పుతిన్ జీవించి ఉన్నారో లేదో ‘ అంటూ యుక్రెయిన్ అధ్యక్షుడు జెలన్‌స్కీ చేసిన వ్యాఖ్యలు సంచలనం స్రుష్టించాయి. రష్యా యుక్రెయిన్ యుద్ధం 11నెలలు పూర్తి అవుతున్న సమయంలో యుక్రెయిన్ అధ్యక్షుడు జెలన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ జీవించి ఉన్నారో లేదో తనకు అర్ధం కావడం లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జెలన్ స్కీ చేసిన ఈ వ్యాఖ్యలు పుతిన్ అనారోగ్యం గురించి పలు రకాల ఊహాగానాలు వస్తున్న వేళ మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో..ఒక ప్రయివేట్ ఈవెంట్‌లో జెలన్‌స్కీ ఈ వ్యాఖ్యలు చేశారు. శాంతి చర్చలు ఎప్పుడు మొదలవుతాయన్న ప్రశ్నకు ఈ సమాధానమిచ్చారు. జెలన్‌స్కీ వ్యాఖ్యలపై రష్యా స్పందించింది.
రష్యా, పుతిన్ ఉనికిలో ఉండకూడదని యుక్రెయిన్ అధ్యక్షుడు కోరుకుంటారని…క్రెమ్లిన్ ప్రతినిధులు మండిపడ్డారు. రష్యా, యుక్రెయిన్ యుద్ధం మొదలైన దగ్గరి నుంచి పుతిన్ ఆరోగ్యంపై అనేక రకాల ప్రచారం జరిగింది. పుతిన్ క్యాన్సర్ సహా అనేక రకాల వ్యాధులతో బాధపడుతున్నారని కనీసం నడవలేని స్థితిలో ఉన్నారంటూ పాశ్చాత్య మీడియాలో వార్తలొచ్చాయి. అయితే వాటిల్లో నిజమెంతో, అబద్ధమెంతో తెలియదు కానీ పుతిన్ మాత్రం రష్యా అధ్యక్ష హోదాలో తన పని తాను చేసుకుపోతున్నారు. ఎందుకంటే ఆయన పాల్గొన్న సమావేశాల ద్రుశ్యాలు మీడియాలో చూపిస్తూనే ఉన్నారు. మొన్నటికి మొన్న యుద్ధ విరమణ గురించీ రెండు నెలల క్రితం పుతిన్ మాట్లాడారు. తూర్పు యుక్రెయిన్ మొత్తాన్ని పూర్తిస్థాయిలో ఆక్రమించుకుని..యుద్ధాన్ని ముగించాలన్నది పుతిన్ ఆశయం.
కాగా..జెలన్ స్కీ మాత్రం 2014లో రష్యా ఆక్రమించుకున్న క్రిమియా సహా యుక్రెయిన భూభాగం మొత్తాన్ని తిరిగి చేజిక్కించుకునే యుద్ధాన్ని ముగిస్తామని అంటున్నారు. 11 నెలలుగా యుద్ధం సాగుతోంది. యుక్రెయిన్ సర్వనాశనమయింది. ఇటు రష్యాకు సైతం అపారమైన నష్టం కలుగుతోంది. మరోవైపు యుద్ధభారాన్ని ప్రపంచమంతా పరోక్షంగా అన్ని విధాలుగా మోస్తోంది. అయినా శాంతి చర్చలు గురించి ఎవరూ మాట్లాడడం లేదు. యుద్ధం మొదలయినప్పుడు జరిగిన చర్చలు మినహా ఇప్పటిదాకా ఎలాంటి సమావేశాలూ జరగలేదు. దీంతో యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది. శాంతి చర్చలు జరిపి…సమస్య పరిష్కరించుకుని..యుద్ధాన్ని ముగించాలని అందరూ కోరుకుంటున్నారు.
![](https://inewslive.net/wp-content/uploads/2023/01/ws_Address_to_the_Federal_Assembly_2012-12-12_-_09.jpeg)
ప్రపంచ ఆర్థిక సదస్సులో ప్రసంగించిన జెలన్‌స్కీనీ అంతర్జాతీయ మీడియా ఇదే అడిగింది. చర్చలు ఎప్పుడు జరుగుతాయని ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు సమాధానంగా సంచలన వ్యాఖ్యలు చేశారు జెలన్‌స్కీ. ఎవరు, దేని గురించి మాట్లాడతారో తాను కొంచెం అర్ధం చేసుకోలేకపోతున్నానని జెలన్‌స్కీ వ్యగ్యంగా మాట్లాడారు. శాంతికి వ్యతిరేకంగా వ్యవహరించే రష్యా అధ్యక్షుడు సరైన వ్యక్తి అని తాననుకోవడం లేదని జెలన్‌స్కీ అన్నారు. పుతిన్ బతికి ఉన్నారా లేదా అన్నది కూడా తానర్ధం చేసుకోలేక పోతున్నానని, నిర్ణయాలు ఆయన తీసుకుంటున్నారా…లేక ఆయన తరపున ఇంకెవరైనా తీసుకుంటున్నారా అన్నది తెలియడం లేదని వ్యాఖ్యానించారు. శాంతి గురించి యూరోపియన్ నేతలకు హామీ ఇచ్చే పుతిన్ మరుసటి రోజే బలగాలన్నింటితో విరుచుకుపడతారని జెలన్‌స్కీ ఆరోపించారు.
జెలన్‌స్కీ వ్యాఖ్యలపై రష్యా అధ్యక్ష భవనం అధికారులు స్పందించారు. రష్యా, పుతిన్…యుక్రెయిన్, జెలన్‌స్కీకి పెద్ద సమస్యగా ఉన్నారన్న విషయం స్పష్టమవుతోందని అన్నారు. పుతిన్, రష్యా ఉనికిలో ఉండకూడదని జెలన్‌స్కీ మనసారా కోరుకుంటున్నారని ఆరోపించారు. రష్యా ఉనికిలో ఉందని, ఉంటుందని…అలా ఉండడమే యుక్రెయిన్‌కు మంచిదని త్వరలోనే జెలన్‌స్కీ ఆ విషయాన్ని స్పష్టంగా గ్రహిస్తారని కౌంటరిచ్చారు. రెండు నెలల క్రితం పుతిన్ తన నివాసంలో జారిపడ్డట్టు వార్తలొచ్చాయి. ఇటీవలి వారాల్లో పుతిన్ పబ్లిక్ ఈవెంట్లలో కనిపించడం లేదు. ఏటా డిసెంబరులో నిర్వహించే ప్రెస్ కాన్ఫరెన్స్‌ను సైతం రద్దుచేసుకున్నారు. దీంతో పుతిన్ ఆరోగ్యంపై మళ్లీ చర్చ మొదలయింది. ఈ సమయంలోనే జెలన్‌స్కీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై అనేక సందేహాలు తలెత్తుతున్నాయి.