ఉన్న సీతాదేవిని రావణాసురుడి చెర నుంచి విడిపించడానికి వానరమూక నిర్మించి న వారథే సేతుసముద్రమని హిందువులు ప్రఘాడంగా విశ్వాసిస్తారు. ఆనాటి ఆ వారధిఇప్పటికీ సముద్రగర్భంలో ఉందనీ, ఉపగ్రహ చాయాచిత్రాలలో అది స్పష్టంగా కనిపిస్తోందని వాదించేవారు అనేకం. అయితే అప్పటికే సేతు హిమాచలం అన్న పదం వాడుకలో ఉంది కాబట్టి తార్కికంగా చూసినా సేతు సముద్రం ఉందా? లేదా అనే మీమాంస అర్థరహితం అని అంటున్నారు చరిత్రకారులు.
ఇంతకీ సేతు సముద్రం వివాదాస్పదంగా ఎందుకు మారింది..అన్నది చూద్దాం..మన దేశంలో పశ్చిమ, తూర్పు తీరాల మధ్య నౌకాయానాలకు శ్రీలంకను చుట్టిరావల్సి వస్తోంది. అయితే రామసేతుకు కొద్ది పాటి మార్పులు చేస్తే ఆ ప్రయాస తొలగిపోతుందని బ్రిటిష్ వారి హయాంలోనే ఆలోచన చేశారు. అయితే, దీనివల్ల సేతుసముద్రంలో కొంత భాగాన్ని తవ్వాల్సి వస్తుంది. అలాచేస్తే హిందువుల మనో భావాలు దెబ్బతింటాయని ఈ ప్రాజెక్టును తలపెట్టి నప్పుడల్లా సందేహాలతో ఆపేస్తూ వచ్చారు.1860లోనే ఈ ప్రాజెక్టును చేపట్టాలని ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం భావించింది. కానీ, రామసేతు హిందువులకు సంబం ధించిన వారథి అనీ, దీనిని తవ్వడానికి వీలు లేదని హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేయడంతో బ్రిటి ష్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది.
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు కూడా సున్నితమైన ఈ అంశంపై ఆచితూచి అడుగులు వేస్తూ వచ్చాయి. నిజానికి అలా శ్రీలంకచుట్టు తిరిగి రావడానికి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అలా వచ్చేందుకు పెద్ద ఎత్తున ఇంధనం, సమయం అవసరమౌతోంది. ఇందుకు భారగా ఖర్చు కూడా అవుతోంది. అలా కాకుండా శ్రీలంక భారత్ మధ్యలోనే ఉన్న దారి ఏర్పాటు చేసి నౌకలకు మార్గం ఏర్పాటు చేస్తే సమయం ఇంధనం ఆదా అవుతుంది. అంటే భారత్ శ్రీలంక మధ్య ఉన్న సముద్రంలో ప్రస్తుతం సేతు సముద్రం ప్రాజెక్టును నిర్మించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఇక్కడ ఓ ఎంట్రీ పాయింటు ఏర్పాటు చేయాలని ప్రపోజల్ ఉంది.. దీనినే సేతు సముద్రం ప్రాజెక్టు అని అంటారు.
అయితే ఆ ప్రాజెక్టును బీజేపీ వ్యతిరేకిస్తోంది. ఎందుకు..? రెండు దేశాల మధ్య ఒకనాడు రాముడు కట్టిన వారధి…ప్రాజెక్టు నిర్మాణం ద్వారా దెబ్బ తినే అవకాశం ఉందని అభ్యంతరం చెబుతోంది. సాక్షాత్తూ కేంద్రమే వ్యతిరేకిస్తోంది కాబట్టి ప్రాజెక్టు పెండింగులో పడింది. దశాబ్ద కాలంగా సేతు సముద్రంపై ఎన్నో వివాదాలు ముసురుకున్నాయి. ఎట్టకేలకు ఇప్పుడు ఈ ప్రాజెక్టు నిర్మించాలనే విషయంపై తమిళనాడులోని రాజకీయపార్టీలన్నీ ఒకే అభిప్రాయానికి వచ్చాయి. ఇది నిజంగాస్వాగతించాల్సిన విషయం. ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆధ్వర్యంలో రాష్ట్ర శాసనసభ ఈ విషయమై ఏకగ్రీవంగా ఒక తీర్మానాన్ని ఆమోదించడం కూడా జరిగిపోయింది.
ఇది నిజంగానే ఆహ్వానించదగిన పరిణామం. వారధి అంటున్న నిర్మాణం చెడకుండా నౌకలకు దారి నిర్మించడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. దానిని నేతలు ఇప్పటికైనా గుర్తించారు. అంతే కాదు.. గతంలో ఈ ప్రాజెక్టు ను వ్యతిరేకించిన బీజేపీ కూడా ఇందుకు మద్దతు తెలపడం వల్ల దీనిని చేపట్టేందుకు మార్గం తయారైందన్నమాట. భారత. అయితే ఈ రెండు పార్టీలకూ సైద్ధాంతిక విభేదాలు పెద్దగా లేవు. అందువల్ల ఈ ప్రాజెక్టును వ్యతిరేకించడం లో ఒకే తీరులో వ్యవహరిస్తూ వస్తున్నాయి. కాంగ్రెస్ ఓట్లు, సీట్ల రాజకీయాల్లో అసలు దీనిని గురించి పట్టించుకోలేదు.
![](https://inewslive.net/wp-content/uploads/2023/01/Ram-Sethu-will195124.jpg)
డీఎంకె వ్యవస్థాపకుడు అన్నా దురై నుంచి ప్రస్తుత ముఖ్యమంత్రి స్టాలిన్ వరకూ ద్రవిడ పార్టీలన్నింటిదీ ఈ విషయంలో ఒకే తీరు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాల్లో డీఎంకె భాగస్వామ్యం వహించినప్పుడల్లా ఈ ప్రాజెక్టు కోసం పట్టుపడుతూ ఉండేది. వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వంలోనూ, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన మన్మోహన్‌సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలోనూ డీఎంకె భాగస్వామ్య పక్షం గా ఉంది. డీఎంకె ఒత్తిడిపై యూపీఏ ప్రభుత్వం 2,700 కోట్ల రూపాయిల వ్యయంతో సేతు సముద్రం ప్రాజెక్టును నిర్మించాలని నిర్ణయించింది. అయితే, హిందుత్వ సంఘాలు, పర్యావరణ వేత్తలు న్యాయపోరాటం జరిపాయి. 2007లో సుప్రీంకోర్టు ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయాలని ఆదేశించింది.
ఆ తర్వాత అన్నా డీఎంకె ప్రభుత్వం దీనిని గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు స్టాలిన్ ప్రభుత్వం ద్రవిడ సంప్రదాయాన్ని పునరుద్ధరించాలన్న కృత నిశ్చయంతో ముందుకు సాగుతున్నారు. ప్రాజెక్టు తీర్మానాన్ని సీఎం స్టాలిన్ ప్రవేశపెట్టగా అసెంబ్లీ ఆమోదం తెలిపింది. తమిళనాడు – భారత ఆర్థిక ప్రగతికి ఈ ప్రాజెక్టు దోహదం చేస్తుందని సీఎం స్టాలిన్ అంటున్నారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కేంద్రప్రభుత్వం ముందుకు రావాలని, తమిళనాడు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు సీఎం స్టాలిన్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించింది. తీర్మానం ప్రవేశపెడుతున్న సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. 1998లో వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు అమలు సాధ్యాసాధ్యాలపై అధ్యయనానికి ఆమోదం తెలిపి, ప్రణాళికలు కూడా ఖరారు చేసిందన్నారు. 2004లో యూపీఏ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత రూ.2,427 కోట్లు కేటాయించిందన్నారు. 2005లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు పనులు సగానికి పైగా పూర్తయ్యాయని, బీజేపీ అధికారంలోకి వచ్చాక రాజకీయ కారణాలతో ప్రాజెక్టును నిలిపేశారన్నారు.
ఈ తీర్మానానికి బీజేపీ సహా అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. అయితే, రామవారధి దెబ్బ తినకుండా చూడాల్సిందేనని బీజేపీ మెలికపెట్టింది. సభలో బీజేపీ నాయకుడు నైనార్ నాగేంద్రన్ మాట్లాడుతూ.. ‘రామసేతుపై ప్రభావం చూపకపోతే ప్రాజెక్టును స్వాగతిస్తాం. ఈ ప్రాజెక్టు అమలైతే దక్షిణ తమిళనాడులో మాకంటే సంతోషించేవారు ఉండరు’ అని వ్యాఖ్యానించారు. బీజేపీ కేవలం రాజకీయ కారణాల వలనే బీజేపీని ప్రాజెక్టును వ్యతిరేకిస్తుందని ఆరోపణలున్నాయి. దివంగత ముఖ్యమంత్రి జయలలిత సైతం ఈ ప్రాజెక్టుకు అనుకూలంగా ఉండేవారని చెబుతున్నారు. అయితే ఆ తరువాత ఆమె ఆకస్మాతుగా తన వైఖరిని మార్చుకున్నారు. కరుణానిధి వైఖరికి భిన్నంగా స్టాలిన్ ఇప్పుడు కేంద్రాన్ని ఢీ కొనేందుకు అడుగులు వేస్తున్నారు.
బీజేపీయేతర పార్టీలతో చేతులు కలుపుతున్నారు. ఈ నేపథ్యంలో సేతు సముద్రం అంశాన్ని మరోసారి పట్టుబట్టి తెరమీదికి తెచ్చారు. ప్రస్తుతం బీజేపీ ఇప్పుడు దక్షిణాదిన.. ముఖ్యంగా తమిళనాడులో కాలు మోపేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఆ ప్రయత్నంలో భాగంగానే అత్యధిక జనం కోరుతున్న సేతు సముద్రం ప్రాజక్టు విషయంలో తన వైఖరిని మార్చుకుంది. ఆధునిక కాలంలో నౌకావాణిజ్యం ప్రాధాన్యం పెరిగింది. భారత తూర్పు, పశ్చిమ ప్రాంతాల మధ్య నౌకాయానానికి శ్రీలంకను చుట్టి రావల్సిన ప్రయాసను తప్పించేందుకు తలపెట్టిన సేతు సముద్రం ఎట్టకేలకు ముందుకు వస్తోంది.
నిర్మాణం పూర్తయితే నౌకా వాణిజ్యానికి ఎంతో ఉపయోగమనడంలో సందేహం లేదు. మరోవైపు రామసేతును జాతీయ వారసత్వ సంపదగా ప్రకటించాలని సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్ పై విచారణ జరిగింది.ఈ క్రమంలో ఫిబ్రవరి మొదటి వారంలోపు స్పందించాలని కేంద్రానికి ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఇప్పటికే శ్రీలంక తీరంలో తన నౌకలను నిలుపుతున్న చైనా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకుని హిందూమహాసముద్రంలో సులభంగా ప్రవేశించే ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. అయితే సేతు సముద్రం ప్రాజెక్టు విషయంలో అమెరికా వైఖరి ఎలా ఉంటుందో కూడా చూడాల్సి ఉంటుంది. సేతు సముద్రం వల్ల వాణిజ్య అవకాశాలు పెరిగినా పొరుగు దేశాలతో సమస్యలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. వాటి నిపరిష్కరించుకోవడం భారతదేశానికి మరో సవాల్ అవుతుందనడంలో సందేహం లేదు.