Homeజాతీయంరాహుల్‌ గాంధీపై అనర్హత వేటు...

రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు…

ఓ మామూలు రాజకీయ నాయకుడు ఏదైనా అభ్యంతకర వ్యాఖ్యలు చేసి దానికి ఫలితంగా శిక్షలు పడితే ఎవరూ పట్టించుకోకపోవచ్చు. ఓ రెండు రోజులు చర్చ జరిగి మీడియా సంస్థలు కూడా మూవాన్ అవొచ్చు..కానీ దేశంలో శతాబ్దకాలానికి పైగా పాపులర్ పార్టీ అయిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ చుక్కాణిగా భావిస్తున్న యువరాజు రాహుల్ గాంధీ విషయంలో అన్నీ వేరుగానే ఉంటాయి. ఆయన తప్పు చేసినా అది తప్పుగా పరిగణించిన న్యాయస్థానం శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. కానీ తమ నాయకుడిపై అలాంటి శిక్ష పడటానికి వీల్లేదని అంటోంది కాంగ్రెస్ పార్టీ..రాహుల్ విషయంలో కాన్విక్షన్ తీర్పు రావడమే తరువాయి లోక్ సభలో ఆయన ఎంట్రీపై అనర్హత వేటు కూడా పడింది.

దాంతో దేశంలో నాయుకులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. చట్టం వేరు…ధర్మం వేరు. చట్టబద్ధమైన చర్యలన్నీ ధర్మబద్ధం కాకపోవచ్చు. కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు పడటానికి దారితీసిన సూరత్‌ కోర్టు తీర్పు, అంతక్రితం రెండు వారాలుగా అధికార, విపక్షాలు సాగిస్తున్న ఆందోళనల పర్యవసానంగా పార్లమెంటు స్తంభించి పోవటం వంటి పరిణామాలు ప్రజాస్వామ్య ప్రియులను కలవరపరుస్తాయి. పౌరులు ఎలా మెలగాలో, పాటించాల్సిన స్వీయ నియంత్రణలేమిటో చట్టాలు చెబుతాయి. అధికారానికుండే పరిమితులేమిటో కూడా తేటతెల్లం చేస్తాయి. కానీ వాటి ఆచరణ సక్రమంగా లేని చోట ఆ చట్టాలు కొందరికి చుట్టాలవుతాయి. మరికొందరికి అవరోధాలవుతాయి.

కర్ణాటకలోని కోలార్‌లో 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా మాట్లాడిన రాహుల్‌ అవినీతికి, అక్రమాలకు పాల్పడి విదేశాలకు పరారైన నీరవ్‌ మోదీ, లలిత్‌ మోదీల పేర్లకు ప్రధాని నరేంద్ర మోదీ పేరు జత చేసారు..సెటైరిక్ గా ‘దొంగలందరి ఇంటిపేరు మోదీ అని ఎందుకుంటోంది?’ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌ వ్యాఖ్యలు ఆ ఇంటి పేరు కలిగిన ఇతర సామాజిక వర్గాలకు ఇబ్బందికరంగా మారాయి. దాంతో గుజరాత్‌ ఎమ్మెల్యే పూర్ణేశ్‌ మోదీ పరువునష్టం దావా పిటిషన్‌ వేసారు. దాంతో అక్కడి జిల్లా కోర్టు రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై తీర్పునిచ్చింది. రెండేళ్ల జైలు శిక్ష విధించింది.

అంతే కాదు పైకోర్టుకు అప్పీలు చేసుకునేందుకు 30 రోజుల గడువు విధించింది. అయితే రాహుల్‌ వ్యాఖ్యలతో చాలామంది ఏకీభవించకపోవచ్చు. ప్రత్యర్థులనుసరించే విధానాలను విమర్శించటం కాక వారిపై దూషణలకు దిగటం చాన్నాళ్లుగా మన దేశ రాజకీయ నాయకులకు రివాజుగా మారింది. భాషకు హద్దులు లేకుండా పోతోంది. చనిపోయినవారిని సైతం వదలకుండా దూషణలు చేయడం, సంబంధీకుల మనోభావాలపై దెబ్బకొట్టడం సునాయాసంగా చేసేస్తున్నారు. అంతే కాదు..సదరు వ్యక్తులు వ్యక్తిగతంగా రెచ్చగొట్టడంతో పాటు భౌతికంగా నిర్మూలిస్తామని బెదిరింపులకు దిగుతున్నారు. దౌర్జన్యాలకు పూనుకోవటం వంటి ఘటనల గురించి చెప్పనవసరమే లేదు.

అయితే ఈ ధోరణులను వ్యతిరేకించేవారు సైతం రాహుల్‌కు విధించిన రెండేళ్ల జైలు శిక్షను, దాని ఆధారంగా పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయటం సమర్థించలేకపోతున్నారు. గతంలో రాఫెల్‌ ఒప్పందంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించినప్పుడు రాహుల్‌ ‘చౌకీదార్‌ చోర్‌ హై’ అని వ్యాఖ్యానించారు. దాంతో అదో పెను వివాదంగా మారింది. మోదీ గతంలో తాను భారతదేశానికి చౌకీదార్ గా ఉంటానని చెప్పిన మాటలను వక్రీకరిస్తూ, ఆరోపణలు చేస్తూ రాహుల్ వివాదంలో చిక్కు కున్నారు.

ప్రధానిని ఉద్దేశించి వ్యాఖ్య చేయడంతో పాటు, సుప్రీంకోర్టును తప్పుబట్టేలా మాట్లాడటంతో సమస్య ఏర్పడింది. ఆ కేసులో రాహుల్‌ గాంధీ మరో మాట లేకుండా క్షమాపణ చెప్పడంతో సర్వోన్నత న్యాయస్థానం 2019లో కేసు మూసివేసింది. అయితే రాహుల్‌ వంటి నేతలు జాగ్రత్తగా మాట్లాడాలని హితవు పలికింది. ఇప్పుడు గుజరాత్ లోని సూరత్‌ కోర్టు దాన్ని ప్రత్యేకంగా గుర్తుచేసింది. ఈ తీర్పుపైనా, అనర్హత వేటుపైనా ఎటూ కాంగ్రెస్‌ అప్పీల్‌కి వెళ్తుంది. అక్కడ ఏమవుతుందన్న సంగతి అటుంచి, సూరత్‌ కోర్టు తీర్పు లేవనెత్తిన అంశాలు ప్రధానమైనవిగా చెబుతున్నారు విశ్లేషకులు.

పరువు నష్టం కలిగించటాన్ని నేరపూరిత చర్యగా పరిగణించడం, గరిష్టంగా రెండేళ్ల జైలు, జరిమానాకు వీలు కల్పించే భారత శిక్షాస్మృతి ‘ఐపీసీ’లోని 499, 500 సెక్షన్ల సహేతుకతపై ఎప్పటినుంచో అభ్యంతరాలున్నాయి. ఒకపక్క పరువునష్టంలో సివిల్‌ దావాకు వీలున్నప్పుడు జైలుశిక్ష, జరిమానాలెందుకని న్యాయ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. బ్రిటిష్‌ వలస పాలన కాలంలో చేసిన ఈ చట్టం ఇప్పుడు బ్రిటన్‌లోనూ, ఇతర పాశ్చాత్య దేశాల్లోనూ ఉనికిలో లేదు. ఇది దుర్వినియోగమయ్యే ప్రమాదం ఉన్నది గనుక, భావప్రకటనా స్వేచ్ఛకు భంగం కలిగిస్తుంది గనుక రద్దు చేయాలని గతంలో సుప్రీంకోర్టుకెక్కిన వారున్నారు. అయితే పేరు ప్రతిష్టలు కలిగివుండే హక్కు జీవించే హక్కులో భాగమని, దానికి భంగం కలిగించినవారు తగిన శిక్ష అనుభవించక తప్పదని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.

అదే సందర్భంలో ఈ అంశంలో తీర్పులు వెలువరించేటపుడు జాగురూకత వహించాలని కింది కోర్టులకు సలహా ఇచ్చింది. అయితే ఈ సలహాను కింది కోర్టులు పాటిస్తున్నాయా అన్న విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. ఒక రచనపై వచ్చిన విమర్శను తట్టుకోలేకనో, ఒక నాటకాన్నీ లేదా సినిమాను అడ్డుకోవటానికి సైతం ఈ సెక్షన్లను రాష్ట్ర ప్రభుత్వాలు యధేచ్ఛగా వినియోగిస్తున్నారు. తమిళనాడులో జయలలిత పాలనా కాలంలో ఆమె పార్టీకి చెందిన కార్యకర్తలు వందల సంఖ్యలో పరువునష్టం దావాలు వేసారు. అప్పుడు జరిగిన సంగతిని ఎవరూ మరువలేరు. కోర్టులు సైతం యాంత్రికంగావ్యవహరిస్తున్నాయి. అందుకే సర్వోన్నత న్యాయస్థానం పలుమార్లు కింది కోర్టులను తప్పు పట్టాల్సి వచ్చింది. నీరవ్‌ మోదీ, లలిత్‌ మోదీ లాంటి పన్ను ఎగవేత దారులకు, బ్యాంక్ ఫ్రాడ్ గాళ్లకు ప్రభుత్వ ప్రాపకం లభించిందని నార్మల్ గా ఆరోపిస్తే రాహుల్‌కు బహుశా ఈ కేసు బెడద ఉండేది కాదు. అయితే తగిన ఆధారాలతో అటువంటి విమర్శలు చేస్తే.. దానివల్ల ప్రజలకు ఏదో మేరకు ప్రయోజనం కూడా కలుగుతుంది.

కానీ ఈ ఘటనలో అలా జరగలేదు..అలా సూరత్ తీర్పు వచ్చిందో లేదో లోక్ సభలో వాయినాడ్ ఎంపీ అయిన రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడంతో కలకలం రేగింది. అంతే కాదు..ఆయనపై రెండేళ్ల జైలు శిక్షతో పాటు భవిశ్యత్తులో ఎనిమిదేళ్ల పాటు ఎన్నికలలో పాల్గొనడానికి వీలు లేకుండా చేయడం అసలు ఎవరూ ఊహించలేదు. అసలే నానాటికీ పడిపోతున్న కాంగ్రెస్ ప్రభ ఈ శిక్షతో మరింత వెలుగును కోల్పోయినట్టయింది. అసలు రాహుల్ గాంధీ లేని కార్యక్రమాలను ఊహామాత్రంగానైనా అంగీకరించడానికి కాంగ్రెస్ నేతలు సిధ్దంగా లేరు. ఎలాగైనా పై కోర్టుకు అపీలు చేసుకుని తీరతామని చెబుతున్నారు. రాహుల్‌ తన వ్యాఖ్యలద్వారా ఒక వెనుకబడిన వర్గాన్ని కించపరిచారని బీజేపీ ఆరోపిస్తోంది. నిజానికి ఇలాంటి రాజకీయ వ్యాఖ్యలను రాజకీయంగా ఎదుర్కొనటం తప్పేమీ కాదు.

అందుకు భిన్నంగా న్యాయస్థానాలను ఆశ్రయించటం ఎంత వరకూ సబబో, చట్టానికి అనుగుణంగానే అయినా ఆదరాబాదరాగా అనర్హత వేటువంటి నిర్ణయాలు తీసుకోవటం ఏమేరకు ధర్మమో ఆలోచించుకోవాలి. గతంలో లాలూ ప్రసాద్‌ యాదవ్, జయలలిత, ఆజంఖాన్‌ తదితరుల కేసుల్లో వెనువెంటనే చర్యలు తీసుకున్న సందర్భాలు లేకపోలేదు. అయితే చర్యలు తీసుకునే ప్రక్రియ సందేహాస్పదం కారాదు. మెజారిటీ ఉంది కదా అని కక్షపూరితంగా చేశారన్న అపఖ్యాతి తెచ్చుకోకూడదు.

దేశద్రోహులను కాల్చిపారేయాలని పిలుపునిచ్చిన వారు నిక్షేపంలా కేంద్రమంత్రులుగా కొనసాగుతుంటే విపక్ష నేత నోరుజారటం మాత్రం మహాపరాధం కావటం సాధారణ పౌరులకు కొరుకుడు పడని అంశంగా ఉంది. ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రధాన లక్ష్యం రాహులేనని పార్లమెంటులోని పరిణామాలైనా, తాజా చర్య అయినా తేటతెల్లం చేస్తున్నాయి. రాజకీయ పక్షాలూ, వాటి వ్యూహాల మాటెలా వున్నా దేశంలో చట్టబద్ధ పాలనకూ, సమన్యాయానికీ విఘాతం కలగనీయకుండా చూడాలని సాధారణ పౌరులు కోరుకుంటున్నారు. మరి రాహుల్ రాజకీయ భవిశ్యత్తు మాటేంటన్న విషయానికొస్తే.. దానిని కాలమే నిర్ణయిస్తుందని అంటున్నారు సీనియర్ కాంగ్రెస్ నేతలు.

Must Read

spot_img