Homeఅంతర్జాతీయంపుతిన్ ఇమేజ్ కి డ్యామేజ్ కారణం ఇదే !

పుతిన్ ఇమేజ్ కి డ్యామేజ్ కారణం ఇదే !

ఉక్రెయిన్ విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి చందంగా జరిగింది. చూస్తుండగానే ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం రెండో ఏడాదిలోకి చొరబడింది. దురాక్రమణ ప్రయత్నాలు జోరుగా కొనసాగుతూనే ఉన్నాయి. ఏడాది మారణహోమం తర్వాత కూడా వ్లాదిమిర్‌ వ్లాదిమిరోవిచ్‌ పుతిన్‌ రాజ్యకాంక్ష ఏమాత్రం చల్లారలేదు.

పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా ఉక్రెయిన్‌పై ఉరుకులు పరుగుల మీద విరుచుకుపడ్డ రష్యాకు, తన అస్త్రాలేవీ పనికిరాకుండా పోయాయని జ్ఞానోదయం కలగడానికి ఎంతోసేపు పట్టలేదు. బాహుబలిగా కాలుదువ్విన పుతిన్‌ ఏడాది తిరిగేసరికి ప్రపంచం దృష్టిలో విలన్‌ అయ్యారు. సొంత ప్రజల దృష్టిలోనూ బాహుబలి హోదాను ఒకింత కోల్పోయారు. ఇంతకీ పుతిన్‌ ఊహించినదేమిటి? ఆయనకు ఎదురైందేమిటి…? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా పూర్వపు సోవియట్‌ యూనియన్‌ రిపబ్లిక్ దేశాలన్నింటినీ మళ్లీ ఒకే తాటిమీదకు తేవాలన్నది పుతిన తన లక్ష్యమని చెప్పుకుంటుంటారు. పొరుగు దేశాలైన ఉక్రెయిన్, బెలారస్‌ కూడా ఒకప్పుడు రష్యాలో అంతర్భాగమేనని అంటుంటారు. రెండేళ్ల క్రితం ఆయన రాసిన ఓ సుదీర్ఘ వ్యాసంలో కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

నిజానికి బెలారస్‌తో రష్యాకు ఎలాంటి విభేదాలూ లేవు. పైగా ఉక్రెయిన్‌పై దాడిలో రష్యాకు ఆదినుంచీ అది వెన్నుదన్నుగా ఉంది. రష్యా మొదట ఉక్రెయిన్‌లో చొరబడేందుకు తన భూభాగాన్ని కూడా అనుమతించింది. ఎటొచ్చీ పుతిన్‌తో వచ్చిన పేచీ అంతా ఉక్రెయిన్‌తోనే అంటున్నారు నిపుణులు. ఆ దేశ సార్వభౌమత్వాన్ని గుర్తించడానికి కూడా రష్యా ఎన్నడూ ఇష్టపడలేదు. రష్యా, ఉక్రెయిన్‌ ఒకే దేశమన్నదే పుతిన్‌ గట్టి నమ్మకం. కానీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మాత్రం ఆ ఆలోచనను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. పైగా ఈ విషయాలన్నింటినీ తన దేశ ప్రజలకు వివరిస్తూ వారి మద్దతును కూడగట్టుకున్నారు. నాటో కూటమిలో చేరడంపైన మొదలైన వివాదం అత్యంత దారుణమైన యుద్దాన్ని చవి చూసింది ఉక్రెయిన్.

నిగూఢంగా చూస్తే మాత్రం, ఈ గొడవంతా పైపై పటారమే. అసలు విషయం ఏమిటంటే సుదీర్ఘ కాలం పాటు రష్యాకు తిరుగులేని నాయకునిగా వెలిగిపోవాలన్నది పుతిన్‌లో అంతర్లీనంగా ఉన్న ఆశగా చెప్తారు. మూడేళ్ల క్రితం ఆయన ఆ దిశగా ప్రయత్నం చేశారు. ప్రజాభిప్రాయ సేకరణతో రాజ్యాంగాన్ని మార్చి అధ్యక్షునిగా 16 ఏళ్లపాటు నిరాటంకంగా కొనసాగేలా కొత్త చట్టం తెచ్చేందుకు క్రెమ్లిన్‌ ప్రయత్నించింది. ఆ సమయంలో రష్యా టీవీ పుతిన్‌ కీర్తనలు, గుణగానాలతో హోరెత్తేది. ‘కల్లోల సాగరంలాంటి ప్రపంచంలో రష్యా నౌకను సమర్థంగా నడిపిస్తున్న కెప్టెన్‌ పుతిన్‌’ అంటూ ఊదరగొట్టేవారు. క్రెమ్లిన్‌ దృష్టిలో పుతిన్‌ సకల కళావల్లభుడు, సకలశాస్త్ర పారంగతుడు. అందుకే జూడో, రేసింగ్, స్విమ్మింగ్, హార్స్‌ రైడింగ్‌ విన్యాసాల్లో పుతిన్‌ సాహసకృత్యాల తాలూకు ఫొటోలను తరచూ ప్రపంచం ముందుకు తెస్తూంటుంది క్రెమ్లిన్‌.

రష్యా ప్రజలను ప్రభావితం చేసి పుతిన్‌ పట్ల ఆరాధనా భావాన్ని పెంపొందించే ప్రయత్నాల్లో భాగంగా రష్యా ఇలా ప్రాపగండా ప్రచారాన్ని ఎంచుకుంది. అసలు విషయమేమిటంటే 2024లో రష్యా అధ్యక్ష ఎన్నికలున్నాయి. ఆలోపు ఏదో ఒక ఘనకార్యం చేసి పుతిన్‌ కీర్తిని అమాంతం పెంచేయడం క్రెమ్లిన్‌ లక్ష్యంగా పెట్టుకుంది. పశ్చిమ దేశాల కనుసన్నల్లో సాగుతున్న ఉక్రెయిన్‌ను ఓ దారికి తెస్తే బాహుబలి లాంటి పుతిన్‌ సత్తా ఏమిటో బయటి ప్రపంచానికి తెలుస్తుందని, అధ్యక్ష ఎన్నికల్లో మంచి ప్రచారాస్త్రంగా మారుతుందని క్రెమ్లిన్‌ థింక్‌టాంక్‌ అంచనా. అనుకున్నదే తడవుగా దాడికి దిగడం, ఆరంభంలో కొన్ని ప్రాంతాను ఆక్రమించి ఎగిరి గంతెయ్యడం… తర్వాత ఉక్రెయిన్‌ధాటికి తట్టుకోలేక వాటిని వదిలేసి తోకముడవడం చకచకా జరిగిపోయాయి. అయితే ఈ నిజాలను అంగీకరించడానికి రష్యా ససేమిరా అంటోంది.

అయినా సరే, ఇప్పటికీ ఉక్రెయిన్‌పై దాడిని తప్పుగా పుతిన్‌ అంగీకరించడం లేదు. రెండు మూడు రోజుల క్రితం మాట్లాడుతూ యధా ప్రకారం ఇదంతా పశ్చిమ దేశాల కుట్రేనని సెలవిచ్చారు. దానికి జవాబుగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఏకంగా ఉక్రెయిన్‌ యుద్ధభూమిలో అడుగుపెట్టారు. ఈ పోరులో తమ వైఖరిని మరోసారి కుండబద్ధలు కొట్టారు. ఉక్రెయిన్‌ను గెలవడం రష్యా తరం కాదని అక్కడే మీడియాముఖంగా ప్రకటించేశారు. బహుశా పుతిన్‌ కూడా ఇలాంటి సవాలు కోసమే ఎదురు చూస్తున్నట్టున్నారు. ఏదోలా వచ్చే ఏడాది రష్యా అధ్యక్ష ఎన్నికల దాకా యుద్ధం కొనసాగాలన్నదే ఆయన అభిమతమని పరిశీలకుల అంచనా. యుద్ధం సమాధుల మీద 2024 అధ్యక్ష ఎన్నికలను నెగ్గాలని పుతిన్‌ భావిస్తున్నట్టు చెబుతున్నారు.

Must Read

spot_img